ఎప్పుడెళ్ళి ఆమెను మరింత దగ్గరగా చూద్దామా అన్న ఆత్రుతతో నడుస్తున్నాడు.
ఎదురుగ్గా వస్తున్న ఆటోలనుగానీ, తనను రాసుకొంటూ వెళుతున్న సైకిళ్ళనుగానీ అతను గమనించడంలేదు. ఎదురుగ్గా వస్తున్న వాళ్ళను ఢీ కొట్టబోతూ, తప్పించుకుంటూ పరుగులాంటి నడకతో వెళుతున్నాడు. ఆరోజు ఉదయం నుంచి తను ఏమీ తినలేదన్న విషయం కూడా అతనికి గుర్తుకు రావడం లేదు. ప్రేమ పైత్యం ప్రకోపిస్తే తయారయిన వెర్రివాడిలాగా అతను నడుస్తున్నాడు.
ఎదురుగ్గా వస్తున్న ఎద్దులబండిని తప్పించుకుని, కుడికాలు నెత్తి ఫుట్ మీద పెడుతున్నప్పుడు ఠప్ మని శబ్దం వినపడడంతో ఆగాడు.
పాదంకేసి చూసుకున్నాడు.
స్లిప్పర్ కున్న ముందు రెండు పట్టీలు మొదట్లో తెగిపోయి, చనిపోయినవాడి చేతుల్లాగా నిర్జీవంగా వేలాడుతున్నాయి.
చెప్పు తెగిపోవడంతో దానిని రిపేరు చేసే అవకాశం ఏమయినా వుందా అని చేతుల్లోకి ఎత్తుకుని చూశాడు.
నడుం విరిగిపోయిన వృద్ధునిలా అది అచేతనంగా కనిపించింది.
దానిని బాగుచేయడం కుదరదని, రెండు చెప్పుల్నీ అక్కడ వదిలేసి నడవడం మొదలెట్టాడు.
తిరిగి కొత్త స్లిప్పర్సును ఎలా సంపాదించాలో అతనికి తెలియడం లేదు. ఎంత దరిద్రుడయినా స్లిప్పర్సు కూడా లేకుండా రజనీకి కనిపించటం అవమానంగా తోచింది. తను పూటకు గతిలేనివాడే కావచ్చు. తను చిన్నప్పట్నుంచీ దరిద్రంలోనే పెరిగుండవచ్చు. తను ఎవరూ లేని అనాధే కావచ్చు. అంత మాత్రాన మరీ వికారంగా కనిపిస్తే ఎలా? ఇప్పుడు ఈ చెప్పులెందుకిలా దేశద్రోహుల్లా మోసం చేశాయి? అతను రకరకాలుగా ఆలోచిస్తున్నాడు.
జేబు తడుముకున్నాడు. ఒక అయిదు రూపాయల కాగితం, మరో రూపాయి కాగితం ఒకదాని కొకటి రాసుకొని డబ్బు శబ్దం చేశాయి. ఈ ఆరు రూపాయలతో స్లిప్పర్సు కొనుక్కోలేడు తను. ఆరు రూపాయలతో సినిమా టికెట్టు కొనడానికే వీలవుతుంది. మరి స్లిప్పర్సు సంపాదించడం ఎలా? తనలో తానే మదనపడిపోతూ వెళుతున్న అతనికి రోడ్డుపక్కగా వున్న ఆంజనేయస్వామి దేవాలయం కనిపించింది.
మధ్యాహ్నమే అయినా జనం విపరీతంగా వున్నారక్కడ.
ఓ క్షణంసేపు దేవాలయం ముందు నిలబడ్డాడు.
గుడి మొదట్లో భక్తులు వదిలిన రకరకాల చెప్పులు పూలతోటలో పెద్ద సుడిగాలికి రాలిన రంగురంగుల పూలల్లా వున్నాయి.
తన కాళ్ళ నగ్నత్వాన్ని కప్పడానికి ఏం చేయాలో తెలిసింది నరేష్ కి.
మెల్లగా దేవాలయం కేసి నడిచాడు.
అప్పుడే అక్కడికి అడుగుపెట్టిన ఓ వ్యక్తిపై ఎంతో చనువుగా చేయివేసి "దేవాలయానికేనా" అని అడిగాడు నరేష్.
ఆ వ్యక్తి ఆరడుగుల పొడవుతో బలంగా వస్తాదులా వున్నాడు.
తన భుజంపై చేయివేసి దేవాలయానికా అని అడుగుతున్న నరేష్ వైపు కొరకొరా చూశాడు అతను.
"కోపం చేసుకోకండి మాస్టారూ! ఏదో మీకు మంచి చేద్దామనే. ఇక్కడ చెప్పుల దొంగలు విపరీతంగా వున్నారు. గుడిలోకి వెళ్ళి వచ్చేసరికి దొంగలకి అవి హారతి అయిపోతాయి. అందుకు నేను గుడికి ఎప్పుడు వచ్చినా చెప్పులు వేసుకురాను" గబగబా చెప్పాడతను.
