అర్జున్ కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. "ఏది ఈ మాట మరోసారి చెప్పు" అన్నాడు.
చెప్పిందే మళ్ళీ చెప్పాను. పెళ్ళి కొడుకు అనే మాట మాత్రం నొక్కి గట్టిగా పలికాను.
"పెళ్ళి నాకా?"
"మరి నాకా?"
"నిన్నే కదా అమ్మ అడిగింది?"
"ఆంటీ ఇద్దరి పెళ్ళి గురించి అడిగింది. నా చేతుల మీదుగా నీ పెళ్ళి చేద్దామని ఆంటీని చూడమన్నాను. డోంట్ వర్రీ నీకు తగిన పిల్లనే చూస్తాము."
"ఇది అన్యాయం అక్రమం, అధర్మం. నా పెళ్ళికేం తొందర నాకెన్నేళ్ళని! అప్పుడప్పుడు డ్యూటీ నుంచి ఆలశ్యంగా ఇంటికి వస్తే అమ్మ అన్నం కలిపి తినిపిస్తుంది. నేను చాలా చిన్నవాడిని. పెళ్ళి మాట ఎత్తితే బుగ్గల్లోకి వెచ్చని ఆవిరి రావటం లేదు. సిగ్గు వేయటం లేదు. ఆ...తెలిసింది తెలిసింది. మనసులో పెళ్ళి చేసుకోవాలని వుంది. ఆ మాట పైకి చెప్పలేక నా మీదకు తోశావ్. అవునా! మగాడివి మొనగాడివి. ఈ చిన్న విషయానికి సిగ్గుపడటం ఏమిటి?"
"ఇదిగో ఇలా మాట్లాడితే నేను సహించను. ఈమధ్య ఓసారి ఏమన్నావ్! నాకు పెళ్ళి చేసుకోవాలని వుంది. తోడుకోసం..."
"అయ్యో!"
"ఆక్రందన చేయకు."
"అమ్మో! వామ్మో!"
"ఆపండి" ఆంటీ గట్టిగా అరిచింది.
ఇద్దరం నోరు మూసుకున్నాం."
"మీ ఇద్దరూ ఇద్దరే నా ప్రాణానికి. మీ ఇరువురి సంగతీ తెలిసి తెలిసి అనవసరంగా పెళ్ళి మాట ఎత్తాను. ఇదిగో ఇప్పుడే చెపుతున్నాను. మీరు నా ముందు వేషాలు వేయకండి. రోజురోజుకీ ముదురు బెండకాయల్లా ముదిరిపొండి నాకేం నష్టమా! మీరు నోరు తెరిచి నాకు పెళ్ళి చేయి. పిల్లను చూడు అని అడిగేదాకా మీ పెళ్ళి మాట నేను తలపెట్టను" కోపంగా అంది ఆంటీ.
"హాయ్ హాయ్" అంటూ ఇరువురం డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచి ఆనందంగా అంట్లచేతిలోనే కరచాలనం చేసుకున్నాము.
ఆంటీకి కోపం బొత్తిగా తెలియదు. మా పిల్ల చేష్టలు చూసి ఇంక నవ్వాపుకోలేక ఫక్కున నవ్వేసింది.
"మీ సంతోషం దొంగలుదోలా, చేతికున్న అంటు కూడా చూసుకోనక్కరలేదా? మీలాంటి వాళ్ళ దగ్గర ప్రతిజ్ఞ పట్టి లాభం లేదు .మీరింకా పిల్లలు కదా మీతో సంప్రదించే పని లేదు. నేనే పిల్లను చూసి నేనే పెళ్ళి ఏర్పాట్లు అన్నీ చేసి శుభలేఖలు కూడా పంచి అప్పుడు మీతో చెపుతాను. ఊ...ఇంక భోం చేయండి. అంట్ల చేతులు నెత్తిన పెట్టుకోక" ఆంటీ గదమాయిస్తూ అంది.
"అయ్యో" అన్నాడు అర్జున్.
"అయ్యయ్యో" అన్నాను నేను.
