Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 12


    అసలే బొంగురు గొంతు కంఠం తగ్గించి మాట్లాడటంతో మరింత బొంగురుగా అంతులేనన్ని అపస్వరాలతో పలికింది.
    రవికి రగిలిపోతున్నా సహనం తెచ్చిపెట్టుకున్నాడు. పళ్ళు బిగించి విష్ణువర్ధన్ వైపు చూశాడు. విష్ణు ముఖం కూడా జేవురించింది.
    "శివయ్యగారూ! మమ్మల్ని ఎవరనుకుంటున్నారూ! నేను కోటీశ్వరుణ్ణి. ప్రాచీన సంస్కృతి అంటే నాకుండే అభిమానంతో రవికి ఆర్థికంగా సహాయం చేస్తున్నానే కాని, ఇక్కడి శిల్పాలని స్మగుల్ చేసి డబ్బు సంపాదించుకుందామని కాదు. రవి కూడా పూర్తి అకడమిక్ ఇంట్రెస్ట్ తోనే పని చేస్తున్నాడు. కొంపతీసి మీ రవ్వలన్నీ ఇలా స్మగుల్ చేసి సంపాదించినవేనా ఏమిటి?"
    అంతటి చికాకులోనూ రవికి నవ్వొచ్చింది. విష్ణులో ఈ భూతయ్య ఎప్పటికప్పుడు తొంగిచూస్తూనే ఉంటాడు.
    రవికి ఏదో ఆలోచన స్ఫురించింది. శివయ్యతో వ్యవహారానికి దిగుతున్నవాడిలా ఫోజుపెట్టి "అయితే శివయ్యగారూ ఇదివరకు ఇక్కడికెవరైనా తవ్వకాల కొచ్చారా? వాళ్లకి మీరు శిల్పాలు అమ్మించి పెట్టారా? అంతా సేఫ్ గా జరుగుతుందా?" అన్నాడు.
    విష్ణు తెల్లబోతూ "రవీ" అన్నాడు కోపంగా.
    "మీరుండండి సార్! ఈ విషయం నాకొదిలెయ్యండి. ఎలాగయినా మన డబ్బు మనకి రావటం ప్రధానం శివయ్యగారయితేనేం! మరొకరయితేనేం? చెప్పండి శివయ్యగారూ!"
    రవి మాటలతో శివయ్యకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. గమ్మత్తుగా నవ్వాడు. లోకంలో కుత్సితాలన్నీ మురికి మేలి ముసుగు వేసుకున్నట్లుగా ఉంది ఆ నవ్వు.
    "లోగడ రెండు మూడు పార్టీలోళ్ళకి నా సాధ్యమయినంత సాయపడ్డానండి. వాళ్ళ పేర్లు మీక్కూడా తెలవనివ్వను. రహస్యం అంటే అంత రహస్యమే మరి! నాతో యవ్వారమంటే అంతా పకడ్బందీగా నడుస్తుంది."
    విష్ణు ముఖం వెలవెలపోయింది. రవిని పక్కకి పిలిచి నెమ్మదిగా అన్నాడు.
    "మనకంటే ముందుగా రెండు మూడు పార్టీలు యెక్స్ లేషన్స్ జరిపిస్తే ఇక్కడి శిల్పాలూ వగైరాలన్నీ వాళ్ళే పట్టుకుపోయారేమో! మనం ఇంత ప్రయాసపడినా ప్రయోజనం ఉండదేమో"
    రవి విసుక్కున్నాడు "అయ్యా! భూతయ్యగారు తమరు కొద్దిసేపు ఊరుకోండి. ఈ వ్యవహారం నేను చూసుకుంటాను. శివయ్యలాంటి వాళ్ళు మాకు చాలాసార్లు తారసపడుతుంటారు. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కానీ, అనవసరంగా ముందే పోట్లాట పెట్టుకోకూడదు."
    రవి, విష్ణులు తమలో తాము మాట్లాడుకుంటూంటే, ఇలాంటి సంప్రదింపులు తమకు అలవాటేనన్నట్టు దూరంగా చుట్టూ, గ్రద్ద చూపులతో చూస్తూ నిలబడి వున్నాడు శివయ్య.
