నెలరోజులు తర్వాత నీళ్ళు పడలేదు. చిచ్చు ఊళ్ళో లేడు. హైద్రాబాద్ వెళ్ళాడు. హైద్రాబాద్ లో చదివించాలనుకున్నారు జ్ఞానదేవ్. అప్లికేషన్ వగైరా చూసుకోవడానికి వెళ్ళాడు. హైద్రాబాద్ లో బంధువులున్నారు వాళ్ళకి. విదుషి కూడా ఉంది.
యోగనాథశాస్త్రికి దిగులుగా ఉంది. తవ్వడం ఆపమని చెప్పాలని ఉంది. కానీ కొండజాతివాళ్ళు "అమ్మా! ఇంకా తవ్వమంటావా?" అని ఇళని అడిగినప్పుడల్లా, తవ్వండి" అంటోంది ఇళ. పాతాళ లోకానికి బిలం తవ్వుతున్నట్లుగా తయారయింది ఆ నుయ్యి. నెలమీద మరో వారం తవ్వారు. బస్సున జలం పొంగింది. కొండజాతి వాళ్ళంతా పారలు, గునపాలు, తట్టలు పట్టుకుని మట్టి మెట్లమీదగా చకచకా పైకి వచ్చారు. చూస్తుండగా అగాధంలో ఆ నుయ్యి సగం వరకూ నీళ్ళతో నిండిపోయింది. పాతాళగంగ పైకి ఉరుకుతున్నట్లు పొంగుతోంది జల. కొండజాతివాళ్ళ ఆనందానికి అంతులేదు. ఆడారు, పాడారు. చివరికి తప్పతాగారు. దుర్గకి భక్తితో నమస్కారం చేసుకుంది ఇళ.
జరిగిందంతా చిచ్చుకి ఉత్తరం రాశాడు జ్ఞానదేవ్! ఆ ఉత్తరం విదుషికి చూపించాడు చిచ్చు.
"అక్కా నిజంగా దుర్గాదేవి, నీళ్ళు ఎక్కడ పడతాయో ఇళకి చెప్పిందంటావా? నమ్మలేకపోతున్నాను." విదుషితో అన్నాడు.
"నాకూ ఆశ్చర్యంగానే ఉంది. నీతో నేను వస్తాను చూద్దాం!" అంది.
చిచ్చు, విదుషి ప్రమధపురి వచ్చేసరికి ఆ ఊళ్ళో తీర్థ ప్రజలాగా ఉన్నారు జనం. అదేదో పుణ్యక్షేత్రమయినట్టు బావినే విరగబడి చూస్తున్నారు. సిమెంట్ వరలకీ నూతి చప్టాకీ మొదలైన వాటికి గవర్నమెంట్ గ్రాంట్ వెంటనే శాంక్షన్ అయిపోయింది. కళ్ళారా ఆ బావిని చూసి విభ్రాంతి చెందాడు చిచ్చు.
"ఆ అమ్మాయి ఇక్కడ నీళ్ళు పడతాయనటమూ, నీళ్ళు పడటమూ యాదృచ్చికం కాకూడదు?" అంది విదుషి.
"కాదు. ఇళ ఈ ప్రదేశమంతా తిరిగి ప్రత్యేకించి ఇక్కడే నీళ్ళు పడతాయని చెప్పిందట!"
"నేలకి చెవి ఆనించి వినటం, అలాంటివేమైనా చేసిందా?"
"లేదట! దుర్గని తలుచుకుని భక్తితో నమస్కారం చేసిందిట! అలా ఎప్పుడూ చేస్తుంది."
"నేను ఇళతో మాట్లాడతాను!" అంది విదుషి.
అయితే ఇళతో మాట్లాడటం విదుషికి సాధ్యం కాలేదు. అచ్యుతమ్మ, యోగనాథశాస్త్రి ఇళని వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉంటున్నారు. ఆ అమ్మాయిని ఎవరితో మాట్లాడనివ్వరు. బయటికి పంపరు. పీట మీద ధ్యానంతో కూర్చోవటం, వచ్చినవాళ్ళకి తీర్థం ఇయ్యడం! అంతే, ఆ అమ్మాయి చెయ్యవలసింది. ఆ పిల్లతో ఎవరేం మాట్లాడాలనీ ప్రయత్నించినా సమాధానం యోగానాథశాస్త్రే చెప్తాడు. ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు వరకూ ఇళకి విశ్రాంతి సమయం. ఆ సమయంలో ఎవరినీ చూడనియ్యరు.
"నీకు ఆ ప్రాంతంలో నీళ్ళు పడతాయని ఎలా తెలుసు?" అడిగింది విదుషి.
యోగనాథశాస్త్రి ముఖం చిట్లించాడు.
"నీకు సంబంధించిన ప్రశ్నలడగవమ్మా! అనవసర విషయాల్లో కల్పించుకోకు." అన్నాడు కసురుతున్నట్లు.
