"అప్పు అడగడానికి అంత ఫీల్ అవ్వక్కర్లేదోయ్. అప్పులేంది ఎవరికి చెప్పు? సాక్షాత్తూ ఆ కలియుగ వేంకటేశ్వరుడికి కూడా అప్పుంది మనదేశం జపాన్ కు అప్పుంది. జపాన్ అమెరికాకు అప్పుంది. అమెరికా ప్రపంచ బ్యాంక్ కు అప్పుంది. దేశాలే అప్పు పెడుతున్నప్పుడు మనమెంతోయ్. సముద్రంలో నీటిబొట్టు. ఎం.ఏ. చదివిన నువ్వు పెట్రోల్ పట్టడమేమిటి! వెంట వచ్చేయ్. అయిదు రూపాయలు అప్పిస్తాను."
"లేదు సార్. ఈరోజుకు క్షమించండి."
"రేయ్ అలా చూస్తావేమిటి? అయిదు లీటర్లు పట్టు" నరేష్ పక్కనున్న కుర్రాడితో చెప్పాడు రాళ్ళపల్లి.
"మీదేనా సార్ బైక్?" అడిగాడు అతను.
"నాది కాదయ్యా. ప్రభుత్వానిది. డ్యూటీలో వున్నప్పుడే వాడతాను."
ఆయన్ను పరిశీలించి చూసి "మీ టోపీ ఎక్కడ సార్?" అని అడిగాడు నరేష్.
ఆ మాటలకు ఆయన నవ్వి "భయపడి వెనక క్యారియర్ లో దాచానయ్యా. స్టేషన్ లో కుర్చీలో కూర్చోగానే నిద్రముంచుకోస్తుంది. నా ఈ దరిద్రమైన అలవాటు తెలిసిన ఖైదీలో, పోలీసులో నాకు సంబంధించిన వస్తువుల్ని ఎత్తికెళ్ళిపోతున్నారు. టోపీ పోగొట్టుకుంటే ఇబ్బంది. అందుకే దాన్ని బైక్ క్యారియర్ లో వేసి లాక్ చేస్తుంటాను" అని చెప్పాడు.
బిల్లు చెల్లించి ఆయన వెళ్ళిపోయాక నరేష్. బంక్ కుర్రాడు చెట్టుకింద నిలబడి మాట్లాడుకోసాగారు.
మరో వెహికల్ వచ్చేంతవరకు వాళ్ళకు విశ్రాంతి.
"గురూ! మారుతీకారు వస్తోంది చూడు. అందులో ఖచ్చితంగా అమ్మాయిలుంటారు. అదిగానీ ఇటొస్తే నువ్వే ఆయిల్ పట్టు" అన్నాడా కుర్రోడు.
దూరంగా వస్తున్న తెల్లటి కారును చూడగానే చైన్ రియాక్షన్ లా అతను గుండె తన వేగాన్ని పెంచింది. రక్తమంతా పిచ్చిగా పరుగెడుతోంది. నరాలు టెన్షన్ తో బిగుసుకున్నాయి. కళ్ళు రెప్పల్ని ఆర్పడం మానేశాయి.
అది రజని కారైతే బావుండు. ఆ కారు ఇటొచ్చి ఆయిల్ పట్టుకుంటే మరింత బావుండు. ఎంచక్కా మూడోసారి రజనీని చూడవచ్చు. అవునూ ఆమె ఇల్లెక్కడ? ఈరోజు తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడతను.
ఆ కారు మరో రెండు క్షణాల్లో పెట్రోల్ బంక్ లోకి దూరింది. అమ్మాయిలతో క్రిక్కిరిసివున్న ఆ కారు చేమంతుల గుత్తిలా అనిపించింది అతనికి. డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారో చూడాలన్న ఆతృత కొద్దీ అతను కారు దగ్గరకు పరుగెత్తాడు.
అంతలో డోర్ తీసుకుని అమ్మాయిలంతా దిగారు. రోస్ షిఫానీ చీరలో అప్పుడే చెట్టుమీద విరబూసిన గులాబీలా వున్న రజనిని చూడగానే అతను అడుగు ముందుకు వేయలేకపోయాడు. ఆ సౌందర్యం అతన్ని పిచ్చివాడ్ని చేసింది. వెర్రి చూపులతో మెల్లగా వాళ్ళ దగ్గరకు వచ్చాడు.
