Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 9


                           నాలుగవ అనువాకము

                   (హవిర్నిర్వాపణము చెప్పుచున్నాడు.)

    1. హస్తములారా! మిమ్ము దేవతల కార్యములకు వినియోగించ గలుగుచున్నాను.

    (చేతులు కడుగుకొనవలెను.)

    2. శూర్పమా! నిన్ను యజ్ఞము కొరకు తీసికొనుచున్నాను.

    3. రాక్షసులు నశింతురు గాత. శత్రువులు నశింతురు గాత.

    (శూర్పమును సెగకు చూపవలెను.)

    4. అగ్నీ! నీవు దుష్టులను నశింపచేయువాడవు. మాపాపములను నశింపచేయుము. మమ్ము హింసించు వారిని నశింపచేయుము. మేము నశింపచేయగోరిన శత్రువును నశింపచేయుము.

    (బండికాడియొక్క రంధ్రమును తాకవలెను.)

    5. శకటమా! నీవు దేవతా సంబంధివి. పరిశుద్ధవు. ధ్యానయోగ్యవు. అందరకు ఇష్టమైన దానవు. హవిస్సును మోయుదానవు. ఇప్పుడు దేవతలను ఆహ్వానించుదానవు అగుచున్నావు.

    (1. ఇది పురోడాశమునకు ఉపయోగించు ధాన్యము తెచ్చుబండి. 2. అధ్వర్యు బండికాడి ఉత్తరనొగను తాకి జపించవలెను.)

    6. శకటమా! నీవు ధాన్యము మోయవలసి ఉన్నది. క్రుంగకుము. హవిస్సువహించవలసి ఉన్నది. గట్టిపడుము. విరుగకుము.

    7. దాన్యమా! నిన్ను జగన్మిత్రుడగు సూర్యుని నేత్రమున చూచుచున్నాను. నిన్ను హింసించను. భయపడకుము.

    (అధ్వర్యుడు ధాన్యమును చూడవలెను.)

    8. ద్వారమా! వాయువు తగులవలసి ఉన్నది. విశాలమవగుము.

    (అధ్వర్యుడు ధాన్యపు గోతపు ముడి విప్పును.)

    9. ధాన్యమా! నేను సవిత అనుజ్ఞ యందు ఉన్న వాడను. అశ్వినుల బాహువుల తోడను - పూష హస్తముల తోను అగ్నికి ఇష్టమగునట్లు నిన్ను ఉంచుచున్నాను.

    (ధాన్యమును శూర్పమున - చేతిలో - పోయవలెను.)

    10. ధాన్యమా! నిన్ను అగ్నిషోమ దేవత కొరకు చేటలో పోయుచున్నాను.

    (9 వ మంత్రము దర్శయాగమునకు. ఇది పౌర్ణమాస యాగమునకు.)
   
    11. ఇది - ఈ ధాన్యము - దేవతలకు చెందునుగాక.

    12. మేము దేవతలతో కూడియున్నాము. ఈ ధాన్యము మాకు చెందును.

    (అధ్వర్యుడు ధాన్యమును తాకవలెను.)

    13. హవిస్సా! వర్థిల్లుటకు అభిమంత్రించుచున్నాను. ఇది దేవతలకు సమర్పించుటకే అగును.

    14. యాగప్రదేశమును వీక్షించుచున్నాను.

    15. వైశ్వానర జ్యోతిని దర్శించుచున్నాను.

    (అధ్వర్యుడు ఆహవనీయాగ్నిని చూచును.)

    16. ఇహ పరలోకములందున్న మా గృహములు గట్టిగా ఉండవలెను.

    17. ధాన్యరూపహవిస్సా! నీవు విశాల ఆకాశమున వర్తిల్లుము.

    (అధ్వర్యు చేటలో ధాన్యము తీసికొనును.)

    18. ధాన్యరూపహవిస్సా! నిన్ను భూమిమీద ఉంచుచున్నాను.

    (అధ్వర్యు ధాన్యమును గార్హ పత్య అగ్ని వద్ద పెట్టవలెను.)

    19. అగ్నీ! హవ్యం రక్షస్వ. హవ్యమును రక్షింపుము.

                         అయిదవ అనువాకము

        (ధాన్యపు పొట్టును పోగొట్టుట చెప్పబడినది.)

    1. జలమా! అచ్చిద్రపవిత్రమున జగదాధారుడైన సూర్యుని కిరణములు నిన్ను పవిత్రము చేయును గాత.

