Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 7

    వంట! నిజానికి నాకురాదు! అయినా పెళ్ళికి ముందు అమ్మ, బొత్తిగా అన్నం వండటం అన్నా రాకపోతే ఎలాగే అంటూ బలవంతంగా అన్నం, చారు, కొన్ని తేలిగ్గా అయ్యే కూరలు చెయ్యడం చెప్పింది. కాని ఇలా వచ్చినరోజే పొయ్యిముందు కూర్చోవాలి.
    అనుకోలేదు. నా ఊహల ప్రకారం నా మొగుడు పెద్ద ఉద్యోగస్తుడు. ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి.
    గ్యాస్ స్టవ్, కుక్కర్, గ్రైండర్ అన్నీ వున్న మోడర్న్ కిచన్ నేను వచ్చేసరికి రెడీ చేసుంటారు. వంటమనిషి కాకపోయినా ఏ కుర్రోడో అయినా తప్పకుండా ఉంటాడు. నేను వంట చేస్తానన్నా ఆయన ఒప్పుకోరు. రోజూ ఆఫీసు నుంచి రాగానే సరదాగా ఏటో అటు వెళ్ళి వచ్చేటప్పుడు హోటల్లో భోజనం చేసి రావచ్చు!
    "డార్లింగ్.... ఇప్పటినుంచే వంట అని పెట్టుకోకు, కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం. నీవిప్పటి నుంచి ఆ వంటింట్లోనే పడి వుంటే నే చూడలేను." అంటారు అని ఊహించుకున్న నా ఊహలన్నీ తలకిందులయ్యాయి. నిజానికి భర్త అలా అంటే ఆ భార్య కరిగిపోయి వంట రాకపోయినా ఎలాగో తంటాలుపడి తనచేత్తో భర్తకి వండి పెట్టాలని తాపత్రయపడుతుంది. 'మీరిన్నాళ్ళూ హోటలు భోజనం తిన్నారు. నేను వచ్చాక కూడానా' అని ఆమే వండుతుంది.
    వంట నాకేం అంతరాదు.... ఏదో అన్నం, చారు, వేపుడు కొద్దిగా వచ్చు. అయినా బాబూ ఈ కిరోసిన్ స్టవ్ మీద వండలేను నేను. గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్ అవి లేకుండా ఎలా బాబూ? అమ్మనిరానీండి అన్నీ కొన్నాక వంట మొదలు పెట్టొచ్చు. మధ్యాహ్నం లంచ్ కి మీరెలాగూ రారు. నేను ఏదో తినేస్తాను. సాయంత్రం ఏదో హోటల్ కి వెళ్ళి తిని వద్దాం. బ్రేక్ ఫాస్ట్ కి బ్రెడ్, ఎగ్స్ అవి తీసుకురండి' అన్నాను.    
    "అబ్బ..... ఇన్నాళ్ళూ హోటల్ కూడు తప్పలేదు. ఇప్పుడు కూడా బ్రెడ్ ఆమ్లెట్లు తినడం నావల్ల కాదు. వంట నేర్పకుండా మీ అమ్మ ఏం చేసింది. ఇన్నాళ్ళు మొగుడికి వండి పెట్టాలని తెలీదా' విసురుగా ఎత్తి పొడిచారు.     
    "ఆ మొగుడు పెద్ద ఉద్యోగస్తుడు, ఏ వంట వాళ్లనో పెట్టి వండిస్తారనుకున్నాను."
    "మాటలు వచ్చు బాగానే, ఆ నేర్పు పనిపాటల్లో ఉంటే బాగుండేది. ఆడది వంటకూడా చెయ్యకపోతే మరి ఆ పెళ్ళాం ఉండి ఏం లాభం?" రుసరుసలాడుతూ బాత్ రూంలో దూరారు. కట్టుకున్న ఆశాసౌధం ఒక్కో అంతస్థు కళ్ళముందే కూలిపోతున్నట్లనిపించింది. ఆయన అలా అన్నారన్న పంతం కొద్దీ ఆ కిరసనాయిల్ స్టవ్ మీదనే, ఆ ఉన్న గిన్నెలతోనే ఎలాగో వంట వండాను. కిర్సనాయిల్ పొగకి కళ్ళు మండాయి. చేయి కాల్చుకున్నాను. కూర తరుగుతూ వేలు కోసుకున్నాను. ఫిజికల్ బాధలన్నింటినీ మించి మనసుకి కలిగిన గాయంతో వంట చేస్తూ బొటబొట కన్నీరు కార్చాను.   
    కొత్త భార్య, కొత్త కాపురం, తెల్లచీర, మల్లెపూలు, పండువెన్నెల, పరిమళాలు, అగరువత్తులు, తాంబూలాలు, సెంట్లు.... ఈ పదాలకి అర్థాలు తెలియనేలేదునా మూడు నెలల సంసార జీవితంలో. అమ్మ ప్రత్యేకంగా కొనిచ్చిన తెల్ల వాయిల్ చీరలు పెట్టె అడుగునే ఉండిపోయాయి. రకరకాల ఫారెన్ సెంట్ల మూత తెరవలేదు. ఖరీదయిన కొత్త చీరలలో షికార్లు తిరగలేదు. మ్యాచింగ్ బ్యాగులు, చెప్పులు ఇల్లు కదలనేలేదు.  
