Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 14


    "అప్పుడే మీ పోలీస్ ఎక్స్ చేంజ్ వాళ్ళు తెలివి ప్రదర్శించి నేనెక్కడనుంచి మాట్లాడుతున్నదీ తెలుసుకున్నట్టున్నారు."

    డి.జి.పి. చేతులు కంపించిపోతున్నాయి. విషయసేకరణలో ఇంతటి వేగాన్ని ప్రదర్శిస్తున్న ప్రత్యర్ధి సామాన్యుడు కాడని మరోసారి చాలా స్పష్టంగా అర్ధమైంది. "అన్నట్టు నేనిప్పుడు రాణిగంజ్ నుంచి మాట్లాడటం లేదు!"

    "సరే" డి.జి.పి. గొంతు తడారిపోయింది. "చెప్పు."

    "నా శక్తేమిటో నీకీపాటికి స్పష్టంగా అర్ధమై వుంటుంది. అవునా?" బ్లాక్ మాంబాగొంతు తేనెపూసిన పంజాధాటిని స్పష్టం చేస్తుంది. "మాటాడు"

    "వింటున్నాను."

    "వెల్...పాయింట్ కి వద్దాం...మిస్టర్ డీజీపీ...ఇప్పటికే చాలామందిని కోల్పోయిన నువ్వు యీ నరమేధం కొనసాగకూడదూ అంటే నాకో సహాయం చేయాలి..."

    "ఏమిటది?"

    "గుర్తుందా...సరిగ్గా మూడునెలల క్రితం సిటీ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ముప్పై ఆరులక్షల రూపాయల ఖరీదుచేసే పాముతోళ్ళను మీ డిపార్ట్ మెంటు అదుపులోకి తీసుకుంది."

    డి.జి.పి. చెంపలపై నుంచి చెమట ధారగా కారుతూంది.

    "నాకు కావాల్సింది ఆ సరుకు కాదు__ఆ రోజు హోటల్ బంజారాలో అనుమానితుడిగా కస్టడీలోకి తీసుకొన్న వ్యక్తి. పేరు తెలుసనుకుంటాను."

    "తెలుసు...ప్రదీప్ సక్సేనా." ఇన్వెస్టిగేషన్ లో ఒక్క విషయమూ బయటికి చెప్పని ప్రదీప్ సక్సేనా ప్రస్తుతం మతిభ్రమించి సంచల్ గూడా జైల్లో వున్నాడు.

    "అతడ్ని విడిచిపెట్టాలి బేషరతుగా."

    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు డిజిపి.

    "కానీ" డిజిపి కంఠం వణికింది. "ప్రదీప్ సక్సేనాపై ఓ కేసు రిజిస్టరైంది. ఇంకా చట్టరీత్యా..."

    "బుల్ షిట్" మధ్యలోనే ఖండించాడు అసహనంగా. "ఈ చట్టం గిట్టం అంటూ కబుర్లు చెప్పకూడదనే నీతో స్వయంగా మాట్లాడుతున్నదీ ఆలోచించు... ఒక్కమనిషికోసం వందలకొద్దీ ప్రాణాలు కోల్పోతావా అందరి క్షేమం కొరి ఆ ఒక్క వ్యక్తినీ విడిచిపెడతావా? నువ్వే తేల్చుకో."

    అప్పటికే డి.జి.పి. ముఖం వివర్ణమైపోయింది. "వెల్...ప్రదీప్ సక్సేనాని విడిచిపెట్టిన మరుక్షణం ఆ టెర్రరిజానికి స్వస్తి చెబుతావా?"

    "విడిచిపెట్టిన మరుక్షణం కాదు డి.జి.పీ. అతడు నా దగ్గరకు సురక్షితంగా అంటే నీ 'టైల్స్'తో వెంటాడటంలాంటిది జరక్కుండా వస్తేనే నేను ఆగేది, ఈ మారణహోమం ఆపేది. నువ్వు సరేనన్నా అలాగే అంటూ ఫోన్ పెట్టేయను...అదంతా చాలా సిస్టమేటిక్ గా జరగాలి."

    "అంటే?"

    "ఉదాహరణకి రేపు ఉదయం నువ్వు సక్సేనాని విడిచిపెట్టాలీ అనుకుంటున్నావనుకో...ఈ రాత్రికి సెక్యూరిటీకి నీ మనిషి నా దగ్గరకు రావాలి. ఆ ప్రాణి నా ఆధీనంలో వుండగా ప్రదీప్ సక్సేనా నన్ను చేరుకోవాలి. అప్పుడు నీ ప్రాణిని నీకు మళ్ళీ సురక్షితంగా అప్పచెబుతాను. నువ్వు సరేనంటే ఎవర్ని పంపాలీ ఎలా పంపాలీ చెబుతాను."

