భయంకరమైన వార్త తెలిసినట్లు అతని కళ్ళు విప్పారాయి. ఫైలు పట్టుకున్న అతని చేయి బిగిసుకుపోయింది.
"వాటీజ్ దిస్?" అంటూ అతని నోటినుండి వచ్చినమాట అతనికొక్కడికే వినిపించింది.
భయంకరమైన వార్త తెలిసినట్లు అతని కళ్ళు విప్పారాయి. ఫైలు పట్టుకున్న అతని చేయి బిగుసుకుపోయింది.
"వాటీజ్ దిస్?" ఈసారి అతని మాట నూతిలోంచి మాట్లాడుతున్నట్లు బయటికి వినిపించింది. గుప్పిట బిగించి కుర్చీ హ్యాండ్ రెస్ట్ మీద అప్రయత్నంగానే రెండుసార్లు గుద్దాడు. టెన్షన్ అతన్ని అదుపు తప్పిస్తోంది.
ఏమీ అర్ధంకాక "సార్!" అన్నాడు శంకర్?
ఎయిడ్స్! ఒన్ ఆఫ్ ది పేషంట్స్ ఇన్ దిస్ రూమ్ ఈజ్ హావింగ్ ఎయిడ్స్!" షాక్ లోంచి తేరుకున్నట్లు ఎటో చూస్తూ చెప్పాడు.
"రియల్లీ?" వింటున్న ఇద్దరూ నోళ్ళు తెరిచారు.
"శరత్ చంద్ర రాత్రి ఎమర్జన్సీ కేసు నమోదు చేశాడు కదూ!"
"ఆ.... ఆ.....! అవున్సార్!" అన్నాడు శంకర్. అతనింకా విన్న విషయం నుండీ తేరుకోలేదు.
"ఆ కేసుకి ఇచ్చిన రక్తంలో 'ఎయిడ్స్' వుందని నమ్ముతున్నారట లాబ్ వాళ్ళు" మెల్లగా చూపు నర్సువైపు తిప్పి అన్నాడు.
"ఏమిటిసార్ మీరంటున్నది?" అంది. భయంతో ఆమె మాట వణుకుతోంది.
ఆమె మాట పట్టించుకోకుండా,
"అతను ఏ బెడ్ మీద వున్నాడు?" అని అడిగాడు.
"బెడ్ నంబర్ త్రీ సార్. పేరు చలపతిరావు" అని అన్నాడు.
వెంటనే అతని చూపు మూడో నెంబర్ బెడ్ వైపు మళ్ళింది. మధ్య వయసు దాటిన చలపతిరావు ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు వున్నాడు. తమ మాటలన్నీ పట్టించుకొనే పరిస్థితిలో లేడు. మత్తు ఇంకా విడలేదు. అతన్నే చూస్తూ, "ఎంత పని చేశావ్ మహానుభావా?" అని మనసులో అనుకొంటుండగా,
"మీరు చెబుతున్నది నిజమా సార్?" అన్నాడు శంకర్. అతని మాట భయం భయంగా వుంది.
"నిజం కాకపోతే ఇదేమైనా జోకా? ఆరుగంటలకి ఎమర్జన్సీ మీటింగ్ కూడా వుందట" అని కొద్దిగా తేరుకుంటూ నోటీసుమీద సంతకం చేసి నర్స్ కి అందించాడు.
అతని భయం శరత్ చంద్ర మీద కోపంగా రూపాంతరం చెందింది.
"ఇలాంటి తుక్కు కేసులన్నీ తీసికెళ్ళి బరబర సర్జరీ చేస్తే ఏమౌతుందీ!? ఇదిగో ఇలాంటివన్నీ భరించాలి!
ఇప్పుడు చూడు ఎయిడ్స్ తో వాడు ఛస్తాడు! చచ్చేలోగా మనందరికీ అంటించి చంపుతాడు" కసిగా అన్నాడు.
"పాపం..... చెయ్యకపోతే అతనప్పుడే చనిపోయి ఉండేవాడు. సార్!" బాధగా అన్నాడు శంకర్.
ఆ మాటతో చిర్రెత్తుకొచ్చింది భగవంతానికి.
"పీడాపోయేది! ఇపుడు ఊళ్ళో వాళ్ళకోసం మనం చావడంలా? అయినా, ఎన్ని కేసులని బ్రతికిస్తాడయ్యా? రిస్కు కేసులు పది చేస్తే ఒకళ్ళో ఇద్దరో బ్రతికేది! ఈమాత్రం దానికి మనమందరం తలవంచుకోవాలా? ఎవడయ్యా దీనికి రెస్పాన్సిబుల్? హెడ్డయినందుకు నేనేగా?" అరుస్తున్నట్లే అన్నాడు. తను చెయ్యలేని కేసులు శరత్ చంద్ర చేస్తున్నాడన్న కసి ఆ మాటల్లో తీర్చుకుంటున్నాడు.
