ఏ క్షణం ఏమారినా ఆ ఎర్రజెండా చూపు దాటిపోతుందని అతడు కన్నార్పకుండా చూస్తున్నాడు.
మరో అరగంట గడిచింది. క్రమంగా చీకటి పడసాగింది.
కమీషనరు ఆఫీసులో అశ్వత్ధామ టెన్షన్ తో వైర్ లెస్ వైపు చూస్తూ కూర్చున్నాడు. చాలాసేపటినుంచి సిరిచందన వైర్ లెస్ లో మాట్లాడకపోవటం ఆ టెన్షన్ కి కారణం. ఆమెకి ఏమైందో అన్న ఆలోచన అతన్ని భరించలేనంత ఉద్వేగానికి గురిచేస్తోంది. విష్ణువర్థనరావు ఇంకా మైకంలోనే వున్నాడు.
బ్రీఫ్ కేసులు విసిరేయగానే ఈ తర్వాత స్టేషన్లో దిగిపోయి అక్కడినుంచి వెనక్కి రావటం కోసం రవితేజకి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రతి స్టేషన్లోనూ ఒక పోలీసు వాహనం అతనికోసం రెడీగా వుంది. చీకటి పడుతున్నకొద్దీ అశ్వత్ధామ టెన్షన్ మరింత ఎక్కువవసాగింది. చీకట్లో ఆ ఎర్రజెండా కనపడకపోతే బ్రీఫ్ కేస్ విసిరే అవకాశమే ఉండదు. కిటికీలోంచి బయటికి చూస్తున్న రవితేజ అకస్మాత్తుగా అలర్ట్ అయ్యాడు. దూరంగా పొలాల్లో ఒక జెండా కనపడింది. రైలుదాన్ని సమీపించేకొద్దీ అది స్పష్టమయ్యింది. రైల్వే ట్రాక్ కి ఫర్లాంగు దూరంలో పొలాలు మధ్యలో పాతిపెట్టబడి వుంది ఎర్రజెండా.
రైలు దాని సమీపంలోకి వచ్చేసరికి రెండు చేతులతో బ్రీఫ్ కేసులు బయటికి విసిరేశాడు. ఆ తరువాతి స్టేషన్లో దిగి, వాహనమెక్కి ఆఘమేఘాలమీద స్టేషన్ కి చేరుకున్నాడు.
కిడ్నాపర్ నుంచి ఇంకా మెసేజి రాలేదు.
దానికి కొంత సమయం పడుతుందని అక్కడున్న పోలీస్ అధికార్లకి తెలుసు. ఎందుకంటే క్రితం సారి డూప్లికేట్ బిస్కెట్స్ అందుకున్న అనుభవం దృష్ట్యా ఈసారి కిడ్నాపర్ వాటిని పరీక్షించి కానీ సిరిచందన ఆచూకీ చెప్పరు.
ఇందతా జరగటానికి మరొక అరగంట పడుతుంది. అందరూ ఆ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉన్నారు.
......అరగంట గడిచింది. గంట గడిచింది ఫోన్ రాలేదు.
8
రైలు వెళ్ళిపోగానే ట్రాక్ ప్రక్కన నిలబడి వున్న గంగయ్య పచ్చజెండా మడిచి చేతిలో పట్టుకొని నడవసాగాడు.
గంగయ్యకి ఏభై అయిదు సంవత్సరాలు. దాదాపు ముఫ్పై సంవత్సారాల్నించి రైల్వే డిపార్టుమెంట్ లో పనిచేస్తున్నాడు. పెళ్లి కావలసిన ఇద్దరు కూతుళ్ళున్నారు. మరో కొద్ది సంవత్సరాల్లో అతడు రిటైర్ కాబోతున్నాడు. ఆ రోజు గోదావరి ఎక్స్ ప్రెస్ పదినిమిషాల లేటుగా నడుస్తోంది. ఆకాశం మేఘావృతమై, ఏ క్షణమైనా వర్షం కురిసేటట్టుగా వుంది.
రైల్వే ట్రాక్ ని చూసుకుంటూ నడుస్తున్న గంగయ్యకి కట్టకింద నల్లగా మెరుస్తూ కనబడింది. ముందు ఏ నాపరాయో అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అదొక బ్రీఫ్ కేస్.
అతడికి వెంటనే వచ్చిన అనుమానం, ఏ నక్సలైట్లో రైల్వే ట్రాక్ పేల్చేయటం కోసం అమర్చిన మందుగుండు సామాగ్రి అని.
మరికొంత దగ్గరికి వెళ్ళి చూసేసరికి బ్రీఫ్ కేస్ కనపడింది. దానికి దూరంగా పొదల్లో మరొక బ్రీఫ్ కేస్ వుంది.
