Previous Page Next Page 
గోరింటాకు పేజి 13


    చక్రపాణి అస్పష్టమైన అవస్థలో పడి తల ఊపాడు. ముకుందం నిల్చున్నచోటే కట్టెలాగా నిలబడిపోయాడు. అతని ముఖం భయంతో వాలిపోయింది. ఏదో చెప్పదల్చుకున్నాడు. కాని నోరు దాటి బయటకు రావటం లేదు. ఇంక మెదలకుండా ఊరుకున్నాడు.

 

    అసలు ఈ అవస్థకంతటికీ కారణం ఏమిటి? ఈ ఊరు చేరినప్పటినుండి చక్రపాణిలో ఏదో తహతహ, భ్రాంతి, కించ. తన ఊహల్ని బలవంతంగా దాచుకోవటంవల్ల చాలాసార్లు బ్రహ్మానందం ముందు బయటపడ్డాడు. మొదట బ్రహ్మానందం నవ్వి వూరుకునేవాడు. తరువాత ఒక విచిత్రమైన చూపు చూసేవాడు. ఆ నవ్వు... ఆ చూపులు చక్రపాణిలో ఒక సంచలనం కలిగించాయి. అతన్ని కంపిత హృదయుణ్ని చేశాయి. ఏమిటి దాగివుంది ఆ నవ్వుల వెనుక, ఆ చూపులమాటున? దీనికి రాజారావు సమాధానం చెప్పగలడా? చెప్పవచ్చు. కాని అప్పుడు తాను బహుశా అతన్ని అభినందించలేడు తన స్వార్ధంవల్ల. ఏమిటీ ఈ స్వార్ధం? ఎందుకు...? అది బ్రహ్మానందంకేసి ముఖాముఖిపోయి అతన్లో ఐక్యం అవుతోంది. తనలో యేదో వుంది అంటాడు అతను. "లేదు ఒట్టి భ్రాంతి" అని తనకు అనిపిస్తూంది తన అమాయకత్వం. తాను అమాయకుడా? అయినట్లే తనకుతోస్తూంది. మాలతిని పెళ్ళిచేసుకుని వుంటే ఎలావుండేది? మాలతి తనను మోసం చేసిందా? పోనీ అలా అనుకుంటే తనకేమయినా తృప్తి కలుగుతుందేమో? ఆలోచించి చూశాడు. ఉహుఁ లాభంలేదు. తాను అస్పష్టంగా, చాలాపనులు చేయగలడు. కాని స్పష్టంగా స్వచ్ఛంగా ఒక్కపనీ చేయలేడు. తనలో ఏవో శక్తులుంటే (బ్రహ్మానందం చెప్పినట్లు) వుండొచ్చుగాని వాటికి సులక్షణమైన పర్యవసానం వుండబోదు. చదువుమానుకుని ఇంటికిపోతే అది మరోనరకం. అక్కడ తాను వుండలేడు. తను ఎక్కడికి పోతున్నాడు? ముకుందం ఏమిటి మాట్లాడడేం? ఏమిటి అతని మనసులోని మర్మం? అసలు మర్మం అంటూ ఏమయినా ఉన్నదా? అతనిది మూగబాధ. ఈ బాధలఘాటు వేరా? ఒంటరిగా కూర్చున్నప్పుడు చప్పుడు చెయ్యని సంకెళ్ళు... వినిపించని ఆడదాని ఆర్తనాదం. చిరుగాలికి రేగిన మర్రి ఆకు మూలుగూ... ఎండిపోయిన నది నగ్నరూపం. ఏమిటి ఈ భావాలు, దృశ్యాలు తన మదిలో, ఈ హృదిలో.

 

    అదేనా... అదే... ఈనాటి బ్రహ్మానందం మాటలమాటున తన కలత నిద్రలో గాఢమైన ముద్ర.

 

                                         * * *

 

    రాత్రి పదకొండున్నరయింది. చీకటి మారుమూలగుహల్లో వ్యాపించినట్లుగా గాఢంగా వుంది. మధ్యమధ్య చీకటిపయ్యదను తొలగిస్తూ చిలిపి చిరుగాలులు ఆ తమస్సులో - ఆ గదిలో వాళ్ళు ముగ్గురూ ఒకరినొకరు పట్టుకొని తపస్సు చేస్తున్నట్లుగా కూర్చున్నారు, వాళ్ళ నిట్టూర్పులు వాళ్ళకు త్రాచుపాముబుసల్లా వినిపిస్తున్నాయి. వాళ్ళ గుండెలచప్పుళ్ళు వాళ్ళకు యుగాంతంలో భూమి బద్ధలై విచ్చుకున్న శబ్దాల్లా వినవస్తున్నాయి. ముగ్గురి పెదాలమధ్య (అందులో ఇద్దరికి) అభ్యాసం లేమిచేత చిందరవందరగా కదుల్తోన్న సిగరెట్ల చివరనున్న నిప్పుకణాలు సూక్ష్మరూపాలు ధరించిన కొరివిదెయ్యాల్లా కనిపిస్తున్నాయి. ఆ మిణుగురు వెలుగులో నింపాదిగా, బరువుగా, కదిలిపోతున్న పొగ కాష్టం తగలబడేటప్పుడు లేచే పొగల సమూహంలా భయంకరంగా వుంది.    

