Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 14


    అందుకోవడానికి చేయి సాచింది శారద.
    అతని కళ్ళు లోతుగా చూస్తున్నాయి ఆమె కళ్ళలోకి.
    ఆమె కళ్ళు బరువుతో వాలి పోతున్నాయి.
    ఆమెలో క్రమంగా రగులుకొంటున్న ఆవేశానికి చిహ్నంగా ఆమె వక్షోజాలు ఎగిరెగిరి పడుతున్నాయి.
    అతని ఎడమ చెయ్యి ఆమె భుజం వదిలి ఆమె నడుము చుట్టూ చేరింది.
    టవల్ జారింది.
    కుడి చేయి ఆమె శిరస్సును వెనక్కి వంచింది.
    అతని పెదవులు ఆమె పెదవుల పైకి చేరాయి.
    ఆమె శరీరం వ్యతిరేకిస్తోంది.
    రెండు క్షణాల తరువాత ఆమె మనసు ఆమె శరీరంపై గెలుపు సాధించింది.
    లొంగి పోయింది మల్లె తీగలాంటి ఆమె శరీరం.
    ఆమె చేతులు అతడ్ని చుట్టేశాయి.
    ఆమె పెదవులను సన్నగా కొరికాడతను.
    చాలా కాలంగా అణిగివున్న ఆమె కోరికలు, ఆమె శరీరంపై నాట్యం చేస్తున్న అతని చేతుల తాకిడికి ఒక్క ఉదుటున ఆవేశంగా లేచాయి.
    తన మూడు సంవత్సరాల కలలనీ నిజం చేసుకుంటూ పూర్తిగా ఆమెలో కరిగి పోయాడతను.
    ఆ తరువాత మనస్పూర్తిగా ఆమె స్మరణే జీవితం అయిపోయిందతనికి. అరవై దగ్గర పడుతున్న ప్రభాకరం మరణిస్తే శారదని వివాహం చేసుకోవచ్చనే కోరికతో రోజులూ, క్షణాలూ లెక్కపెట్టసాగాడు. ఒకటి రెండు సార్లు ప్రభాకరానికి విడాకులిచ్చేసి తామిద్దరమూ ఎక్కడికయినా దూరంగా వెళ్ళిపోదామని తాను చెపితే వద్దని వారించింది శారద. ఆయన విడాకులివ్వరనీ, అనవసరంగా పదిమంది నోట్లో పడిన వాళ్ళమౌతామని, అదీగాక కొంతకాలం ఓపిక పడితే ఎలాగూ వాళ్ళు ఒకటవ్వడమే కాక ఆస్తి కూడా అన్యాయం కాకుండా దక్కుతుందనీ సలహా చెప్పిందామె. వేచి వుండక తప్పిందికాదు కేశవ్ కి. అదృష్టవశాత్తూ ఇక్కడ కూడా ఎక్కువ కాలం అతనికి వేచి వుండాల్సిన అవసరం కలగలేదు. ప్రభాకరం అనారోగ్యం పాలై సంవత్సరం లోగానే మరణించాడు. అయితే అనారోగ్యం అతని ప్రాణాలు తీయలేదు. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తూ జరిగిన కారు ప్రమాదంలో మరణించాడతను.
    మరో నాలుగు నెలల కల్లా కేశవ్ శారదని వివాహం చేసుకుని లక్షాధికారి అయిపోయాడు. వారి వివాహానికి వచ్చింది ఇద్దరే. ఒకరు కేశవ్ స్నేహితుడు రామచంద్ర, మరొకరు.... ఆనాటి నుండీ ఈనాటి వరకూ కేశవ్ భరద్వాజకి చేదోడు వాదోడుగా వుంటూ అతడి పెరుగుదలకి, ఈనాటి అతని స్టేటస్ కీ మూలకారణమైన శ్రీధరం.
    శ్రీధరం ప్రభాకరం తమ్ముడు.
    స్టేట్స్ లో ఫైనాన్స్ మేనేజ్ మెంట్ చదువుకొని కేశవ్ శారదల వివాహానికి ఒకరోజు ముందే తిరిగి వచ్చాడు.


