"ఇలాంటి నాటకం ఇంకోటి ఆడే అవకాశం ఇంకోసారి ఇవ్వను నీకు! రేపటి నుండి నువ్వు ఇంక ఆఫీసుకి రానక్కర్లేదు. సెలవు పెట్టెయ్! నాకున్న పరపతి అంతా ఉపయోగించి నీ ఉద్యోగం పీకించేస్తాను. యా! దిసీజ్ ఏ ప్రామిస్!"
పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళి కార్లో కూలబడ్డాడు ఆయన. కోపంతో అణువణువూ దహించుకుపోతోంది ఆయనకు.
నిఖిల్ పెద్ద నేరస్తుడని లోకమంతటికీ తెలుసు. కాని అతన్ని జైల్లో పెట్టడానికి తగినంత బలమైన సాక్ష్యం ఇంతవరకూ దొరకలేదు. ఇన్నాళ్ళకు ఒక ప్రత్యక్ష సాక్షిని పట్టుకోగలిగాడు తను. నిఖిల్ కు మాగ్జిమమ్ శిక్ష వేయించగలననుకున్నాడు. కానీ ఈ అమ్మాయి శనిదేవతలా దాపురించి కేసుని అనుకోని మలుపు తిప్పేసింది.
అసలు ఈ అమ్మాయినే ఆ కంప్లయింట్ గా చూపిస్తూ మళ్ళీ కేసు ఫ్రేం చేస్తే ఎలా ఉంటుంది?
అతని బుర్ర తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టింది.
కోర్టు వరండాలో నిలబడి ఉన్న అమూల్యని నిందాపూర్వకంగా చూస్తున్నారు అందరూ. నిన్నటిదాకా తను వీళ్ళందరి దృష్టిలో చక్కని చుక్క. లీగల్ ప్రపంచంలో ఉద్భవిస్తున్న సరికొత్త ధృవతార. క్రిమినల్ లాలో యూనివర్శిటీ గోల్డు మెడలిస్టు. రెండేళ్ళలో తారాపథాన్ని అందుకోవాలని అర్రులు చాస్తున్న అమ్మాయి.
కానీ ఇవాళ?
ఇవాళ తను ఆకాశంలో నుండి భూమి మీదకు జారిపోతూ భస్మీపటలమైపోతున్న ఉల్క!
తను నిఖిల్ కి తోడు దొంగ అని వాళ్ళందరూ అనుకుంటున్నారని తెలుసు అమూల్యకి. "నేను అలాంటిదాన్ని కాను. నాకేం తెలియదు. నన్ను ఎవరో పావులాగా ఉపయోగించుకున్నారు" అని లోకమంతా వినబడేటంత పెద్దగా అరిచి చెప్పాలనిపించింది.
కానీ అలా చెయ్యలేదు అమూల్య. తలవంచుకొని గబగబనడిచి బయట నిలబడి ఉన్న ఓ ఆటోలో ఎక్కేసింది.
అపార్ట్ మెంట్ చేరేసరికి తనకోసం అరెస్టు వారంట్ ఉంటుందో సెర్చి వారంటే ఉంటుందో, కోర్టు సమనులే ఎదురు చూస్తుంటాయో, తెలియదు ఆ అమ్మాయికి.
* * *
అపార్టుమెంట్ తలుపు తెరిచి లోపలికెళ్ళిపోయి, స్లిప్పర్సు కూడా విప్పకుండానే సోఫాలో ఒరిగిపోయింది అమూల్య. ఆ ఏకాంతంలో ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది చాలాసేపు.
అప్పుడు మెల్లిగా గమనానికి వచ్చింది. ఏదో వాసన!
ఏం వాసన అది? సిగరెట్ పొగవాసన! చటుక్కున కళ్ళు తెరిచి చూసింది అమూల్య. టీవికి ఎదురుగా వేసిన సోఫా పై నుండి రింగుల్లా వస్తోంది పొగ. నల్లటి ఉంగరాల జుట్టు ఉన్న తలా, స్టిఫ్ గా ఉన్న షర్టు కాలరూ కనబడుతున్నాయి.
