"ఆయన ఇక్కడికి వచ్చి చేస్తారా!"
"చిచ్చూ! వొంటిమీద తెలివి వుండి మాట్లాడుతున్నావా! ప్రొఫెసర్ ఇక్కడికెలా వస్తారూ! వచ్చినా అంత మేజర్ ఆపరేషన్ చెయ్యడానికి తగిన ఎక్విప్ మెంట్ ఇక్కడ ఆస్పత్రిలో ఉందా!"
చిచ్చు మాట్లాడలేదు. ఇద్దరి మధ్యా కొన్ని నిముషాలు మౌనంగా గడిచింది.
"డబ్బు... ఎంత అవసరమవుతుందీ!"
"ప్రొఫెసర్ ఉదారంగా ఏమీ తీసుకోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగితే మందులకీ, పళ్ళకీ, పాలకీ మొదలైన వాటికీ... నర్సులకీ, ఆయాలకీ, అమ్యమ్యాలకీ మొదలైన వాటికి కనీసం మూడువేలన్నా చేతిలో పెట్టుకోవాలి. అదీ ఇళ తల్లిదండ్రులు ఎవరైనా బంధువుల ఇంట్లో ఉండగలిగితే. హోటల్ లో ఉండవలసి వస్తే ఇక అడగక్కర్లేదు."
ఎంతోసేపటికి ఒకే ఒక్క చిన్నమాట వచ్చింది చిచ్చు నోట.
"టూట్."
ఎప్పటిలా తెల్లవారుఝామున నాలుగు గంటలకి లేచింది అచ్యుతమ్మ. అంత పొద్దున్నే లేస్తేగానీ ఆవిడకి పని తెమలదు. కాలకృత్యాలు తీర్చుకుని, ఇంటి ముందూ, గుడి ముందూ ఊడ్చి, కళ్ళాపి జల్లి ముగ్గువేసి, ఇళ మంచం దగ్గరికి వచ్చింది. పక్కలో ఇళ లేదు. పైప్రాణాలు పైనే పోయాయి. భర్తని కుదిపి లేపింది.
"ఏవండీ? ఇళ మంచంలో లేదు. లేచి నాలుగడుగులు వెయ్యలేని దశలో ఉన్న పిల్ల ఎక్కడికి వెళ్ళింది! ఏమయిపోయిందీ!"
యోగనాథశాస్త్రి కంగారుగా లేచి హరికేన్ లాంతరుతో తన యింటి పరిసరాలలో చూసి వచ్చాడు. కనపడలేదు. అచ్యుతమ్మ ఏడుపులకీ చుట్టుపక్కలవాళ్ళు లేచి వచ్చారు. క్షణాలలో ప్రమధపురి అంతా ఇళ కనపడటం లేదనే వార్త పాకిపోయింది. ఊరు ఊరంతా యోగానాథశాస్త్రి ఇంటికి చేరింది. కొందరు మొగవాళ్ళు లాంతర్లు పట్టుకుని వెతకటానికి బయల్దేరారు. చేతబడి అత్తగారు అచ్యుతమ్మ మీదికి వంగి గుసగుసగా అంది.
"ఎందుకైనా మంచిది_ చిచ్చు ఎక్కడున్నాడో చూడండి!"
అచ్యుతమ్మ తన ఏడుపు మరిచిపోయి, కళ్ళు పెద్దవి చేసింది. అయినా ఈ సలహా తోసిపారెయ్యదగినదిగా కనిపించలేదు ఆవిడకి. రహస్యంగా యోగానాథశాస్త్రి చెవిలో ఏదో చెప్పింది. ఆయన నివ్వెరపోయి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. చిరుగులు కనబడకుండా జాగ్రత్తగా మడతలు పెట్టిన కండువా పైన వేసుకుని, జ్ఞానదేవ్ ఇంటికి పరుగులుతీసి మూసి ఉన్న తలుపు దబదబ బాదాడు. నిద్రలో వున్న ఇంటిలో జనమంతా అదిరిపడి లేచారు. జ్ఞానదేవ్ తలుపు తెరిచాడు. యోగానాథశాస్త్రిని చూసి ఆశ్చర్యంతో "మీరా! ఇంత తెల్లవారుఝామున...లోపలికి రండి" అన్నాడు.
"మర్యాదలు తర్వాత...ముందు" కోపంగా ఏదో అనబోతున్న యోగనాథశాస్త్రికి నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. చిచ్చు వచ్చి తండ్రి పక్క నిలబడి ప్రశ్నార్థక ముఖంతో యోగనాథశాస్త్రిని చూస్తున్నాడు.
"ఏం జరిగిందండీ!" శాంతంగా అడిగాడు జ్ఞానదేవ్.
చిచ్చుని చూడగానే అంతకుముందు అంతరాంతరాల్లో ఉన్న ఆశ అణగారిపోయింది యోగనాథశాస్త్రికి. పైకి కోపం, ఆరాటం ఉరికివస్తున్నా, అతని అంతరాంతరాల్లో అతనికే తెలియకుండా కొన్ని ఆశలు ఊహల పందిళ్ళపైకి పాకుతున్నాయి. ఇళ చిచ్చుతో వెళ్ళినట్టూ, ఇది సాకుగా జ్ఞానదేవ్ తో పోట్లాడి ఇళకీ, చిచ్చుకీ పెళ్ళి జరిపినట్టూ... అతనికే తెలియకుండా అతని మనసులో ఊహల పందిరిపైన అల్లిబిల్లిగా సాగుతున్నాయి. ఆలోచనల తీగెలు చిచ్చు అప్పుడే నిద్రలేచి, కళ్ళు నులుముకుంటూ తన ఎదుట నిలబడేసరికి, యోగనాథశాస్త్రి కళ్ళలో చివ్వున నీళ్ళు తిరిగాయి. ఎవరూ రమ్మనకుండానే లోపలికొచ్చేసి, కింద కూలబడి చిరుగుల కండువాలో ముఖం దాచుకున్నాడు.
