సహజంగా కాస్త పెళుసుగా వుండే ఆ అమ్మాయి అలా మౌనం వహించటాన్ని ఇంకోలా భావించాడు రవి. సున్నితంగా ఆమె చేతిని ముద్దు పెట్టుకొని, "థాంక్స్" అన్నాడు.
మొట్టమొదట ఈ పురుష స్పర్శ ఆమె హృదయ తంతుల్ని ఎక్కడో మీటినది. కానీ అంతకన్నా బలమైన భావం ఏదో ఆమెలో చోటు చేసుకుంది. ఆ భావానికి నిర్వచనం లేదు. ఏమిటో ఆమెకే అర్థం కావటంలేదు. ఆ అలజడితోనే నిద్రపట్టక ఆమె తన గదిలోంచి బయటకొచ్చింది.
కౌసల్య తన గదిలో చదువుకుంటోంది. రవి ఇంట్లో లేడు.
ఆమె మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. ఆ యింట్లో అన్ని గదులూ ఆమెకి పరిచయమే.
కారిడార్ నిశ్శబ్దంగా వుంది. గాజు అద్దాల తలుపుల్ని తోసుకుని బాల్కనీలోకి వెళ్ళటం కోసం అడ్డుగానున్న పరడాను తొలగించి అక్కడ కనబడిన దృశ్యాన్ని చూస్తూ అలాగే చాలాసేపు నిలబడిపోయింది.
చైతన్య ఈజీఛైర్లో విశ్రాంతిగా పడుకుని వున్నాడు. నెమ్మదిగా వీచే పిల్లగాలికి అతడి తెల్లటి లాల్చీ సుతారంగా కదులుతోంది. పక్కనే కుర్చీలో కాంతిమతి కూర్చొని వుంది. అతడి వళ్ళో బాబు కూర్చొని ఆడుకుంటున్నాడు. కాంతిమతి స్టూలుమీద వున్న ఆకులకు సున్నంరాసి అతడి నోటికి అందిస్తోంది. ట్రాన్సిష్టర్ లోంచి సితార్ నెమ్మదిగా వినిపిస్తోంది. పిట్టగోడ మీదకు వాలిన కొబ్బరిచెట్టు ఆకులు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఆప్యాయతల్ని ఇంత అందంగా ప్రచురించుకోవచ్చునన్న సంగతి ఆమెకి ఇప్పుడే తెలిసింది. తన కుటుంబం, తల్లీ, తండ్రీ జ్ఞాపకం వచ్చేరు. ఎంత అసహ్యకరమైన వాతావరణం అది. లాటరీ టిక్కెట్ల పిచ్చితో జేబులు ఖాళీ చేసుకొని ఆ విసుగుతో ఇంటికొచ్చి, తింటూ తింటూ ఖాళీ కంచాలు విసిరేసే తండ్రీ, మంచంమీద పడుకొనే నానా తిట్లు తిట్టే తల్లీ-ఎంత భయంకరమైన గతం....
మనుష్యులు ఇంత ఆనందంగా వుండగలరన్నమాట? ఎంత చక్కటి ఆహ్లాదకరమయిన వాతావరణం.
అసలిలాటి ప్రపంచం ఒకటున్నదనీ, ఈ ప్రపంచంలో మనుష్యులు ఇంత సున్నితంగా, హాయిగా బ్రతికేస్తారనీ తమలాంటి వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఇరవై నాలుగు సంవత్సరాలు ఎంత హేయమయిన స్థితిలో బ్రతికింది తను!
తెలియనంత సేపూ ఫరవాలేదు. తెలిసేక.....
చప్పున ఆమెకు వచ్చినప్పటి నుంచి తన మనసులో కదలాడే అస్పష్టమైన భేదానికి కారణం ఏమిటో!
'పోలిక'
4
"పది రోజుల్లో క్రిస్టమస్. ఆ రోజే బాబు పుట్టినరోజు..... సాయంత్రం మనం పార్టీ ఇస్తాం. ఆ రోజు నాలుగయిదు ఇళ్ళల్లో పార్టీలకు వెళ్ళవలసి వుంటుంది. మ్యూజిక్ డాన్సులతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు" అన్నాడు రవి.
అందరూ మెయిన్ హాలులో కూర్చుని వున్నారు. కౌసల్య మేనల్లుడికి స్వెట్టర్ కుడుతోంది. కాంతిమతి ఒడిలో బాబు ఆడుకొంటున్నాడు.
"శారద వంటల్లో సిద్ధహస్తురాలు . ఎంతమందికయినా యిట్టే వంటేస్తుంది" అంది కిరణ్మయి.శారద సిగ్గుతో తలవంచుకుంది.
"మరి నువ్వేం చేస్తావే?" చైతన్య అడిగాడు.
"సూపర్ విజన్."
"అది నా పని" నవ్వేడు.
"ఏదీ చేతకానివాడు తన పనికి పెట్టుకునే ముద్దుపేరది" అంది కౌసల్య అన్నయ్యని వెక్కిరిస్తున్నట్లు. అందరూ నవ్వేరు.