    నేను వచ్చేనని తెలుసా ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయన కొలీగ్స్ మాత్రం భార్యలతో వచ్చారు. ఎవరన్నా వస్తే కూర్చోబెట్టడానికి కుర్చీ అన్నాలేదని సిగ్గుపడ్డాడు. గతిలేకపోతే వేరే సంగతి. అన్నీ ఉండి ఈ దరిద్రం ఏమిటని బాధపడేదాన్ని.     
    నా ఉత్తరం చూసి అమ్మ డబ్బు పట్టుకు వచ్చింది. మా ఇల్లు నా వాలకం చూసి బెంబేలుపడిపోయింది." అయ్యయ్యో.... పదిహేను రోజులకే ఇలా తయారయ్యావేమిటి? ఈ స్టవ్ ఏమిటి? ఆ మసిగిన్నెలేమిటి? అంట్లు నీవు తోమడం ఏమిటి? పనిమనిషన్నాలేకుండా వంటెందుకు మొదలు పెట్టావసలు? ఈ ఇల్లేమిటి గుమస్తా కొంప కంటె కూడా అధ్వాన్నంగా ఉంది. ఏం మనిషే ఇతను' అంటూ గోల పెట్టింది.
    అమ్మ వచ్చాక ఆయన పలకరించనన్నాలేదు. గదిలో మూతి బిగించుకుని కూర్చున్నారు. ఆయన ఆఫీసుకి వెళ్ళాక జరిగిందంతా చెప్పుకుని ఏడ్చాను. వాళ్ళన్న మాటలు, వాళ్ళ ట్రీట్ మెంట్ అంతా చెప్పాను. అమ్మ గుండెలు జారిపోయాయి." ఇదేం ఖర్మ, ఎత్తి ఎత్తి ఎంగిలాకులమీద అడుగు వేసినట్లు, ఈ సంబంధం మనపాలపడింది. వాళ్ళకంటే పోనీ బుద్ధిలేదు, ఇతను చిన్నవాడూ ఈ కాలంవాడు. ఇతని బుద్ధి ఏమయింది? వెధవ లాంఛనాలు మర్యాదలు అంటూ దానికోసం నిన్ను బాధపెడ్తారా..... వుండురానీ అతని పని చెబుతాను. పిల్లనిచ్చాం అంటే వాళ్లడుగులకి మడుగులు వత్తినోరుమూసుకుని మేము పడి వుండాలా? అంత కావల్సినవారు 'మాకేం అక్కరలేదని' గొప్ప కబుర్లు చెప్పకుండా ఇలా కావాలి అని ముందే ఏడవచ్చుగా' అంటూ అమ్మ ఆవేశపడింది.   
    ఇద్దరం ఏం చెయ్యాలో తోచక తలలు పట్టుకున్నాం. 'ఉండు మీ నాన్నగారిని రమ్మని ఫోను చేద్దాం. పెళ్ళయిన నెలకే కాపురం ఇలా ఉంటే ముందెలా ఉంటుందో, నాన్నని నాలుగూ అడగమందాం' అంది.    
    ఆయన సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే అమ్మ ఆవేశం అణుచుకుని శాంతంగానే "పిల్ల సంసారానికి కావల్సినవి నాలుగు కొనమని ఆయన పదివేలిచ్చి నన్ను పంపారు. మీ సంసారానికేం కావాలో తెచ్చుకోవచ్చు బజారు కెడదాం పదండి" అంది.   
    ఆయన మొహం గంటు పెట్టుకుని "ఇప్పుడేం వద్దు నేనెలాగూ ఆరునెలలు ట్రైనింగ్ కి వెళ్ళాలి. అయినా ముందు మా వాళ్ళని అడగాలి. మా ఇంట్లో అన్నీ వున్నాయి. ఏం కొనమంటారో అడగాలి" అన్నాడు. అమ్మ వళ్ళుమండింది. అయినా శాంతంగానే, అల్లుడు గనక ఆవేశం దిగమింగుకుని "అక్కడుంటే మీకేం వస్తుంది? ట్రైనింగ్ కి వెడితే మాత్రం బొత్తిగా మంచాలు, పరుపులు అయినా లేకుండా కిందపడుకోడానికి ఏం ఖర్మ! దానికసలు ఈ కిరసనాయిల్ స్టవ్ లు అవి అలవాటు లేదు. నాలుగు కుర్చీలన్నా కొనుక్కోకుండా ఏం దరిద్రం ఇది.
    మీకు వీలుకాకపోతే మేం ఇద్దరం వెళ్ళి తెస్తాం' అంది. "పద విద్యా.... తయారవు మనిద్దరం వెడదాం' అంది అమ్మ. అమ్మ గదిలోంచి వెళ్ళగానే "ఇదిగో నాకేం అక్కరలేదు. కొన్నావంటే ఆ మంచాల మీద నేను పడుకోను. నీవు కొనుక్కుని నీవే పడుకో" అన్నారు మొండిగా.    
    "అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా.... మీకెందుకింత పంతం" అన్నాను కోపంగా.

 Previous Page Next Page