"అయినా మీరు చేసింది తప్పుకాదా? బ్యాంకులో ఉన్న దానం ప్రజల ధనం కాదా? ప్రజల సొమ్ముని లూటీ చేయటం నేరం కాదా?"
"నేరమే....తప్పే....అనఫీషియల్ గా చేజిక్కించుకుంటే దొంగతనం అవుతుంది. మరి అఫీషియల్ గా చేజిక్కించుకుంటే కాదా? హర్షద్ మెహతాలాంటి ఘరానా దొంగలెంతమందున్నారీ దేశంలో! రాజకీయ నాయకులు- వాళ్ళ బంధువర్గం ఫ్యాక్టరీలు పెడతామని, వ్యాపారం చేస్తామని అఫీషియల్ గా లోన్స్ తీసుకొని, వాటిని స్వంతానికి వాడుకొని ఐ.పి.డిక్లేర్ చేస్తే ఏం చేస్తున్నారు?
బేడ్ డెట్స్ - రాని బాకీల కింద రికార్డ్స్ లో రాసుకొని ఫైల్స్ క్లోజ్ చేసేస్తున్నారు.
బ్యాంకులకు బ్యాంకుల్నే దివాళా తీయించిన దొరలున్నారు. ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ ని దివాళా తీయిస్తున్న పెద్దమనుషులున్నారు.
ఎవరు బాబు ఇక్కడ నీతిమంతుడు?
నీతిమంతుడికి అసలు లోన్సే యివ్వరు.
కోటి రూపాయలు లోన్ శాంక్షన్ చేస్తే, అందులో పది లక్షలు బ్యాంక్ అధికారులకే కమీషన్ కింద సమర్పించుకోవాలి. బ్యాంక్ గేట్ దగ్గరే పదిశాతాన్ని పోగొట్టుకొనే వ్యక్తి ఆ అప్పుని ఖచ్చితంగా తీరుస్తాడా?
మనదేశం భ్రష్టుబట్టిపోయింది. రాజకీయాలు కుళ్ళుకంపుకొడుతున్నాయి. దేశాభివృద్ధి వెనక్కి నడుస్తోంది. అయినా మనకిప్పుడా మీమాంస అనవసరమేమో" అని ఆవేశంగా అంటూ నిద్రకి వుపక్రమించాడు రామదాసు.
అయినా వివేక్ ఆలోచిస్తూండిపోయాడే తప్ప వెంటనే నిద్రపోలేకపోయాడు. ఒక నెకెడ్ వరల్డ్ ని రామదాసు మాటలలో చూస్తున్నాడు వివేక్.
* * * *
ఉదయం అంతా వరసలో నించున్నారు.
సబ్ జైలర్ నాయుడు అటెండెన్స్ తీసుకుంటున్నాడు.
ఖైదీలకు పెట్టిన నెంబర్స్ పిలుస్తుంటే స్కూల్లో పిల్లల్లా ఖైదీలు "ప్రెజెంట్ సార్" అంటున్నారు.
"ఒకసారి జస్పాల్ కేసి చూడు. మన పక్కలైన్లోనే వున్నాడు...." మెల్లగా అన్నాడు రామదాసు. మెల్లగా తల వంచుకునే.
ఆ రోజెందుకోగానీ మార్నింగ్ ప్రోటోకాల్ కి జైలు సూపరింటెండెంట్ వీరనారాయణ కూడా హాజరయ్యాడు. అంత పొద్దుటే ఆయన రావడము ఖైదీలకే కాదు, సబ్ జైలర్ నాయుడికి కూడా ఆశ్చర్యంగా వుంది.
వీరనారాయణ ప్రతి ఖైదీని పట్టి పట్టి చూస్తున్నాడు. ఏ ఖైదీ మీదయినా వీరనారాయణకి అనుమానం వస్తే- ఆ ఖైదీని తన గదికి పిలిపించి తుక్కుకింద కొట్టేసి, కోరలు పీకేసి ఒక విధమైన భయాన్ని వారిలో ప్రవేశపెడతాడు.
క్రితం రాత్రి అర్దరాత్రివేళ రౌండ్స్ కి రావటం, పొద్దుటే ప్రోటోకాల్ కి రావడంతో రామదాసు ఆలోచనలు పరిపరివిధాలా పోతున్నాయి....ప్రమాదాన్ని శంకిస్తున్నాయి.
వివేక్ తలని స్ట్రెయిట్ గా వుంచి, చూపుల్ని పక్కకి మరల్చి జస్పాల్ కేసి చూశాడు. జస్పాల్ తల వంచుకొని వున్నాడు.
ఆ రోజు ఏదో ఒక సమయంలో జస్పాల్ తన మీద ఎటాక్ చేయవచ్చన్న అనుమానం వుంది వివేక్ లో.
అరగంటకి ప్రోటోకాల్ అయిపోయింది.