"హలో చితా! ఇక్కడ వున్నావేమిటి?" సరళ అతన్ని గుర్తుపట్టింది.
స్నేహితురాల్ని నోరు మూయమన్నట్టు చేత్తో గిల్లి "బావున్నారా" అని అడిగింది రజని.
"ఆ ప్రశ్న నీకే వేసింది. జవాబు చెప్పు. హరీయప్" ఎవరో తన లోపల్నుంచి అరుస్తున్నట్లు ఫీలైన నరేష్ బావున్నానన్నట్టు తల వూపాడు.
"ఎవరిక్కడ? ముందు పెట్రోల్ పట్టండి. మీరు ఆలస్యం చేస్తే అక్కడ సినిమాకు టిక్కెట్లు హుష్ కాకీ అయిపోతాయి. ముందే ఆ అప్సరా థియేటర్ అగ్గిపెట్టెంత ఉంటుంది" అరిచింది సరళ.
వాళ్ళంతా అప్సరా థియేటర్ లో మ్యాట్నీ చూడడానికి వెళుతున్నారని అతనికి అర్థమైంది.
సినిమాకు వెళితే మూడుగంటలపాటు రజనిని చూడచ్చు. సమయమూ,సందర్భమూ కలిసొస్తే ఆమె ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ముందు ఇంటి అడ్రస్ సంపాదిస్తే ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇంటి దగ్గర కాపు వేయవచ్చుననుకున్నాడు అతను.
ఇక మనసు అక్కడ ఆగదని తెలిసిపోయింది. వాళ్ళతోపాటు సినిమాకు చెక్కేయాలనుకున్నాడు. తమ వాళ్ళకోసం కాకుండా కాకతాళీయంగా ఆ థియేటర్ కు వెళ్ళినట్టు వెళ్ళాలి. లేకపోతే సరళ మా రజనిని బీట్ కొట్టడానికి వచ్చావా? అని డైరెక్ట్ గా ముఖం మీదే అడిగేసే ప్రమాద ముందని జడుసుకున్నాడు.
అతనితో ఇంకేం మాట్లాడాలో తోచక అలా చూస్తూ నిలబడిపోయింది రజని.
"ఇదేమిటి మహానుభావా? ఇక్కడ తగిలావ్" సరళ అడిగింది.
"ఇక్కడే పనిచేస్తున్నాను. నాకు ఆకలేసినప్పుడంతా మీ ఫ్రెండ్ కనిపించి డబ్బులివ్వరు కదా. అందుకే టెంపరరీగా ఈరోజే ఇక్కడ చేరాను."
అంతలో కుర్రాడు ఆయిల్ పట్టాడు. బిల్లు కట్టమని రజని ఆ కుర్రాడి చేతికి వందరూపాయలిచ్చింది.
అతను బిల్లు, చిల్లరతో తిరిగొచ్చాడు.
రజని సీట్లో కూర్చుని "ఆ రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళింది ఏ కంపెనీకి? మరిచిపోయాను" అడిగింది తల బయటికి పెట్టి.
"స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెనీ" నరేష్ చెప్పాడు.
"వెళ్ళొస్తానండీ" అని చెప్పి కారును కదిలించింది రజని.
ఆ కారు కనుమరుగయ్యే వరకూ అలానే చూస్తుండిపోయాడు అతను.
ఆ తరువాత మెల్లిగా ఆఫీసులోకి నడిచాడు.
"నేను వెళ్ళిపోతున్నాను" అన్నాడు మేనేజర్ తో.
మేనేజర్ అతనివేపు విస్మయంగా చూస్తూ "ఏమిటి ప్రాబ్లమ్?" అని అడిగాడు.
"తీవ్రాతి తీవ్రంగా కడుపునొప్పి. భరించలేకుండా వున్నాను. అరరోజు కూలీ ఇప్పిస్తే వెళ్ళిపోతాను."
మేనేజర్ టైమ్ చూసుకున్నాడు. ఏదో అనబోయి అంతలోనే మనసు మార్చుకొని డ్రాయర్ సొరుగు తీసి ఆరురూపాయలిచ్చాడు.
"వస్తాను సర్!" అని కడుపు మీద చేయి ఆనించుకుని బయటకు వచ్చాడు నరేష్.
ఇప్పుడతను ప్రేమకు సంబంధించి రెండో దశలో వున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని గురించి కలలు కనడం అందులోని మొదటి దశ. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడం రెండవ దశ.