Previous Page Next Page 
గోరింటాకు పేజి 12


    "అన్నావుగదా అలా, నీకు చుట్టూవున్న పరిస్థితుల్ని బట్టి - అంటే డబ్బూ ప్రేమించే తల్లిదండ్రులు, లేతవయస్సు, ఏదో చదువు, అమాయకత్వం. వీటిని బట్టి అసలు మాలిన్యం వుండకూడదు. కాని వుంది. ఎందుకు వుంది? ఎలావుంది? పాణీ! ఇంత అందమైన నీ బుల్లి సుకుమార దేహంలో, ఈ మాలిన్యం ఎలా ప్రవేశించింది? అసలు మనసంటేనే మాలిన్యం. ఈ ఇరవయ్యో శతాబ్దంలో ఇంతకంటే శుభ్రంగా నువ్వుండలేవు తెలుసుకో."     

 

    "ఎందుకని?"

 

    "ఒకమనిషి జీవితంమీద ఏదో ఓ ప్రభావం నిరంతరం ప్రసరించబడనిదే అతను ఉత్సాహంగా ముందుకు సాగలేడు. మరి ఈ ప్రభావం - ఎవరో అన్నట్లు అసలు మంచి ప్రభావం అంటూ వుండదు."

 

    ముకుందం బాధగా "అయితే మనిషి అజ్ఞాతంగా చెడునే కోరుకుంటాడన్న మాట" అన్నాడు.

 

    "ఆహా! ఒక్క చెడునేకాదు, అర్థంకాని అశాంతిని, నిరాశను ప్రేమగా వరించటంలో తను ఆనందం పొందుతాడు. ఈ కాలం యువకులకు ఇది ఒక ఫ్యాషన్ అనొచ్చు. వ్యక్తులదికాదు ఫ్యాషన్, కాలానిది ముకుందం! జీవితమంటే ఉద్యోగాలు వెతుక్కోవటం, చెయ్యటం, నిద్రపోవటం - ఇది మాత్రమేకాదు. అసలిది కానేకాదు. నీలో నిద్రపోతూన్న భావనకు ఓ స్వరూపం ఇచ్చి మేల్కొలపాలి. రాత్రుళ్ళు మేలుకో. కుళ్ళు, కుములు. ఎవరికీ అర్థం కాకుండా ఆకాశం అంత పెరుగు. ఒక్కసారి నవ్వి ఏడ్వు. కాని ఇవన్నీ అనుభవించు. అనుభవాలకు బెదిరి దూరంగా పారిపోకు. అసలు జీవితమంటే అనుభవాల గుచ్ఛం. అనుభూతుల వలయం."

 

    చక్రపాణి కంఠం తగ్గించి "కాని అనుభవాల్ని అన్వేషించటం... సక్రమమా?" అన్నాడు.

 

    బ్రహ్మానందం నిర్లక్ష్యంగా నవ్వి "అసలు అన్వేషించనిదే నీకు ఏదీ లభ్యంకాదు. నువ్వు బి.ఏ. పాలిటిక్స్ ను వెదుక్కుంటూ ఇక్కడికి వచ్చావుగాని, అది నిన్ను వెతుక్కుంటూ మీ ఊరికి రాలేదు. మనల్ని వెదుక్కుంటూ వచ్చే నిజమైన అనుభవం ఒకటే. ఆ చివరిది కూడా అదే. మృత్యువు."

 

    చక్రపాణికి ఒళ్ళు జలదరించి అన్నాడు: "మరి ఉదాత్తత, శీలం అంటారే, వీటిని త్రోసిరాజనందే వాటిని ఎలా సాధించగలుగుతాం?"

 

    "పాణీ! అరవిందునిలాంటివారు భిన్నత్వంలోని ఏకత్వాన్ని అంగీకరించారు. విభిన్నరీతుల ఘటనలకు గురై వాటిలోదిగి, దిగమ్రింగి వెలికి వచ్చిన పిదపకదా ఈ మాటల నిర్వచనం తెలుసుకోవటం సాధ్యం. నిర్వచనం తెలియకుండానే పదం అందంగా వుందికదా అని దానిజోలికి పోకూడదు."

 

    "కాని మనిషిలోని సంఘర్షణ మృత్యువుకంటే ఘోరమైన అవస్థ అని నా కనిపిస్తుంది బ్రహ్మానందం! ఈ సంఘర్షణకు అవకాశం ఇచ్చే ఏ పనయినా హానికరమే."

 

    "అసలు సంఘర్షణ లేనిదే ఒకడికి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతాయో నాకు కాస్త చెప్పు పాణీ! వింటాను."

 

    చక్రపాణి సిగ్గుపడుతూ ఆలోచించాడు.

 

    "అయితే మనిషి అభివృద్ధికి సంఘర్షణ అవసరమంటావా?" అన్నాడు.

 

    "అవసరం, అనవసరం అలావుంచు. కాని దానినుంచి తప్పించుకోబూనటం పిరికితనం."

