Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 12


    రాత్రివేళ నిద్రలో కూడా ఆ సంగీతం ఇళ మనసును తడుతూనే ఉంటుంది. మనసులో అల్లకల్లోలంగా ఉన్న స్వర తరంగాలను వెతుక్కుంటూ కలల్లో నడిచిపోతుంది మనసు. సన్నని కాలి బాటలు, అపరిచిత ప్రదేశాలు! చిక్కడి అడవులు! నిలువెత్తు కొండలు. అడవుల మధ్య దారి తప్పిపోతుంది. మనసు లేచి కూచుంటుంది ఇళ! కాళ్ళు కడుక్కుని దుర్గని ధ్యానం చేసుకుని మళ్ళీ పడుకుంటుంది. ఇలాంటి రాత్రులు రాను రాను ఎక్కువవుతున్నాయి.


                                                 *    *    *    *


    ఇళకి పెళ్ళి సంబంధాలు తీసుకొచ్చాడు యోగనాథశాస్త్రి. పెళ్ళి కొడుకుని చూసి అచ్యుతమ్మ నీరసపడిపోతూ "ఛీ! మరీ వికారంగా ఉన్నాడు" అనేసింది.
    "దున్నపోతులా" అని మనసులో అనుకుంది. పైకి అనలేదు.
    "నీ ముఖం మాడ్చ! ఇలాంటి వెధవ్వాగుడు వాగావంటే నేపోయి సన్నాసుల్లో కలుస్తాను. నీ కూతురికి రూపంలో మన్మథుడు, డబ్బులో కుబేరుడూ, బుద్ధిలో బృహస్పతీ రావాలంటే ఈ పురోహిత బ్రాహ్మణుడు ఎక్కడ తేగలడే!"
    ఆయన కంఠంలోనూ కోపం కంటే బాధే ఎక్కువగా ఉంది. మళ్ళీ మాట్లాడలేదు అచ్యుతమ్మ. ఆవిడకి చేతనయింది ఒక్కటే, తన తల తను కొట్టుకోవటం! "కర్మ!" అని తల కొట్టుకుంది.
    ఈ సంభాషణ అంతా ఇళకి వినిపిస్తూనే ఉంది. వినిపించకుండా ఉండేటంత పెద్ద ఇల్లు కాదది! 'తల్లీ దుర్గాదేవీ! నా కారణంగా మా అమ్మకీ నాన్నకీ ఎవరికీ కష్టం రాకూడదు. పెళ్ళి కొడుకు ఎలా ఉన్నా నేను మనసారా అతడిని ప్రేమించాలి. సీత, అనసూయ, సావిత్రి మొదలైన వాళ్ళలా మహా పతివ్రతనై పోవాలి." మనసులో దుర్గని ధ్యానం చేసుకుంటూ కూచుంది ఇళ.
    పెళ్ళివారు పెళ్ళికూతుర్ని తీసుకురమ్మన్నారు. బంగారు బొమ్మలా ఉన్న ఇళని చెయ్యి పట్టుకుని పెళ్ళికొడుకు ముందుకు తీసుకొస్తోంటే ఆపుకోలేని ఉక్రోషం వచ్చేసింది అచ్యుతమ్మలో. పెళ్ళికొడుకునీ అతడి తండ్రినీ, అతడి చుట్టాలనీ, ఈ ఆచారాలని, ఏర్పాటు చేసిన కనపడని సమాజాన్ని, అందర్నీ చింతబరికె పుచ్చుకుని చావబాదాలనిపించింది. ఏమీ చేయలేక తల కొట్టుకోబోయి అంతలో నిగ్రహించుకుంది.
    "నీ పేరేమిటి?" అడిగాడు పెళ్ళికొడుకు. దున్నపోతు అరచినట్లుగా ఉంది ఆ స్వరం.
    సమాధానం చెప్పడానికి తలెత్తింది ఇళ. నల్లగా లావుగా పెద్ద బొజ్జతో పెళ్ళికొడుకు యముడిలా కనిపించాడు ఇళకి!
    "ఎలా ఉన్నాసరే! తాను సావిత్రిలా... యముడు సావిత్రి...సావిత్రి యముణ్ణి పెళ్ళిచేసుకోలేదు. ప్రేమించిన సత్యవంతుణ్ణి పెళ్ళి చేసుకుని అతడి కోసం యముడితో పోట్లాడింది. తను యముణ్ణి పెళ్ళి చేసుకుంటుంది యముడు...పాశాలు...యమపాశాలు...శరీరాన్ని చుట్టి లాగుతున్నాయి. ఎక్కడికో లాక్కుపోతున్నాయి. మనసు ఏవో సుడిగుండాలలో చిక్కులు పడిపోతోంది. గుండె ఎవరో చేత్తో పట్టుకుని నొక్కినట్లయింది. విరుచుకుపడిపోయింది ఇళ.


