Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 10


    రామప్ప శిల్పాలు కాకతీయులనాటివి. అయితే, అంతకు చాలా ముందునుంచీ కూడా ఇలా ద్రవం పూసి శిలను నున్నగా చెయ్యటం ఉంది. ఇప్పటివరకూ ఆ ద్రవం ఏమిటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఇప్పటి శిల్పులు కూడా నున్నదనం కోసం ద్రవాలు ఉపయోగిస్తున్నారు. కానీ అవి పాతకాలం నాటి ద్రవాలలాంటివి కావు.
    వెంటిలేషన్ కోసం ఎంత చూసినా లాభం లేకపోయింది. గాలి, వెలుతురు ఎక్కడినుంచి వస్తున్నాయో అర్థం కావటంలేదు. పోనీ అక్కడినుంచి మరో గదిలోకి దారికూడా కనబడటం లేదు. కొన్ని పెద్ద పెద్ద గుహలలో పది పన్నెండు గదులవరకూ కూడా ఉంటాయి.
    వెలుగురేఖ కిందకు దిగింది.
    "సాయంత్రం అవుతున్నట్లుంది. మనం సూర్యనేత్రం కింద ఉన్న లిపిని అనువదించుకుని మళ్ళీ వద్దాం" ఇద్దరూ తమలో తాము అవును కాదని తర్కించుకుంటూ ఆ లిపిని ఇలా అనువదించుకున్నారు.
    "చెంచుదొర ఒక కన్ను పశ్చిమాన తెరచుకున్నప్పుడు కిరాతకుడి తల పువ్వు నాలుగు రేకులతో నవ్వినప్పుడు రాకాసి రాని శిరస్సుకు లోకాలన్నీ మొక్కినప్పుడు ఈ నేత్రం తన కథ చెపుతుంది."
    రాత్రి ఏడు గంటలు. డేరాలలో ఏదో ఉత్సవం జరుగుతున్నట్లు సందడిగా వుంది. పగలంతా టెన్షన్ తో శ్రమపడిన అందరూ రకరకాలుగా వినోదాలు కల్పించుకుంటారు. ఆ సమయంలో అందరూ ఏక కుటుంబంగా అయిపోతారు. అంతస్థుల భేదాలూ ఎక్కువ తక్కువలూ పూర్తిగా పోవు కాని, కాస్త వెనక్కు తగ్గుతాయి.
    డ్రాఫ్ట్స్ మన్ ప్రకాశం సితార్ వాయించాడు. అది పెద్ద గొప్పగా లేదుకాని అందరూ వింటున్నట్లు నటించారు. ఇలాంటి సందర్భాలే ఒక మోస్తరు కళాభిరుచి వున్నవాళ్ళకి కూడా అవకాశం కలిగించేవి. సితార్ వాయిద్యం అయిపోగానే జెన్నిఫర్ డాన్స్ చేసింది.
    ఆ అమ్మాయి దగ్గిర చాలా కేసిట్స్ వున్నాయి. అవన్నీ పాప్ మ్యూజిక్ కి సంబంధించినవే. వెంట ఎప్పుడూ మినీ టేప్ రికార్డు ఆ అమ్మాయి హేండ్ బాగ్ లోనే వుంటుంది. రీసెర్చ్ ఇంటరెస్ట్ తో వచ్చానని చెప్పుకొంటున్న జెన్నిఫర్ తాను స్వయంగా ఎప్పుడూ ఏ పనిలోనూ పార్టిసిపేట్ చెయ్యదు.
    ఎప్పటికప్పుడు తన టైట్ ఫ్రాక్ నలక్కుండా, బాబ్డ్ హెయిర్ స్టయిల్ చెదరకుండా, ఫేస్ పౌడర్ ఫేడయి పోకుండా చూసుకుంటూ వుంటుంది. ఎప్పుడూ లో గొంతులో ఫారిన్ మ్యూజిక్ 'హమ్' చేసుకుంటూనే వుంటుంది. మామూలుగా నడుస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయి అడుగులు తను హమ్ చేసే సంగీతానికి అనుగుణమైన లయలో పడతాయి. తనకు నచ్చిన పాట వున్న కేసెట్ టేప్ రికార్డరులో వుంచి అది ఆన్ చేసి డాన్స్ చేస్తోంది.
