భోజనాలదగ్గర అతని మామయ్య సదాశివంగారి సందడి మరీ ఎక్కువైంది. "చూడూ! నువ్వు ఇదివరకెంత బలంగా వుండేవాడివి! చెల్లాయి నిన్ను చూసిందంటే ఏడ్చిమొత్తుకుంటుంది. మనిషివి కూడా నల్లబడిపోయినావు. ఈ ఎలక్షన్ హడావిడిలో తిరుగుతున్నావు కాబోలు! డబ్బుకూడా బాగానే ఖర్చు అయే వుంటుంది."
"ఊఁ! కొంచెం అవుతూనేవుంది" అన్నాడు రాజారావు అన్నం కలుపుతూ.
"ఏమాత్రం, ఒక రెండొందలు అయివుంటుందా?"
"రెండొందలు ఏ మూలకి వస్తుంది నాన్నా! నాకు తెలుసుగా ఎలక్షన్స్ గురించి. ఒక వెయ్యి పై చిలుకు వదుల్తాయి" అన్నాడు కొడుకు.
"అయ్యబాబోయ్! అంత సొమ్మే. ఎందుకురా అంత దుబారా? తిరిగి పెట్టినదాంట్లో ఒక దమ్మిడీ అయినా వస్తున్నది కనుకనా?"
నెయ్యి వడ్డిస్తూ అత్తయ్య "చాల్లే ఊరుకోండి. భోజనాల దగ్గర యేమిటా వాదింపు? ఈ వయసులో ఖర్చు పెట్టకపోతే ఎప్పుడు పెడతాడు? అదీగాక అల్లుడికి పలుకుబడికేమీ తక్కువలేదు. మొన్న రైతు శేషయ్య చెప్పాడుగా వాళ్ళ ఊళ్ళో అతనిమాటకు ఎంత చెల్లుబడో, ఏమిటో? రేప్పొద్దున్న యే ఎమ్. ఎల్. ఏ.నో అయితే ఇలాంటి వేలు బోలెడు సంపాదిస్తాడు" అంది.
ఓ, అవును. ఇప్పట్నుంచీ ఇలాంటివాటిలో తిరిగితేగాని అప్పటికి అనుభవం చాలదు. అయితే మోహనం! మనమ్మాయి ఎమ్.ఎల్.ఏ.గారి భార్య అవుతుందంటావు. ఏం?"
"ఒక్క అదేనేమిటి? అల్లుడు తలుచుకుంటే..." అంటూ ఆవిడ కూర మారు పట్టుకురావటానికి లోపలకు వెళ్ళింది.
"ఇదిగో ఇదయ్యా మీ అత్తయ్యగొడవ. దీనికి నేను సమాధానం చెప్పలేకుండా వున్నాను. ఇదిగో, ఏమేవ్! ఆ మాట్లాడేదేదో స్పష్టంగా మాట్లాడకూడదూ? అతను ఇవాళ వెళ్ళిపోయాడంటే మళ్ళీ కంటికి కనిపించటం కరువు.
రాజారావుకు ఈ పరిస్థితి ఏమీ సుఖంగా లేదు. ఇహ ముసలమ్మగారు ప్రారంభించిందంటే ఈ రభసకు అంతూ పంతూ వుండదు. "ఇవాళ ఈయనకు ఎందుకు కనిపించాన్రా దేముడా!" అనుకున్నాడు.
ఆయనగారి భార్య లోపల్నుంచి గిన్నెలు చప్పుడు చేస్తూ "బాగుంది. భారమంతా నామీద తోస్తున్నారా! అయినా మీ చాదస్తంగాని రాజుకు మట్టుకు మనం చెప్పాలా యేమిటండీ? ఇది ఇప్పటి విషయమా? అతని అన్నలూ, ఆవిడకూడా ఏకగ్రీవంగా ఒక నిశ్చయాని కెన్నడో వచ్చేశారు. సత్యవతీ! ఇదిగో ఈ కూర తీసుకెళ్ళి వడ్డించిరామ్మా!"
"అబ్బ, నేను వెళ్ళను బాబూ!" అన్నదా అమ్మాయి కంఠస్వరం తగ్గించి.
"ఇదిగో విన్నారా దీనిమాటలు, అతనిమీద అలిగినట్లుంది. ఇప్పుడేమీ తీసుకురానంటోంది."
కొడుకు "బావ పిలిస్తేగాని రాదేమో అమ్మా! సత్యవతీ! ఫర్వాలేదులే రా. ఆనక నిన్నేడిపించనులే" అని నవ్వేశాడు. వెనుకనుంచి తల్లి మెల్లగా పొడిచి బలవంతంగా ఇవతలకు తోసింది. అప్పుడాపిల్ల వచ్చి, గత్యంతరం లేక తలవంచుకుని పళ్ళెంతో వడ్డించసాగింది.