ఖైదీలంతా ఉన్నారని నిర్ధారణ చేసుకొన్న వీరనారాయణ తన క్వార్టర్స్ కేసి వెళ్ళిపోయాడు.
సబ్ జైలర్ నాయుడు కూడా సెంట్రీల్ని ఒకసారి హెచ్చరించి తన ఆఫీస్ గదికేసి వెళ్ళాడు.
ఖైదీలకు ఒకసారి స్వేచ్చ లభించినట్లయింది. ఒక్కొక్కరూ వివేక్ దగ్గరకొచ్చి, జస్పాల్ గూబ పగలగొట్టినందుకు అభినందిస్తున్నారు. మరికొందరు దూరం నుంచే వింతగా, దిగ్భ్రాంతిగా వివేక్ కేసి చూస్తూ వెళుతున్నారు.
జస్పాల్ తననేమీ చేయలేదు సరికదా- తనవైపు కన్నెత్తయినా చూడకపోవటం వివేక్ లో ఆలోచనల్ని రేకెత్తించింది.
తనని తిట్లతో పలకరించే సెంట్రీలు సైతం తననేమీ అనకపోవటము మరింత ఆశ్చర్యంగా వుంది అతనికి.
జైల్లో పెంచుకున్న గార్డెన్ పనిలో నిమగ్నమయ్యారు ఖైదీలంతా.
"చూశావా....? ఒకే ఒక దెబ్బ ఎంత మార్పు తీసుకొచ్చిందో.... దయచేసి నా మాట విను.... జైలు నుంచి తప్పించుకో, నీ పగ తీర్చుకో" పక్కనే పాదులు చేస్తున్న రామదాసు అన్నాడు దగ్గర్లో గార్డింగ్ చేస్తున్న సెంట్రీలకు వినిపించకుండా.
కొద్దిక్షణాలు అతను మాట్లాడలేదు.
కుండీల్లో ఉన్న మొక్కలపై నీళ్ళు చిలకరిస్తూండిపోయాడు. నిజానికి రామదాసు వుద్భోధ, క్రితం రోజు జరిగిన సంఘటన వివేక్ లో తీవ్రమైన ఆలోచనల్నే రేకెత్తించాయి.
"దానివలన మీకేమిటి లాభం?" ఒకింత మౌనం తర్వాత ప్రశ్నించాడు వివేక్.
"ఉంది.... చాలా వుంది.... నీకు అన్నివిధాలా సహాయం చేసినందుకు నువ్వు నా ఋణం తీర్చుకోవాలిగదా? ఆ ఋణమే నా పగ" విత్తనం వేశాడు రామదాసు.
వివేక్ కి విషయం చాలావరకు అర్ధమైపోయింది.
"నీకు ట్రైనింగ్ యిస్తాను. అందుకు రహస్య ఒడంబడిక నాయుడితో చేసుకుంటాను. జైలు నుంచి నిన్ను నేను తప్పిస్తాను. జైలు నుంచి బయటకు వెళ్ళాక నా నిధి, నా శిష్యులు, నా ఆయుధాలు, వాహనాలు నీకు సహాయపడతాయి. అందుకుగాను జస్వంతరావు ఒక్కడిని నువ్వు ఆసాసినేట్ చేస్తే చాలు. నీకు అన్యాయం చేసినవాళ్ళు నలుగురయిదుగురు వుండవచ్చు. నువ్వు వాళ్ళను ఎలా అసాసినేట్ చేయాలో కూడా ట్రైనింగ్ యిస్తాను. నీ గతం పొల్లుపోకుండా నా ముందుంచితే, తగిన పథకాన్ని సిద్ధంచేసి నీకు అందిస్తాను. నా మాటల్ని తేలిగ్గా తీసుకోకు...."
రామదాసు కంఠం మెస్మరైజ్ చేస్తున్నట్లుగా, ట్రాన్స్ లోకి తీసుకెళుతున్నట్లుగా- ఆపైన శాసిస్తున్నట్లుగా వుంటాయి. గంభీరమైన బేస్ వాయిస్ రామదాసుది.
రామదాసు వివేక్ సమాధానం కోసం ఎదురు చూస్తూండగానే వినిపించాయా మాటలు-
"ఇప్పటికీ ధైర్యం చాలటంలేదా అర్భకుడా" అంటూ.
ఇద్దరూ వులిక్కిపడ్డారు.
నలువైపులా చూశారు ఆసక్తిగా.
మూడువైపులా పనిచేస్తున్న ఖైదీలు.... వాళ్ళను గార్డ్ చేస్తున్న సెంట్రీలు తప్ప ఎవరూ లేరు.
నాలుగోవైపు- తమకి ఎదురుగా పెద్ద పొదల్లాంటి పూలగుబుర్లు వాటి వెనుకనుంచే ఆ మాటలు వచ్చి వుండాలి. ఎవరయి వుంటారు?