    జెన్నిఫర్ ముఖంలో పెద్ద ఆకర్షణ లేదు కాని అంగ సౌష్ఠవం మాత్రం ప్రొవోకింగ్ గా వుంటుంది. అందులోను టైట్ ఫ్రాక్ తో డిస్కో డాన్స్ చేస్తోంటే చాలా ఎగ్జయిటింగ్ గా వుంది. టెక్నికల్ అసిస్టెంట్స్ ఇద్దరూ ప్రకాశం, విష్ణువర్ధన్ తమను ఇతరులు గమనిస్తున్నారనే విషయం కూడా మరచిపోయి, తమ ముఖాలలో కామోద్రేకాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నారు.
    రవి తనకు తెలియకుండానే ఆ లయకి అనుగుణంగా ఊగిపోతున్నాడు. కళ్ళలో ఎర్ర జీరలు ఎక్కువయిపోతున్నాయి. అతడి పక్కనే కూర్చున్న అనిల "ఛీ! ఛీ!" అంది అతి నెమ్మదిగా.
    ఉలిక్కిపడ్డాడు ఆ "ఛీ! ఛీ!" లు ఎవరిని వుద్దేశించో అర్థంకాలేదు. తప్పు చేస్తూ దొరికిపోయినవాడిలా సిగ్గుపడ్డాడు. ఆ సంకోచం కోపంగా మారింది.
    "మీకు ఇక్కడ ఇబ్బందిగా వుంటే వెళ్ళిపోండీ" అన్నాడు.
    "ఇబ్బందిగా వుందని ఎవరన్నారు?"
    ఆమె "ఛీ! ఛీ!" ల సంగతి బాహాటంగా చెప్పలేకపోయాడు రవి. అలా చెప్తే జెన్నిఫర్ ని అవమానించినట్లవుతుంది. అది విష్ణువర్ధన్ కి కూడా అవమానం కావచ్చు. విష్ణువర్ధన్ ని అవమానించటానికి వీల్లేదు. ప్రస్తుతం ఈ ఎక్స్ కవేషన్స్ కి అతడే పెట్టుబడిదారు. అంచేత ఒకరకంగా అతడే యజమాని.
    అందరిలో తనను బయటపడేసినందుకు అనిలకీ కోపం వచ్చింది.
    "అదీగాక నన్ను వెళ్ళమనే అధికారం మీకు లేదు. ఇవి మా గ్రామాలు. ఇక్కడి వాళ్ళంతా నన్ను "చిన్న దొరసానీ" అంటారు. నేనిక్కడి నుంచి వెళ్ళటమే జరిగితే, అదీ కోపంతో మీ దగ్గిర పని చెయ్యటానికి ఒక్క కూలీ రాడు. అంతేకాదు, మీకిక్కడ ఒక్క చుక్క మంచినీళ్ళయినా దొరక్కుండా చెయ్యగలను. సరే వెళ్తున్నాను."
    అనిల విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈ గోలకి జెన్నిఫర్ డాన్స్ ఆగిపోయింది. విష్ణువర్ధన్ కంగారుగా కోపంగా "రవీ ఇప్పుడావిడకెందుకు కోపం తెప్పించారు? ఈ మాజీ జమీందారులనీ, జమిందారిణులనీ చూస్తోంటే నాకు చాలా చికాగ్గా వుంది. వీళ్ళకి జమీలు పోయినా, డాబు దర్పాలు పోలేదు. అహంకారం చావలేదు. వీళ్ళు అన్నంతపనీ చేస్తారు. వెళ్ళి ఆవిడకి నచ్చజెప్పి తీసుకురండి. లేకపోతే మన శ్రమ అంతా బూడిద పాలవుతుంది."
    రవి వెంటనే లేచాడు. అప్పటివరకూ పడిన శ్రమ వ్యర్థమవుతుందనే భయంతో కాదు. తనమీద కోపంతో అనిల అలా వెళ్ళిపోవటం బాగోలేదు.
