సూరన్న - నక్క సూరన్న ఇప్పసారాయి బాగా తాగాడు. పిడికెడు మీసాలు అతని ముఖానికి నిండుదనాన్ని ఇస్తున్నాయి. కండ్లు ఎర్రగా వున్నాయి. వెన్నెలలో మెరిసిపోతున్నాయి. అయినా అతడు స్పృహ తప్పలేదు. తరతరాలుగా వచ్చిన కథ చెపుతున్నాడు.
"చో ఓ ఓ ఓ ఓ
ఓ ఒ ఓ ఒ ఓ
ధన్ ధనా ధన్ ధనా ధన్
ధనా ధన్ ధనా ధన్ ధన్"
జల ప్రళయమొచ్చింది. కలిఘ్రంమంత నీల్లల మునిగిపోయింది. సముద్రం మీదికి కలకోడి వచ్చింది. ఆమె ఆదిశక్తి రూపం, మహాతల్లి అవతారం. కలకోడి గుడ్డు పెట్టింది. అది వెయ్యేళ్ళ తరువాత చితికిపోయింది. ఇంకో గుడ్డు పెట్టింది. అది కూడా వెయ్యేళ్ళు తరువాత బతికి పోతుంది. కలకోడి కలకోడి- దుఃఖించింది. మూడవగుడ్డు పెట్టింది. దానిమీద కూర్చొని పొదిగింది. వెయ్యేళ్ళకు అది పగిలింది. ఫై చిప్ప ఆకాశం అయింది. కిందికి భూమిగా మారింది. గుడ్డులోంచి పుట్టినవారు కామధేనువు, విష్ణువు, ఈశ్వరుడు. కామధేనువు నాలుగు తోకలు, రెండు తలలు, నాలుగు కొమ్ములతో పుట్టింది.
కలకోడి ఆదిశక్తి అయింది. తనతో భోగించనున్నది. ఈశ్వరుడు తల్లితో భోగించనన్నాడు. ఆదిశక్తి తనకు అమ్మ కాదన్నాడు విష్ణువు. అమ్మమ్మ అన్నాడు. తాను భోగిస్తానన్నాడు. అడిగిన వరం ఇవ్వాలన్నాడు. ఇస్తానన్నది. విష్ణువు భోగించాడు. ఆదిశక్తికి ఆదిరాజు పుట్టాడు.
అతడన్ని లోకాల నేలినాడు
అందుకోసమే మీరు దొరసట్టపోరూ
చో చో చో ఓ ఓ ఓ ఓ
జల రేల రేలా రేల
జలా రేల రేలా రేల
హెయ్, హెయ్, హెయ్ హెయ్ హెయ్
హేయ్ హెయ్ హేయ్ హెయ్ హెయ్
అడుగులు ముందుకూ వెనక్కూ వేస్తూ నృత్యం చేస్తున్నారు. కోయ యువకులు, యువతులు చెట్టపట్టాలు పట్టుకొని ఎగురుతున్నారు. వెన్నెలను వెక్కిరిస్తూ కిలకిలా నవ్వుతున్నారు. ఇప్పపూవు సారాయి సేవిస్తున్నారు. తైతక్కులాడుతున్నారు. గుసగుస లాడుతున్నారు. వారి ఆనందం అవధులుదాటింది. అయినా చెలియలి కట్టకుతాకి కెరటం విరిగి పడుతూంది. మరొక తరంగం ఊయలలూగుతూ వస్తూంది. వయ్యారంగా వస్తూంది విరిగి పడుతూంది. వెదురు గడలలో తుమ్మెదలు రంధ్రాలు చేశాయి. వాటిలోనికి గాలిపోయి వేణుగానం ఆలపిస్తూంది.
జల రేల రేల రేల
రేలరే జల రెలరే
"ఉస్స్! టక్కునాపితివేమే సూరన్న. మల్ల డోలోడెట్లొచ్చెనో చెప్పకపోతివి." అడిగాడు సమ్మయ్య.