బాబుకి పాలు పట్టటానికి కాంతి లోపలికి వెళ్ళింది.
"అన్ని చోట్లకి రానక్కరలేదు. కాని రాబర్టు ఇంటికి మాత్రం రండి....అక్కడ పార్టీ నిజంగా చూడాల్సిందే" అన్నాడు చైతన్య ఇద్దరితో.
ఇంతలో ఫోన్ మోగింది- రవి వెళ్ళాడు.
శారద, కౌసల్య అల్లుతున్న స్వెట్టర్ని పరిశీలిస్తోంది.
బయటనుంచి రవి అరిచేడు. "కౌసల్య ఫోన్ - ఫ్రెమ్ దీపక్"
కౌసల్య కొద్దిగా సిగ్గుతో అక్కడినుంచి లేచి వెళ్లింది.
ఆమె వెళ్ళేక చైతన్య అన్నాడు. "దీపక్ అని కొట్టాయంలో వుంటాడు. కౌసల్య కాలేజీమేట్. మంచి టెన్నీస్ ప్లేయర్. వచ్చే వేసవి తరువాత తన లైఫ్ మేట్....."
కిరణ్మయి తన మనస్సులో సంశయాన్ని దాచుకొనే ప్రయత్నం ఏమీ చేయక "మీలో ప్రేమించుకోవటాలూ, పెళ్ళిచేసుకోవటాలూ చాలా సులభంగా జరిగిపోతూ ఉంటాయనుకొంటానే" అంది.
శారదచప్పున తలెత్తి అక్కవేపు చూసింది. ఈ సంస్కారం రహితమైన ప్రశ్న అతడిని ఎలా గాయపరుస్తుందో అన్న భయం ఆమె మొహంలో కనిపించింది.
చైతన్య మొహంలో మాత్రం అతడి స్వభావసిద్ధమైన చిర్నవ్వు చెరిగిపోలేదు. కిరణ్మయి ప్రవృత్తిని అతడు మొదటి రోజే అర్థం చేసుకున్నాడు.
నవ్వుతూనే "నేనైనా కౌసల్యకి అంతకన్నా మంచి సంబంధం తేగలనని అనుకోను" అన్నాడు.
"మీకీ ప్రేమలమధ్య నమ్మకం వుందా?"
ఊహించని ఈ ప్రశ్నకి అతడు కొంచెం విస్తుబోయినా వెంటనే తేరుకొని "ఎలాగో పెళ్ళవుతుంది కదా! ఆప్యాయత అదే పట్టుకొస్తుంది" అన్నాడు.
శారద అక్కయ్యని వారించబోయింది కానీ, కిరణ్మయి మొహం ఏదో చెప్పాలన్న ఆవేశంతో ఎర్రబడింది. ఎప్పట్నుంచో ఆమెలో పేరుకుపోయిన భావం అగ్ని పర్వతంలా బ్రద్ధలైంది.
"లేదు! ఈ ప్రేమలూ, ఆప్యాయతలూ డబ్బుతో ముడిపడ్డవి. కడుపు పూర్తిగా నిండితే, ఎయిర్ కండీషన్ రూమ్ లో చల్లగాలి సేద తీరుస్తూ వుంటే......ప్రేమా, ఆప్యాయతా వద్దన్నా పుట్టుకొస్తాయి. ఒకవేపు కడుపు కాలినపుడు, డబ్బే ముఖ్య సమస్య అయినపుడు , ఈ అప్యాయతలన్నీ గుండెల్లో కనబడని చోటుకు వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ స్థానాన్ని విసుగూ, చిరాకు భర్తీ చేస్తాయి."
ఆమె భావావేశానికి అతడు విస్తుబోయాడు. బీదతనంవల్ల ఆమెలో కలిగిన పెర్వర్షన్ కి విచారించాడు. "లేదు కిరణ్మయీ! నేను నీ భావంతో ఏకీభావించను. ఈ బంధుత్వాలూ, ఆప్యాయతలూ మనిషి తన సంస్కారంతో ఏర్పర్చుకొన్నవి. కేవలం ఆకలివల్ల మనిషి మృగంగా మారటమే సంభవించిన పక్షంలో ఈ ప్రపంచంలో బీదవాళ్ళు తమ సంసారాలన్నింటినీ కొల్లద్రోసుకునేవారు."
కిరణ్మయి అతడి మాటల్ని మధ్యలోనే ఆపుజేస్తూ "ఏదో కలిసివుండాలి కాబట్టి వాళ్ళు వుంటున్నారు కానీ, మీకు తెలీదు.....భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్ళు ప్రతిరోజూ ఎంత బద్ధశత్రువుల్లా పోట్లాడుకుంటారో మీకు తెలీదు. ఆ మురికి కూపాల్లో, ఆ చీకటి గుహలలో ఆప్యాయత అనేది వెతికిచూసినా కనపడదు."
"ఏది ఏమైనా.....డబ్బే ఆప్యాయత బయటపడటానికి కారణమని నువ్వంటే నేనొప్పుకోను."