ఆ అరుపులకి అక్కడి నర్స్ లందరూ అతనివైపే చూస్తున్నారు. ఎయిడ్స్ రోగికి దగ్గర్లో ఉన్నందున శంకర్ కాళ్ళు వణుకుతున్నాయి.
ఆ మాటలేవీ వినిపించే స్థితిలో లేనందుకు రోగి నిజంగా అదృష్టవంతుడే; అతనా స్థితిలో వుండుంటే జబ్బు వచ్చినందుకే గాక, ఇంత హీనమైన మనుషులున్నారని తెలిసి మానసికంగా కుంగిపోయి వుండేవాడు.
శరత్ చంద్రకన్నా తను జూనియర్ ననీ, శరత్ చంద్ర వద్దంటేనే తనీ డిపార్ట్ మెంట్ కి చీఫీ స్థానంలో వున్నాననీ గుర్తుంచుకోడానికి ఏ మాత్రం ఇష్టపడడు భగవంతం.
పైగా, తన క్రింది వాళ్ళు ఎక్కడ గుర్తిస్తారోనని జాగ్రత్త పడుతుంటాడు. ఎప్పటికప్పుడు వాల్ళముందు శరత్ చంద్రని తేలిగ్గా మాట్లాడి తన సుపీరియారిటీని ప్రదర్శించడానికి తాపత్రయపడుతుంటాడు.
ప్రక్కవాణ్ణి హీనపరచడం ద్వారా తన గొప్పదనాన్ని గుర్తింపచేసుకోవాలనే హీనమైన మనస్తత్వం!
* * * *
కంపించిపోతున్నాడు శరత్ చంద్ర! పాపకి ఆపరేషన్ చేయలేకపోయాననే బాధ నలిపేస్తుండగానే, రాత్రి చేసిన కేసుకి ఎయిడ్స్ సోకిందని తెలిసి కృంగిపోతున్నాడు.
ఒకదాని తర్వాత ఒకటి అతన్ని కుదిపేస్తున్నాయి!
"చలపతిరావుకి బ్లడ్ డొనేట్ చేసిందెవరు?"
తనని తాను తమాయించుకుంటూ అసిస్టెంట్ కిరణ్ ని అడిగాడు. ప్రతి బైపాస్ ఆపరేషన్ కీ ఆరుసీసాల రక్తం కావాల్సుంటుంది. ఆ విషయాలన్నీ కిరణ్ చూసుకుంటుంటాడు.
"బ్లడ్ బాంక్ లో అతని గ్రూప్ రక్తం లేదంటే ఎవరో డోనర్స్ ని వాళ్ళే తీసుకొచ్చారు సార్! నలుగుర్ని మాత్రం బ్రోకర్ ద్వారా తెచ్చుకున్నారట" చెప్పాడు.
ఆ మాటతో అంతా అర్థం అయింది శరత్ కి. చలపతిరావుది చాలా అరుదైన గ్రూప్ రక్తం. ఆ గ్రూప్ రక్తం బ్లడ్ బాంక్ లో లేకపోవడం వల్ల వాళ్ళు బయటినుండీ డోనర్స్ ని వెదికి తెచ్చుకొని వుంటారు. ఎమర్జన్సీ కేసు! గ్రూపు కలిసిన డోనర్స్ ని వెదికి తేవడం టైమ్ తీసుకునే పని!
అంచేత, మామూలుగానే - వాళ్ళు రక్తం అమ్ముకొనే వాళ్ళని సప్లయ్ చేసే బ్రోకర్స్ ని ఆశ్రయించి వుంటారు. వాళ్ళు సరఫరా చేసిన మనుషుల్లో ఎవరికో ఎయిడ్స్ వుండి వుంటుంది.
రక్తం రోగికి ఇచ్చేందుకు ఎయిడ్స్ లేదని నిర్ధారించే పరీక్ష చేసే టైమెక్కడ?? అంతా క్షణాల్లో జరిగిపోవాల్సిన ఎమర్జన్సీ కేసు!
ఒక్కొక్కటీ తెలుస్తున్న కొద్దీ ఏకాకిగా తుఫానులో ఇరుక్కుపోతున్న ఫీలింగ్ కలిగింది.
బాధకన్నా బాధ్యత బలమైంది!
చేయవలసిన పనులు కళ్ళముందు కదిలాయి. అతను వెంటనే తేరుకున్నాడు.
"కిరణ్! మీరు టి.ఆర్.ఆర్. లో చలపతిరావు దగ్గర వుండండి. ఎవరూ అధైర్యపడకుండా చూసే బాధ్యత మీదే! రవళీ, మీరు రౌండ్స్ కి రండి" అని ఆదేశిస్తూ అక్కడి నుండి కదిలాడు.
అతని ఆదేశం కిరణ్ గుండెల్లో రైళ్ళు పరిగెట్టించింది.