అతనివైపు పరిశీలనగా చూసి లోపలికెళ్ళాడు వస్తాదు.
నరేష్ గుడికి కుడివైపుగా వెళ్ళి గర్భగుడి చుట్టూ మూడు రౌండ్లు వేసి, విగ్రహం ముందు నిలబడి అయిదు నిమిషాలపాటు ధ్యానముద్రలో గడిపాడు.
అక్కడ్నుంచి కదిలి, చెప్పులు వదిలేచోట ఓ సెకనుపాటు ఆగి, బయటపడ్డాడు.
ఫర్లాంగు దూరం వరకూ పరుగులాంటి నడకతో నడిచి, ఆ తరువాత స్థిమితపడ్డాడు.
తన పాదాలకేసి చూసుకున్నాడు. నల్లటి షోలాపూర్ చెప్పులు కాళ్ళను చుట్టుకున్న నీగ్రో ఆడపిల్లల్లా మెత్తమెత్తగా, కొత్తకొత్తగా వున్నాయి.
చెప్పులు ఎవరివోగానీ బ్రహ్మాండంగా సరిపోయాయి అతనికి.
మామూలుగా అయితే ఆ పని చేసుండడు నరేష్. ఎన్నో సమయాల్లో అతను స్లిప్పర్స్ లేకుండా గడిపాడు. మిట్ట మధ్యాహ్నం తారురోడ్డుమీద పాదాలు కాలిపోతున్నా ఇంటర్వ్యూలకని మైళ్ళకు మైళ్ళు నడిచాడు.
అయితే యిప్పుడతనున్న పరిస్థితి వేరు. ప్రపంచమే అతనికొక బెలూన్ లా వుంది. ప్రతి పువ్వూ నవ్వుతున్నట్లు, ప్రతి మనిషీ తనకు చిరకాల మిత్రుడయినట్టు అనిపిస్తోంది. అందుకే చాలా ఈజీగా ఆ పని చేశాడతను. ఎవరివో చెప్పులేసుకొని సినిమాకి బయల్దేరాడు.
అప్సరా థియేటర్ చేరేసరికి రెండుంపావయింది. అప్పటికే చాలామంది టికెట్లు తీసుకొని లోపలికెళ్ళారు. బయట పదిమందిదాకా హడావుడిగా వున్నారు.
నరేష్ ముందు కారు పార్కింగు దగ్గరికి వెళ్ళి చూశాడు. తెల్లటి మారుతీకారు రెక్కలు ముడుచుకొని కునుకు తీస్తున్న పావురాయిలా వుంది.
హమ్మయ్యా! రజని వచ్చింది. మధ్యలో ప్లాన్ మారి మరో థియేటర్ కి వెళ్ళకుండా ఆ థియేటర్ కే రావడంతో అతను గుండెల్నిండా ఊపిరి పీల్చుకొని వదిలాడు. అంతవరకూ వున్న టెన్షన్ అంతా మాయమైంది.
వాళ్ళు తప్పక రిజర్వ్ డ్ క్లాస్ కే వెళ్ళారని తెలియడంవల్ల ఆ కౌంటరు దగ్గరికి వెళ్ళాడు. క్యూలో ఎవరూ లేరు త్వరత్వరగా నడిచి, కౌంటరులోకి చేయిని తోస్తూ టికెట్టు ధర ఎంతన్న అనుమానం వచ్చి పైకి చూశాడు. అక్కడున్న అంకెల్ని చూస్తూనే జావగారిపోయాడు. రిజర్వడ్ టికెట్టు ఆరున్నర రూపాయలన్న అక్షరాలు మసగ్గా కనిపించాయతనికి. అప్పటికే అతని కళ్ళు బైర్లు కమ్మాయి.
ఎప్పుడోగాని అతను సినిమాలు చూడడు. తిండికి డబ్బు సంపాదించుకోవడమే గగనమైపోయిన అతను సినిమాలకి వెళ్ళడు. ఎప్పుడయినా రాళ్ళపల్లి పిలిస్తే ఫ్రీ పాసుమీద వెళతాడు. అందుకే ఏ థియేటరులో ఏ టికెట్ ఎంతో తెలియదు.
కౌంటరు లోపల తన చేతిని తేలు కాటువేసినంత బాధగా గబుక్కున లాగేసుకున్నాడు.
టికెట్ కి సరిపడా మరో అర్థరూపాయిని ఎలా సంపాదించుకోవాలో తెలియలేదతనికి. ఈ చిల్లర తక్కువ సమస్య తను చనిపోయేటప్పుడు కూడా వదలదనిపించింది. ప్రతిదానికీ ఎంతో కొంత చిల్లర తక్కువ కావడం అతనికి మామూలే. అన్నిటికీ సరిపడా డబ్బు ఎప్పుడుంటుందోననే ఆలోచనలో పడ్డాడు. తన దరిద్రాన్ని కక్ష తీరా తిట్టుకొన్నాడు. ప్రేయసితో కలిసి సినిమా చూడలేని తన దురదృష్టాన్ని తలచుకొని కుమిలిపోయాడు.