ఇళ విదుషిని చూసి చిరునవ్వు నవ్వింది అంతే.
జరిగింది తెలుసుకున్న చిచ్చు మళ్ళీ మరొకసారి ప్లాన్ ఆలోచించాడు. రోజురోజుకు ఇళ ప్రాముఖ్యం హెచ్చుతోంది. భక్తులెందరో ఆమెకు పూలు సమర్పించుకుంటున్నారు. ఒక కాగితం మీద ఇలా రాశాడు.
"నాన్నగారు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎలా అయినా ఒక్కసారి రా!" ఆ కాగితంలో పూలు చుట్టి భక్తుడిలాగా వచ్చి ఇళ ముందు ఉంచి వెళ్ళిపోయాడు.
అచ్యుతమ్మ కోపంగా పూలు పళ్ళెంలో గుమ్మరించి కాగితం ఉండచుట్టి గదిలో మూలకి విసిరేసింది. అలా చెయ్యటమే మేలయింది. చిచ్చు వ్రాసిన అక్షరాలూ ఇళ కంటబడ్డాయి. సమయం చూసుకుని ఆ కాగితం చదువుకుంది.
తన విశ్రాంతి సమయంలో పెరటి దారిన బయటికొచ్చింది. నేరుగా జ్ఞానదేవ్ ఇంటికి వచ్చేసింది. తెల్లబోయాడు జ్ఞానదేవ్.
"ఇళా! నువ్వు...ఏమిటమ్మా! ఇలా వచ్చావ్?" అన్నాడు.
"మీరు రమ్మన్నారుట గదా మాస్టారు?"
"నేను రమ్మన్నానా?"
"అయితే ఇది చిచ్చు ఘనకార్యమన్నమాట!"
ఇళ ముఖంలో కోపం లేదు. నవ్వుతూనే అంది. ఇళ గొంతు విని లోపలి గదిలో మాట్లాడుకుంటున్న చిచ్చు, విదుషి వచ్చారు.
"ఏరా చిచ్చు! ఇంకా నీ అల్లరి పోలేదా?" మందలిస్తున్నట్టు అన్నాడు జ్ఞానదేవ్.
"సారీ! నాన్నగారు. ఈ మహాతల్లిని విదుషి అక్కతో కూడా మాట్లాడనియ్యలేదు వాళ్ళ అమ్మ. అందుకే మనింటికి రమ్మన్నాను. మీ పేరు చెప్తే కాదనదని నాకు తెలుసు. అక్కా, త్వరగా మాట్లాడేసెయ్."
"ఇళా! ఆ ప్రాంతంలో నీళ్ళు పడతాయని నీకెలా తెలిసిందమ్మా?" బుజ్జగింపుగా అడిగింది విదుషి.
"అక్కడ మైలారమ్మ ఉంది. మైలారమ్మ నాకు చాలాసార్లు కలల్లో నీళ్ళ మధ్య కనిపించింది. అంచేత అక్కడే నీళ్ళు పడతాయనుకున్నాను."
"మైలారమ్మ ఎవరూ?"
"కొండ దేవత."
"నువ్వు చూశావా ఆ దేవతని?"
"ఆ చాలాసార్లు!"
మతిపోయింది విదుషికి. ఆ అమ్మాయి అబద్ధం చెప్తోందని అనుకోలేకపోయింది. "మైలారమ్మ నీతో మాట్లాడుతుందా?"
"మాట్లాడదు. నీళ్ళలో పడిపోతూ కనిపిస్తుంది కలల్లో"
"మైలారమ్మ ఇప్పుడు కూడా అక్కడ ఉందా?"
"తెలీదు."
"ఎక్కడికెళ్ళింది?"
"ఇదివరకు ఆ దిబ్బమీద ఉండేది. అక్కడ నుయ్యి తవ్వారుగా! ఎక్కడికెళ్ళిందో మరి."
"ఇప్పుడు కూడా నీకు మైలారమ్మ నీళ్ళలో మునిగిపోతున్నట్లు కలలొస్తున్నాయా?"
"రావడం లేదు."
వర్ధని కాఫీ తీసుకొచ్చింది ఇళకి. వద్దనకుండా తాగింది. "మాస్టారు నాకు చదువుకోవాలని ఉందండీ. దుర్గ అంశ ఉంటే చదువుకోకూడదా?" అమాయకంగా అడిగింది ఇళ. జ్ఞాన్ మనసు కరిగింది.
"మీ నాన్నతో మాట్లాడతానమ్మా!" అన్నాడు. తన ప్రయత్నం ఫలించదని అతనికి తెలుసు. చిచ్చుకంతా అయోమయంగా ఉంది. ఇళ భవిష్యత్తు ఎటు పోతుందో అతడికి అంతుపట్టడం లేదు.