                                                    *    *    *    *


    ఇళ కళ్ళు తెరిచేసరికి మొట్టమొదట కన్నీళ్ళతో శోకమూర్తిలా ఉన్న తల్లి కనిపించింది. "అమ్మా" అంది. అన్నాననుకొంది. కానీ గొంతుదాటి మాటలు బయటికి రాలేదు. చుట్టుపక్కల చాలామంది ఆడవాళ్ళున్నారు. ఏవేవో గొంతులు వినిపిస్తున్నాయి.
    "నేను మొదటినుంచీ చెప్తూనే ఉన్నాను. ఇళ అందరు ఆడపిల్లల్లాంటిది కాదు. దానిలో దేవతాంశ ఉంది."
    "ఇకముందు పెళ్ళిమాటలు తలపెట్టం అని దుర్గకి మొక్కుకోండి! ఇళ లేచి కూచోకపోతే నా పేరు అలమేలు మీనాక్షి కోటేశ్వరమ్మ కాదు." అది చేతబడి అత్తగారి గొంతు.
    "బాగుంది. పెళ్ళిచేయకుండా వయసొచ్చిన ఆడపిల్లని ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటారు. ఇప్పుడంటే అమ్మ అయ్యా ఉన్నారు. తర్వాత ఈ పిల్ల గతేమవుతుంది? ఏదైనా గాలి సోకిందేమో పూజ చేయించి కాస్త విబూది పెట్టించండి."
    ఆదిలక్ష్మమ్మ సలహా!
    "నమ్ముతారో లేదోకాని మొన్ననే నాకు ఇళ విరుచుకు పడిపోయినట్టు పీడకలొచ్చింది. "ఛ! ఇళేమిటి విరుచుకు పడటమేమిటి!" అనుకున్నాను. చివరికి నాకలే నిజమయింది." పీడకలల పిన్నమ్మగారు సంబరంగా అంది.
    ఇంకా ఏవేవో గొంతులు గోలగా వినిపిస్తున్నాయి. ఏదో చెప్పాలని అనిపించింది. గుర్తు రావటంలేదు. ఏమిటది? ఏమిటది? ఆ! గుర్తొచ్చింది. అమ్మ ఏడుస్తోంది. వెంటనే చెప్పాలి.
    "అమ్మా నేను...యముణ్ణి పెళ్ళి చేసుకుంటాను."
    అతి ప్రయత్నం మీద హీనస్వరంతో అంది.
    అచ్యుతమ్మ కూతురి నోరుమూసి "అలా అనకే!" అంది ఏడుస్తూ.
    "మీకెవరికీ బుద్ధిలేదు! ఇళని ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి!"
    దురుసుగా తీక్షణంగా వినిపించింది ఒక గొంతు! అది చిచ్చు గొంతు. చిచ్చు వచ్చేశాడు. అయితే యముడితో పెళ్ళి జరగనివ్వడా? ఏం జరుగుతుంది మరి? మనసులోకి ఆలోచనలు ఒక క్రమంలో రావటం లేదు. ఏదో అగాధంలోకి జారిపోతున్న భావన. కళ్ళు మూసుకుపోయాయి.


                                                   *    *    *    *


    కొడుక్కి ఎప్పుడు ఉత్తరం రాసినా ఊళ్ళో విశేషాలన్నింటితో రాస్తుంది వర్ధని. అంతకంటే ఎలా రాయాలో పాపం ఆవిడకి తెలియదు. అలాగే ఇళకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారనీ, ఫలాన రోజు మొగపెళ్ళివారు వస్తున్నారనీ రాసింది. పల్లెటూర్లో ఇలాంటి విషయాలు ఊరందరికీ తెలుస్తాయి. అందులోనూ దైవభక్తి గల వర్థనమ్మ రోజూ యోగనాథశాస్త్రి కింటికి వెళ్ళి వస్తూనే ఉంది. తల్లి ఉత్తరం అందిన వెంటనే తిరుగుటపాలో ప్రమధపురికి వచ్చేశాడు చిచ్చు. తల్లి, తండ్రి ఇద్దరూ ఇంట్లో లేరు. స్కూల్ లో ఉన్నారు. పక్కింటివాళ్ళ పాప తొమ్మిదేళ్ళ తులసి తలుపు సందులోంచి చూచి, "చిచ్చు అన్నయ్య" అంది.
    "ఏయ్ పిడుగూ! మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది?"
    "అచ్యుతమ్మత్తయ్య ఇంటికి! ఇళ వదిన పడిపోయిందిగా! అందుకు" పెద్ద ఆరిందలా చెప్పింది.
    "ఇళ పడిపోయిందా! ఎక్కడ, దేనికి!"
    "వాళ్ళింట్లోనే! పెళ్ళి చేస్తున్నారుగా, అందుకు" అని చిచ్చు దగ్గరగా వచ్చి రహస్యంగా అంది. "చిచ్చన్నయ్యా! పెళ్ళికొడుకు ఏం బావుండడు."
    ఆ పిల్ల నెత్తిమీద చిన్నగా ఒకటి మొట్టి వెన్నె యోగనాథశాస్త్రి ఇంటికి పరుగుతీశాడు చిచ్చు. అతడక్కడ అడుగు పెట్టేవరకూ ఎవరికీ డాక్టర్ కి చూపించాలనే ఆలోచన రాలేదు.
    "ఈ ఊళ్ళో డాక్టర్ చచ్చి తల పగల గొట్టుకున్నా ఇంటికి రాడు. మనం అక్కడికి పోవాలిసిందే! వెళ్ళినా మహానుభావుడు ఉంటాడో ఉండడో?" నిరాశగా అంది అచ్యుతమ్మ.

 Previous Page Next Page