    (అగ్నిహోత్రహవణి అను పాత్రయందలి జలమున అధ్వర్యుడు దర్భచే చేయబడిన పవిత్రమును ముంచి, మూడు మారులు కదిలించి పవిత్రము చేయవలెను.)

    2. జలములారా! దర్భలు శుద్ధిచేయునవి. మీరు అట్టి దర్భలనే శుద్ధిచేయువారు. మీరు ఈ యజ్ఞమును నిర్విఘ్నముగ పూర్తిచేయించండి. మీరు ప్రవాహరూపులు. మానవులను మించిన వేగమున ప్రవహించువారు. ఈ యజ్ఞకర్తకు స్వర్గము కలిగించండి. పూర్వము ఇంద్రుడు వృత్రవధకు మీ సాయము కోరియున్నాడు. అట్టి జలములారా! ప్రోక్షితులు కండి.

    (ఇంద్రుడు వృత్రుని వధించదలచినాడు. ప్రజాపతిని ప్రార్థించినాడు. వజ్రాయుధమును నీటతడిపి వృత్రుని సంహరించమన్నాడు ప్రజాపతి. ఇంద్రుడు అట్లే వృత్రుని సంహరించినాడు. అందువలన ఇంద్రుడు నీటి సాయము అర్థించినట్లయినది.) (అధ్వర్యుడు వ్రీహులను ప్రోక్షించవలెను.)

    3. ధాన్యమా! మిమ్ము అగ్నిదేవత ఇష్టపడునట్లు ప్రోక్షించుచున్నాను.

    (ధాన్యమును ప్రోక్షించును - నీరుచల్లును.)

    4. ధాన్యమా! మిమ్ము అగ్నిషోమ దేవతకు ఇష్టమగునట్లు ప్రోక్షించుచున్నాను.

    (ప్రోక్షించును.)

    5. పాత్రలారా! మీరు దేవయాగము కొరకును, దేవసంబంధ కర్మ నిమిత్తమును పరిశుద్ధులు కండి.

    (అధ్వర్యు పాత్రలను మూడుమారులు ప్రోక్షించును.)

    6. కృష్ణాజినమున సూక్ష్మముగ ఉండు రాక్షసులను శత్రువులును నశింతురుగాక.

    (జింక చర్మమును మూడు సార్లు దులుపవలెను.)

    7. కృష్ణాజినమా! నీవు భూమికి చర్మరూపమవు. భూమి ఆ విషయము తెలిసికొనును గాత.

    (గార్హ పత్యాగ్నికి ఉత్తర భాగమున పరచవలెను.)

    8. ఉలూఖలమా! నీవు వనస్పతి సంబంధివి. ధాన్యము దంచుటకు ఆధారమవు. కృష్ణాజినము నిన్ను తన దానినిగా గుర్తించును గాత.

    (రోటిని కృష్ణాజినముపై పెట్టును.)

    9. ధాన్యమా! నీవు అగ్నికి శరీరమవు. మాట వెలువడుటకు కారణమవు. కావున నిన్ను దేవతలు ఆరగించుటకు తీసికొనుచున్నాను.

    (ధాన్యమును రోటిలో పోయును.)

    10. రోకలీ! నీవు చెట్టునుండి పుట్టినావు. అయినను రాతివలె గట్టిగా ఉన్నావు. ఇది దేవతల కొరకైన ధాన్యము. దీనిని పొట్టుపోవునట్లు దంచుము.

    (దంచవలెను.)

    11. పాషాణమా! యజ్ఞకర్త మధుర రసహవిస్సును తెచ్చుచున్నాడు. ఈ విషయము దేవతలకు తెలియపరచుము. మేము దృషత్, ఉపలముల ధ్వనిచేత శత్రుమూకలను గెలుతుము.

    (ఒక రాతిపై మరొకరాతితో కొట్టవలెను.)

    12. శూర్పమా! వర్షమున పెరిగిన వెదురున పుట్టిన దానవు. అందువలన వర్షమున వర్ధిల్లిన దానవే యగుదువు.

    (ధాన్యమును చేటలో చెరిగి శుభ్రము చేయవలెను. చేటను ముందునగాని, ఉత్తర దిక్కునగాని ఉంచవలెను.)

    13. ధాన్యమా! వర్షమున పెరిగిన వెదురున పుట్టిన చేట నిన్ను వర్షమున పెరిగిన దానిగా తెలిసికొనును గాత.