    "సరే శివయ్యగారూ! మాకూ ఏవైనా ప్రాచీన కళాఖండాలు దొరికితే మీకు కబురు చేస్తాం! ఇప్పటివరకు మేం గుహ లోపలికి పూర్తిగా వెళ్ళలేకపోయాం! బయట తవ్వకాల్లో కుండ పెంకుల్లో అస్థిపంజరాలు తప్ప ఏమీ దొరకలేదు. శాతవాహన కాలం నాటివి అనిపించే కొన్ని పూసలు దొరికాయి. ఇంకా కాలం విషయంలో మేమే ఒక నిశ్చయమైన నిర్ధారణకి రాలేదు."
    "చిత్తం" అన్నాడు శివయ్య చేతులు నలుపుకుంటూ...
    అతడి చిత్తంలోని కపటానికంతకూ ప్రతిరూపంలా ఉంటుంది. ఆ మాట అతని నోట.
    "తమరికి మరోమాట కూడా సెలవియ్యాల..."
    "చెప్పండి"
    "సిరిమిట్టోళ్ళూ, లచ్చింబోడోళ్ళూ పైకి ఎంత సాధువుల్లా అగపడతారో, సమయం వచ్చిందంటే అంతకంత కంటే కసాయోళ్ళు. ఎంత సిన్ని యిసయానికైనా తేలిగ్గా పీకలు తెగ్గోసేసుకుంటారు. ఆళ్ళ మధ్యలో మీరు యిరుక్కున్నట్టయినా జోగులాంబయినా మిమ్మల్ని కాపాడలేదు. ఈళ్ళలో ఒకరి మేక వెళ్ళి ఆళ్ళ చెత్త మేసిందనే యిసం మీద సులుగ్గా పాతిక పీకలు తెగిపోతయ్"
    "అవును, ఇలాంటి కొట్లాటలు ఇంచుమించు అన్ని పల్లెటూళ్ళలోనూ ఉంటాయి."
    "కానీయండి. ఈ రెండూళ్ళోలకీ నా మాటంటే మాత్రం గురి. అందరికీ కష్టంలో సుఖంలో సాయపడతా వుంటాను గదండీ" నవ్వాడు శివయ్య.
    ఆ నవ్వు ఎంతో వెగటుగా తోచింది రవికి. ఎందుకంటే శివయ్య ఆ రెండు గ్రామాల ప్రజలకీ చేసే సాయం ఎలాంటిదో అతనికి తెలుసు.
    "సరేలెండి వెళ్ళిరండి" అతడిని విరగడ చేసుకోవాలనే తొందర రవిలో.
    "చిత్తం చిత్తం" చేతులు నులుపుకుంటూ తన కుత్సితపు నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.
    డేరాల వరకూ విష్ణుతో వెళ్ళిన రవి, అతనితో కలిసి లోపలికి వెళ్ళలేదు "ఇప్పుడే వస్తాను" అని చప్పున వెనుదిరిగాడు.
    దూరంగా శివయ్య వాచ్ మెన్ తో ఏదో మాట్లాడుతున్నాడు. ఒక కాగడా వెలిగించి చేత్తో పట్టుకుని బయలుదేరాడు. చీకటి పడ్డాక అడవులలో తిరిగేవాళ్ళందరూ చేతిలో కాగడా పట్టుకునే తిరుగుతారు. ఆ మంట వెలుగుకి భయపడి జంతువులు దూరంగా పారిపోతాయి!
    ఎందుకో అతడిని అనుసరించాలని అనిపించింది రవికి. తన చేతిలో కాగడా లేదు. కానీ ఎప్పుడూ షర్ట్ లోపలి జేబులో పెన్ సైజులో ఉన్న టార్చి వుంటుంది. అది ఇంపోర్టెడ్ ది. సైజు చిన్నదయినా బేటరీ పవర్ ఫుల్ గా వుంటుంది.
    ఆ లైట్ ముఖం మీదకి ఫోకస్ చేస్తే ఎలాంటి క్రూర జంతువయినా ఒక్కడుగు ముందుకు వెయ్యలేదు. అదీగాక 32 బేరల్ రివాల్వర్ వుంది. ఈ రెండింటి సాయంతో అతడు ఇదివరలో చాలా అరణ్య ప్రాంతాలలో తిరిగాడు.
    లైట్ వెనక్కి తిప్పితే తప్ప శివయ్యకి తను కనపడడు. అలా చేస్తే ప్రమాదం కనుక శివయ్య అలా చెయ్యకపోవచ్చు. అతడికి ఫర్లాంగు దూరంలో తన టార్చిలైట్ ఉపయోగించకుండా నడవసాగాడు రవి.
