"నేను తీసుకొస్తాను."
వెళ్ళాడా చిచ్చు. అరగంటలో కాంపౌండర్ తోనూ, నర్స్ తోనూ వచ్చాడు. ఆ చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాలకి ఒక్కడే డాక్టర్. ఆ ఊళ్ళో ఉంటున్నానని ఈ ఊళ్ళో ఉంటున్నానని ఆ ఊళ్ళో చెప్పుకుంటూ టౌన్ లోనో, సిటీలోనో ఉంటాడు. నర్స్ లాంఛనంగా ఇళ చెయ్యిపట్టుకుని చూసి "ఇదేదో కాంప్లికేటెడ్ కేసులా ఉంది. పెద్దాసుపత్రిలో చూపించండి" అని తన బాధ్యత తీర్చేసుకుంది.
"అందాకా కోలుకోవడానికి గ్లూకోజ్ ఇంజక్షన్ ఇయ్యమంటే ఇస్తాను" అన్నాడు కాంపౌండర్.
"ఇయ్యి" చెప్పాడు చిచ్చు.
కాంపౌండర్ ఇంజక్షన్ ఇస్తోంటే "అబ్బా" అని బాధగా కళ్ళు తెరిచిన ఇళ చిచ్చుని చూసి బాధ మరచిపోయి నవ్వింది.
కాంపౌండర్ వెళ్తోంటే "థాంక్స్" చెప్పాడు చిచ్చు.
"నువ్వెప్పుడొచ్చావురా? వీళ్ళిద్దరినీ ఎలా తీసుకురాగలిగావ్? ఎక్కడికీ రారే!" అడిగింది వర్ధని.
"నేవెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఆస్పత్రిలో కులాసాగా జోక్స్ వేసుకుంటున్నారు. నేను జర్నలిస్ట్ ననీ నాతో వెంటనే రాకపోతే వీళ్ళిద్దరి మీద పేపర్లలో రాసేస్తానని, వీళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయని బెదిరించాను. వెంటనే వచ్చేశారు." నవ్వాడు చిచ్చు. అక్కడున్న అందరూ నవ్వారు.
ఇళ కళ్ళు మూసుకుని పడుకున్నా ఆమె పెదవుల మీద నవ్వు చెప్తోంది అవన్నీ వింటోందని.
"నువ్వు నిజంగా చిచ్చు వేనయ్యా!" అన్నాడు యోగనాథశాస్త్రి.
ముందు ఇళని సికింద్రారాబాద్ తీసుకెళ్ళాలి. అక్కడ విదుషి అక్క ఉంది. ఆమెకి తెలిసిన పెద్ద డాక్టర్లున్నారు."
కర్తవ్యం గుర్తుచేశాడు చిచ్చు. యోగనాథశాస్త్రి ముఖం పాలిపోయింది.
"ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు చిచ్చూ" బాధగా అన్నాడు. డబ్బు ప్రస్తావన రాగానే అక్కడ అంతకుముందు గుమికూడిన వారంతా ఒక్కొక్కరుగా జరుకోవటం మొదలుపెట్టారు.
"నేను టాక్సీలో తీసికెళ్ళి ఆస్పత్రిలో చేర్పిస్తాను." వెంటనే అన్నాడు.
"నువ్వా! నువ్వెలా తీసికెళ్తావ్! వయసులో ఉన్న ఆడపిల్లని వంటరిగా నీతో పంపిస్తామా?" వెలవెలపోయాడు చిచ్చు. ఈ ఆలోచన అప్పటివరకూ అతడి మనసులోకి రాలేదు. మనసులోనే "టూట్" అనుకున్నాడు. కొన్ని క్షణాలు ఆలోచించాక మెరుపులా ఒక పరిష్కార మార్గం తోచింది.
5
జ్ఞానదేవ్ ముఖం చూడగానే తండ్రికి తనమీద చాలా కోపం వచ్చిందని అర్థమయింది చిచ్చుకి. చిన్నప్పటిలా అతడిప్పుడు గోడకుర్చీ వెయ్యటంలేదు. కానీ, తను నిజంగా తప్పుచేశాననుకున్నప్పుడు తండ్రి ఎదుట చేతులు కట్టుకుని నిలబడతాడు. ఇప్పుడు అలాగే నిలబడ్డాడు తల దించుకుని.
"ఎందుకొచ్చావ్ ఇంటికిప్పుడు!"
శాంతంగానే అయినా, కఠినంగా అడిగాడు జ్ఞానదేవ్. చిచ్చుకి తను చేసింది తండ్రికి నచ్చలేదనీ, నచ్చదనీ తెలుసు. కానీ, తండ్రి ఎదుట అబద్ధాలాడటం అతనికి అలవాటులేదు. తను చేసినది తప్పని అతడు అనుకోవటం లేదు.
