Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 12


    "అది మీకు శుభవార్తా?"
    "అవునండీ! దాని సంగతి నాకు తెలీదు. అన్నీ మూఢనమ్మకాలు! వంటిమీదకు దేముడు రావటం తనకు ఎవరో చేతబడి చేశారని, ఎదురు చేతబడి చేయాలని ఆనటం కాళిని పూనించటం మంత్రాలు, విభూతి నాకు నిజంగా వాళ్ళింటికెళ్ళాలన్నా, ఆ అమ్మాయితో మాట్లాడాలన్నా కూడా ఎలర్జీ..."
    "అమ్మాయి చదువుకోలేదా?"
    "సగం చదువుకోమట్టేనండి ఈ చావు! మన తెలుగు నవలలు, సినిమాలు అంటే పంచప్రాణాలు. అందుకే అలా తయారయింది...మొన్నీ మధ్య వాళ్ళింట్లోకి ఓ పామొస్తే దేవుడని దాన్ని కొట్టకుండా అందరూ సాష్టాంగపడి దండంపెట్టారుట! అది మా మామయ్య చేతిమీద కాటేసింది. అతి కష్టంమీద బ్రతికాడు మామయ్య__"
    బేరర్ వచ్చాడు.
    "చెప్పండి! ఏం తీసుకుంటారు? ఒక స్వీటూ, ఒక హాటూ మాత్రం కంపల్సరీ__తర్వాత మీ ఇష్టం."
    "నాకు ఫలహారం అలవాటులేదు."
    "నాకూ లేదండీ! కానీ ఇవాళమాత్రం తప్పదు..."
    "సరే అయితే మీరే ఆర్డర్ చేయండి..." అతను ఆర్డర్ చేశాడు.
    ఇద్దరికీ ఫలహారం తెచ్చిపెట్టాడు బేరర్. సావిత్రి అమ్మాయి గురించి ఆలోచిస్తోంది.
    "మన ప్రభుత్వం, మన మీడియా, మన సాహిత్యం అన్నీ అలాగే ఉన్నాయ్. ప్రజలను వెనక్కు తీసికెళ్ళే ప్రయత్నాలే అన్నీనూ" అందామె.
    అతను సావిత్రి మాటలు విని ఆశ్చర్యపోయాడు.
    "మీరు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తారనుకుంటాను నాలాగే_"
    "అవును టి.వి. రేడియో చూడండి! ఎంతసేపూ మతాలూ, పండగలూ, జాతరలూ అన్నీ ఫోకస్ చేస్తుంటారు...అలాగే న్యూస్ పేపర్లు కూడా! ఈమధ్య ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఎంత దారుణమయిన న్యూస్ అయిటమ్ వచ్చిందంటే పుటవర్తి సాయిబాబా మానవాతీతమయిన శక్తుల ద్వారా ఓ హాస్పిటల్ తాలూకూ ఆపరేషన్ థియేటర్ లో ప్రత్యక్షమయి ఆపరేషన్ అవబోతున్న తన భక్తుడికి ధైర్యం చెప్పాడుట! ఇంత మూర్ఖత్వం ఇంకే దేశంలో కనపడుతుంది మనకీ?"
    అతను ఆనందంతో పొంగిపోయాడు.
    "అయామ్ హ్యాపీ సావిత్రిగారూ! ఆడాళ్ళల్లో ఈ మాత్రం అబ్జర్వేషన్ ఉన్నవాళ్ళను ఇంతవరకూ కలుసుకోలేదు. అసలీమాత్రం నాలెడ్జి ఉన్నవాళ్ళు ఉంటారని కూడా అనుకోలేదు"
    సావిత్రి నవ్వేసింది.
    ఇద్దరూ కాఫీ తాగారు. బస్ స్టాప్ కి వచ్చేవరకూ అతను మాట్లాడుతూనే ఉన్నాడు.
    "పాముల మంత్రాలు ఎంత బోగస్ వ్యవహారమో చూడండి. చాలా పాములు హానికరం కావు. అంచేత అవి కరచినా ఏమీకాదు...ఇదే అదనుగా తీసుకొని ఈ మంత్రాల మోసగాళ్ళు పెరిగిపోయారు. పాము కరవటం, ఎక్కడినుంచో ఫోన్ లో మంత్రగాడు "పాము కరవలేదు... పాము కరవలేదు__ పాము కరవలేదు అని చెప్పమనటం, ఆ ముక్క వాడి చెవిలో చెప్పగానే కరచిన వ్యక్తి లేచి కూర్చోవటం__ ఇంత బ్లయిండ్ గా ఎలా నమ్ముతారు? ఎలా నమ్మిస్తారు?"
    సావిత్రికి చాలా ఆసక్తి కలుగుతోంది అతని మాటలు వింటుంటే.
    "మీరు ఇంటికేనండీ?" అడిగాడతను.
    "అవును"
    "అయితే ఆటోలో వెళదాం పదండి! బస్ కోసం నిలబడితే అరగంట టైమ్ వేస్టు"
    "ఎందుకండీ__బస్ లో వెళ్ళవచ్చుగా_"
    "ఒక్కరయితే ఆటో వేస్టనుకోండి! ఇద్దరున్నప్పుడు" అంటూ ఆటో పిలిచాడతను.
    సావిత్రి ఇంక అభ్యంతరం చెప్పలేకపోయింది. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది.
    తామిద్దరూ అంత త్వరగా అంత క్లోజ్ గా మూవ్ అవటం!
    ఆ రాత్రి చాలాసేపు అతనిగురించే ఆలోచిస్తూండిపోయింది సావిత్రి. అతనికి వివాహం కాలేదు...చాలావరకూ ఇద్దరి ఆలోచనా విధానం ఒకటిగా వుంది...అతని రూపం తనకు నచ్చింది...అతనినే తను జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటే? తను ఎన్నుకోవటం సంగతి సరే_మరి అతని సంగతేమిటి? అతనుకూడా తనను అదేవిధంగా కోరుకుంటున్నాడా? అతని మనసులో అసలా అభిప్రాయం ఉందా?
    మర్నాడు తను ఆఫీస్ కి బయలుదేరేసరికి అతను వెనుకనుంచి వచ్చి కల్సుకున్నాడు.
    "గుడ్ మార్నింగ్" అన్నాడు చిరునవ్వుతో.
    "గుడ్ మార్నింగ్__"
    "నేను మీతో రావటం మీకేమీ అభ్యంతరం లేదుకదా?"
    "అభ్యంతరం ఎందుకు?" నడుస్తూనే అడిగిందామె.
    "అదేనండీ__ఇలా మీప్రక్కనే మాట్లాడుతూ నడవటం..."
    "అందులో తప్పేముంది?"
    "కొంతమంది దారుణమండీ! మా ఆఫీస్ లో పనిచేసే అమ్మాయిని ఓసారి బయట కనబడితే పలకరించాను... దాంతో ఆమె చాలా సీరియస్ అయిపోయింది. తనెప్పుడూ ఎవరితోనూ మాట్లాడదట! నిజమేగావాలనుకున్నాను. తరువాత ఓ హీరోతో స్కూటర్ మీద వెళుతూ కనిపించింది. అంతకంటే ఘోరం ఏమిటంటే ఆమె ఫైల్స్ మధ్యలో మన తెలుగు వారపత్రికలు కనిపించాయి."

 Previous Page Next Page