"ఏం మాట్లాడాలేంటి?" సెంట్రీ గీరగా అన్నాడు.
"ఓ కేసు గురించి అర్జంటుగా మాట్లాడాలి అని ఇప్పటికి నాలుగుసార్లు చెప్పాను."
"లోపల ఇన్ స్పెక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఏదో అర్జంట్ కేసు గురించీ తర్జన భర్జన పడుతున్నారు. తప్పనిసరి కేసయితే లోపలికి పంపిస్తాను. లేకపోతే ఏదో ఒక కానిస్టేబుల్ ని పిలుస్తాను. ఆయనకి మీ కేసు చెప్పండి. పనయిపోద్ది! వ్యంగ్యంగా అన్నాడు సెంట్రీ.
"నేను ఎవరినో తెలుసా?" బబిత కోపంగా అంది.
"నాకళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. నువ్వో ఆడకూతురివి" నిర్లక్ష్యంగా అని. అటుగా వస్తున్న కానిస్టేబుల్ కనకారావుని చూసి, "అయ్యా. టూ నాట్ టూ గారూ! ఇలా రండి ఇక్కడో కేసు వచ్చింది. చూసేద్దురుగాని!" అన్నాడు.
బబిత వస్తూన్న కోపాన్ని బలవంతాన దిగమింగుకొని, "మీ పేరేంటి?" నవ్వుతూ అడిగింది.
కానిస్టేబుల్ కనకారావు దగ్గరకి వచ్చాడు.
"ఏమిటమ్మా! ఎవరు కావాలి?" బబితను అడిగాడు.
"మీ ఇన్ స్పెక్టర్ గారితో నేను అర్జంటుగా మాట్లాడాలి. ఈ కేసు నేను ఇన్ స్పెక్టర్ తోనే చర్చించాలి. మీ ఎవరితోను కాదు" అంది బబిత.
కాకీదుస్తుల్లో వున్న కనకారావుకి కూడా దుస్తుల మహత్యమేమో చిర్రెత్తుకు వచ్చింది. "ఈ పిల్లని చూస్తూంటే రేప్ చేసిన దాఖలాలు కానీ, మర్డర్ చేసిన దాఖలాలు గానీ కనపడటం లేదు.
చెట్టంత మగాడిని నేను ఇక్కడే వుంటే నాతో మాటమాత్రం కూడా కేసు గురించీ చెప్పక, ఇన్ స్పెక్టర్ ని కలుసుకోవాలట ఇన్ స్పెక్టర్ ని. ఈ కాలం కాలేజీ అమ్మాయిలు మరీ బరితెగించి పోయారు." అనుకున్నాడు.
"కేసు కొంచెం అయినా చెప్పమని" బబితతో వాదన వేసుకున్నాడు.
అయిదు నిముషాలసేపు కానిస్టేబుల్ కనకారావుని కూడా మాటలతో ఏడిపించి అప్పుడు బయట పెట్టింది తను ఎవరు అన్నది.
ప్రముఖడైలీ "ది న్యూస్" తాలూకా ప్రెస్ రిపోర్టరు. జర్నలిస్టూ ఈమె అని తెలియగానే, కానిస్టేబుల్ కనకారావు వళ్ళు చల్లబడింది. సెంట్రీగారి కాళ్ళు కూడా కాస్త వణికాయి. పేపరు వాళ్ళతో గొడవ పడటం పెద్ద తలనొప్పని వాళ్ళకి బాగా తెలుసు.
కాలేజీ పిల్లలాగా వస్తే ప్రెస్ రిపోర్టర్ అని ఎలా అనుకుంటారు? వచ్చినది మొదలు కేసు. కేసు అంది కానీ తను ఎవరో ఏమిటో చెప్పిందా, పెట్టిందా! ఆమె ఎవరో ముందే చెబితే ఇంతసేపు ఆపేవాళ్ళం కాదు కదా! అనుకున్నారు ఇరువురూ.
అలా అనుకున్న మరిక్షణమే కనుసైగ కూడా చేసుకున్నారు.
"మేడమ్! లోపల ఇన్ స్పెక్టర్ గారు ఓ పెద్దకేసు చూస్తూ చాలా బిజీగా ఉన్నారు. అడ్డు రావద్దని మాకు కూడా చెప్పారు. అందువల్ల మిమ్మల్ని మేము గేటులోనే నిలవేశాము. లోపలికి వెళ్ళి మీరు వచ్చిన విషయం చెప్పి వస్తాను. ఇలా వచ్చి వరండాలో కుర్చీలో కూర్చోండి!" అలా అని మర్యాదగా చెప్పి కానిస్టేబుల్ కనకారావు లోపలికి వెళ్ళాడు.
బబిత వరండాలో కుర్చీలో కూర్చోలేదు. అసహనంగా వరండాలో అటూ ఇటూ తిరుగుతూ వుండిపోయింది.
కావాలని అయిదు నిముషాలు ఆలస్యం చేసి, అటూ ఇటూ తచ్చాడి, అప్పుడు వచ్చాడు కానిస్టేబుల్ కనకారావు.
