Previous Page Next Page 
హ్యూమరాలజీ - 3 పేజి 16


    "ఏమిటది?"

 

    "మనందరం కలిసి కోర్టుకెళ్తాం! ఇది అనేకమందికి సంబంధించిన కేస్ కాబట్టి త్వరగా న్యాయం జరగడానికి అవకాశం వుంది. ఇలాంటికేసుల్లో మాంచి స్పెషలిస్ట్ లాయర్ ఒకతను నాకు బాగా తెలుసు. అతని దగ్గరకెళదాం" అన్నాడతను ఉత్సాహంగా.

 

    మాకూ అతని మాటలు ఆశలు కలిగించినయ్.

 

    అప్పటికప్పుడే రెడీ అయి ఉదయం ఆరుగంటలకల్లా లాయర్ నరసింహారావ్ ఇంటికి చేరుకున్నాం.

 

    గోపాల్రావ్ ని చూస్తూనే ఆదరంగా ఆహ్వానించాడతను.

 

    "వీళ్ళంతా మీ కాలనీ వాళ్ళేనా?" అడిగాడతను.

 

    "అవును!"

 

    "గుడ్ ఫెలోస్! పేపర్లో పాపం మీ పాట్లు అప్పుడప్పుడూ చూస్తేన్ వుంటాను. ఇంతకూ ఏం పనిమీద వచ్చారు?"

 

    గోపాల్రావ్ జరిగిందంతా చెప్పాడు.

 

    అతనికి మామీద జాలివేసింది.

 

    "దిసీజ్ టూమచ్! మన రాష్ట్రంలోనేకాదు. దేశమంతా కూడా పరిస్థితి ఇలాగే అఘోరించింది. మధ్యతరగతివాడి గురించి పట్టించుకునే నాధుడేలేడు. గవర్నమెంట్ దృష్టిలో ప్రజలంటే మందలుమందలుగా ఓట్లు నివసించే ప్రాంతాలు! అంతే!"

 

    "ఇప్పుడు మనం కోర్టుకెక్కితే వాళ్ళను మా స్థలాల్లోనుంచి ఖాళీ చేయిస్తారంటారా?" ఆశగా అడిగాడు శాయిరామ్.

 

    "ఇంతమందికి అన్యాయం జరిగింది గనుక తప్పక మనకు అనుకూలంగా తీర్పులభించే అవకాశాలున్నాయి"

 

    మా మహజర్లు, డాక్యుమెంట్లు, పోలీస్ కంప్లెయింట్ కాఫీలు అన్నీ జతపరచి ఆయనకిచ్చాము.

 

    ఆరునెలల తరువాత మా నరసింహారావు వ్యక్తిగత పలుకుబడివల్ల మా కేసు హియరింగ్ కొచ్చింది. అందరం కోర్టుకెళ్ళి మతగ్రంథాలమీద ప్రమాణాలు చేసి మేజిస్ట్రేట్ గారికి జరిగినదంతా విన్నవించుకున్నాం.

 

    ఆయనకు మామీద విపరీతమయిన జాలి కలిగింది.

 

    మా జనార్థన్ అద్భుతమయిన నటనతో సహా తను ఎన్నికష్టాలు పడి ఆ స్థలం కొన్నదీ వివరిస్తోంటే మేజిస్ట్రేట్ గారికి కూడా కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.

 

    ఆ మేజిస్ట్రేట్ గారు కూడా ఆ మధ్య కొన్న ఓ స్థలంలోకూడా ఎవరో గుడిశెళు వేశారనీ, అందువల్ల ఆయన మా బాధ తేలికగా అర్థం చేసుకోగలిగాడనీ తరువాత చెప్పాడు నరసింహారావు.

 

    ఇంక మాకేసుకి తిరుగులేదనీ, ఆ గుడిశెలవాళ్ళూ చెప్పేదికూడా విన్నాక వాళ్ళను ఆ స్థలాల నుంచి బయటకు గెంటించడం ఖాయమనీ చెప్పాడతను.

 

    మేమందరం ఆనందంగా ఇళ్ళకు వెళ్ళాం.

 

    ఆ తరువాతి వారంలోనే గుడిశెల నాయకులు బోనులో నిలబడ్డారు. మేమంతా శెలవుపెట్టి కోర్టుకి వెళ్ళాం.

 

    "చూడు కిష్టయ్యా! నువ్వు ఇంకొంతమందీ కలిసి రెండునెలల క్రితం ఇంకొకరి స్థలాల్లో గుడిశెలు కట్టుకున్నారట నిజమేనా?"

 

    "రెన్నెల్లకిందటేడ దొరా! మేమాడ గుడిశెలుగట్టి యాభై ఏండ్లయిపాయే"

 

    మేము మాతోపాటు మా లాయరుకూడా అదిరిపడ్డాం.

 

    "ఏమిటి? మీరా గుడిశెలువేసి యాభైఏళ్ళయిందా?"

 

    "అవ్ దొరా! ఆ జమానాల నిజాం దొర ఖుద్ ఆ జమీన్ మాకు నజరానా ఇచ్చిండన్నట్లు-"

 

    "అంతా అబద్ధం! వాళ్ళు రెండునెలల క్రితమే గుడిశెలు వేశారు" అరచాడు రంగారెడ్డి.

 

    "ఆర్డర్! మధ్యలో అలా అరిచారంటే బయటకు గెంటిస్తాను" అన్నాడు మేజిస్ట్రేట్ కోపంగా.

