"మా నాన్నగారికి రాయకుండా, వాళ్లకి చెప్పకుండా నేనేం చెయ్యను. మీవాళ్ళిచ్చే కుర్చీలకి, మంచాలకి మొహం వాచిలేను. మహా ఏ కారో తెచ్చియిచ్చినట్లు పదిసార్లు పదివేలు తెచ్చానని మీ అమ్మ గొప్పగా చెపుతూంది."
"అదన్నమాట అసలు సంగతి. కారు కావాలన్నమాట - ఆ కారు కోసం ఇన్ని డొంకతిరుగుళ్ళు ఎందుకు..... సూటిగా అడగవచ్చుగా!" నిలేశాను.
మా గొడవకి అమ్మ గదిలోకి వచ్చింది. "అమ్మా..... మీ అల్లుడు గారికి కారు కావాలటమ్మా, అందుకు ఈ అలకంతా."
"కారా.... బాగుంది నాయనా. మా దగ్గర లక్షలకి లక్షలు మూలుగుతున్నాయా? పోనీ మీరామాట ముందే చెపితే తక్కిన ఖర్చులుమాని కారు కొనేవాళ్ళం. దానికోసం పిల్లని నానామాటలు అనడం ఎందుకు? అంతా అయ్యాక ఇప్పుడు కారు అంటే ఎక్కడి నుంచి తెస్తాం? మేం మామూలు సంసారులం బాబూ. పెళ్ళి అయ్యాక ఇలాంటి చిన్న విషయాలకి దాని మనసు మా మనసు బాధపెట్టడం బాగులేదు బాబూ!"
"ఏమిటీ..... మీ అమ్మాయి మేం అష్టకష్టాలు పెడ్తున్నట్టు చెప్పిందా?" పెడసరంగా అన్నారు.
"కన్నతల్లితో కాక ఇంకెవరితో చెప్పుకుంటుంది! అష్టకష్టాలు అంటే తిండి పెట్టకుండా మాడ్చి చంపడం, తిట్టడం, కొట్టడం మాత్రమే కాదు బాబూ..... కొత్త పెళ్ళికూతురు మనసు సన్నజాజిలా అతి నాజూగ్గా ఉంటుంది. ఆ పూవుని సున్నితంగా వాసన చూడాలి. జడలో తురమాలి - అంతేగాని మోటుగా పట్టుకుంటే నిమిషంలో వాడిపోతుంది. కొత్త కోడలిని, కొత్త భార్యని అపురూపంగా కాకపోయినా ఆదరంగా అయినా చూశారా, పెళ్ళిళ్ళలో ఏవేవో చిన్న చిన్న లోపాలు, పొరపాట్లు జరుగుతాయి. ఆ కారణంతో అభం శుభం తెలియని పిల్లని, అందరిని వదులుకుని మీ ఇంటికి వచ్చిన పిల్లని చూసే విధానం ఇదేనా?" అమ్మ బాధగా అంది.
"ఏం..... ఏం చేశాం మేము.... ఏదో నేరం చేసినట్లు నిలేస్తున్నారే!"
అమ్మ ఏదో జవాబీయబోతుంటే నేనే బలవంతంగా బయటికి లాక్కెళ్ళాను. ఆయన అమ్మతో అమర్యాదగా ఎక్కడ మాట్లాడతారోనని. ఆ పూటకి ఇంక బజారు లేదు. ఏం లేదు -
ఆ మర్నాడు "నేను వెళ్ళి మీనాన్నగారిని పంపిస్తానే. ఇతని మూర్ఖపు మాటలు చూస్తుంటే నాకేమిటో భయంగా వుంది. మనం సామానుకొంటే మాత్రం ఇతను పంతం కొద్దీ వాడకపోతే ప్రయోజనం ఏమిటి-" అంది దిగులుగా. ఆ వున్న ఒక్కపూటలో కూతురి కాపురం తీరు అర్థమయిపోయింది అమ్మకి. ఎడమొహాలతో కూచున్న మమ్మల్ని చూడలేక అమ్మ మర్నాడే వెళ్ళిపోయింది.
పెళ్ళయి నెలరోజులు అయింది. నా కాలేజి పోతుంది. అటెండెన్సుపోతుంది. ఈయన ఫారెన్ వెళ్ళే సంగతి ఇంకా ఏమీ తేలలేదు. చదువు వంకనన్నా ఇక్కడి నుంచి పోతే చాలనిపించింది. ఓరోజు నా చదువు మాట ఎత్తాను. 'క్లాసులు పోతున్నాయి, త్వరగా వెళ్ళాలి' అన్నాను.
"నీవా ఎమ్మే పూర్తి చెయ్యకపోతే కొంప ఏం మునగదులే" నిర్లక్ష్యంగా అన్నాడు.
"ఒక ఏడాది చదివి. ఇంకో ఆరునెలలుండగా మానేస్తానా - ఏమయినా సరే కంప్లీట్ చెయ్యాలి నేను. పెళ్ళికి ముందే చెప్పాను ఆ మాట."