ధన్ ధనాధన్ ధనాధన్
ధనాధన్ ధన్ ధనాధన్
ఆదిశక్తి అక్కడనే అసువులు బాసింది.
ఆదిరాజు ఒక్కడుగా దిగులు పొందినాడు.
ఆదిశక్తి పానాలు విడిచింది. మల్లపోయి మడుగులో పుట్టింది. కాళింది మడుగులో పుట్టింది! ఆదిరాజు దిగాలుపడినాడు. ఆదిశక్తి చేప అయిందని గ్రహించాడు. ఆదిరాజు గాలం తయారుచేశాడు. మద్దిచెట్టును కర్రచేశాడు. వాసుకిని తాడుచేశాడు. ఏదుపంది కొమ్మును సీకుగా పెట్టాడు. మదపు పడ్డను - అడవి బర్రెను ఎరగా గుచ్చాడు; ఆదిరాజు సప్త సముద్రాలు తిరిగాడు. ఎక్కడా చేప దొరకలేదు. భూలోకమంతా తిరిగాడు. కాళింది మడుగుకు వచ్చాడు. గాలం వేశాడు. ఒడ్డున కూర్చున్నాడు. చేప పడింది. గాలం తీశాడు. ఆదిశక్తి వచ్చింది. ఇద్దరూ పెళ్ళాడారు.
వారికి నూటొక్కమంది పుత్రులు పుట్టారు. నూటొక్కమంది చన్నుకుడవసాగారు. పాలు అయిపోయాయి. రక్తం కారసాగింది. విసిగిపోయింది ఆదిశక్తి. నూటొక్క మందిని చంపమన్నది. ఆదిరాజు భార్యమాట విన్నాడు. నూటొక్కమందిని తీసుకొని అడవికి బయలుదేరాడు. అవును అడవికి బయలుదేరాడు. తల్లి వారిని చంపమన్నది? అడవిలో వదలమన్నది. తండ్రి వారిని తీసుకొని బయలుదేరాడు. నూటొక్కమంది తండ్రితో వెళ్తున్నారు. వారికి దాహం వేసింది. నాలుకలు ఆరుకుపోతున్నాయి. ఏం చేయాలో తోచలేదు ఆదిరాజుకు. ఒక దసిని చెట్టు కనిపించింది. దసినికాయ కోశాడు. నీళ్ళున్న చోటికి వెళ్ళాడు. అందులో నీరు నింపాడు. అయిదు మానికల నీరుపట్టింది. అందరికీ దాహం తీర్చాడు. వెంట తీసుకొని బయలుదేరాడు. అప్పటికి పొద్దుకుంగింది. చీకట్లు కమ్మాయి. వారు మర్రి వృక్షం క్రిందికి చేరారు. నూటొక్కమంది నిద్రపోయారు. మర్రికొమ్మకు నీళ్ళున్న దశినికాయ కట్టాడు ఆదిరాజు. దానికి నూటొక్క రంధ్రాలు చేశాడు. నూటొక్క రంధ్రాల నుంచి నీరు రాసాగింది. ఆ నీటితో పెదవులు తడుపుకొని నిద్రపోయారు. ఆదిరాజు పిల్లలను వదిలాడు. బయలుదేరాడు. పిల్లలకు ఆకలి అయింది. అంతా లేచి నేలను గోళ్ళతో త్రవ్వారు. ఆ మట్టిని తినేశారు. అక్కడ పెద్ద గుంట అయింది. అదే వాననీటితో నిండి చెరువు అయింది. మన్నుతిని నిద్రపోయారు బాలురు. ఆదిరాజు తిరిగి తిరిగి చిలకల పర్వతం చేరాడు.
పర్వతము నెత్తిండు పట్టుకొని వచ్చిండు.
పడుకున్న పిల్లలా మీద వేసిండు.