"చాలు..." అంటున్నాడు రాజారావు.
"ఇంకొంచెం వేయించుకో బావా! ఆనక మా సత్యవతికి కోపం వచ్చిందంటే ఇల్లెగిరిపోతుంది."
గబగబ ఏదో కాస్త గుమ్మరించి సత్యవతి లోపలకు పరుగెత్తింది సిగ్గుతో. అవమానంతో రాజారావుకు చచ్చినచావయింది. వీళ్ళంతా కలిసి... ఏం చెయ్యాలి?
మొత్తానికి ఎలా అయితేనేం భోజనాల వ్యవహారం ముగిసేసరికి "హమ్మయ్య" అని నిట్టూర్చాడు అతను. ఇహ బయల్దేరటానికి సిద్ధపడసాగాడు.
"వాన వచ్చేటట్లుగా ఉంది. ఇప్పుడేం వెడతావు" అంది అతని అత్తయ్య.
"కాదులే అత్తయ్యా, చాలాపనివుంది. నాకోసం స్నేహితులు ఎదురుచూస్తూ వుంటారు" అని ఎలానో నచ్చచెప్పి మొత్తంమీద బయటపడ్డాడు. అతనికి చెమటలుపట్టాయి. "ఈ ఊరు వదిలేసి గుంటూరుకన్నా పోవలసింది చదువుకు ఎంత పాడుపని చేశాను?" అని మధనపడ్డాడు. కొంతదూరం పోయి, ఏదోతోచి, వెనుదిరిగి చూశాడు. డాబామీద చీకట్లో ఒక స్త్రీ నిలబడి అతను వెళుతున్న దారికేసి నిరాశగా చూస్తోంది.
4
ఓరోజు ప్రొద్దున ఎనిమిది గంటల సమయానికి బైట నీరెండ కాస్తుండగా స్నేహితులు ముగ్గురు తమ గదిలో గంభీరమైన ముఖాల్తో కూర్చుని వున్నారు. ఉఁ హు కాదు. ముకుందరావుమట్టుకు కంగారుగా, తడబడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడప్పుడూ చప్పున ఆగి జాలిగా, దిగులుగా చూస్తున్నాడు. మొత్తంమీద ముగ్గురూ ఏదో జటిలమైన సమస్యలోనే పడినట్లుంది. మౌనంగా నిమిషాలు గడిపేస్తున్నారు.
మొదట నిశ్శబ్దాన్ని బ్రద్దలుచేసింది బ్రహ్మానందమే "నాకు మనుషుల ఈ ప్రవర్తనే నచ్చదంటాను" అన్నాడు చటుక్కున.
చక్రపాణి కిటికీదగ్గరగా కుర్చీలో కూర్చొనివున్నాడు. "ఏది?" అన్నాడు తల ఎత్తి.
"ఏది" అన్నాడు వెటకారంగా బ్రహ్మానందం. "ఎన్నాళ్ళయినా, ఎంత పిడుగులు పడుతున్నా ఈ ప్రశ్నమట్టుకు మనల్ని వెన్నాడటం మానదు. మనం ఎవరు? ఎందుకు జీవిస్తున్నాం? ఏమిటి సాధిస్తున్నాం? మనుషులకు ఎందుకీ నియమాలు, అట్టహాసం, వల్లకాదు. ఈ ఊరొచ్చి నేను ఏడాది అయింది. డబ్బుంది. నాన్న ఎంతో పంపిస్తున్నాడు. నేను కాలేజికిపోతూ, డబ్బు ఖర్చుపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాను. ఏదో మత్తు, చవటతనం, స్తబ్ధత. ఇది కాదనిపిస్తుంది నాకు జీవితం. ఏం మాట్లాడవేం?"
"నువ్వే చెప్పు బ్రహ్మానందం" అన్నాడు చక్రపాణి.
"అవును, నేనే చెప్పాలి. ఆ విషయం తెలుసు పాణీ! పాపం, పుణ్యం, స్వార్ధం, త్యాగం, శుభ్రం, అసహ్యం - వీటికిగల తేడా తెలుసా నీకు?"
చక్రపాణి ఆలోచించి "మనిషి స్వచ్ఛంగా వుండటం, ఉండకపోవటం ఈ తేడాలను...?"
"ఊఁ, స్వచ్ఛం, ఏమిటి నువ్వనుకునే స్వచ్ఛం? అందంగా వుండటమా? స్నానం చేయటమా? మంచిబట్టలు వేసుకోవటమా?"
"కాదు. మనసులోని మాలిన్యం..."