Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 15


    "ఆర్యూ మేడ్" నిర్లిప్తంగా అన్నాడు డి.జి.పి.... "వాడేదో గొంతెమ్మకోర్కె కోరాడని మనం ఇలాంటి రిస్కు తీసుకోలేం ప్రసన్న. ఆల్టర్నేటివ్, గురించి ఆలోచిద్దాం."

    "అంగీకరిస్తాడన్న నమ్మకం నాకు లేదు" ప్రసన్న భావరహితంగా అన్నాడు. ఒకపక్క నెగోషియేషన్స్ అవుతుండగానే అక్కడ బస్సులో స్నేక్స్ విడిచిపెట్టి ఒక దారుణానికి సిద్ధపడినవాడు కనీసం సహనంలేకుండా తన ఆధిక్యతని క్షణక్షణమూ నిరూపించుకోవాలనుకుంటున్నవాడు తను అన్న మాట జరగలేదని తెలిసిన మరుక్షణం మరీ విజృంభిస్తాడు."

    "సో వాట్ డూ యూ సజెస్ట్ దెన్" కమీషనర్ భృకుటి ముడిపడింది.

    "లల్లీని పంపడమే" ప్రసన్న గొంతు వణికింది.

    "యూ ఆరె మేడ్ మేన్" డి.జి.పి. ఖండించాడు. "లేకపోతే చేజేతులా ఒక పసికందుని అందులోనూ కన్న కూతుర్ని పంపాలని ఎలా అనుకుంటున్నావు మిస్టర్ ప్రసన్న..." ఆప్యాయంగా ప్రసన్న భుజంపై చేయివేసాడు. "బాధ్యత గొప్పది. దానికన్నా ఆ బాధ్యత నిజాయితీగా నిర్వర్తించాలన్న ఆలోచన గొప్పది కాదనను. కాని వీటన్నిటికి మించింది మమకారం. నీ ప్లేస్ లో నేనున్నా నా బిడ్డని పంపను. పంపలేను. మైడియర్ చైల్డ్...నీకు ప్రత్యేకించి మా టాస్క్ ని అప్పచెప్పింది బాధ్యతని నిర్వర్తించగలవనేగాని దానికోసం నీ మమకారాన్ని చంపుకోమని కాదు. సో...ఐకాంటే క్సెప్ట్."

    ఒక అభినందన కోసంగాని విద్యుక్త ధర్మ నిర్వహణలో తనో అసాధారణమైన మనిషనిగాని నిరూపించుకోవాలనే మనస్తత్వం కాదు ప్రసన్నది.

    అయినా ఆలోచిస్తున్నాడు ఇంకా అలాగే...

    తనకిక పిల్లలు పుట్టరు...హిస్ట్రెక్టమీతో పిల్లల్నికనే అదృష్టాన్ని సబిత కోల్పోయింది లల్లీ పుట్టుకతోనే.

    అదికాదు ఇప్పుడు ప్రసన్న ఆలోచిస్తున్నది.

    ఒకవేళ ఇది కొన్ని గంటలపాటే అయితే సబితని తను మభ్యపెట్టగలడు. కాని లల్లీని ఒప్పించడమెలా...

    నిన్నరాత్రి జరిగిన సంఘటననుంచి ఇంకా తేరుకోని లల్లీ ఇక్కడొక మారణహోమం జరిగిపోతుందీ నువ్వు దానికి సహకరించాలీ అంటే వినేటంత వయసులేదే. పైగా తప్పకుండా తిరిగివస్తుందన్న నమ్మకమూలేదు.

    ప్రసన్న కళ్ళముందు సుమారు ఇరవై గంటలుగా పోయిన పిల్లలకోసం గుండెలుబాదుకుని ఏడుస్తున్న తల్లిదండ్రులూ మరణించిన తల్లి కోసమో తండ్రి కోసమో గుండెలవిసేలా రోదిస్తున్న పిల్లలూ వరుసగా మెదులుతుంటే__

    ఇదిగో ఇక్కడొక పోలీసాఫీసర్ ఒక మరణయాతనకి సిద్ధపడుతూ మమకారం కన్నా తన చుట్టూవున్న ప్రపంచం గొప్పదని చరిత్రకోరని ఒక సంఘటనకి సిద్ధపడుతూ తన అభీష్టాన్ని వ్యక్తం చేయబోతుండగా ఫోన్ రింగయింది.