ఆదిరాజు పర్వతాన్ని పిల్లలమీద వేశాడు. తండ్రి బిడ్డలను చంపుతున్నాడు. భూదేవి చూచింది. గడగడలాడింది. భూమి బద్దలైంది. పిల్లలను అందులోకి చేర్చింది. పిల్లలు భూమిలోకి వెళ్ళారు. ప్రయాణ సాగించారు. నాగలోకం చేరుకున్నారు. నాగలోకంలో నాగేంద్రుడికి రాచపుండు పుట్టింది. పన్నెండేండ్లనుంచి బాధ పెడుతూంది.
భూలోకం నుంచి కోయలొచ్చిరని విన్నాడు.
వారికి చెట్లుమందులు తెలుసనుకున్నాడు.
నాగేంద్రుడు కోయదొరలను పిలిచాడు. నూటొక్కమంది కోయదొరలు వెళ్ళారు. నాగేంద్రుడు తన బాధ వివరించాడు. నయం చేయమని ప్రార్దించాడు. రాజులు నయం చేస్తామన్నారు. తాము కోరింది ఇవ్వాలన్నారు. ఇస్తానన్నాడు నాగేంద్రుడు. బెరంబోయనరాజు బయలుదేరాడు. సిరిబొద్దు చెట్టు వేళ్ళతోసహా తెచ్చాడు. తవ్వాడు కాళ్లతో సహా తిచ్చాడు. రాచపుండుబాద వేశాడు. గుడ్డకట్టివేశాడు. సిరిబొడ్డుచెట్టు తగిలిందా. రాచపుండు పగిలిందా నాగేంద్రుడు నిద్రపోయాడు. పన్నెండేండ్లు నిద్రపోయాడు. లేవగానే కోయలను పిలిపించాడు. ఏం కావాల్నో కోరుకొమ్మన్నాడు. నాగేంద్రుని దగ్గర నాగళ్ళతంబ వాయించే వాడున్నాడు. వాడు మంచిగా వాయిస్తున్నాడు. వాని వాయిద్యం వారెవా! ఏం బాగున్నది!! దొరలు డోలువాణ్ణి ఇవ్వమన్నారు. డోలుపోతే తన బతుకు లేదన్నాడు నాగేంద్రుడు. బ్రతిమిలాడాడు దొరలను. ఇచ్చిన మాట కాదనమన్నారు దొరలు. తమకు డోలువాడె కావాలన్నారు. నాగేంద్రుడు చాలా దుఃఖించాడు. కన్నీటితోనే డోలువాణ్ణి సాగనంపాడు.
"నాగేంద్రుణ్ణి వాణ్ణి సాగనంపినాడు
వాడె మీకు డోలువాడైనాడు"
డోలోణ్ణి తీసుకొని దొరలు బైలెళ్ళినారు. వారూ భూలోకానికి వచ్చినారు. వారు నడిచి నడిచి డస్సినారు. దాహంతో తపించసాగారు. అప్పుడు వారికి
రెండు బండల సందునా
రేల చెట్టు కనిపించెను
రేల చెట్టునానుకొనీ
నీరు జలజల పారెను
అప్పుడు వారు సంతోషించారు. నీటిని చూచి గంతులేశారు. పాట పాడారు. అదే కోయల మొదటిపాట.
జలా రేల రేలా రేల
రేలారె జలా రేల
చో ఓ ఓ ఓ ఓ
జలా రేల రేలా రేల
వేగుచుక్క పొడిచింది. డోలు సూరన్న అలశాడు. రేయి సైతం అలసి సొక్కిపోయింది.
హేయ్ హేయ్ హేయ్ హేయ్
హేయ్ హేయ్ హేయ్ హేయ్
చెట్టాపట్టాలు పట్టుకొని అడుగులు ముందుకూ వెనక్కూ వేస్తూ విడిపోయారు. కిలకిలమంటూ గుడిసెల్లో దూరారు. యువతులు, యువకులు నాగళ్ళు తీసుకొని భూమిని చీల్చడానికి బయలుదేరారు. గింజల బుట్టల్తో యువతులు వారి వెంట వచ్చారు.