Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 13

    "అది ప్రకృతి రహస్యం."

    "మరిది ఇండియన్ పొలిటిక్స్ ఓపెన్ సీక్రెసీ...."

    "చాలా ఆశ్చర్యంగానూ, బాధగానూ వుంది" నిట్టూర్చుతూ అన్నాడతను.

    తిరిగి కొద్దిక్షణాలు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం పేరుకుంది.

    ఇతనికి ఆ రోజు మధ్యాహ్నం జస్పాల్ ని కొట్టిన సంగతే జ్ఞాపకం లేనట్టుందే? తిరిగి రేపతనేమన్నా చేస్తాడా? చేస్తే ఎలా? 'మీరే నన్ను రక్షించాలి. ఎందుకంటే- మీరు కొట్టమంటేనే కొట్టానని' తనను అర్దిస్తాడనుకున్న రామదాసు అంచనాలు తలకిందులయ్యాయి.

    వివేక్ కేసే ఒక్కక్షణం చూశాడు రామదాసు. అతను తనకేసే చూస్తున్నాడు.

    అతని మొహంలో డిజర్ట్ ఎక్స్ ప్లోజన్ ఎక్స్ ప్రెషన్....అనెమోషనల్ ఎక్స్ ప్రెషన్, అసలితనికి తనకుపడ్డ ఉరయినా గుర్తుందా? ఏమో?!

    ఒక విషయం మీద తన దృష్టిని కేంద్రీకరిస్తే దాన్ని తప్ప ప్రపంచాన్నేం పట్టించుకోని ఏ రేర్ క్రియేచర్ ఆఫ్ మేన్ కెండ్....

    సరిగ్గా ఇతనే తనకు సరిపోయే అస్త్రం! ఇతని ద్వారానే తన పగ, ప్రతీకారాలు నెరవేరాలి. నెరవేరతాయి కూడా.

    డెడ్లీ కాన్ సబ్ ట్రేషన్....

    అన్ బిలీవ్ బుల్ కాన్ సన్ ట్రేషన్....

    చేసే వృత్తి ఏదయినా, ఇంత ఏకాగ్రత వున్న వ్యక్తి తన గోల్ సాధించకుండా వెనుదిరగలేడు. తనతోటి వారిలోకి తను ముందుండకుపోడు.

    రామదాసు గతంలోకి తొంగిచూస్తే రౌడీయిజం....గూండాయిజం....మాట్లాడేతీరు.... విషయావగాహన చూస్తే ఎంతో సంస్కారం.... నాగరికత.... ప్రతి విషయంపై పట్టు.... లోతయిన పరిశీలన....ఏమిటీ వైరుధ్యము?

    మొత్తానికి రామదాసుకి వివేక్ మీద-

    వివేక్ కి రామదాసుమీదా విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఎన్నో ఏళ్ళుగా నీడలు ముసురుకొని వున్న రామదాసు ముఖంపై చిరునవ్వు విరిసింది.

    ఒక్క దెబ్బకే జస్పాల్ లాంటి బలమైన వ్యక్తిని నేలకరిపించగల భుజబలం వుంది. ఎస్.... అది తనకవసరం. ఎంచుకున్న లక్ష్యం నుంచి వీసమెత్తయినా పక్కకి జారిపోని ధృడచిత్తం, ఏకాగ్రతా వున్నాయి. ఎస్....ఎస్....అవే తనకు కావాలి.

    ఇక సమయస్పూర్తి, తెలివితేటలు సంగతే తేలాలి. ఒకవేళ అవి లేకపోయినా నియంత్రించిన రోబోట్ లా పని చేసుకుపోగలిగితే చాలు.

    కానీ తను చెప్పేది వింటాడా?

    తను చెప్పినట్లు చేస్తాడా?

    అంత పెద్ద సాహసానికి సిద్ధపడగలడా?

    అందుకు తనొక్కడి ప్రయత్నమే సరిపోతుందా? సరిపోతుందా? అక్కడే....ఆ సందేహం దగ్గరే రామదాసు ఆలోచనలు ముసురుకున్నాయి ఒకింతసేపు.

    సెంట్రీల బూట్ల నాడాల శబ్దం లయబద్ధంగా ఆ నిశి నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తున్నాయి. అతని ఆలోచనలు వేడెక్కుతున్నాయి క్రమంగా.

    ఎస్....తనొక్కడి ప్రయత్నమే సరిపోదు.

    మరొకరి సహాయం కావాలి. ఆ మరొకరు ఎవరైతే బాగుంటుంది? అవును....అతన్ని జైలునుంచి తప్పించుకొని పగతీర్చుకోమంటున్న అతని తల్లే! ఆవిడే కావాలి. ఆవిడ తనకు అండగా నిలవాలి!

    అదెలా సంభవం?

    "ఇంతకీ ఆ యాభై లక్షలు ఏం చేశారు?" ఎంతో ఆసక్తిని కనబరుస్తూ అడిగాడు వివేక్.