శారద ఈ సంభాషణ ఆపుచెయ్యటానికి ప్రయత్నిస్తూ..... "పోనీలెండి ఇక ఆ విషయం వదిలిపెట్టండి" అంది.
అంతలో కౌసల్య అక్కడికి వచ్చింది. "ఏమిటంత గట్టిగా వాదించుకుంటున్నారు?" అడిగింది.
కిరణ్మయి నవ్వి.... "బీదతనం మీద తన అభిప్రాయం తప్పని నేనూ, ప్రేమమీద నా అభిప్రాయం తప్పూ అని తనూ వాదించుకుంటున్నాము" అంది. "ప్రేమాభిమానాలు డబ్బు లేకపోతే కోపమూ విసుగుల మధ్య కప్పబడి పోతాయి."
కౌసల్య నవ్వి "అన్నయ్యకి తెలియని విషయం వుంటుందని నేననుకోను. డబ్బుతో అన్నీ కొనుక్కోలేం" అంది.
"నా అభిప్రాయం తప్పని నేనూ అనుకోను" అంది కిరణ్మయి పట్టుదలగా.
చైతన్య ఇవేమీ వినటం లేదు. కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. దూరంగా సముద్రపు హోరు లీలగా వినిపిస్తూంది.
భావాన్ని నిరూపించటం కోసం అనుభవం అనివార్యం. సంపూర్ణర్థం చూడకపోతే భావం ఎప్పుడూ అనిశ్చిత్తము, అవ్యక్తము, అసిద్ధమూ, అసంపూర్ణమే. భవమే రియాలిటీ!
* * *
"ఎంతుంది స్టాకు?" చైతన్య అడిగేడు.
"ఆరు లక్షలదాకా వుంటుంది బాబూ!"
"ఇంకో నాలుగు లక్షలు కావాలి. నెలాఖరుకు కొంచెం ధర ఎక్కువయినా కొనెయ్యమనండి. మొదటివారంలో పదిలక్షలకు కాంట్రాక్టుంది."
రంగయ్య తలూపాడు.
ఇంక ఆ విషయం చూసుకోనక్కరాలేదు. రంగయ్యకి ఏదైనా పని అప్పగిస్తే అది జరగదన్న ప్రసక్తిలేదని చైతన్యకి తెలుసు. పది సంవత్సరాల్నుంచీ నమ్మకంగా పనిచేస్తున్న వర్కర్.
చైతన్య వచ్చి కారు ఎక్కగానే రంగయ్య కోల్డు స్టోరేజ్ లోకి వెళ్ళాడు.
ఐస్ అచ్చులమధ్య రొయ్యలు దీర్ఘనిద్రలో వున్నాయి. దాదాపు రెండువేల ప్యాకెట్లు- ఆరులక్షలు విలువచేసే ప్యాకెట్లు.
కంప్రెషర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసేడు.
తలుపు మూసి బయటకొచ్చేడు.
విశాలమైన మెయిన్ హాలు, వరుసగా పెద్ద పెద్ద ఖాళీట్రేలు, ట్రేలమధ్య సన్నటి ధార.
అంతా నిశ్శబ్దంగా వుంది.
క్లోరిన్ వాసన.
ప్రెస్సింగ్ మిషన్ దగ్గరకెళ్ళి స్ప్రింగ్ లో ఆయిల్ చుక్కలు వేసేడు. నిజానికి ఇవన్నీ చూసుకోవటానికి కుర్రవాళ్ళున్నారు. కానీ తను స్వయంగా చూసుకొంటేగానీ అతనికి తృప్తి వుండదు.
చాలా పాతకాలం నౌఖరు అతడు.
చైతన్య తండ్రికాలం నుంచి పనిచేస్తున్నాడు. ఫీల్డర్ గా చేరి సూపర్ వైజర్ అయ్యాడు.
అతడికి నవ్వొచ్చింది.
ఇంత నిశ్శబ్దంగా వున్న హల్ ని మరుసటిరోజు చూస్తే అసలు పోలిక వుండదు.
దాదాపు నూటయాభయ్ మంది యువతులు చురుగ్గా పని చేసుకుపోతూ వుంటారు.
రంగయ్య మెయిన్ హాల్ నుంచి బయట రూమ్ లోకి వచ్చేడు. చిన్న గది అది.
బల్లమీద స్టాక్ రిజిష్టర్ వుంది. తీసి చూశాడు.
నార్త్ కొచ్చిన్ నుంచి రావాల్సిన 'మెక్ నైజెడ్ బోట్స్' ఇంకా రానట్లుంది. అవేగాని రాకపోతే విశాఖపట్నం నుంచి తెప్పించాల్సి వస్తుంది.
దాదాపు మూడు సంవత్సరాల్లో ఈ బోట్లు నాలుగు రెట్లవడంతో విపరీతమయిన పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. ఏ మాత్రం రొయ్యలజాడ కనబడినా, ఒడ్డున చేరుకున్న బోట్లుకూడా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి.
ఈ ఆలోచన్లతోనే తలుపు తాళం వేసి బయటికి వచ్చేడు.