" అంతేనంటూవురా అబ్బూ!" నీళ్ళు కారిపోతూ అన్నాడు వ్యాకర్ణ.
" అంతేగాక...!" అన్నాడు అబ్బులు నీళ్ళలా కారినచమట కర్ చీఫ్ తో తుడుచుకుంటూ.
జయచిత్ర లోపలికెళ్ళితనకో కుర్చీ తెచ్చుకునే లోపల అబ్బులు వ్యాకర్ణ చెవులు కొరుక్కుని నోరు మూసుకున్నారు.
తాపీగా కుర్చీలో కూర్చున్న జయచిత్ర అందమైన పంతులమ్మలా ముఖం పెట్టి అబ్బులిని వ్యాకర్ణని రెండోక్లాసు పిల్లకాయల్ని చూసినట్లు చూసి " ఆ... ఎంతవరకొచ్చాను?" అంది.
అర్ధంగాని అబ్బులు భూతద్దాలలోంచి వ్యాకర్ణని చూశాడు. అబ్బులుగాడు ముఖం తిప్పేశాడని గ్రహించిన వ్యాకర్ణ ఏమాత్రం తడుముకో కుండా " మిరు మాకు కుర్చీలు తెచ్చివేసి మిరు మరో కుర్చీ తెచ్చుకుని వేసుకున్నారు. అంతవరకూ వచ్చామండీ జయగారూ!" అన్నాడు.
" ఏడ్చినట్లే వుంది" అంది జయచిత్ర.
" ఏంటండీ? యిలా కూర్చోటమా?" అన్నాడు వ్యాకర్ణ.
" మిరు చెప్పింది" టకీమని అంది జయచిత్ర.
" నులకతాడు దబ్బనంతో ఈ పిల్ల నోరు కుట్టాలి" కసిగా అనుకున్నాడు వ్యాకర్ణ.
" దొండపండులాంటి పెదవులు ఎంతముద్దొస్తున్నాయోచూడు. వాటిని కుట్టటానికి ఎలా మనసొప్పిందిరా రాక్షసుడా!" అంటూ అంతరాత్మ లోపలినుంచే కేక లేసిందీ
" సరే, పెదవులు దొండపండ్లే! నాలుక మాటేంటి? అది నాలుకా! తాటిపట్టా? ఎంత యిది? ఎంత అది? యిల్లు ఈవిడిగారిదని మే మద్దెకొస్తున్నామని అంత యిదిపనికిరాదు. అయినా నీ గోలేంటి మధ్యలో!" అంటూ అంతరాత్మని కోప్పడ్డాడు వ్యాకర్ణ.
" ఏమండీ అబ్బూ! మిరేం సబ్బు వాడుతారు?" అంది జయచిత్ర. డైంట్ విల్ లా వున్న టినోపాల్ ఏజెంటులకు సౌందర్యమునిచ్చు సబ్బు. అదే ఎల్లావేళలా వాడెదను" చెమట..." ఆగిపొయ్యాడు.
" మిరేం సబ్బు వాడుతారు?" అంది వ్యాకర్ణతో జయచిత్ర.
" ఎల్లవేళలా మన సౌందర్యా న్ని ఆరోగ్యాన్ని కాపాడే లైఫ్బాయ్ సబ్బునే వాడెదను" అని..." మి ఇంట్లో అద్దెకి దిగాలంటే వాడే సబ్బుల సంగతి టూత్ పేస్ట్ సంగతి రేజరు సంగతి చెప్పలాండీ?" అన్నాడు వ్యాకర్ణ.
" అవునండీ!"
" దేనికండీ?"
" చూడండి దాన వీర శూర కర్ణగారూ!"
ఏడుపోక్కటే తక్కువగా ఏడువు ముఖం పెట్టి "నా పేరు వ్యాకర్ణ అండీ!" అన్నాడు.
" చూడండీ కర్ణా!" అంది శాంత గంభీర స్వరంతో జయచిత్ర.
" కర్ణ కాందండి, వ్యాకర్ణ" సరిదిద్దాడు వ్యాకర్ణ.
" సరే, వ్యాకర్ణగారూ! సబ్బుల సంగతి పేష్టు సంగతి ప్రస్తుతం అప్రస్తుత మయినా ఎండుకడిగా నంటారు?" అంది జయచిత్ర సీరియస్ గా.
" తెలీదండి" అన్నాడు వ్యాకర్ణ.
" నాకూ తెలీదండి" అంటూ ముందే వొప్పుకున్నాడు అబ్బులు.
" మికు తెలీదని ముందే నాకు తెలుసనుకోండి. ఆ మాట మి నోటంట వినాలని మాత్రమే. ముఖాలలా పెట్టుకోకండి. అసలు విషయం చెపుతాను.
మా యింట్లో అద్దెకుండాలంటే మంచితనం ఒక్కటే చాలదు ఓర్పు... ఓర్పు వుండాలండి."


