Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 14


    సికింద్రాబాద్ వెళ్ళిన చిచ్చు, వెంటనే మళ్ళీ ప్రమధపురికి వచ్చాడు. వంటరిగా రాలేదు. విదుషిని వెంటబెట్టుకుని వచ్చాడు. విదుషి తన ప్రొఫెసర్ దగ్గరే కార్డియాలజీలో ఎం.డి. చెప్తోంది. సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఇన్ మిరకిల్ క్యూర్స్" అనే అంశం మీద పరిశోధనసాగిస్తూనే ఉంది. చాలా మెటీరియల్ కలెక్ట్ చేసింది. ప్రొఫెసర్ తో కలిసి సేకరించిన విషయాలు మరోసారి పరిశీలించి, పేపర్స్ పబ్లిష్ చేయాలనుకుంటోంది. చిచ్చు రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ బి.ఎస్.సి. ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. అప్పుడప్పుడు యూనివర్సిటీ బస్ లో సిటీకి వచ్చి విదుషిని కలుసుకుంటాడు. చిచ్చు విషయమంతా వివరించి "ఇళ ఆరోగ్యం విషయం నాకు చాలా అనుమానంగా ఉంది. నువ్వు రాగలవా!" అనగానే, వెంటనే అతనితో బయలుదేరి ప్రమధపురి వచ్చేసింది. చిచ్చు ఈ విషయంలో మరీ ఇంతగా కల్పించుకోవడం జ్ఞానదేవ్ కి నచ్చలేదు. అయినా ఏమీ మాట్లాడలేదు. కొంత వయసు వచ్చాక, కొడుకు అయినా సరే మన అభిప్రాయాలు వాళ్ళమీద రుద్దకూడదు. స్వతంత్ర వ్యక్తిత్వం పెంపొందించుకోవాలి" అనే ఉద్దేశం ఆయనది. వర్ధని మాత్రం తన అయిష్టాన్ని స్పష్టంగానే ప్రకటించింది.
    "ఆ పిల్ల మామూలు ఆడపిల్ల కాదు. దేవత. ఆ అమ్మాయి లోకంలో అందరికీ సాయం చెయ్యగలదు. నీ సాయం తనకి అక్కర్లేదు. ఈ వంకతో నువ్వు చీటికీ మాటికీ చదువు మానుకుని రానక్కర్లేదు" అని రుసరుసలాడింది.
    విదుషి స్థిమితంగా జ్ఞానదేవ్ కి విషయం వివరించి "ఒకసారి ఆమెని పరీక్షిస్తాను. నిజంగా ఏదైనా జబ్బయితే ఒక నిండు ప్రాణాన్ని చూస్తూ చూస్తూ మూఢనమ్మకాలకి బాలిపెట్టడం అన్యాయం కదా!" అంది. కాదనలేకపోయాడు జ్ఞానదేవ్.
    చిచ్చు విదుషితో యోగనాథశాస్త్రి ఇంటికి వచ్చేసరికి అక్కడ చాలామంది జనం మూగి ఉన్నారు. ఒక్కొక్కరూ లోపలికి వెళ్ళి లేవలేకుండా మంచంలో పడుకుని ఉన్న ఇళ పాదాలకి నమస్కారం చేస్తున్నారు. తనకి నమస్కరించిన వాళ్ళ తలమీద నీరసంగా వేలాడుతోన్న చేయి ఆనించి అస్పష్టంగా ఏదో ఆశీర్వదిస్తోంది ఇళ. తీర్థ ప్రసాదాలు యోగానాథశాస్త్రి ఇస్తున్నాడు అందరికీ. ఆ జనాన్ని తోసుకుని లోపలికి వెళ్ళడానికి అసాధ్యమయింది చిచ్చుకీ, విదుషికీ!
    లోకంలో ఎన్నోరకాల వార్తలు ప్రచారమవుతాయి. జనం తాము నమ్మాలనుకున్న వాటినే నమ్ముతారు. "ఇళ దుర్గాదేవి అంశతో జన్మించింది. అందుకే ఆమెకి పెళ్ళి తలపెట్టగానే విరుచుకుపడిపోయింది. పెళ్ళి మాట తలపెట్టం" అని తల్లిదండ్రులు లెంపలేసుకున్నాక కళ్ళు తెరిచింది". ఈ వార్త ప్రమధపురిలోనే కాక ఆ నోటా ఈ నోటా చుట్టుప్రక్కల అంతటా ప్రాకింది. చాలామంది నమ్మారు. ఇళ దర్శనం కోసం వచ్చారు. నమ్మనివాళ్ళు సహితం ఏమిటో చూద్దామనే కుతూహలంతో వచ్చారు.
    "మనం కొంతసేపాగి వెళ్దాం" నిస్పృహతో అంది విదుషి. చిచ్చు ముఖం పాలిపోయింది. "భక్తుల రాక మళ్ళీ మొదలయితే ఇళ జీవితం ఏమవుతుందీ?" ఇది చిచ్చు మనసులో బుసలు కొడుతున్న ప్రశ్న.
    భక్తులందరూ వెళ్ళిపోయేవరకూ ఆగి అప్పుడు లోపలికి వెళ్ళారు చిచ్చు, విదుషి.
    చిచ్చుని చూడగానే పాలిపోయి జీవం లేనట్లుగా వున్న ఇళ ముఖం మీదికి చిరునవ్వు వచ్చింది. కళ్ళతోనే పలకరించింది. చిచ్చు అక్కడికి రావడం అచ్యుతమ్మకి ఇష్టంలేదు కానీ కూతురు ముఖంమీద నవ్వుచూసి అతడిని పొమ్మని అనలేకపోయింది. ఎంతైనా ఆవిడది తల్లి మనసు.
    "మరోసారి ఇలా వస్తారా!"
    అచ్యుతమ్మని పెరట్లోకి పిలిచింది విదుషి. విదుషి డాక్టరని అచ్యుతమ్మకి తెలుసు. కాదనలేక వెళ్ళింది. ఇద్దరూ పెరట్లో జామచెట్టు క్రింద నిలబడ్డారు.
    "మీ అమ్మాయి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి" అంది విదుషి.
    "అంటే!" భయంగా అడిగింది అచ్యుతమ్మ ఆవిడ అనుమానాలు ఆవిడకున్నాయి. అవి నిజం కాకూడదని రోజూ దుర్గకి ఉభయ సంధ్యల్లోనూ మొక్కుకుంటూ ఉంటుంది.
    "మీ అమ్మాయికి గుండెజబ్బు అని అనుమానంగా ఉంది నాకు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ కి చూపిస్తే మంచిది."
    "ఆ!" నోరు తెరిచి కింద కూలబడింది అచ్యుతమ్మ.
    "మీరలా అయిపోకూడదు. ధైర్యంగా ఉండాలి.
    "ఏం ధైర్యం! ఇంట్లో నయాపైస లేదు. ఈ రెండురోజులుగా భక్తులిచ్చిన కానుకలతో ఎలాగో ఇల్లు ఈడుస్తున్నాం. అరిచి మొరపెట్టుకున్నా, అప్పిచ్చే నాధుడు లేడు. మేము అప్పు చేసినా తీర్చలేం అని అందరికీ తెలుసు. ఏం చెయ్యగలను నేను!"
    మాట్లాడలేకపోయింది విదుషి. వేల సంఖ్యలో సాయం చెయ్యగలిగే స్థోమత విదుషికి కూడా లేదు. వంద రెండు వందలయితే ఎలాగో సర్దగలదు. పల్లెటూళ్ళో స్కూల్ మాస్టర్ గా పనిచేస్తూ, గవర్నమెంట్ బడ్జెట్ శాంక్షన్ చేసిన నెలజీతం అందుకుంటూ లేని నెల జీతం లేకుండానే పనిచేసి ఎరియర్స్ కోసం ఎదురుచూస్తూ చేతనయినంతగా చుట్టుప్రక్కల వారికి సహాయం చేస్తూ, ఎలాగో కొడుక్కి చదువు చెప్పించుకుంటున్నాడు జ్ఞానదేవ్. ఈ పరిస్థితుల్లో పనివాడు చైతన్య మాత్రం ఏం చెయ్యగలడు.
    "ఏం చేయాలన్నది తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతం ఇళని ఏమాత్రం శ్రమపడనీయకండి. మంచంమీది నుంచి కదలనీయకండి. భక్తుల్ని ఆశీర్వదించే పనికూడా పెట్టకండి. తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు అన్నీ మీరే చూసుకోండి. మా ప్రొఫెసర్ తో మాట్లాడి మీకు ఉత్తరం వ్రాస్తాను" అంది విదుషి.
    తల ఊపింది అచ్యుతమ్మ. విదుషి అచ్యుతమ్మతో ఇళ దగ్గరికి వచ్చేసరికి చిచ్చు ఇళ మంచంప్రక్కన కింద కూర్చుని ఇళ చేతిని తన చేతిలోకి తీసుకుని ఏవో కబుర్లు చెబుతున్నాడు. చిరునవ్వుతో కళకళలాడుతూ కాంతివంతంగా ఉంది ఇళ ముఖం. ఎం.డి. చేస్తోన్న విదుషి సహితం ఆ ముఖం చూస్తూ ఇళకి జబ్బు అనుకోలేకపోయింది. అచ్యుతమ్మ మాత్రం ఆ దృశ్యం చూసి ముఖం చిట్లించుకుంది.