 

    "చిన్నప్పుడు నాకో స్నేహితుడుండేవాడు. అతను ఎప్పుడూ క్లాసుకి వచ్చేవాడు కాదు. ఒకసారి నాకు సినిమాహాల్లో కనిపించి, "ఈ చదువెందుకు? ఈ కష్టంలోని సుఖమెందుకు?" అని అనడం సాగించాడు. మరిఇలా తాము చేస్తున్నపనిని వక్రంగా సమర్థించుకోవటం "ఆత్మవంచన క్రింద, ఎస్కేపిజం క్రింద రాదా?"

 

    "చక్కని ప్రశ్న పాణీ! దీనికి పాజిటివ్ రిప్లై లేదు. కాని వాళ్ళు తాత్కాలికంగా తాము చేస్తున్నపని మంచిదే అని నమ్ముతారు. పోనీ ఇరవయ్యేళ్ళనుంచీ సిన్సియర్ గా పనిచేసి ప్రమోషనుపొంది పైకివచ్చిన ఎవరయినా ఆఫీసర్ని కలిసి అడుగు. వాళ్ళకుకూడా లైఫ్ ఎందుకు డ్రైగా అనిపించాలి? వాళ్ళు దాన్ని ఇంకోరకంగా సమర్థించుకుంటారు. పాణీ! అసలు మానవుడి జీవితమంతా పరిసరాల రాజీతోనే ఇమిడివుంది. ఎక్కడికక్కడ ఇరుక్కుని అతుక్కుపోవాలని చూస్తుంటాడు. అతన్లోని స్వకీయవాంఛలు తపన. వీటిని భార్య, సంసారం, పిల్లలు వీళ్ళు డామినేట్ చేసి తనని గురించి తనను ఆలోచించుకోనీయకుండా చేస్తారు. విశ్రాంతిలోనే ఈ అన్వేషణ. అందుకే చివరిదశలో భగవద్గీత పారాయణ, భగవన్నామస్మరణ ఇలాంటివి.     

   

    "అసలు యవ్వనం ఉందే. దీని అహంభావం యొక్క ప్రభావం కూడా వ్యక్తిమీద చాలావుంది. తనకు తెలియకుండానే మానవుడు తనలోని స్వార్థంవైపు మెల్లిగా మొగ్గుతూ వుంటాడు. దీనికి ఈ యవ్వనాహంకారం దోహదం చేస్తూంటుంది. అతను ఇదే నిజం, శాశ్వతం అనుకుని లోకంమీద విరుచుకుపడాలని చూస్తాడు. తీరా తప్పు తెలుసుకున్నాక వెనక్కి రావటానికి ఆత్మ అడ్డుకుంటుంది. అది వార్థక్యం యొక్క చాదస్తం."

 

    "కాని మనిషి సుఖపడాలంటే ఈ రాజీయే శరణ్యం. దేనికైనా ఒకదానికి లొంగిపోవటమే మార్గం. అది వివేకమైనపని.

 

    "నాకు సరిగ్గా అర్థంకాలేదు."

 

    "అంటే ప్రకృతిలో పోరాటం తగదని. నీ మనసుని ధ్వంసం చేసుకుని, నిన్ను నీవు చిత్రవధ చేసుకోమని, అందునా జీవించాలంటే ఉపాయం అవసరం."

 

    "అసలు ఎవరికోసం ఈ ఆత్మపరిశీలనలు? నేను మనస్ఫూర్తిగా చెపుతున్నాను. ఇంతవరకూ శారీరకమైన అనుభవం ఏమీలేదు. అయినా లోకం నన్ను జారుడంది. ముకుందం ఉద్యోగం మాటేమిటోగాని, ఉద్యోగ నిర్వహణలోగాని అవకతవకలు ఎప్పుడూ చేయలేదు. ఇహ నీవు ఎప్పుడూ సిగరెట్లు కూడా కాల్చలేదు. ఎవరికీ హానిచేయ్యలేదు. అయినా నీకు మనశ్శాంతి లేదు. ఎవర్ని ఉద్ధరించటానికి మన ఈ మంచితనాలు? ఏం బావున్నాం మనం?"    

 

    ముకుందం పచార్లు ఆపి భయంగా నిలబడ్డాడు. అతని శరీరం వణుకుతూంది. చక్రపాణికూడా ఇంచుమించు అదే అవస్థలో వున్నాడు.

 

    బ్రహ్మానందం చెప్పసాగాడు. "మనం ఈ గదుల్లోకి వచ్చినప్పుడు ఇంటి యజమాని హుస్సేన్ సాయిబు ఈ పడమటివైపునున్న కిటికీ తియ్యకూడదని శాసించాడు. ఆజ్ఞ ఉల్లంఘనలో మంచి మజావుందని వప్పుకుంటారు కదా? సరే. మీకు జీవితంలో విచిత్రాలు చూడాలనివుందా? ఈ రాత్రి పన్నెండు గంటలకు ఆ కిటికీ తెరవడంతో మన దండయాత్ర ప్రారంభిద్దాం. నా మనస్సు ఉరకలుచేస్తుంది. మీరిద్దరూ బుద్ధిమంతులు. ఏమీ అభ్యంతరం చెప్పరు. ఏం?"

 Previous Page Next Page