    అది ఎక్కడ నుంచీ అన్నది ఇంకా డి.జి.పి. తెలుసుకునే ప్రయత్నంలో వుండగానే ప్రసన్న అందుకున్నాడు. "హల్లో"

    ప్రసన్న అంచనా తప్పుకాలేదు. అనుకున్న వ్యవధికన్నా ముందు ప్రత్యర్ధి ఫోన్ చేస్తాడన్న అతడి నమ్మకం నిజమైంది.

    "బుస్...స్..." పాము బుస వినిపించింది భీతావహంగా.

    "నేను ప్రసన్నని మాటాడుతున్నాను."

    "ఇప్పుడు టైం నాలుగే అయింది"

    "అవును..."

    "నేను ముందే ఫోన్ చేస్తానని గెస్ చేసావా!"

    "నీ అసాధారణమైన మేధస్సుని పూర్తిగా కాకపోయినా కొంత అర్ధం చేసుకున్నాను మిస్టర్ బ్లాక్ మాంబా."

    డి.జి.పి, కమీషనరూ స్థాణువులై చూస్తున్నారు.

    "చర్చలు పూర్తయ్యాయా?"

    "అఫ్ కోర్స్...ఒక్కటే" కొద్దిగా సంశయిస్తూ అన్నాడు ప్రసన్న. "ప్రదీప్ సక్సేనాని విడిచిపెడతాం. కాని ఈ రాత్రికి మా లల్లీ..."

    "తెలివి ప్రదర్శించకు ప్రసన్న. నీ కూతుర్ని మాత్రమే పంపాలి. దట్సాల్."

    "కాని పసిపిల్ల."

    "అయినా నీ కూతురు కదూ...మిస్టర్ ప్రసన్న...ప్రదీప్ సక్సేనాని అరెస్టుచేసిన నీ మేధస్సుని నేను ఆరోజే అంచనా వేయగలిగాను. నీ డిపార్ట్ మెంట్ లో నువ్వొక ముత్యానివి. ఐ లవిట్. స్టిల్ ఐ హేట్ యూ. ఇక్కడ నీ కూతుర్నే అడ్డం పెట్టుకోకపోతే తెలివిని ప్రదర్శిస్తావు ఎంతైనా తండ్రివిగా. రిస్కుతీసుకోకుండా ముందు నిన్ను కస్టడిచేయాలని ఈ షరతుపెట్టాను ఏమంటావు?"

    "యస్...అంగీకరిస్తున్నాను..."

    "గూడ్" నవ్వువినిపించింది. "చూడూ ముఖ్యంగా నీకోవిషయం చెప్పాలి. నా ఆధీనంలో వున్న నీ లల్లీ వుండేది పాముల కేజెక్స్ మధ్య. మీరెవరన్నా పిచ్చి వేషాలు వేస్తే పాముకాటుకి బలైన లల్లీ శవం భద్రంగా నీ దగ్గరికి చేరుతుంది...సో..."

    "ఓ రిక్వెస్ట్" ప్రసన్న ఉద్విగ్నంగా అడిగాడు. లల్లీ చిన్నపిల్ల. నీ షరతులకి నేను అంగీకరించాను కాబట్టి తోడుగా మరోమనిషిని నేను పంపితే నీకు అభ్యంతరం లేదుగా."

    "ఓ క్షణం నిశ్శబ్దం...

    "కనీసం తోడులేకపోతే మరీ భయపడుతుందని" ఇంచుమించు అర్దిస్తున్నట్టుగా అన్నాడు.

    "మీ డిపార్టుమెంటు వాడైతే కాదుగా."  

    "నో నో...కేవలం దానికి రాత్రంతా కంపెనీగా వుండటంకోసమనే."

    "సరే...అంగీకరిస్తున్నాను..." చెప్పాడు. ఏంచేయాల్సింది. ప్రసన్న వెన్నులో సన్నగా వణుకు. "మిస్టర్ ప్రసన్నా...ఈ రాత్రి సరిగ్గా ఏడుగంటలకి వూరికి దూరంగావున్న ఆ ప్రదేశంలో ఇద్దర్నీ దింపేసాక ఏమాత్రం ఎవరన్నా అనుసరిస్తున్నట్లు అనుమానంవస్తే అప్పటికే పొదల్లో కాచుక్కూచున్న నా మనుషులు నీ కూతుర్ని దారుణంగా షూట్ చేసి చంపుతారు అర్ధమైందా?"