    డి.జి.పి. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "చెప్పు ఎవరు కావాలి?"

    ఓ క్షణం నిశ్శబ్దం. "డి.సి.పి. ప్రసన్న కూతురు...లల్లీ."

    "వ్వాట్" ఉలికిపాటుగా అన్నాడు. "ఒక పసిపిల్లనా?"

    "ఎందుకలా కంగారుపడతావు? అడిగి చూడు నీ పక్కనే వున్నాడుగా."

    ఒక పసికందు ప్రాణాల్ని పణంగాపెట్టి ఎలా ఆపరేషన్ నిర్వహించగలడు.

    "మిస్టర్ బ్లాక్ మాంబా! నేను రాష్ట్రానికి పోలీసు అధికారినైనా నాకూ కొన్ని పరిధులున్నాయి. కొంచెం ఆలోచించుకునే గడువుకావాలి"

    హెచ్చరికలా వినిపించింది. "మిస్టర్ డి.జి.పీ. లల్లీని పంపి తీరాలి..."

    "బ్లాక్ మాంబా కొంత వ్యవధి అవసరం."

    "వెల్...ఓ గంట చాలా..."

    మాటాడలేదు డి.జి.పి.

    "పోనీ రెండుగంటలు."

    డి.జి.పి. జవాబు చెప్పలేక పోయాడు.

    "అదీ కాని నాడు నాలుగు...చివరగా చెబుతున్నాను. ఏడుగంటలు అంటే సరిగ్గా సాయంకాలం ఏడున్నర గంటలకి నీకు ఫోన్ చేస్తాను. ఈలోగా ఫార్మలిటీస్ పూర్తిచేసుకో..."

    "ఎక్కడికి ఫోన్ చేస్తావు" డి.జి.పి. కంఠం గొణుగుతున్నట్టుగా పలికింది.

    "ఆ వివరాలు ఇప్పుడు కాదు.....చెప్పేది అప్పుడే" ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు...ఇక్కడా ప్రత్యర్ధి పోలీసుల్ని తప్పుదోవపట్టించాడు. ఇప్పుడు ఫోన్ చేయబడింది. ఆసిఫ్ నగర్ లోని ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి.

    డి.జి.పి. ఇంకా స్థాణువులా నిలబడేవున్నాడు.

    సరిగ్గా ఇదే సమయంలో...

    రద్దీగా వున్న చిక్కడపల్లిలో సికింద్రాబాదువేపు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు హఠాత్తుగా అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న పదిమంది మీదనుంచి దూసుకుపోయి ఓ ఎలెక్ట్రిక్ పోల్ ని గుద్ది ఆగిపోయింది.

    దానిక్కారణం ప్రయాణీకులతో కిక్కిరిసివున్న ఆ బస్సులో డ్రైవరు వెనకగా నిలబడ్డ వ్యక్తి భుజానికున్న సంచిలోనుంచి ఓ మిన్నాగుని తీసి డ్రైవరుపై విసిరాడు...అదే ఇంత అనర్ధానికి కారణమైంది.

    రోడ్డుపై రక్తపు మడుగులో పడివున్న శవాలు ఉధృతమైన మారణహోమానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.


                       *    *    *    *


    "ఘోరం. అతి దారుణం... ...ఏమైపోతుందీ రాష్ట్రం...ఏం కాబోతుంది నా ప్రభుత్వం...ఏం చేస్తుందీ పోలీసుబలగం" రాష్ట్ర ముఖ్యమంత్రి అసహనంతో చిందులు తొక్కుతున్నాడు. "నా ప్రజలైనా ప్రాణమన్నాక శాంతి భద్రతలు కాపాడి సర్వమానవాళికి సుఖసంతోషాలలో ఓలలాడించి రాష్ట్రాన్ని రామరాజ్యంగా మార్చడమే నా జీవితాశయమని నొక్కి మరీ వక్కాణించాక...ఆ సదృశ్యమూ అజరామరమూ అనుపమానమూ అయిన దృడచిత్తంతో సర్వమానవ సౌభ్రాతృత్వంకి సేవలందించాలని అహోరాత్రులూ కలలుకన్నాక...అహో..." ఓ క్షణం బాధగా తల పట్టుకుని మరుక్షణం తూలి రెండడుగులు వేసి దుఃఖోద్విగ్నుడైనట్టు సీటులో కూర్చున్నాడు.