జ్ఞానదేవ్ అతడి పక్కన కూచుని అనునయంగా భుజం తట్టి "శాస్త్రిగారూ! ఆందోళన పడకండి. ఏం జరిగిందో చెప్పండి" అన్నాడు.
"ఇళ... ఇళ... ఇంట్లో లేదు. ఏమయిపోయిందో తెలీదు!" ఏడుపు గొంతుతో చెప్పాడు శాస్త్రి. నివ్వెరపోయింది వర్ధని.
"మంచం మీద నుంచి లేవలేని దశలో ఉంది. ఎక్కడికి వెళ్తుంది! ఎలా వెళ్ళగలుగుతోంది!" అంది.
చిచ్చు మనసు గందరగోళంగా అయిపోయింది. రెండురోజుల కిందట ఇళ భవిష్యత్తు గురించి వ్యాకులపడుతోన్న చిచ్చుతో విదుషి ఇలా చెప్పింది.
"ఇళని దేవతగా నమ్మటం, భక్తులూ, ప్రసాదాలూ ఇదంతా ఇళ మంచికే వచ్చిందేమో! ఈ సమయంలో ఇళకి ప్రధానంగా విశ్రాంతి కావాలి. పాలూ, పళ్ళూ లాంటి తేలుగ్గా అరిగే బలమైన ఆహారం కావాలి. భక్తులు తెచ్చే పళ్ళు అలా ఉపయోగపడతాయి.
విదుషి మాటలతో పూర్తిగా సమాధానపడలేకపోయినా, అప్పట్లో అంతకంటే చేయగలిగింది లేదు కనుక ఊరుకున్నాడు చిచ్చు. అక్కడున్న అందరిలో ఇళ అనారోగ్యం గురించిన యథార్థ స్థితి తెలిసింది అతడి కొక్కడికే! ఇళ ఒక్కర్తే నడుచుకుంటూ వెళ్ళినమాట నిజమే అయితే, అది ఎంత ప్రమాదమో తెలిసింది కూడా అతనికి మాత్రమే! ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా ఇంట్లోంచి పరుగు తీశాడు. ఊళ్ళోకి నాలుగువైపులా వెతకటానికి!
6
ఊళ్ళో వున్న ఒక్క చెరువూ, రెండు బావులూ వెతికారు. తోటలూ, దొడ్లూ వెతికారు. ఎక్కడా ఇళ కనబడలేదు. ప్రమధపురిలో వున్న వంద కుటుంబాలూ ఇళ కోసం వెతుకుతున్నాయి. అంచేత ఎవరింట్లోనైనా వుందేమోననే అనుమానానికి ఆస్కారం లేదు. చిచ్చు తిరిగి తిరిగి దుర్గ గుళ్ళో కూచున్నాడు. ఎక్కడికి వెళ్ళినా గుడికి వస్తుందనే ఆశ. జనం రచ్చబండ దగ్గర చేరి ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తున్నారు. చిచ్చు తమ కళ్ళ ఎదుట ఊళ్ళోనే ఉండటం చాలామందికి నిరుత్సాహంగా ఉంది.
"ముందుగా ఆ అమ్మాయిని దాటించేసి, తర్వాత తను వెళ్ళి కలుసుకుందామని ప్లానేసి వుంటాడు చిచ్చు. హమ్మో! సామాన్యుడా!" గుండె బాదుకుంటూ తన ఆలోచన బయటపెట్టింది చేతబడి అత్తగారు. ఈ ఊహ చాలామందికి ముఖ్యంగా ఆడవాళ్ళకి నచ్చింది. చర్చలు ప్రారంభమయ్యాయి. అతికొద్ది సేపట్లో ఆ విషయం ఊహ అనేమాట మరిచిపోయి నిజంగా జరిగినట్లు మాట్లాడేసుకుంటున్నారు.
"మొన్న నాకో పీడకలొచ్చింది. ఇళ, చిచ్చు ఎక్కి వెళ్తోన్న రైలుకి పెద్ద ఏక్సిడెంటయిందిట." చెప్పింది పీడకలల పిన్నిగారు.
"అయ్యయ్యో. వాళ్ళిద్దరూ ఏమయ్యారు. చచ్చిపోయారా!" ఆరాటంగా అడిగింది ఓ ఇల్లాలు.
"ఇళ బతికింది. చిచ్చు ఏమయ్యాడో కనిపించలేదు."
గంభీరంగా చెప్పింది పీడకలల పిన్నిగారు.
"ఆ పిల్ల దేవత. దానిమీద మోజు పెంచుకుంటే, మహిషాసురుడిలాగ చావక తప్పదు."
తన పరిజ్ఞానం ప్రకటించింది చేతబడి అత్తగారు.
ఊళ్ళో ఇంత గోలగోలగా వున్నా చిచ్చు దుర్గ గుళ్ళోంచి కదలలేదు. దుర్గవైపు తిరిగి చేతులు జోడించి "అమ్మా దుర్గా! ఇళని నాకు చూపించు!" అన్నాడు.