    కొంచెం దూరం సాగాక శివయ్య ఆగాడు. రవి కూడా ఆగాడు. కాలి బాటకి పక్కనే ఉన్న ఒక పొద వెనక కూర్చున్నాడు శివయ్య. చేతిలో వున్న కాగడా వెలుతురులో పరిసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
    పక్కనే ఏదో జరజర పాకినట్లయింది. పురుగు కావచ్చు పాము కావచ్చు కదలకపోతే అవి ఏమీ చెయ్యవు. బహుశా అంతకుముందే అక్కడ ఉన్న జంతువు తను కూర్చున్న అలికిడికి పారిపోతూ ఉండొచ్చు.
    శివయ్య అలాగే నిలబడివున్నాడు కొన్ని నిముషాలు. అప్పుడు మరోవ్యక్తి వచ్చి అతడిని కలుసుకున్నాడు. ముఖాలు అటు తిరిగి ఉండటం వల్ల ఎవరైనది రవికి కనపడుటలేదు. ఇద్దరు కొన్ని నిముషాలు అతి మెల్లిగా గుసగుసలాడుకున్నారు.
    రవికి ఏమీ వినిపించలేదు. రెండో మనిషి శివయ్య చేతిలో కాగడా మంటసాయంతో తనూ ఒక కాగడా వెలిగించుకుని ఇటు తిరిగాడు. అప్పుడు చూశాడు రవి అతని ముఖం ఒక్క క్షణం. రవికి ఊపిరి ఆగిపోయినట్లయింది. అతడు డ్రాఫ్ట్స్ మన్ ప్రకాశం చేతిలో వెలుగుతున్న కాగడా పట్టుకుని చకచక తన డేరా వైపు వెళ్ళిపోతున్నాడు.
    శివయ్య, ప్రకాశం ఇద్దరూ చెరోవైపుకి సాగిపోయాక అప్పుడు పొద చాటునుంచి బయటికి వచ్చాడు రవి.
    పకాశం ఇక్కడికెందుకొచ్చాడు? శివయ్యతో అతడికేం పని? తనకు కనపడకుండా ఎలా రాగలిగాడు?
    అప్పుడు స్ఫురించింది. సితార్ వాయిద్యం అయిపోగానే ప్రకాశం తన డేరాలలోకి వెళ్ళిపోయాడని. బహుశా అతని డేరా నుండి ఇక్కడికి రావటానికి మరోదారి ఉండి వుండాలి. ఈ అడవి నిండా గజిబిజిగా వున్న కాలిబాటలే.
    ఆ దారి ప్రకాశానికి తెలుసుంటే, అతడికి ఈ ప్రదేశంతో ఇంతకు ముందునుంచీ పరిచయం వుండాలి. శివయ్య కూడా అతడికి పూర్వ పరిచితుడే అయి వుండాలి. ఈ ఊహలు రైటయితే, ప్రకాశం శివయ్యతో ఏం మాట్లాడి ఉంటాడో ఊహించటం కష్టం కాదు.
    వెనక అడుగుల చప్పుడు వినిపించింది. రివ్వున వెనక్కి తిరిగి టార్చిలైట్ ఫోకస్ చేశాడు. అతడి కళ్ళు చెదిరాయి. కాశ్మీర్ సుందరుల పసిమి ఛాయ, లాలిత్యం, కర్ణాట సుందరుల విజ్ఞాన స్ఫూర్తి, ఆంధ్ర సుందరుల అంగసౌష్ఠవం కలబోసుకుని, అందాలన్నీ ఆకారం దాల్చినట్లు కళ్ళెదుట నిలిచివుంది ఒక నవయవ్వని.
    కట్టుకున్నవి అతి పల్చని కాషాయవస్త్రాలు. రంగు కాషాయమైనా అవి ఖరీదైనవి. అందుచేత అందంగా వున్నాయి. జాకెట్ లేదు. బ్రాలాగా వల్కలం లాంటిది కట్టుకుంది. ఉంగరాలు తిరిగిన వెంట్రుకలు నడినెత్తిమీదకి ముడిగా చుట్టుకుంది. పచ్చని నుదుట మీద ఉంగరాలు తిరిగి ముంగురులు అల్లరి చేస్తున్నాయి అందంగా.

 Previous Page Next Page