"మీరు వచ్చినట్లు చెప్పాను! లోపలికి వెళ్ళండి. ఆయన అసలే చాలా కోపంగా ఉన్నారు. మీరు మాట్లాడవలసింది ఏమిటో నెమ్మదిగా మాట్లాడి వచ్చేసేయండి. ఆయనకి కోపం వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, అది గుర్తుంచుకోండి మేడమ్!" వినయంగా ఒక సలహా ఇచ్చి ఇన్ స్పెక్టర్ ఉన్న గదివైపు ఒక చేయి చాచి చూపించాడు.
"ఎవరిముందు ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు!" మామూలుగా అని రూమ్ కేసి నడిచింది.
"తిక్క తిన్నగా కుదురుతుందిలే! వెళ్ళు వెళ్ళు!" అనుకున్నాడు కానిస్టేబుల్ కనకారావు.
కనకారావు అలా అనుకోటానికి తగిన కారణముంది.
అంతక్రితం ఇన్ స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, "మీతో ఏదో మాట్లాడాలిట, ప్రెస్ రిపోర్టర్ ఒకామె వచ్చింది. ఆమెకి తిక్కా, గీరా చాలా వున్నాయి. ముఖ్యంగా పోలీసు డిపార్టుమెంట్ అంటే చాలా చిన్నచూపు" అని ముందుచూపుతో ఇన్ స్పెక్టర్ తో చెప్పి మరీ వచ్చాడు కనకారావు.
ఆడమనిషి, ప్రెస్ రిపోర్టర్ అనగానే. "ఓ భారీకాయం చిన్న వేలుముడి, స్లీవ్ లెస్ జాకిట్టు, దళసరి కళ్ళద్దాల"తో తన దగ్గరకి వస్తున్నట్లు వూహించుకున్నాడు ఇన్ స్పెక్టర్ మనోజ్.
"బుర్ర మీసాలూ, దబ్బ ముక్కు, గండు పిల్లి ముఖమూ కూరుకుపోయిన కుర్చీలో కూచుని వుంటాడు ఈ ఇన్ స్పెక్టర్ మహాశయుడు" అనుకుంది బబిత ఇన్ స్పెక్టర్ గురించి.
బబిత ఇన్ స్పెక్టర్ రూమ్ లోకి వచ్చింది.
ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా చూసుకున్నారు బబితా ఇన్ స్పెక్టర్ మనోజ్.
అంతలోనే.
వాళ్ళ ముఖంలో రంగులు మారిపోయాయి,
అంతలోనే తెలివి తెచ్చుకుని సర్దుకున్నారు.
కావాలనే ఇన్ స్పెక్టర్ మనోజ్. ఎవరో రావాలన్నట్లుగా, వాకిలివైపు చూశాడు.
ఎదురుగావున్న తనని చూడకుండా తన వెనుక ఎవరో వున్నట్లు చూస్తున్న ఇన్ స్పెక్టర్ ని చూసి," అతను ఎవరి రాకకోసమయినా ఎదురు చూస్తున్నాడేమో!" అని వెనుతిరిగి చూసింది బబిత.
వెనుక ఎవరూ లేరు.
ఆ రూమ్ లో ఇన్ స్పెక్టర్ మనోజ్, మరో కానిస్టేబుల్, బబిత మాత్రమే వున్నారు.
ఆ క్షణంలో ఆ ఇరువురినీ చూస్తూంటే, "పనేమీ లేక తీరుబడిగా కూర్చుని వున్నారా!" అనిపించింది.
"కమిన్!" మర్యాదగా అన్నాడు ఇన్ స్పెక్టర్ మనోజ్.
ముఖం గట్టు పెట్టుకుని ఇన్ స్పెక్టర్ కి విష్ చేసింది బబిత.
"ప్లీజ్ సిడౌన్!" అన్నాడు ఇన్ స్పెక్టర్ మనోజ్.
బబిత లోపలికి రావటమే కోపంగా వచ్చింది. లావుగా చిన్న బొజ్జతో ఉండి, వెకిలి చూపులు, వెకిలి చేష్టలు అలాచేసే ఇన్ స్పెక్టరేమో, కయ్యికయ్యిమందామనుకుంది.
"ఈ ఇన్ స్పెక్టర్ చూస్తూంటే, సినిమాల్లో కొత్తకుర్రాడిని ఇన్ స్పెక్టర్ వేషం వేసినట్లుగా వుంది. నిజ జీవితంలో - ఇన్ స్పెక్టర్ కన్నా హిందీ సినిమాల్లో హీరోకయితే బాగుండేవాడు" అతనిని చూసి అనుకుంది బబిత.
"ఈ అమ్మాయి ప్రెస్ రిపోర్టరా? ప్రెస్ రిపోర్టరంటే ఆషామాషీ జాబ్ కాదే? కాలేజీ నుండి వచ్చి వెంటనే ఈ జాబ్ లో జాయినయినట్లుంది సరదాగా. ఆడపిల్లలు చాలా ఎదిగిపోయారు. ఈ అమ్మడు వెళ్ళి ప్రశ్నలు అడిగితే, ఆ జవాబిచ్చే వాళ్ళు సరిగ్గా మాట్లాడుతున్నారో లేదో?" బబితను చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇన్ స్పెక్టర్ మనోజ్.