    అతడి కభిముఖంగా స్టేట్ చీఫ్ సెక్రెటరీ హోంసెక్రెటరీతో బాటు డి.జి.పి., డి.సి.పి. కూర్చుంటే సమీపంలోని కుర్చీల్లో హోంశాఖామాత్యులు, ముఖ్యమంత్రికి అతిముఖ్యుడైన ఆర్ధికశాఖా మంత్రి వున్నారు. ముఖ్యమంత్రి ఉద్ఘాటించిన దాంట్లో అర్ధభాగమే అర్ధమైన ఆర్ధికశాఖామంత్రి ఆయన బాధని తనూ పంచుకుంటున్న సూచనగా కళ్లొత్తుకున్నారు.

    "సర్..." డి.జి.పి. అస్థిమితంగా అన్నాడు" "ప్రస్తుతం మనం ఏంచేయాలి అన్నది ఆలోచించాలి."

    "ఆ పని మీరు చేయాలి డి.జి.పి...ఎసెంబ్లీలో గొంతుచించుకుంటాం ప్రజలకోసం గుండెలు చీల్చుకుంటాంగాని ప్రత్యర్ధితో ముఖాముఖీ మేమెలా పోరాడగలం. ఆ విధినిర్వహణ మీదికదా..."

    "ఐడూ అడ్మిట్ సర్...మీరు అనుమతివ్వాల్సింది ప్రదీప సక్సేనా విడుదల విషయంలో..."

    "అవును...అదికానినాడు మరిన్ని పాములు ప్రవేశించి మా ప్రభుత్వాన్ని మొత్తం కాటేసి కూల్చుతాయి. ప్రతిపక్షాల్ని ఎదుర్కుంటూ ప్రజాధినేతగా ప్రజలంతా ముక్తకంఠంతో కీర్తించే ప్రముఖనాయకుడిగా శేష జీవితాన్ని గడుపుతున్న నేను ఈ రోజు పాములకి వెరచి ప్రజలదృష్టిలో అప్రయోజకుడ్ని కాలేను. తరచిచూస్తే కరిచే పాముల మూలంగా ప్రజా శ్రేయస్సుకి భంగం కలిగించేకన్నా ఆ ప్రదీప్ సక్సేనాని విడిచి ఈ సమస్యని తుడిచిపెట్టడం మేలని భావిస్తాం."

    భళి భళీ అన్నట్టు బుర్ర కధదళం వంత పాడేవాళ్ళలా చెరో పక్కవున్న మంత్రులు తలలూపేరు.

    "కాని ఆ ముఠానాయకుడు ప్రసన్న కూతుర్ని ముందు పంపమంటున్నాడు."

    "అదెంత భాగ్యమని" ముఖ్యమంత్రి నేత్రాలు అరమోడ్పులయ్యాయి... "ప్రజాశ్రేయస్సుకై ప్రదీప్ ని వదిలిపెడుతున్నా మీ ప్రసన్న తన పాపని వదులుకోలేడా."

    ప్రసన్న దవడకండరాలు బిగుసుకోవడం ముందుగా గమనించింది డి.జి.పి. ఇక అక్కడ మాటాడాల్సిందేమీ లేనట్టు పైకిలేస్తూ హోం సెక్రటరీతో అన్నాడు. "ప్రదీప్ సక్సేనా విడుదలకి కావలసిన ఏర్పాట్లు చూడండి...తక్కిన వివరాలు మీతో తర్వాత మాటాడతాను."

    డి.జి.పి...సి.పి. ప్రసన్నలతో బాటు తన ఆఫీసుకి తిరిగివచ్చాడు..."వెల్...ఓ సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ రాత్రికి పంపాల్సిన వ్యక్తి గురించి."

    డి.సి.పి. ప్రసన్న తలవంచుకుని నేలవేపే చూస్తున్నాడు.

    "వుయ్ విల్ నెగోషియేట్ ఫరిట్" డి.జి.పి. వాక్యం ఇంకా పూర్తికానేలేదు ప్రసన్న జోక్యం చేసుకున్నాడు.

    "క్లియర్ గా చెప్పాడు కావలసింది మా లల్లీ" అని.

 Previous Page Next Page