వెంటనే వాటిని ముట్టుకోకుండా దూరంగా నిలబడి పరీక్షించాడు. ఆ చుట్టుప్రక్కలకూడా కొంచెంసేపు వెదికాడు. రెండు బ్రీఫ్ కేసులు తప్ప మరింకేమీ దొరకలేదు. అతడో క్షణం తటపటా యించి, వాటి దగ్గరికి వెళ్లి చేతిలోకి తీసుకున్నాడు. రెండూ చాలా బరువుగా వున్నాయి. వాటిని తెరిచి చూద్దామా అనుకున్నాడు. కానీ అలా సీల్ తెరవగానే పేలిపోయేటట్టు అమర్చారేమో అన్న భయం మనసులో ఒక మూల కలిగింది.
సాధారణంగా రైల్లోంచి బ్రీఫ్ కేసులూ, పెట్టెలూ బయటికి జారిపోవటమంటూ జరగదు. బస్సుల పైభాగంలో పెట్టిన సామాన్లు అలా పడిపోవటం అప్పుడప్పుడు సంభవమే కానీ, రైల్లో ఆ అవకాశం లేదు. అతడి పాతికేళ్ళ జీవితంలో అదే ప్రధమం.
రైల్వే ట్రాక్ మీద కూర్చుని అతడు ఆ బ్రీఫ్ కేసు తెరవటానికి ప్రయత్నించాడు. కానీ రెండు బ్రీఫ్ కేసులూ తాళం వేసున్నాయి.
అతడు వాటిని బ్రద్దలు కొట్టే ప్రయత్నమేమీ చేయలేదు. చెరోచేత్తో వాటిని పట్టుకొని స్టేషన్ వేపు నడవటం ప్రారంభించాడు. పదిహేను నిమిషాల్లో అతను స్టేషన్ చేరుకున్నాడు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు ఇన్ స్పెక్టర్ అదే స్టేషన్ లో ఉన్నాడు. గంగయ్య అతని దగ్గరికి వెళ్లి నమస్కరించి ట్రాక్ ప్రక్కన దొరికిన ఆ రెండు బ్రీఫ్ కేసుల సంగతి అతనికి చెప్పాడు.
ఇన్ స్పెక్టర్ కి కూడా గంగయ్యకి వచ్చిన అనుమానమే వచ్చింది. అయితే రిస్క్ తీసుకోదల్చుకున్నాడు. ఎందుకో అతనికి బ్రీఫ్ కేసులు చూస్తూంటే అందులో R.D.X. లాంటి ప్రేలుడు సామాగ్రి వుంటుందని అనిపించలేదు. ఒక బ్రీఫ్ కేస్ బ్రద్ధలు కొట్టాడు. గంగయ్య, మరికొంతమంది రైల్వేసిబ్బంది, ప్రొటెక్షన్ ఫోర్స్.... అందరూ చూస్తూవుండగా అతడు బ్రీఫ్ కేస్ తెరిచాడు.
ఒక్కసారిగా అక్కడ కలవరం రేగింది. అందరి కళ్ళకీ తాము చూస్తున్నది కాలో నిజమో అర్థంకాలేదు. అంత బంగారాన్ని ఎవరూ తమ జీవితంలో చూసివుండరు. ఆ గది అంతా గుసగుసల్తోనూ, వాఖ్యానాల్తోనూ నిండిపోయింది. అందర్లోనూ సంచలనం.
గంగయ్య మాత్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు! అవే బ్రీఫ్ కేసుల్ని.... దొరికినచోటే తెరిచివుంటే, అంత బంగారం చూసి తన మనసు తప్పకుండా చెదిరివుండేది. పెళ్లి కావాల్సిన కూతుళ్ళ గుర్తొచ్చారు. ఆ బంగారాన్ని అమ్మితే మిగతా జీవితమంతా హాయిగా గడిచిపోయి వుండేది. కానీ ముఫ్పై ఏళ్ళ నిజాయితీ మంటకలిసి వుండేది. తనకా స్థితి కల్పించనందుకు మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రైల్వే ప్రొటెక్షన్ ఇన్ స్పెక్టరు గంగయ్య దగ్గరకు వచ్చి అభినందిస్తున్నట్టు భుజం తట్టి "నీలాంటి నిజాయితీ పరులు ఈ రోజుల్లో చాలా తక్కువ గంగయ్యా! మంచి బహుమతికి నీ పేరు రికమెండ్ చేస్తాను" అన్నాడు.
గంగయ్య చేతులు జోడించి వూరుకున్నాడు.