    అనిల అన్న మాటలు రైటే. డేరాల చుట్టూ చిన్న చిన్న మంటలు వెలిగించి, అటూ ఇటూ తిరుగుతున్న వాచ్ మన్ అనిలని ఏమీ అడక్కుండా నమస్కారం చేసి దారి వదిలాడు. స్నేక్ పిట్స్ కూడా దాటి వెళ్ళిపోతోంది అనిల ఎక్కుపెట్టి విడిచిన బాణంలా.
    అతి నాజూగ్గా ఉండే ఆ అమ్మాయి అంత త్వరగా నడవగలదని ఊహించలేకపోయాడు. అతడికి భయం వేసింది. ఇంకా కొంచెం దూరం నడిస్తే ఆ అమ్మాయి ఒంటరిగా అడవి దారిలోకి వెళ్ళిపోతుంది.
    "అనిలా!" అన్నాడు గట్టిగా.
    ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్నదానిలా టక్కున ఆగిపోయింది. ఆమెకి దగ్గిరగా వచ్చాడు. వెళ్ళిపోతుందేమో అనుకున్నప్పుడు కలిగిన భయం ఆగటంతో పోయింది. బతిమాలుకుని వెనక్కి తీసుకెళ్లాలని వచ్చిన అతడు అది మరిచిపోయి వాదనలోకి దిగాడు.
    "జెన్నిఫర్ డాన్స్ చేస్తోంటే మీకెందుకూ అంత చికాకు? కావాలంటే, మీరూ చెయ్యండి."
    "అలా వళ్ళంతా కనపడేలా తైతక్కలాడే కర్మ నాకు పట్టలేదు" ఆ అమ్మాయికి నిజంగా ఎందుకు కోపం వచ్చిందో, రవికి అంతరాంతరాలలో తెలుసు. అతడికీ మాత్రం చొరవనిచ్చింది ఆ ధైర్యమే! మరి కాస్త వుడికించాలనిపించింది.
    "అది కర్మ కాదు అదృష్టం! ఆ డిస్కో డాన్స్ చెయ్యటం ఎంత కష్టమో తెలుసా! అందరికీ రాదు అంత అందంగా చెయ్యటం" చివరి మాటలు నొక్కి పలికాడు.
    "ఆ డిస్కో డాన్స్ లు చెయ్యవలసింది ఇలాంటి చోట కాదు ఏ హోటల్స్ లోనో కాబరే డాన్స్ లు చేసుకోవాలి. ఇక్కడికి మనం వచ్చింది మన పురాతన శిల్పాల గురించి కొత్త విషయాలు తెలుసుకోవటానికి."
    "వర్క్ వైల్ యు వర్క్ ప్లే వైల్ యు ప్లే అన్నారు. పని అయ్యాకే రిలాక్సేషన్"
    "ఇలాంటి డాన్సులా రిలాక్సేషన్? సభ్యతా సంస్కారాలున్న అమ్మాయి కూడా ఇలా అమ్మమ్మలా మాట్లాడటం బాగోలేదు. ఇప్పుడు డిస్కో డాన్స్ లు అందరూ చేస్తున్నారు. పెళ్ళికొడుకులు పెళ్ళిచూపులకి రాగానే అమ్మాయిలు హార్మోనీ పెట్టె ముందు కూచోటం మానేసి డిస్కో డాన్స్ లు చేసేస్తున్నారుట."
    సీరియస్ గా అంటున్న అతడి ముఖం చూసి బింకం మరిచిపోయి నవ్వేసింది.
    "అంతేకాని పెళ్ళి చూపులూ, వరకట్నాలు మాత్రం వదలవన్నమాట ఇంతే మీ మోడ్రనిటీ"
    అనిల నవ్వేసరికి అతడికి మరి కాస్త ధైర్యం వచ్చింది.
    "ఏది మంచో అది ముందుగా గ్రహిస్తాం! "మంచి అన్నది పెంచుమన్నా!" అన్నాడు గురజాడ. ఇంక వెనక్కి వచ్చేయండి"
    "ఆహా! గురజాడ మాటలకి ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం? నేను రాను"
    "కోపమే, నిజంగా?"
    "నిజంగా అంటే?"

 Previous Page Next Page