 

    "పదకొండూ ముప్పావై వుంటుంది" అన్నాడు బ్రహ్మానందం. ఆ స్వరం శవం బ్రతికి నీళ్ళు కావాలని నీరసంగా గోలపెట్టినట్లుంది.

 

    "తెరుద్దామా?" అన్నాడు చక్రపాణి, నూతిలోదూకి నీళ్ళక్రింద నుంచి మాట్లాడుతున్నట్లు.

 

    "వీల్లేదు. పన్నెండంటే పన్నెండే. ముహూర్త నియమాన్ని పాటించాలి."

 

    ముకుందం మాట్లాడలేదు. భయం, భీభత్సం అణుచుకున్నట్లుగా వుంది. చక్రపాణి అతడి భుజంచుట్టూ చెయ్యివేశాడు. ఆడదాని భుజం కన్నా (ఊహ) వెచ్చగా నిప్పులా తగిలింది. "మరో నిప్పు" అని గొణిగాడు.       

 

    "రెడీ!" అన్నాడు బ్రహ్మానందం చివరకు.

 

    ఈసారి చాలా పెద్ద పెద్ద నిట్టూర్పులు వెలువడినాయి. ఏది ఎవరిదో తెలియలేదు. ముగ్గురూ ఒక్కసారిగా కిటికీ తలుపులమీద చెయ్యివేశారు. అవి వణుకుతున్నాయి. ఉత్సాహం వణికినట్లు ఆపదలో. ఏముంది అవతల? స్వర్గమా? నరకమా? ఏదయినా విచిత్రలోకమా? వాళ్ళు మనుషులేగా? పరమేశ్వరా! దీనబంధూ! ఒక్క ఊహ, ఎన్నాళ్ళనుంచో తడిసివున్న గడియ బింకం వీడిపోయింది. ఒక్క అరడుగు వెడల్పు మాత్రం ఖాళీ వుండేట్లు వాళ్ళచేతులు తలుపుల్ని జాగ్రత్తగా పట్టుకున్నాయి. ముగ్గురూ ఎలాగో తిప్పలుపడి తలకాయలు ఒకదానిపైన ఒకటి వరుసగా పొడవుగా పెట్టారు. కళ్ళు చించుకొని చూశారు.  

 

    ఆరుబయలు ప్రదేశం. లోపల యెక్కడో వెలుగుతూన్న లైటు యొక్క సన్నని వెలుగూ, చుట్టూరా క్రోటన్సూ, దూరంగా ఆవులూ, గేదెలూ, మధ్యలో వరుసగా మంచాలు. వాటిపైన పవ్వళించివున్న వివిధ మానవ శరీరాలు, వెనగ్గా వాళ్ళ యెత్తయిన మేడ. అబ్బ! ఎంత విశాలమైన భవనం! లోపల ఇంత పెద్ద మేడవున్నట్లు బయటివాళ్ళకు రవ్వంతకూడా తెలియదుకదా!     

 

    బ్రహ్మానందంలో ఇద్దరు మనుష్యులున్నారు. గంభీరంగా మాట్లాడేటప్పటి రూపం వేరు. మామూలు వ్యవహారంలో వున్నప్పుడు రూపం వేరు.

 

    అతను కంఠస్వరం బాగా చిన్నదిచేసి, ఉత్సాహంగా వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. "అదిగో! ఆ మొదటిమంచంమీద ముసుగు పెట్టుకుని ముడుచుకుని పడుకున్నాడే, వాడే మన హుస్సేను సాయిబు. హిడింబిలా వాడిప్రక్క మంచంమీద బోర్లా పడుకుని వున్నదే అదే మన బడంకి దెయ్యం మీనాల రాకాసి. ప్రక్కన రెండు మంచాలమీదా పిల్లకాయలు. ఆ తర్వాత... హుష్, ఆగండి. అమ్మాయి, వయసులోవున్న పిల్ల. పద్ధెనిమిదేళ్ళు వుంటాయనుకుంటా. అందంగానే వుండొచ్చు. ఆ తర్వాత మరోపిల్ల. సన్నగా, నాజూగ్గా, లేతగా వున్నట్లుంది. ఓ మొగ్గలా వుంది. పదిహేనేళ్ళయితే ఫరవాలా. మనవాడికి జోడే. ఆ ఇద్దరు వెధవాయిలు - ఆ తండ్రికి తొత్తులు ఏరి? డాబామీద పడుకున్నట్లున్నారు. లేకపోతే ఇనప్పెట్టెకు కాపలా కాస్తున్నారేమో! చూడటం అయిందా? అయిందా, అంటున్నా. ఉష్ ఆగండి. బాబోయ్ అదేమిటి? చచ్చాం. ముకుందం, పాణి! ఊపిరి బిగపట్టండి."

 

    అతను చెప్పకముందే వాళ్ళ ఊపిరి బందయిపోయినది. పద్ధెనిమిదేళ్ళని బ్రహ్మానందంచేత పేర్కొనబడ్డ ఆ అమ్మాయి ఆకస్మాత్తుగా మంచంమీద నుంచి లేచి కూర్చున్నది. తల అటూ ఇటూ త్రిప్పింది. లేచి కూర్చుని శాలువా మీద కప్పుకుని మెల్లగా బయల్దేరింది.                

 Previous Page Next Page