గుడిశెల రాజకీయం
మాకాలనీలో వుండే మిమిక్రీ ఆర్టిస్ట్ మారుతీ ప్రసాద్ సొంతిల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేయబోతున్నాడన్న వార్త అశనిపాతంలా తాకింది మమ్మల్ని.
ఆ సాయంత్రం అందరం కాలనీ వేదిక దగ్గర కూర్చుని ఆ విషయమే బరువెక్కిన హృదయాలతో మాట్లాడుకుంటూంటే మారుతీ ప్రసాద్ చిరునవ్వుతో వెలిగిపోతున్న ముఖంతో మా దగ్గర కొచ్చాడు.
"రేపే తెల్లారుఝామున గృహప్రవేశం సార్! మన కాలనీవాళ్ళంతా తప్పకుండా రావాలి!" అన్నాడు అందరికీ తలో ఇన్విటేషన్ కార్ట్ ఇస్తూ.
ఆ ఇన్విటేషన్ కార్డ్ చూస్తూనే మాకందరికీ మాట పడిపోయినంత పనయింది.
"తప్పకుండా వస్తాం" అన్నాం లోపలి ఫీలింగ్స్ బయటకు కనిపించకుండా అణచిపెడుతూ.
అతను వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు అందరం నిశ్శబ్దంగా వుండిపోయాం.
"అందరూ ఇళ్ళు కట్టుకుంటున్నారు. మనకే.. స్థలం వుండీ- లేకుండా పోయినట్లయింది" అన్నాడు శాయిరామ్.
"లేకపోతే ఈ పాటికి మనందరం కూడా గృహ ప్రవేశాలు చేసి వుండేవాళ్ళం అన్నాడు రంగారెడ్డి విచారంగా.
ఆ రాత్రి ఆ మారుతీ ప్రసాద్ గృహ ప్రవేశం తాలూకూ ఇన్విటేషన్ కార్డ్ చూసేసరికి కాలనీలో ఆడాళ్ళందరూ సాధింపు ప్రారంభించినట్టు స్పష్టంగా వినిపిస్తూనే వుంది బయటకు.
"ఇంత చేతకాని వాళ్ళు కాబట్టే కొన్న ప్లాట్లను ఆ గుడిశెల వాళ్ళకు అప్పజెప్పి నోర్మూసుక్కూర్చున్నారు" అంటోందొకావిడ.
"మా పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బు మాకు తెచ్చిచ్చేయండి. ఇల్లు కట్టని కాడికి ప్లాటుండేం లాభం?" అంటోందింకో ఆవిడ.
వాళ్ళ సూటిపోటి మాటలు భరించలేక భోజనాలవగానే అందరం ఇళ్ళల్లో నుంచి బయటపడ్డాం.
"ఎట్లాగయినా మనప్లాట్లు మనం స్వాధీనం చేసుకోవాలి!" అన్నాడు గోపాల్రావ్ ఆవేశంగా. అతనిమాటతో మా అందరికీ కూడా ధైర్యం, ఆవేశం పుట్టుకొచ్చినయ్.
"అవును! అదంతా మన కష్టార్జితం. కనుక వదలడానికి వీల్లేదు" అన్నాడు రంగారెడ్డి.
"కానీ ఎలా స్వాధీనం చేసుకుంటాం! పోలీసులు మనకేమాత్రం సహాయం చేయడం లేదు కదా! పైపెచ్చు గుడిసెలను తీసేస్తామని మన డబ్బుకూడా కొట్టేశారు" అన్నాడు చంద్రకాంత్ అనుమానంగా.
దాంతో మా ఆవేశాలు మళ్ళీ చల్లారిపోయాయ్.
"పోలీసులు సహాయం చేయకపోతే వాళ్ళపై అధికారులకు రిపోర్టిద్దాం" అన్నాడు గోపాల్రావ్.
అతని సూచన మాకందరికీ నచ్చింది.
పోలీస్ అధికారుల్లో కూడా అవినీతివున్నా డైరెక్ట్ గా వచ్చే కొత్త ఐపీయస్ అధికారులు కనీసం కొంతకాలం వరకయినా చాలా సిన్సియర్ గా నీతిగా వుంటారని మాకు తెలుసు. అందుకని వాళ్ళను బ్రతిమాలుకుంటే ఫలితం వుండవచ్చని మాకనిపించింది.
