ఇంధనం టాంక్ ఫుల్ చేసిన హెలికాఫ్టరును స్టేషన్ బయట సిద్దంగా వుంచాలి....
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విశ్లేషణచేసిన డి.ఐ.జి.కి ఇది టెర్రరిస్టుల పనే ననిపించింది. అరగంటపాటు అటు ఇటు లైట్నింగ్ కాల్స్ హోరెత్తాయి.
డి.ఐ.జి. విజ్ఞాపన మేరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది.
అజ్ఞాతవ్యక్తి డిమాండ్లను కేబినేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
సి.ఎం.ను వెనువెంటనే వదిలివేయవలెనని తీర్మానించారు....
నిజానికి, కేబినేట్ అప్పటికప్పుడు అన్ని డిమాండ్లను ఆమోదించినా, అప్పటికప్పుడు వాటిని అధికార యంత్రాంగం సమకూర్చగలదా....? అసలే బురాక్రసీ....,
డి.ఐ.జి. మెదడు చురుగ్గా పనిచేసింది.
"కమాండర్! సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ ఎలక్ట్రికల్ ట్రాక్ మీద మద్రాసునుంచి విజయవాడ వరకే వస్తుంది. విశాఖపట్టణం వెళ్ళడానికి విజయవాడలో ట్రెయిన్ ను ఖచ్చితంగా ఆపి తీరాలి. డీజిల్ ఇంజన్ ను అటాచ్ చేయాలి...." చెప్పుకుపోతున్నాడాయన. కాని,
"నెవర్! సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ విజయవాడలో ఆగదు! ఆపడానికి మీరు స్వయంగా ప్రయత్నించి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దు!" కమాండరు విషపు నవ్వు వినిపించింది.
ఎలక్ట్రిఫికేషన్ ట్రాక్ లేకపోయినా విజయవాడ నుంచి విశాఖకు సూపర్ ఫాస్ట్ ఎలా వెడుతుందో డి.ఐ.జి.కి అంతుపట్టలేదు.
అలా ఆలోచిస్తుండగానే ఆయన వెన్నులో వణుకు పుట్టినట్టయింది. ఎదురుగా మరొక ప్రమాదం పొంచి వుంది....
సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ అదే వేగంతో కృష్ణా బ్రిడ్జిని క్షేమంగా దాటగలదనే నమ్మకం లేదు. అంత స్పీడ్ తో బ్రిడ్జిని క్రాస్ చేస్తే అది కూలడం ఖాయం. పైగా, కృష్ణానది ఉరవళ్ళు పరవళ్ళుతో ఉధృతంగా ప్రవహిస్తున్నది....
సమయం మించిపోతున్నది. అనుకున్న ఏర్పాట్లలో ఒక్కటీ ఇప్పటికి అమలు కాలేదు....
సి.ఎం. ను, ప్రయాణీకులను ఈ గండం నుంచీ గట్టెక్కించాలంటే....
మరొక మార్గం ఆలోచించాడు డి.ఐ.జి.
"మిస్టర్ కమాండర్! మీరడిగినట్టే అన్ని ఏర్పాట్లు చేసాం. ఇక, సూపర్ ఫాస్ట్ ను విజయవాడలో ఆపి సి.ఎం.ను, ఇతర ప్రయాణీకులను సురక్షితంగా వదిలి వేయండి!"
"మిస్టర్ డి.ఐ.జి.! డోంట్ బ్లఫ్ మి. నేనేమీ గుడ్డివాడిని కాను! ఇంతవరకు మీరు అసలేమీ చేయలేదు! సరే, మరొక్క అవకాశం ఇస్తున్నాను-మన ఒప్పందం విశాఖపట్టణంలో అమలు జరగాలి. సూపర్ ఫాస్ట్ విశాఖకు యాబై కిలోమీటర్ల దూరంలో వుండగానే అక్కడ మీరు అన్ని ఏర్పాట్లు నిజంగానే పూర్తిచేయాలి. లేదా, సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ 49న కిలోమీటరుకు చేరే క్షణానికి ముందే అదికాస్తా బ్లాస్ట్ అయిపోతుంది, జాగ్రత్త!"
అజ్ఞాత వ్యక్తి మాటలకు డి.ఐ.జి. తెల్లబోయారు. చమట పట్టింది.
అజ్ఞాత వ్యక్తి పోలీసుల ప్రతి చర్యనూ గమనిస్తున్నాడూ అంటే అతని వద్ద అత్యాధునికమైన సాంకేతిక పరికరాలన్నీ వున్నాయన్న మాట!
అంతేకాదు. వాటిని ఆపరేట్ చేసి విషయాలను ఎప్పటికప్పుడు చేరవేసే సిబ్బంది కూడా ఉండి వుండాలి!
సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ కృష్ణా కెనాల్ ను దాటింది.
ప్రయాణీకులు బిక్కచచ్చి, ప్రాణాలను గుప్పెట్లలో పెట్టుకుని వున్నారు.
"మిస్టర్ కమాండర్! సాటి మానవునిగా ఒక్కసారి పునరాలోచించు. అమాయకుల ప్రాణాలతో చలగాటాలాడొద్దు. ట్రెయిన్ స్పీడ్ తగ్గించి..."
"వెరీ వెరీ సారీ మిస్టర్ డి.ఐ.జి.! మీ కెవ్వరికీ ఇప్పటికీ చీమకుట్టినట్టయినా లేదు. ఏమాత్రం అవకాశం ఇచ్చినా మీ ఆలోచనలు పెడదారినేపోతున్నాయి. ట్రెయిన్ వేగాన్ని తగ్గించడం అంటూ జరగనే జరగదు! ఇక ప్రమాదం అంటారా_అది జరగడం జరక్కపోవడం అనేది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి వుంటుంది!"
సూపర్ ఫాస్ట్ కృష్ణా బ్రిడ్జికి కేవలం కిలోమీటరు దగ్గరికి వచ్చేసింది.
సి.ఎం.తన సీటు నుంచి ఛటాలున లేచారు. అప్రయత్నంగానే ఆయన చేయి చెయిన్ మీదకు వెళ్ళింది.
చైన్ ను బలంగా గుంజారు. మళ్ళీ మళ్ళీ లాగారు....
ట్రెయిన్ ఆగలేదు. కనీసం వేగంకూడా తగ్గలేదు.
అంటే _ దుండగులు చెయిన్ కు వాక్యూమ్ కు మధ్యవున్న లింక్ ను ఎప్పుడో తప్పించి వేశారన్నమాట!
సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ కృష్ణా బ్రిడ్జిని సమీపించింది.
కొన్ని క్షణాలలోనే బ్రిడ్జిని సురక్షితంగా దాటింది.
బ్రిటీష్ వారి హయాంలోని కట్టడాలకు భారతీయ ఇంజనీర్ల నిర్మాణాలు ఎందులోను తీసిపోవని రుజువయింది!
విజయవాడ అయిదవ నెంబరు ప్లాట్ ఫారంమీద ఆసక్తితో నిలిచివున్న ప్రయాణీకులను, మోహరించి వున్న పోలీస్ అధికారులను, ఫైర్ టెండర్స్, అంబులెన్స్ లను వెక్కిరిస్తున్నట్టుగా అదే వేగంతో సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ డబుల్ డీజిల్ ఇంజన్లతో క్షణాలలో ప్లాట్ ఫారాన్ని దాటిపోయింది!