    "ఏమీ చేయలేదు. డబ్బు పిల్లలు పెడుతుందంటారు. నా విషయంలో నేను నిక్షిప్తం చేసిన డబ్బలాగే వుందివుంటుంది. కానీ నాలోని జబ్బు పిల్లలు పెడుతోంది. నన్ను మృత్యువువైపు నెట్టి వేస్తోంది. మృత్యువు మన నీడ అని యింతకాలం నమ్మాను. కాదు....మనమే మృత్యువని యిప్పుడనిపిస్తోంది.

    నాకు డబ్బున్నా మృత్యువుతో బేరాలాడలేను. ఆరోగ్యాన్ని కొనలేను. నాదొక నిస్సహాయమైన స్థితి! ఎంతోకాలం నా ఆకృత్యాలకు సహాయపడి, నన్ను గెలిపిస్తూ వచ్చిన నా అలసిన వృద్ధశరీరం యిప్పుడు బలహీనమయి, బలిష్ఠమైన మృత్యువుతో పోరాడుతోంది. కానీ నేను మాత్రం తీరని పగతో, జరిగిన ద్రోహంతో, మోసంతో పోరాడాలనుకుంటున్నాను.

    నాకు డబ్బుంది. అంగబలం వుంది. పలుకుబడి వుంది. చట్టం త్వరలోనే వదిలేసే అద్భుతమైన అవకాశముంది. కానీ మృత్యువు వాటికన్నా ముందు నిలిచి వుంది.

    నీకు డబ్బులేదు. అంగబలం లేదు. పలుకుబడి అంతకన్నా లేదు. కానీ జైలునుంచి తప్పించుకోగలిగితే ఎంతో జీవితం వుంది. దాన్ని రసమయం చేయగల ఆరోగ్యమైన శరీరం వుంది. వాటికి ముందు ఉరి రూపములో మృత్యువు నీవైపు కూడా తొంగిచూస్తోంది...." నిర్లిప్తంగా అంటూ నిట్టూర్చాడు రామదాసు.

    "ఇంతకీ ఆ డబ్బునేం చేశారు? మీకెవరూ లేరా?"

    "డబ్బుని ఓ లక్ష్యంకోసం దాచాను. నా అన్నవాళ్ళను చాతగాక దూరం చేసుకున్నాను గనుకే పగతో అలమటించిపోతున్నాను. ఆ పగని తీర్చుకొనేందుకే ఆ డబ్బుని దాచాను."

    "ఆరోగ్యాన్ని కొనలేని డబ్బు పగనేలా తీరుస్తుంది?"

    "శెభాష్....దారిలోకొస్తున్నావ్" అని స్వగతంలో అనుకొని-

    "ఈ ప్రపంచంలో డబ్బు మాలిమి చేసుకోలేనిదీ, మచ్చిక చేసుకోలేనిదీ మృత్యువు నొక్కదాన్నే! సరైన పద్ధతిలో డబ్బుని ఉపయోగిస్తే పగ, ప్రతీకారాల్నే కాదు- దేన్నయినా తీరుస్తుంది. దానికంత శక్తి వుంది. దానికంత శక్తి వుంది గనుకే యీ జైల్లో నాకింత గౌరవం....అఫ్ కోర్స్! ఇట్ మేబీ ఏన్ ఆర్టిఫిషియల్ రెస్పెక్ట్....ఏదైతేనేం....ముగియబోతున్న నా జీవితాన్ని నీ జీవితానికి అడ్డేసి యీ జైలునుంచి నిన్ను తప్పిస్తాను.... ముందు నీ పగ తీర్చుకునే- ఆపైన నా పగని చల్లార్చుతావా?    

    వెంటనే 'నో' అనకు! అది ఇంగ్లీసోడి డిప్లమసీ ఆలోచించి 'ఎస్' అను. లేదంటే 'బట్' తో మొదలెట్టు.....ఇక పడుకో. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం" అని వివేక్ కి 'నో' అనే అవకాశం యివ్వకుండా వుండేందుకే చాపమీద వాలిపోయాడు చటుక్కున.

    వివేక్ కూడా పడుకోబోతూ ఒక్కక్షణం ఆగాడు.

    "మీ ప్రపోజల్ కి మీరన్నట్లుగానే వెంటనే 'నో' అనను. మీరు చెప్పేదీ, మా అమ్మ చెప్పేదీ ఒక్కటే! కానీ అది తప్పని, చట్టవిరుద్దమని నాకు తెలుసు. అందుకే వెంటనే 'ఎస్' అనికూడా అనలేను. బంగారం లాంటి నా జీవితం ఎందుకిలా జైలుపాలయిందనే బాధ, ఉద్రోషం, కసి, కోపం, నిస్సహాయతా నన్నూ వెంటాడుతున్నాయి. అయినా వాటి సంగతి తరువాత....! ఒక్క సందేహం తీర్చి పడుకోండి. ప్లీజ్...." అన్నాడు వివేక్.

    127 సెల్ లో అటుతిరిగి పడుకున్న రామదాసు అన్నీ విన్నాడు. ఫర్వాలేదు....దారిలోకొస్తున్నాడు. అని స్వగతంలో అనుకొని "ఏమిటా సందేహం?" అనడిగాడు రామదాసు.