 

    మేము రంగారెడ్డిని బలవంతంగా కూర్చోబెట్టేశాము.

 

    "మీరు యాభైఏళ్ళ నుంచీ అక్కడ గుడిశెలు వేసుకుని వున్నట్లు సాక్ష్యాధారాలేమయినా వున్నాయా?"

 

    "సాక్ష్యమేమున్నది దొరా! ఆడుండేటోళ్ళందరూ ఖసంతోటి సాక్ష్యం జెప్పనికి తయారున్నరు-"

 

    రెండు రోజుల్లో రెండువందలమంది బోను ఎక్కి వాళ్ళు ఆస్థలాల్లో యాభైఏళ్ళ నుంచీ గుడిశెలు వేసుకుని వుంటున్నట్లు సాక్ష్యాలు చెప్పారు. ఆఖరులో ఆ ఏరియా ఎమ్మెల్యే కూడా వాళ్ళంతా తరతరాల నుంచీ అక్కడే గుడిశెలు వేసుకుని వున్నట్లు సాక్ష్యం చెప్పాడు.

 

    ఆ రోజు మా లాయర్ మాతో చెప్పేశాడు.

 

    "మన రాజధానిలో ఎక్కడయినా గానీ ఇదే పద్ధతిలో భూముల కబ్జా జరుగుతూంటుంది. గుడిశెళు వేసేస్తారు. వేశాక ఆ స్థలాల ఓనర్లు కాళీ చేయించడానికి కోర్టుకేక్కితే యాభైఏళ్ళ నుంచీ అక్కడే గుడిశెలు వేసుకుని వున్నట్టు వాళ్ళ లేబర్ తోనే సాక్ష్యాలు చెప్పిస్తారు. వాళ్ళు కేవలం రెండు నెలల క్రితమే అక్కడకు వచ్చి గుడిశెలు వేసుకుని వున్నట్టు మనం కోర్టులో చెప్తాం. కానీ మనకు ఎవరూ సాక్ష్యం వుండరు కదా! అంచేత కేస్ ఎప్పుడూ వాళ్ళే గెలుస్తుంటారు-"   

 

    ఆ తరువాత మరో రెండు నెలల్లో జడ్జిమెంట్ వచ్చింది.

 

    "వాళ్ళు యాభై సంవత్సరాల నుంచీ ఆ స్థలాల్లో గుడిశెలు వేసుకుని వున్నట్టు సాక్షాధారాలతో ఋజువు కావటం వల్ల కేస్ కొట్టివేయడమైనది."

 

    "ఇదన్యాయం!" అంటూ ఆవేశంగా అరిచాడు యాదగిరి.

 

    అతనిని వెంటనే పోలీసులు బయటకు తోసేశారు.

 

    మేమంతా దిగాలుపడి కోర్టు ఆవరణలోనే వున్న ఓ కాంటీన్లో 'టీ' తాగుతోంటే ఆ గుడిశెలు వేయించిన పాండూ దాదా మా దగ్గర కొచ్చాడు.

 

    "ఏం తంబీ? ఏమాయే? సుధరాయించిన్రా లేక బడే కోర్ట్ ల ఠకరాయిస్తరా?" అన్నాడు ఎగతాళిగా.  

 

    మాకు రక్తం ఉడికిపోయింది కానీ మధ్యతరగతి వాళ్ళం గనుక నోర్మూసుకుని వుండిపోయాం.

 

    "ఏయ్- ఇదీ గరిబోండ్ల రాజ్యంబే! మేమేం జేస్తే గదే కానూన్ అవుతది! మేమేం జెప్తే గదే ప్రభుత్వం జేస్తది. మేమెవళ్ళకు ఓట్లేస్తే వాండ్లే రాజ్యం జేస్తరు. సమజైందా?" హేళనగా అడిగాడు.

 

    మేము ఇళ్ళకు తిరిగి వచ్చేశాము. అంతకుముందు కేవలం మా కష్టారిజితమైన ఆ ఇళ్ళస్థలాలు పోయాయన్న బాధ ఒక్కటే వుండేది.

 

    ఇప్పుడు దానికి తోడు ఆ దాదాగాడు మిమ్మల్ని అతిదారుణంగా పూల్స్ ని చేయడం మరింత బాధ కలిగిస్తోంది. చదువులేనివాడు విద్యావంతుల్ని ఫూల్స్ చేయడమే మనదేశంలో డెమొక్రసీ!

 

    ఇంట్లో టీవీ కార్యక్రమాలు మామూలు ప్రకారం ప్రజల్ని చీల్చి చెండాడుతున్నయ్! మరికాసేపటి తరువాత హోమియోపతి డాక్టర్ తో ఇంటర్ వ్యూ ప్రారంభమైంది. మామూలుగానే డాక్టర్ నేమీ మాట్లాడనివ్వకుండా అన్నీ మాట్లాడేస్తున్నాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.

 

    డాక్టర్ మధ్యలో జొరబడడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు గానీ ఆ వ్యక్తి అతనికే మాత్రం సందు దొరకనీయడం లేదు. ఆఖరులో ఆ వ్యక్తికి హఠాత్తుగా దగ్గు రావడం వల్ల ఆ సమయాన్ని డాక్టర్ ఛటుక్కున దొరకబుచ్చుకుని తను చెప్పదల్చుకున్న నాలుగు మాటలు శరవేగంతో చెప్పేశాడు.

 Previous Page Next Page