                             *    *    *    *


    కిటికీ దగ్గర నుండి వెనక్కి తిరిగి నెమ్మదిగా నడుచుకొంటూ వచ్చి మంచంమీద కూర్చున్నాడు భరద్వాజ.
    ఆలోచిస్తున్నాడతను.
    వెదుక్కొంటూ వచ్చిన అదృష్టాన్ని చక్కగా వినియోగించుకుని ఈ స్థితికి చేరిన తను ఇంతవరకూ దేనికీ భయపడలేదు.
    అలాంటిది__ ఎందుకో అనుకోకుండా ఈ మధ్య తెలియని భయమేదో వ్యాపించసాగింది అతని హృదయంలో. ఎందుకో హఠాత్తుగా తమ్ముడు విజయ్ భరద్వాజ గుర్తుకొచ్చి ఒళ్ళుగగుర్పొడిచిందతనికి.
    తనకేదన్నా జరిగితే !!!
    దేనికీ భయపడని తనకి మృత్యువంటే అంత భయమా?
    అయిదేళ్ళ బాలుణ్నీ, అరవై ఏళ్ళ వృద్ధుణ్నీ కూడా ఒకే స్థాయిలో భయపెట్టగలిగే మృత్యు వసలెలా ఉంటుంది?
    మృత్యువూ, జీవనమూ శత్రువులైతే మరి గెలుపెప్పుడూ మృత్యువుదేనా? అదే అయితే ఎందుకీ అర్థంలేని తపనలూ, తాపత్రయాలూ.... చివరకు మిగిలే ఆ ఆరడుగుల నేలలోని గోతి వరకూ, కాలి బూడిదయ్యే మాంసం, ఎముకల కొరకూ ఎందుకిన్ని ఘర్షణలు? అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ సమాధానాలు దొరకని సమస్య. టెలిఫోన్ డయల్ చేశాడు భరద్వాజ.
    అవతల ఫోన్ తీసిన శబ్దం.
    "హలో ఏ.ఎఫ్.సి. మేనేజర్ మూర్తి హియర్"
    "హలో మై బోయ్! భరద్వాజను మాట్లాడుతున్నాను"
    "సర్...."
    "హౌ ఈజ్ ఎవ్రిథింగ్?"
    "ఫైన్ సర్...."
    "మూర్తీ....రేపు సాయంత్రం బోర్డాఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కి నేనూ అటెండ్ అవుతున్నాను. మీ డిపార్ట్ మెంట్ కి సంబంధించి మన క్రొత్త హౌసింగ్ ప్రాజెక్ట్ ఫైలూ, చౌదరి పర్సనల్ ఫైలూ రెడీ చేయించు. దే ఆర్ గోయింగ్ టు బీ ది ఫోర్ మోస్ట్ ఇన్ ది అజెండా"
    "సర్....కానీ....మీరీ స్థితిలో...."
    "అయామ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్ నౌ"
    "కాని....డాక్టరూ"
    "టు హెల్ లివిట్. అయామ్ దేర్ ఇన్ డి కాన్ఫరెన్స్. దట్స్ ఆల్. నువ్వు చెప్పినట్టు చెయ్యి. అంతే"
    "యస్ సర్"
    ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు భరద్వాజ.
    హబీబ్ విజిటింగ్ కార్డొకటి తెచ్చి అందించాడతనికి. కార్డు చూడగానే అతని కనుబొమలు ముడిపడ్డాయి.
    "పంపించు" అన్నాడు సాలోచనగా.
    మరో ఐదు నిమిషాలకల్లా లోనికొచ్చాడతను.
    బ్రౌన్ కలర్ ప్యాంట్, వైట్ షర్టుతో లైట్ బ్రౌన్ కలర్ సూట్ వేసిన అతను అయిదడుగుల ఎనిమిది అంగుళాల పొడవుంటాడు సుమారుగా.
    "హలో సర్! హౌ ఆర్యూ నౌ?"
    "ఫైన్....థాంక్స్....ఏమిటిలా?"
    "జస్ట్....మీ ఆరోగ్యం గురించి తెలుసుకుందామని"
    "నైసాఫ్ యూ....హబీబ్"
    హబీబ్ వచ్చి నిల్చున్నాడు.
    "ఏం తీసుకుంటారు మీరు? బీర్....కాఫీ....కూల్ డ్రింక్?"
    "చల్లటి మీ సమక్షంలో చల్లని పానీయమే మంచిది" అంటూ సిగరెట్ తీసి నోట్లో వుంచుకొని లైటర్ వెలిగించాడతను.
    లైటర్ నుండి సన్నని సంగీతం వెలువడింది.


                                      7


    మ్రోగుతున్న అలారంని దుప్పట్లోనుండే చేయి బయటికి చాపి ఆపాడు సాగర్. తిరిగి ముసుగుతన్ని పడుకున్నాడు. రకరకాల ఆలోచనలతో రాత్రి ఆలస్యంగా నిద్రపట్టడం, అదీ కలతనిద్ర కావడం మూలాన అతనికి ఒళ్ళంతా బరువుగా అనిపించింది. ప్రొద్దున్న 8 గంటలకి ఆ రకంగా కంబళి కప్పుకొని జోరుగా తిరుగుతున్న ఫాన్ కింద మత్తుగా పడుకోవటం అతనికి స్వర్గతుల్యంగా అన్పించింది. చిన్నప్పట్నుండీ మిట్టమధ్యాహ్నపు ఎండలో కూడా, చెమటలు పడుతున్నా కప్పుకొని పడుకోవటమే అలవాటు.
    అప్పుడప్పుడే ఆదివారం తెల్లవారుతోంది బయట ప్రపంచానికి మరో అరగంట పక్కమీద దొర్లి లేచాడు సాగర్.

 Previous Page Next Page