    "మీరెప్పటినుంచో జైల్లో వుంటున్నారు. మరికొద్ది రోజుల్లో శిక్ష పూర్తయి బయటకు కూడా వెళ్ళబోతున్నారు. మీరు దాచుకున్న యాభై లక్షలమీద యిప్పుడు హఠాత్తుగా కన్నేసి, జైల్లోకి రౌడీల్ని పంపే అవసరం ఏమొచ్చింది? అంతకుముందే ఆ పని చేయవచ్చుగా? లేదంటే జైల్ నుంచి విడుదలై బయటకు వెళ్ళాక ఆ పని చేయవచ్చుకదా?"

    వివేక్ వెలిబుచ్చిన సందేహానికి చటుక్కున లేచి కూర్చున్నాడు రామదాసు.
    "నా డబ్బుని చేజిక్కించుకోడానికి, నేను ఏ క్షణాన పోతానో డాక్టర్సే చెప్పలేకపోయారు. నేను పోతే ఆ యాభై లక్షలూ శాశ్వతంగా సమాధయిపోతాయి. నాకుతప్ప అవెక్కడున్నదీ మరెవరికీ తెలీదు.

    నేను అనారోగ్యంతో చచ్చేలోపు నా నోటినుంచి ఆ నిధి రహస్యాన్ని కక్కించాలని వాళ్ళ ప్రస్తుత ప్రయత్నం! ఇంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళు ప్రయత్నించారు. నేనా డబ్బుని ఎక్కడ నిక్షిప్తం చేసుకున్నదీ తెలుసుకునేందుకు. నేను వీలుపడనివ్వలేదు. ఇంకిప్పుడు జైలు నుంచి నేను విడుదలయ్యేదాకా బ్రతుకుతానో లేదో తెలీదు.

    ఎప్పటినుంచో నా మీద కన్నేసి వుంచిన వారికి నా అనారోగ్యం విషయము తెలీడం పెద్ద కష్టం కాదు. తెలుసుకొని వుంటారు. నా దీపం ఆరిపోకముందే వాళ్ళ ఇళ్ళు చక్కబెట్టుకుందామని...."

    "ఇంతకీ ఆ డబ్బుని ఎందుకోసం దాచిపెట్టారు?"

    "నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి, నా జీవితాన్ని జైలుపాలు చేసిన జస్వంతరావుని హతమార్చేందుకు."

    "ఒక వ్యక్తిని చంపడానికి అంత డబ్బు అవసరమా? అందునా రౌడీయిజం- గూండాయిజంలో ఆరితేరిన మీలాంటి తెలివైనవారికి?!!"

    "అఫ్ కోర్స్.... బట్ నా శత్రువు అధికారంలో వున్నాడు. అపరిమితమైన భద్రతల మధ్య మసలుతున్నాడు. అలాంటి వి.వి.ఐ.పి.ని అసాసినేట్ చేయాలంటే చాలా ఖర్చవుతుంది. ఇటీవల బొంబాయిని ధ్వంసం చేసేందుకు ముస్తార్ టైగర్ మెమూన్ బృందం కొన్ని కోట్లు ఖర్చుపెట్టిందట- ఎందుకో తెలుసా? ఎక్స్ ప్లోజివ్స్ కి, టాక్సీలకు, స్కూటర్స్ కి....ఆపైన హెంట్ మెన్ కోసం.... ఇప్పుడు హత్యలు, విధ్వంసాలు- అసాసినేషన్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవే.

    నిజానికి నాకున్న యాభైలో ఓ పాతిక జైలు సిబ్బందికి పడేస్తే, సత్ ప్రవర్తన అని నా ఫైలు మీద రాసేసి ఏ ఆగస్టు 15 నాడో, జనవరి 26నాడో నేను విడుదలయ్యేలా చూసేవారేమో.... అలా విడుదలయి ఏం చేయగలను? పైగా ఈ అంగవైకల్యంతో, అనారోగ్యంతో.

    నాకు బయట రౌడీబలం వుంది. కానీ వారి వలన నా పగ నెరవేరదు.

    వాళ్ళెంత నా శిష్యులయినా- వారికి జస్వంతరావు మీద వ్యక్తిగతమైన పగలేదు. ప్రయత్నం చేసినా నా దగ్గరున్న డబ్బు కొరకే చేస్తారు. సంధించిన అస్త్రంలా దూసుకుపోరు. పైగా వారికి ఏకాగ్రత తక్కువ.... వ్యసనాలు ఎక్కువ. సంధించి స్కడ్ మిస్సైల్ లాంటి మనిషి నాకు కావాలి. అతని ద్వారానే నా కోరిక నెరవేరుతుంది. నేను సంధించే మారణాస్త్రం తన పనిని నెరవేర్చే సందర్భంలో, నాకు మిగిలి వున్న రౌడీలు ఏ కొద్దిపాటి సహాయమో చేయగలరు తప్ప, జస్వంతరావులాంటి హైలీ సెక్యూర్డ్ పర్సనాలిటీని ఏం చేయలేరు" అన్నాడు రామదాసు నిస్పృహగా.    

 Previous Page Next Page