    14. రాక్షసులు దూరము చేయబడినారు. శత్రువులు దూరము చేయబడినారు.

    (ధాన్యపు పొట్టు మున్నగు వానిని పోగొట్టుట అని అర్థము.)

    15. పొట్టూ! నీవు రాక్షసుల భాగమవు.

    (పొట్టును గిన్నెలో వేసి వేరుగా ఉంచవలెను.)

    16. తండులములారా! వాయువు మిమ్ము మాకలు మున్నగునవి లేకుండునట్లు బాగుచేయును గాత.

    (బియ్యమును శుభ్రము చేయవలెను.)

    17. బియ్యమా! చెరుగునపుడు చేటనుండి మీరు అటునిటు పడుదురు. అట్టి మిమ్ము హిరణ్యపాణియగు సవితా దేవత స్వీకరించును గాత.

    (చేటలోని బియ్యమును పాత్రలో పోయును.)

                           ఆరవ అనువాకము

                     (ఇది వ్రీహ్యా వహనము చెప్పినది.)

    1. కృష్ణాజినము నందు సూక్ష్మముగా ఉండు రాక్షసులు శత్రువులు నశింతురు గాత.

    2. కృష్ణాజినమా! నీవు భూమికి చర్మరూపమవు. అట్లని భూమి తెలిసికొనును గాత.

    3. శమ్యా! నీవు స్వర్గమును ధరించినదానవు. కృష్ణాజినము భూమికి చర్మరూపము. అది నిన్ను తన దానిగా తెలిసికొనును గాత.

    (జింక చర్మము మీద శమ్యను ఉంచవలెను.)

    4. దృషత్ పాషాణమా! నీవు పర్వత సంబంధివి. నీకు నూరుట తెలియును. స్వర్గమును ధరించిన శమ్య నిన్ను తనదానినిగా తెలియును గాత.

    (శమ్యపై రాతిని పెట్టవలెను.)

    5. ఉపలా! నీవు పర్వత సంబంధివి. నూరుట తెలిసిన దానవు. దృషత్తు నిన్ను తనదానినిగా తెలిసికొనును గాత.

    (1. ఉపల రుబ్బురాయి అగును. 2. రాతిపై రుబ్బురాతిని ఉంచును.)

    6. నేను సవితా దేవుని అనుజ్ఞ యందు ఉన్నవాడను. అశ్వినుల బాహువులతోను, పూష హస్తములతోను నిన్ను దృషత్తుపై ఉంచుచున్నాను. నీవు పిండి చేయదగినదానవు. దేవతలను సంతోష పరచుము. "ధినుహిదేవాన్"

    (బియ్యమును దృషత్తుపై ఉంచును.)

    7. బియ్యమా! నిన్ను ప్రాణము కొరకు నూరుచున్నాను.

    (బియ్యమును తూర్పువైపు నూరవలెను.)

    8. బియ్యమా! నిన్ను అపానము కొరకు నూరుచున్నాను.

    (బియ్యమును పడమటివైపు నూరవలెను.)

    9. బియ్యమా! నిన్ను వ్యానము కొరకు నూరుచున్నాను.

    (మధ్యన నూరవలెను.)

    10. యజమానికి దీర్ఘాయువు కొరకు కర్మహేతువగు ఉపలను పట్టుకొనుచున్నాను.

    (నూరిన పిండిని తూర్పువైపునకు త్రోయవలెను.)

    11. అటునిటుపడు బియ్యపు గింజలను హిరణ్యపాణియగు సవిత స్వీకరించును గాత. "దేవో వ స్సవితా హిరణ్యపాణిః ప్రతిగృహ్ణాతు"

    (పిండిని కృష్ణాజినమున ఉంచవలెను.)

                             ఏడవ అనువాకము

        (పురోడాశమునుంచు పాత్రలను కాల్చు విధము చెప్పుచున్నాడు.)

    1. ఉపనేషమా! నీవు నిప్పు కణికలను పట్టుకొను సాధనమవు. మంత్రపూతమగు పురోడాశమును దేవతలకు అందించుము.

    (1. మోదుగు కొమ్మ విరిచి పట్టుకారువలె చేసినది ఉపవేషము. 2. అధ్వర్యుడు ఉపవేషము అందుకొనవలెను.)

    2. గార్హ పత్యాగ్నీ! వండినదానిని కాక ఇతరమును తిను అగ్నిని పారద్రోలుము.

 Previous Page Next Page