                               *    *    *    *


    ప్రమధపురిలో సన్నని మట్టిరోడ్డు మీద నడుస్తున్నారు చిచ్చు, విదుషి. ఇద్దరిలో ఎవరూ మాట్లాడటం లేదు. ఎంతోసేపు ఆ నిశ్శబ్దం భరించలేకపోయాడు చిచ్చు. "అక్కా! ఇళకి...ఏమిటి!" అడిగాడు.
    "గుండె జబ్బు అని అనుమానంగా ఉంది"
    నడుస్తున్నవాడు ఆగిపోయాడు "టూట్" అన్నాడు. విదుషి మాట్లాడలేదు.
    "నాకు ఇళ బాగా చిన్నతనం నుంచి తెలుసు. ఆరోగ్యంగా ఉండేది. మాతోపాటు ఆడేది. తనకి గుండెజబ్బు ఏమిటి? ఇంత చిన్న వయసులో అకస్మాత్తుగా వొస్తుందా గుండెజబ్బు?"
    "అకస్మాత్తుగా రాలేదు. కొన్నిరకాల గుండె జబ్బులు పుట్టుకతోనే వస్తాయి. కొంతకాలం వరకూ మామూలుగానే పెరుగుతారు. కానీ ఎప్పుడో అకస్మాత్తుగా బయటపడుతుంది. ఉదాహరణకి ఎ.ఎస్.డి. అనే గుండెజబ్బు అలాంటిదే!"
    చాలాసేపు మాట్లాడలేకపోయాడు చిచ్చు.
    హీనస్వరంతో అడిగాడు.
    "ఇళకి...ఏమీ కాదుగా!"
    "చెప్పలేం ఆపరేషన్ వల్ల నయం కావచ్చు."
    "ఆపరేషన్....!"
    "అవును... ఎప్పటికైనా జరుగవలసిందే. లేకపోతే... ప్రమాదం తప్పదు. ప్రొఫెసర్ చెయ్యగలరు."

 Previous Page Next Page