అటువైపు స్త్రీల వార్డ్స్ వున్నాయి.
ఆడఖైదీల్నుంచేది అక్కడే.
వినవచ్చిన మాటలు కూడా ఆడగొంతునుండి వచ్చినవే. ఆ కంఠాన్ని ఎక్కడో విన్నట్టుగా అనిపించింది వివేక్ కి.
"ఇంతకంటే గొప్ప అవకాశం నీకురాదు. నీ పక్కనున్నాయనెవరో దేవుడిలా వచ్చారు. అవకాశం ఆహ్వానిస్తుంటే చేతులు కట్టుక్కూచునేవాడు పిరికివాడు. నువ్వు ముగ్గుర్ని చంపాలి. అందుకు సహకరిస్తున్న ఆ పెద్దాయనవైపు ఒక్కర్ని మట్టుబెడితే చాలు" ఈసారి మరికొంత హెచ్చు స్వరంతో వినిపించాయా మాటలు.
ఇద్దరూ ఉలిక్కిపడి చేస్తున్న పనాపి, లేచి నించుని పొదల ఆవలివైపుకేసి చూసే ప్రయత్నం చేస్తుండగా-
మాటునుండి బయటకు వచ్చిందావిడ-
చేతిలో చీపురుతో....
ఒక్కసారిగా షాక్ తిన్నాడు వివేక్ హై వోల్టేజ్ లో.
"అమ్మా...." అన్నాడు అప్రయత్నంగానే. క్షణాలో విషయం అర్ధమయిపోయింది రామదాసుకి.
"జైలు వెనక వున్న ఊరికి మీ అమ్మ మకాంమార్చి స్వీపర్ గా మారి, అదీ నీ కోసం జైలు కొచ్చింది. అది నా అంచనా....ఏమ్మా....కరక్టేనా?" అన్నాడు రామదాసు వేదవతి వైపు చూస్తూ.
"పిరికి కొడుక్కి ధైర్యాన్ని నూరిపోయటానికి ఈ పనిని ఒప్పుకోక తప్పలేదు" అంది ఈసడింపుగా కొడుకు వైపు చూస్తూ వేదవతి.
"ఆహా....ఏం పట్టుదలమ్మా మీలో....వయస్సు ఉడిగినా మనలో వున్న పట్టుదల, వయస్సులో వున్న ఇతనిలో లేకపోవటం విచారకరం" అన్నాడు రామదాసు సర్ క్కాస్టిగ్గా.
వివేక్ గుండెలోతుల్లో నిక్షిప్తమైవున్న 'అహం' కొద్దిగా పైకి లేచింది. పౌరుషం నిద్రలేచింది.
"జైల్లోంచి తప్పించుకోవటం, జైల్లోకి రావటమంత తేలిక కాదు. నువ్వు నా తల్లివని జైల్లో తెలిస్తే నిన్నూ బయటికెళ్ళనివ్వరు. ఎందుకయినా మంచిది. త్వరగా వెళ్ళిపో. రేపటినుండి రాకు. ఇంత కట్టుదిట్టమైన జైలునుండి తప్పించుకోవటం మీరనుకునేంత తేలికకాదు. దొరికితే పిట్టని కాల్చినట్లు కాల్చిపడేస్తారు" ఒకింత అసహనంగా అన్నాడు వివేక్.
"లేదంటే....పాపం....నిన్ను దయతలచి నీ ఉరిని తప్పిస్తారు. ఉరితీసి, దిక్కుమాలిన చావు నువ్వు చచ్చాక సంజీవిని పర్వతం తెచ్చి నీ శవం మీదుంచి తిరిగి బ్రతికిస్తాను. సిగ్గులేదురా ఇలాంటి పిరికి మాటలు మాట్లాడటానికి? ఛీ....ఛీ.... నీ చేతిలో అన్నం లాక్కుంటే- నీ నోటి దగ్గర కూడు లాక్కుంటే- ఒకరు చెప్పేదాకా నీలో పౌరుషం నిద్రలేవలేదూ?" ఆడపులిలా అంటున్న ఆమెవైపు చూసి ఇద్దరూ షాక్ తిన్నారు.
అప్పుడే ఆ విషయం ఈమెకెలా తెలిసిపోయింది?
ఆ సంఘటన జరిగింది నిన్న, ఈమె పనికి చేరింది ఈ రోజు....?
తన అంచనా కరెక్టే. క్రితం రాత్రే వివేక్ ని రెచ్చగొట్టేందుకు తనకో ఆసరా కావాలనుకున్నాడు. ఆ ఆసరా వాళ్ళమ్మయితే బావుండుననుకున్నాడు. సరిగ్గా ఇప్పుడదే జరిగింది. తన టైమ్ బావుంది.