ఆంటీ ముసి ముసి నవ్వులు నవ్వుకుంది.
"విచారించి ప్రయోజనం లేనప్పుడు తాపీగా భోం చేయటం నయం" ఉచిత సలహా ఇచ్చాను.
"ఇప్పుడు నేను చేస్తున్నది ఆపనే" అన్నాడు అర్జున్.
ఆ తర్వాత ఆంటీ కొసరి కొసరి వడ్డిస్తుంటే తృప్తితీర భోంచేసి లేచాము. ఆంటీ అన్నట్లు నేనూ అర్జున్ ఒకచోట చేరినా మేమంతా కలిసినా మా ఉద్యోగాల మాట మర్చిపోతాం. పసివాళ్ళలాగే వ్యవహరిస్తుంటాము. ఈ ఆనందం అనుభవించాల్సిందేగాని మాటలతో చెప్పలేనిది.
నేను అర్జున్ ఆంటీ హాలులో కూర్చుని టి.వి. చూస్తున్నాం. టి.వీలో ప్రధాని శ్రీమతి గాంధీ మాట్లాడుతున్నారు.
"నేను ఇప్పుడే చెపుతున్నాను. మీలో ఎవరికి ముందు పిల్లలు పుట్టినా, అమ్మాయి పుడితే ఇందిరా ప్రియదర్శిని అన్నపేరు ,అబ్బాయి పుడితే రాజీవ్ గాంధీ పేరు పెడతాను. మీకు ఇష్టమో, కాదో ఇప్పుడే చెప్పండి" ఆంటీ అడిగింది.
ఆంటీ ఇందిరాగాంధీకి ప్రియభక్తురాలు. అఫ్ కోర్స్ ఇక్కడ ఎవరు కాదు కనుక!
"నాకు అభ్యంతరం లేదు. నా పిల్లల విషయంలో ఫుల్ హక్కులు ఆంటీకి ఈ నిమిషం నుంచే ఇస్తున్నాను" అన్నాను.
"నేనూ అంతే ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేస్తున్నానని చెప్పటానికి గర్విస్తున్నాను" అర్జున్ అన్నాడు.
ఆంటీ ముఖం వెంటనే కళకళ లాడింది. ఆ తర్వాత ఆంటీ ఫక్కున నవ్వింది.
విషయం అర్ధం చేసుకున్న మేమూ నవ్వాము మనసారా.
విషయం అర్ధంగాకపోవటం అంటూ ఏమీ లేదు. పెళ్ళి ఇప్పుడప్పుడే వద్దన్నా మేము మా పిల్లలకి పేరు పెట్టటానికి ఆంటీ అడగంగానే ఓ.కే. అన్నాము అదీ సంగతి.
టి.వి.లో ప్రధాని గాంధీ ప్రసంగంముగించి జైహింద్ అన్నారు.
13
పై నుంచి ఎలాంటి వార్త రాకపోవటంతో నా పని మూడు హత్యలు, ఆరుగురు హంతకులులాగా వుంది. చదవటం నాకు చాలా ఇష్టం కాబట్టి తెలుగు ఇంగ్లీషు నవలలు వార, మాస పత్రికలు తెగ చదివి పారేస్తున్నాను.
సి.ఐ.డీ. లకి ఏ అలవాట్లు వుండకూడదు. తన అలవాటు వల్ల సి.ఐ.డి. మారువేషంలో బయటపడే ప్రమాదం వుంది. అతని అలవాటు హంతకులకి తెలిసి వుంటే పసిగట్టిన మరుక్షణం పరారు అవుతారు. హంతకులు చేసే పొరపాట్లు వారి అలవాట్లు పోలీసులకి ఎంతగా ఉపయోగపడతాయో, వీరి అలవాట్లు హంతకులకి అంతే ఉపయోగపడతాయి. ఈ జాగ్రత్త విషయంలో పోలీస్ డిపార్టుమెంట్ కన్నా మా ఇంటల్ జెంటివ్ శాఖలో ప్రతి వ్యక్తికి ముఖ్యం.