ఒక్క ఉదుటున లేచి కూర్చుంది అమూల్య. "ఎవరు? హూ ఈజ్ దట్?" అంది పెద్దగా.
నిదానంగా లేచాడు ఆ మనిషి. "భయపడకండి. నేను మీ శ్రేయోభిలాషినే!"
వెంటనే తలుపువైపు చూసింది అమూల్య. తను అపార్ట్ మెంట్ లోకి రాగానే లోపలినుండి గడియ పెట్టింది. వేసిన తలుపులు వేసినట్లుగా ఉండగానే ఇతను లోపలికి ఎలా వచ్చాడు?
ఒక్కసారిగా ముచ్చెమటలు పోశాయి అమూల్యకి.
"నా పేరు తరుణ్" అన్నాడతను మర్యాదగా. "నేను 'రా'లో పని చేస్తున్నాను. 'రా' అంటే తెలుసునా? ఆర్ ఏ డబ్ల్యూ, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అంటే దాదాపు భారతదేశపు గూఢచారి లాంటివాణ్ణి అని చెప్పుకోవచ్చు, వ్యవహారిక భాషలో"
నోటమాట రాకుండా చూస్తూ ఉండిపోయింది అమూల్య. ఇతను గూఢచారా? గూఢచారి తన అపార్ట్ మెంట్ కి ఎందుకు వచ్చాడు?
అతను హుందాగా అడుగులు వేస్తూ వచ్చి అక్కడే ఉన్న మరో సోఫాలో కూర్చున్నాడు. అప్రయత్నంగానే అతన్ని ఆపాదమస్తకం ఒకసారి పరికించి చూసింది అమూల్య.
మెత్తగా ఫాషన్ బుల్ గా ఉన్న సూడ్ లెదర్ బూట్లు వేసుకుని ఉన్నాడతను. అతను వేసుకున్న గ్రే కలర్ సూటు కట్ చేసిన పద్దతి చూస్తే అది ఇండియాలో కుట్టిన దానిలాగా లేదు. చారల డిజైనుతో ఉన్న టై. నున్నగా షేవ్ చేసుకున్న గెడ్డం కొంచెం ఆకుపచ్చ ఛాయలో కనబడుతోంది. మడత నలగని అతని బట్టల్లో, కాలుమీద కాలు వేసుకుని అతను కూర్చున్న తీరులో, ఒక పద్దతీ, క్రమశిక్షణ కనబడుతున్నాయి. అతని పర్సనాలిటీ లో ఒక పద్దతి ప్రకారం లేనట్లు కనబడుతోంది అతని జుట్టే! విశృంఖలంగా ఉంగరాలు తిరిగి ఉంది. ఎందుకలా ఉంది?
కళ్ళు అప్పగించి అతని జుట్టువైపే చూస్తూ ఉండిపోయింది అమూల్య.
అతను గమనించి నవ్వాడు. "మీ దృష్టి చాలా చురకయినది. మీ పరిశీలనా శక్తికి చిన్న పరీక్ష పెడదామనే ఈ విగ్గు పెట్టుకున్నాను. యూ విన్!" అన్నాడు విగ్ తీసేస్తూ.
అతని ఒరిజినల్ జుట్టు మృదువుగా కొంచెం రాగిరంగులో సాఫీగా ఉంది
పెదిమలు తడిచేసుకుంది అమూల్య.
"పరీక్షా! ఎందుకు?"
"మీతో మాకు చాలాపని ఉంది."
"ఏమిటి?"
అతను జేబులోనుంచి ఎల్ అండ్ ఎమ్ అమెరికన్ సిగరెట్ల ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ బయటికి తీశాడు. నోట్లో ఉన్న సిగరెట్ తోనే దాన్ని అంటించుకుని పాత సిగరెట్ ని పడెయ్యడానికి యాష్ ట్రేకోసం అటూ ఇటూ చూసి చివరికి టాయిలెట్లో పడేసి వచ్చి కూర్చున్నాడు.
"ఇవాళ కోర్టులో జరిగిన తమాషా అంతా చూస్తూనే ఉన్నాను నేను"
"అందులో నా తప్పేమీ....." అని చెప్పబోయింది అమూల్య.
అతను చెయ్యి ఎత్తి ఆమెని వారించాడు.