"అమ్మ ఉత్తరం రాసింది, అది చదువుకుని..."
"నిన్ను రమ్మని రాసిందా అమ్మ!"
"లేదు. ఇళకి పెళ్ళిచూపులని రాసింది."
"అయితే నువ్వెందుకు రావటం!"
వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు చిచ్చు. నిశితంగా కొడుకు ముఖం చూస్తూ కూచున్నాడు జ్ఞానదేవ్.
తన మనసులో భయాలు బయటపెట్టలేకపోతున్నాడు తండ్రి.
తన మనస్సులో భావాలకి భాష ఇయ్యలేకపోతున్నాడు కొడుకు.
భయంగా ఇద్దరినీ చూస్తోంది వర్ధని. ఇళంటే ఆవిడకి ఇష్టమే! కానీ చిచ్చు ఇలా కల్పించుకోవటం ఆవిడకీ నచ్చలేదు.
"ఇళకి పెళ్ళిచూపులయితే నువ్వెందుకు రావటం!" మళ్ళీ అడిగాడు జ్ఞానదేవ్.
ఈలోగా ధైర్యం తెచ్చుకున్నాడు చిచ్చు!
"ఇళకి పద్నాలుగేళ్ళుకూడా లేవు. అంత చిన్నతనంలో పెళ్ళి చెయ్యకూడదు. ఇళకే కాదు ఎవరికీ చెయ్యకూడదు. చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉండి మనకి తెలిసిన వాళ్ళకి చెడు జరుగుతోంటే, చూస్తూ ఎలా ఊరుకోవటం? అందరికీ నచ్చజెప్పి ఈ పెళ్ళి ప్రయత్నం మానించాలని వచ్చాను". ఈ సమాధానం జ్ఞానదేవ్ మనసుని చాలావరకు శాంతపరిచింది. చిచ్చు దురుసుగా సినిమాటిక్ గా "నేను ఇళని ప్రేమిస్తున్నాను." లాంటి డైలాగులు మాట్లాడితే అతడు చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది. ఆదరంగా చిచ్చుని చూస్తూ మెత్తని మందలింపు స్వరంతో "అందరి విషయాలూ నీకెందుకూ! నీ చదువు నువ్వు చూసుకోరాదూ!" అన్నాడు. ఆ స్వరం చిచ్చు మనసులో భయం పూర్తిగా పోయింది. ఉత్సాహంగా అన్నాడు.
"మన సంగతి మనం చూసుకోవటం కాదు. మన చుట్టూ ఉన్న సమాజం గురించి కూడా మనం ఆలోచించాలి అని మీరే కదా అంటారు. నిజానికి ఊళ్ళో మీరు బడికి వెళ్ళకపోయినా, మీ జీతం మీకు వస్తుంది. అలాంటిది మీరు ఈ ఊళ్ళో పిల్లలకి చదువు చెప్పడమే కాక, అడవుల్లో కోయపిల్లలకి కూడా చదువు చెప్పాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో మూఢవిశ్వాసాలు పోగొట్టాలని శతవిధాలా నచ్చచెపుతున్నారు. అలాంటిది మన ఊళ్ళో మన కళ్ళముందే మనకి తెలిసినవాళ్ళు. పాతకాలపు ఆచారాలతో జీవితాలు చిందరవందర చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం మంచిదేనా!"
"హారి పిడుగా!" అని మనుసులో అనుకుని పైకి నవ్వేశాడు జ్ఞానదేవ్. చిచ్చు కూడా నవ్వాడు పసిపిల్లాడిలా సంబరంగా. తండ్రికి తనమీద కోపం వచ్చిపోయినప్పుడల్లా అతడలాగే నవ్వుతాడు.
"ఇళని అలా తయారుచెయ్యడం నాకూ ఇష్టంలేదు. కనీసం ఇప్పుడైనా చదివించమని యోగనాథశాస్త్రికి చెప్పాను. ఆయన వినలేదు అనాగరికులైన కోయవాళ్ళకైనా నచ్చచెప్పగలుగుతున్నాను. కాని ఎటూ కాని ఈ పండితులకీ, పురోహితులకీ చెప్పలేకపోతున్నాను. నీ మాట అయినా వింటారని అనుకోను. ఇలాంటి విషయాలలో నీ చదువు పాడుచేసుకోకు. ముందు చదువు పూర్తికావాలి. తర్వాతే ఏదైనా" అన్నారు జ్ఞానదేవ్. చివరి మాటలు హెచ్చరింపుగా అన్నాడు.
"బాగానే ఉంది, తండ్రి అడవుల్ని ఉద్దరిస్తాడు. కొడుకు ఊళ్ళని ఉద్దరిస్తాడు."
మూతీ ముక్కూ విరిచింది వర్ధని.
* * * *