మర్నాడే అందరం కలిసి పోలీస్ అధికారులను కలుసుకోవాలని నిర్ణయించుకున్నాం.
"కొంతమంది పోలీస్ అధికారులు నాకు బాగా తెలుసు. వాళ్ళు మామూలు పౌరులకు సహాయం చేయకపోవచ్చుగానీ మా జర్నలిస్ట్ లకు మంచి సహాయం చేస్తారు" అన్నాడు గోపాల్రావ్.
తీరా మర్నాడు మేం వెళ్ళేసరికి పోలీస్ అధికారులమరూ నక్సలైట్లు పట్టుకున్న ఓ మండలాధికారిని విడిపించే విషయంలో చాలా బిజీగా వున్నారని తెలిసింది.
సాయంత్రం ఆరుగంటలవరకూ వేచి వున్నాక మాకు ఒక పోలీసాఫీసర్ ఇంటర్వ్యూ దొరికింది.
మా సంగతంతా చాలా ఆసక్తిగా విని మా ఆర్జీ తీసుకున్నాడతను.
"నేను చూస్తాను! మీరింక వెళ్ళిరండి" అన్నాడు చివరలో.
మేము ఆనందంగా తిరిగి వచ్చేశాము.
మర్నాడే పోలీసులువెళ్ళి ఆ గుడిసెలన్నిటినీ పీకేస్తారని మేము అనుకున్నాంగానీ నెలరోజులు అయినా ఏమీ జరగకపోయేసరికి మాకు తిక్కరేగిపోయింది.
అందరం కలిసి మళ్ళీ పోలీస్ స్టేషన్ కెళ్ళాం.
ఇన్ స్పెక్టర్ మమ్మల్ని చూసి నవ్వాడు.
"కుదరదయ్యా వాళ్ళ గుడిశెలు తీయడం కుదరదని చెప్పినా వినకుండా మా ఆఫీసర్ దగ్గరకెళ్ళారుకదా! ఆయనేం చేస్తాడు? మాకు చెప్పాల్సిందేగా మళ్ళీ?"
మా ముఖాలు మాడిపోయాయి.
"వాటిని పీకేయడం ఎందుకు కుదరదు? మీకు ఇచ్చిన డబ్బు చాల్లేదా?" కోపంగా అడిగాడు రంగారెడ్డి.
"అది కాదయ్యా! మన రాజధానిలో వుంటూ కూడా గుడిశెల రాజకీయం గురించి మీకు తెలీలేదంటే ఏం చెప్పాలి? మీ స్థలాల్లో గుడిశెలు వేయించింది ఎవరోకాదు. ఆ ఏరియా ఎమ్మెల్యే ఆ ఏరియాలో వాళ్ళ పార్టీకి ఓట్లు కొంచెం తక్కువయ్యాయని గుడిశెలేయించి వాళ్ళపార్టీ వాళ్ళను అందులో వుంచారు. కనుక వాళ్ళను కాళీ చేయించడం ఎవడివల్లా కాదు-"
మేము గొణుక్కుంటూ ఇళ్ళకు చేరుకున్నాం.
ఆ రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు.
ఆ స్థలాలకు తిలోదకాలు వదులుకోవాల్సి వచ్చిందే అనే బాధ.
తెల్లారుజామున నాలుగ్గంటలకు కాలనీలో గోపాల్రావ్ వుంటున్న వేపు నుంచే పెద్దగా కేక వినిపించేసరికి అందరం అదిరిపడి లేచి కూర్చున్నాం.
మరి కాసేపట్లో బిగ్గరగా మాటలు వినిపించేసరికి వుండబట్టలేక బయటకు నడిచాను. అప్పటికే మా వాళ్ళందరూ నిద్రకళ్ళతో గోపాల్రావ్ చుట్టూ మూగివున్నారు.
గోపాల్రావ్ చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు.
"రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాను గురూ! కొశ్చెనాఫ్ అవర్ స్వెట్ అండ్ బ్లడ్ కదా! ఎలా వదులుకుంటాం? చివరకు మార్నింగ్ ఫోరోక్లాక్ కి అయిడియా వచ్చింది!"