"అంతగా చదవాలని వుంటే ప్రైవేటుగా వెళ్ళు పరీక్షకి"
"ఏడాది అయ్యాక ఇప్పుడు మానుకుంటే ఒక ఏడాది వేస్ట్ అవుతుంది నాకు. ఆరునెలల కోసం మళ్ళీ ప్రైవేటుగా అప్పియర్ అవాలా?" కోపం అణుచుకుంటూ అన్నాను. ఆయన తనని కాదన్నట్టు జవాబివ్వలేదు. "పెళ్ళికి ముందు మీ వాళ్ళు మీరు ఎలాగూ ఆరునెలలు ట్రైనింగ్ కి వెడతారు. అప్పుడు కంప్లీట్ చెయ్యొచ్చు అన్నారని గాని లేకపోతే అసలు పరీక్షలయ్యేవరకు పెళ్ళికి వప్పుకోలేదు నేను" రెట్టించి అన్నాను.
"చూద్దాంలే.... నా వీసా ఇంకా రాలేదు. నేనిక్కడుండగా నీవు వెళ్ళి అక్కడ చదువకపోతే మరేం కొంప మునగదు. అయినా పెళ్ళయ్యాక మొగుడి దగ్గర వుండాలి. లేదంటే అత్తింట్లో ఉండాలి గాని పుట్టింట్లో ఎందుకు? నేనెళ్లాక నీకంతగా చదవాలని ఉంటే మా ఇంట్లో వుండి చదువు" అన్నాడు.
నన్నెలాగోలాగ రెచ్చగొట్టి, నాచేత వాగించి, ఏడిపించాలనే ఆయన తత్వం అర్థం అయి ఉక్రోషం వచ్చింది.
"ఒక ఏడాది అయ్యాక మళ్ళీ అక్కడ చదవాలా! యూనివర్సిటీలు వేరు అయినా మీరు లేనప్పుడు మీ ఇంట్లో ఎందుకుండాలి? మా ఇంట్లో ఉండే చదువుతాను." నేను మొండిగా తెగేసి చెప్పాను.
"అయితే అసలు చదవక్కరలేదు. మాట్లాడకుండా ఇంట్లో కూర్చో. ఉత్త డిగ్రీకే ఇంత మిడిసిపడ్తున్నావు పోస్టు గ్రాడ్యుయేట్ అయితే నీ పొగరింకా ఎక్కువ అవుతుంది" ఆయన నన్ను రెచ్చగొట్టేవిధం చూస్తే కల్పించుకుని కావాలని నాతో దెబ్బలాటకి కారణం వెతుక్కుంటున్న ఆయన సాడిస్టిక్ మెంటాలిటీకి కసి, ఉక్రోషం వచ్చాయి.
"నేను చచ్చినా చదవాపను. నన్నాపగలరేమో చూడండి చూద్దాం!" కసిగా సవాల్ చేశాను.
"మీ వరస ముందురోజు నుంచీ చూస్తున్నాను. మీరింత సాడిస్ట్ అని తెలిస్తే చచ్చినా చేసుకొనేదాన్ని కాదు. మీరసలు ఏమనుకుంటున్నారు నా గురించి? మీరేం చేసినా, ఏం అన్నా నీవే గతి నాథా అంటూ మీ కాళ్ళ దగ్గిర పడుంటాననుకుంటున్నారా.... పెళ్ళయిందగ్గిర నుంచి చూస్తున్నాను.... ఏమిటసలు మీ ఉద్దేశం? మీరసలు ఏ పదో శతాబ్దంలోనో పుట్టాల్సిన మనుష్యులు. మీ థింకింగ్, మాటలు, చేతలు..... ఐ హేట్ యూ....ఐ హేట్ యూ...." అంటూ అరిచాను. "మీ చదువు, ఉద్యోగం చూసి మోసపోయాం. చదువుకి, సంస్కారానికి సంబంధం లేదని రుజువు చేశారు మీరు. మీలో ఒక్కటంటే ఒక్కటి ప్లస్ పాయింట్ లేదు. ఏ ఆడదీమీతో కాపురం చెయ్యలేదు. "ఏం అంటున్నదీ తెలియనంత ఆవేశంగా అలిసిపోయేవరకూ అరిచి గదిలోకి వెళ్ళి తలుపు భళ్ళున మూసుకుని ఆ రోజంతా తిండి తినకుండా తనివి దీరా ఏడ్చాను.
అయిదు రోజుల తరువాత నాన్నగారు వచ్చారు. నన్నూ, నా అవతారాన్ని, నా ఇంటినీ చూసి నేనెంత సుఖంగా ఉన్నదీ ఎవరూ చెప్పనక్కరలేకుండానే గ్రహించారు. అంత గంభీరంగా ఉండే ఆయన కళ్ళల్లో నీరు చిమ్మింది. 'ఏమిటమ్మా ఇదంతా?' అన్నారు బేలగా.