    "చెప్పు, ఎక్కడ విడిచిపెట్టాలి."

    "తెలివితేటలు ప్రదర్శించకు. సరిగ్గా అయిదునిమిషాలముందు అంటే ఆరుఏభై అయిదుకి ఫోన్ చేస్తాను. ఏ ప్రదేశంలో విడిచిపెట్టాల్సిందీ" ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడైంది.

    నిస్సత్తువగా కూర్చుండిపోయిన ప్రసన్న కొన్ని క్షణాలు మాటాడలేకపోయాడు...

    ఇంకా పూర్తిగా విరియని ఒక లేతమొగ్గని పాములు చంపేస్తాయి. 'డాడీ ఎక్కడికన్నా వెళ్ళిపోదాం డాడీ' అంటూ నిన్నరాత్రి తనను చుట్టేసుకుని ఏడ్చిన పసికందుని గుర్తుచేసుకుంటుంటే గుండె కలుక్కుమంటూంది...కళ్ళల్లో అస్పష్టంగా ఓ నీటిపొర.

    కలలోలా చెప్పుకుపోయాడంతా...

    తన ముప్పయ్యేళ్ళ అనుభవంలో ఇలాంటి ఒక పోలీసాఫీసర్ని చూసి ఎరగని డి.జి.పి. అప్రతిభుడౌతూనే అడిగాడు. "ఇంతకీ పాపతో పంపాలనుకుంటున్న వ్యక్తెవరు...?"

    "మన డిపార్ట్ మెంట్ మనిషి కాదు."

    "నీ దృష్టిలో ఎవరన్నావున్నారా!"

    "ఉన్నాడు. కాని ఎక్కడున్నాడో తెలీదు...తెలుసుకోగలిగితే పంపిస్తాను"

    "ఎవరతను?"

    "జయేంద్ర"


                         *    *    *    *


    సాయంకాలం నాలుగున్నర కావస్తోంది.

    ఆకాశం ధ్వంసరచనకి గుండె పట్టిన నీలి కాగితంలా వుంది.

    గాలి విషవాయువుల్ని మోసుకొస్తూ ప్రళయానికి ముందు ప్రశాంతతని స్పురింపచేస్తుంది.

    బడలికగా నిద్రలేచిన జయేంద్ర శృతికోసం చూశాడు.

    అలికిడిలేదు...పిలిచాడు...అప్పటికీ జవాబులేదు...లేబరేటరీ గదిలోక్కూడా వెళ్ళాడు...ఆమెకు బదులు ఆమె రాసిన ఉత్తరం కనిపించింది టీపాయ్ పై...

    "జయేంద్రా...నేను బయటికి వెళుతున్నాను. సాయంకాలానికల్లా వస్తాను...ఈలోగా కాఫీ కావాలీ అంటే ప్లాస్కులో వుంది తాగండి. నా అనాలో, మా అనాలో తెలీదుగాని మొత్తానికి నా ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న మీరు కొన్ని రోజులపాటు అలా విశ్రాంతి తీసుకోవాలని మేల్కొలపలేదు. చిన్న సలహా మీరేం అనుకోకపోతే...ప్రపంచం సంగతి తర్వాత ఆలోచిద్దాంగానీ ముందు లుంగీ కట్టుకోవడం నేర్చుకోండి.

    ముందంతా సీరియస్ గా చదివిన జయేంద్ర ఆ చివరివాక్యంతో కాస్త తొట్రుపడి లుంగీ కోసం చూసుకున్నాడు. లేదు...బెడ్ కి దిగువగా నేలపై పడివుంది.

    తను ఉన్నది అండర్ వేర్ తో అన్న విషయం అప్పటికి గుర్తురావడంతో అమాంతం దుప్పటిని పైకి లాక్కున్నాడు.

    బహుశా శృతి తననిలాగే ఇందాక చూసి వుంటుందన్న ఆలోచన ఎంత బిడియాన్ని కలగాజేసిందీ అంటే ఇక ముందు పైజమా వేసుకుని తప్ప ఇక నిద్రపోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

    ఇప్పుడు ఉత్తరంలోని శృతి అక్షరాలు పగలబడి నవ్వుతున్నట్టనిపిస్తుంటే తొందరగా లేచి లుంగీని మొలకి చుట్టుకున్నాడు.

    "షేమ్ షేమ్ పప్పీ షేమ్..."

 Previous Page Next Page