అది వినగానే ఆ మనిషి అదిరిపడ్డాడు.
"ఏరా నా కొడుకా! ఏట్రా కూస్తున్నావ్? నేన్నీకు నాన్నని కానా? నువ్వు నాకు కొడుకువి కావా?" అన్నాడు ఆగ్రహంగా.
"నేన్నీకు కొడుకుని కావచ్చు. కానీ నువ్వు నాకు తండ్రివి కావు."
"ఎందుకనో?"
"తండ్రి అనిపించుకోవడానికి కనీసమయిన క్వాలిఫికేషన్లు కూడా నీలో లేవు"
"కన్నాను కదరా! అది చాల్దా?"
"పందులు కూడా కంటాయి. కానీ అవి తమ పిల్లల్ని ఇంతకన్నా ప్రేమగానే చూసుకుంటాయి."
ఉగ్రుడయిపోయి కృష్ణాజీ వైపు తిరిగాడు ఆ మనిషి.
"ఇన్నారా సార్ ఈడి వాగుడు! పర్మిషనివ్వండి! పీక పిసికేస్తా!"
"నీ పేరేమిటి?" అన్నాడు కృష్ణాజీ.
"అయ్యబాబోయ్! నా పేరు దాసు కదండీ! సారా దాసు! అండర్ గ్రౌండ్ లో అందరికీ తెలుసండీ!"
దాసుని ఎగాదిగా చూశాడు కృష్ణాజీ.
పేరుకి తగినట్లే వున్నాడు సారా దాసు. ఒంట్లో రక్తానికి బదులు సారానే ప్రవహిస్తున్నట్లు కంట్రోలులో లేకుండా వూగిపోతున్నాడు. తాగి తాగి కళ్ళు ఉబ్బిపోయినట్లు అసహ్యంగా వుంది. చచ్చుబడిపోయినట్లు సన్నగా, పీలగా వున్నాయి చేతులు. తుఫానులో తిరిగివచ్చిన వాడి జుట్టులాగా పరమ అస్తవ్యస్తంగా వుంది జుట్టు. కొరివి దెయ్యాలు కాపురం వుంటున్నట్లు ఎర్రగా వున్నాయి కళ్ళు. జర్దా కిళ్ళీలు నమిలి నమిలి నలుపుకి తిరిగిన ఎరుపురంగులోకి మారాయి పళ్ళు. అతను మాట్లాడుతుంటే డ్రైనేజి గుంటలా వుంది నోరు.
సారా దాసు వాగుతూనే వున్నాడు.
"కన్న తండ్రంటే కూసింతయినా మమకారం లేద్సార్ ఈ నా కొడుక్కి! తెగ సంపాదించి, అంతా తనే తింటాడు గానీ తండ్రికేం పెట్టడు సార్! పైపెచ్చు, ఈ నా కొడుకు ఐదో ఏటే ఇంట్లో నుంచి పారిపోయాడ్సార్!"
"అవును! నువ్వు అమ్మని కిరసనాయిలు పోసి కాల్చేసి, నన్ను కూడా చంపెయ్యాలని చూస్తే పారిపోయా" అన్నాడు రాజా.
"అమ్మనీయమ్మ! అయితే ఇప్పుడు నామీద ఖూనీ కేసు పెట్టిస్తావేట్రా నంజ కొడకా! పోలీసు బాబు పక్కనున్నాడని వూరుకుంటున్నా గానీ పొడిచి పారేసి వుండేవోడ్ని నా కొడకా! పద!"
"ఎక్కడికి?"
"ఎక్కడికేట్రా! మనింటికే!"
"నేన్రాను."
"నువ్వొస్తావు. నువ్వు నేనూ కలిసి సారా వ్యాపారం చేస్తాం! దానికింక తిరుగులేదుగానీ, నోర్మూసుకుని నడు."
"నేను రాను"
"అమ్మనీయమ్మ! ఇక్కడుండి లార్డులాగా సంపాదించుకుంటూ అంతా నువ్వే దిగమింగుదామనుకుంటున్నావా? పద కన్నా! పద! చూడు, నీ ముసల్తండ్రి ఎన్ని కష్టాలు పడుతున్నాడో. వయసొచ్చిన కొడుకుని పెట్టుకుని నాకిదేం ఖర్మరా! పద పద!"
"ముసలాడివైతే దాన్నెందుకుంచుకున్నావ్?"
"ఎవర్నీ?"
"అదే...రత్నాన్ని"
మళ్ళీ తిక్కరేగింది దాసుకి.
"నా ఇష్టంరా నంజి కొడకా! నేను మొగాణ్ణిరా నలుగుర్ని చేసుకుంటా, నలభై మందిని ఉంచుకుంటా! వేలెడంత లేవు నాలో తప్పులు ఎతికేంత వాడివయ్యావా?"
"ఇప్పుడే కదా అన్నావ్ నేను పెద్దాడినైపోయాను! పెట్టి పోషించాలని!"
"మీరే చెప్పండి పోలీసుబాబూ! న్యాయం చెప్పండి? నా కొడుకుని నాతో పంపెయ్యండి!" అన్నాడు దాసు.
రాజా కళ్ళలో అంతకు ముందు లేని భయం కనబడింది.
రాజా మొహంలో ఆ ఎక్స్ ప్రెషన్ చూడగానే, అతని విషయంలో ఏం చెయ్యాలో పూర్తిగా తేల్చుకోలేక అటూ యిటూ ఊగిసలాడుతున్న కృష్ణాజీ ఒక నిర్ణయానికి వచ్చేశాడు.
తన చేతిని బలంగా దాసు మెడమీద వేసి, గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత నిదానంగా అన్నాడు -
"ఇదిగో చూడు దాసూ! విను! నీలాంటి పరమ భ్రష్టుడూ, పుండాకోరూ ఈ లోకంలో ఒకడు ఉన్నాడని యిప్పుడే నాకు తెల్సింది. రాజా సంగతి మర్చిపో! ఈసారి రాజాని గనక కలుసుకోవడానికి చూశావా ఆ తర్వాత అసలెందుకు పుట్టానా అని ఏడ్చే స్థితికి వస్తావ్. అర్థమయ్యిందా? మళ్ళీ చెప్పనా?"
చావు దెబ్బ తిన్న కుక్కలా తోక ముడిచాడు దాసు.
కానీ కుక్క మొరుగుతున్నట్లు ఇంకేదో అనబోయాడు.
"షటప్!" అన్నాడు కృష్ణాజీ కర్కశంగా.
బుర్రుమని ముక్కుతో భయంకరంగా ఒక శబ్దం చేసి, తర్వాత సైలెంటుగా అయిపోయాడు దాసు.
"కమాన్!" అన్నాడు కృష్ణాజీ, రాజాతో.
ఇద్దరూ బయటికి వచ్చారు.
ఇప్పుడు రాజా మొహంలో నిజంగానే భయం కనపడింది.
"చెప్పండి! పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళకుండా ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడన్నా పడేసి కొడతారా?" అన్నాడు.