ఒక కిడ్నాప్ కాబడిన వ్యక్తి ప్రాణాలు రక్షించటంకోసం పోలీస్ డిపార్ట్ మెంటే ట్రైన్ లోంచి ఆ బ్రీఫ్ కేసులు విసిరేసిందని అక్కడున్న వారికి ఎవరికీ తెలీదు. రవితేజ దిగింది ఆ స్టేషన్ లోనే. ఐతే అతడు మామూలుగా ఏదో పనిమీద ఆ ఊరువచ్చి దిగాడని అక్కడివాళ్లు అనుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఇన్ స్పెక్టర్ ఆ బ్రీఫ్ కేసులు జాగ్రత్తగా సీల్ చేసి రైల్వే స్టేషను లాకరులో పెట్టాడు. ఆ తరువాత ట్రైన్ లో వాటిని సెక్యూరిటీ గార్డుల్నిచ్చి హైదరాబాద్ పంపించటం కోసం ఏర్పాట్లు చేశాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (R.P.F) కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విభాగం. దానికీ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధంలేదు. అప్పుడప్పుడూ 'రైల్వే పోలీస్' తో కలిసి కేసుల్ని డీల్ చేసినా ఎక్కువగా అది స్వతంత్ర ప్రతిపత్తి గల విభాగంగానే పనిచేస్తుంది. అందువల్ల రైల్వేట్రాక్ ప్రక్కన దొరికిన బ్రీఫ్ కేసులు ఆ ఊరి పోలీస్ స్టేషన్ లో అందజేయకుండా తన డిపార్ట్ మెంట్ ద్వారా డీల్ చేయాలని అతడు అనుకోవటంలో తప్పులేదు. కమీషనర్ అశ్వత్ధామ మాత్రం ఆ బ్రీఫ్ కేసుల్ని కిడ్నాపర్ తీసుకుని వుంటాడనీ, తమకి ఫోన్ వస్తుందని భావిస్తూ టెలిఫోను ప్రక్కనే కూర్చుని వున్నాడు. తాము ఎవరికైతే అందజేయాలనుకున్నారో ఆ వస్తువు అతనికి అందలేదని, అవి కేంద్రప్రభుత్వానికి చేరటంకోసం మరోచోట భద్రపరచబడి వున్నాయని కమీషనరుకి తెలియదు.
ఎనిమిదయింది. ఫోన్ రాలేదు.
* * *
ఆమె లెక్క పెట్టటం మానేసింది.
అప్పటికి తను శవ పేటికలో బంధింపబడి ఆరేడు గంటలకు పైగా అయివుంటుందని ఆమెకి నిశ్చయంగా తెలుసు. అయినా తనను రక్షించటానికి ఎవరూ రాలేదంటే బహుశా బంగారం తిరిగి ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకొకపోయి వుండొచ్చు. లేదా బంగారం తీసేసుకుని తను ఎక్కడ వున్నదో చెప్పకుండా కిడ్నాపర్ మాయమైపోయి వుండొచ్చు. ఆమెకీసారి భయం వేయలేదు. తన మరణం గురించి ఆలోచించసాగింది.
తను ఏ విధంగా మరణిస్తుంది? ఆకలివల్ల కాదు. ఎందుకంటే మరో కొద్దిసేపట్లో బ్యాటరీ క్షీణించగానే గాలి ఆడటం మానేస్తుంది. పేటికలో ఆక్సిజన్ తక్కువైతే ఆ మరణం ఎలా వుంటుంది. ఊపిరితిత్తులు నొక్కుకుపోయి శరీరం గిలగిలా కొట్టుకుంటూ ....నో...... ఆ విధంగా ఆలోచనలు కొనసాగనివ్వకూడదు. ఆ ఫోబియా మరింత బాధాకరం.
ఈసారి ఆమె తనలో తాను సంతోషంగా వుండటానికి ప్రయత్నించింది. సన్నగా పాత పాడటం ప్రారంభించింది. 'రఘుపతి రాఘవ రాజారాం...... పతీత పావన సీతారాం......"
నిమిషంపాటు పాడి ఆమె పాత ఆపుచేసింది. తలప్రక్కగా తడిమిచూసింది. రొట్టె చిన్నభాగం మిగిలివుంది. అది తిని నీళ్ళసీసా నోటిదగ్గరకు తీసుకుంది. వెల్లకిలా పడుకొని సీసాతో నీళ్లు త్రాగటం కష్టమైనా పని. కానీ అంతకన్నా మరోదారి లేదు.
ఆమె నీళ్ళు త్రాగి సీసా మూతి బిగించింది. నిజానికి ఆమెకు ఆకలిగా లేదు. కానీ ఏదో ఒక పని చేయకపోతే పిచ్చిక్కిపోయేలా వుంది. గట్టిగా గొంతెత్తి పాటలు పాడాలని కోరిక కలిగింది. కొంచెం సేపు కాళ్ళతో చెక్కని లయబద్ధంగా కొట్టింది. "ఇన్ సేనిటీకి" తను దగ్గరగా వెళుతున్నానని ఆమెకు అర్థమవుతోంది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోతోంది.
ఇరుకు ప్రదేశాల్లోనూ, చిన్న చిన్న లిప్ట్ లలోనూ వుండటానికి భయపడే వ్యక్తులకున్న వ్యాధిని "క్లస్ట్రోఫోబియా" అంటారు చీకట్లో, నిండా ముసుగుపెట్టి పడుకోవటానికి కూడా ఈ వ్యక్తులు భయపడతారు. ఈ "ఫోబియా" నించి తనని తను రక్షించుకోవాలి! ఎలా.....? ఆమె ఆ విధంగా ఆలోచిస్తూ వుండగా నుదుటిమీద తడి తగిలింది. మొదట ఆమెకు అర్థం కాలేదు. చెమటేమో అనుకుంది. కానీ తడిమి చూస్తే అది నీటిచుక్క!
ఆమె గుండె ఒక్కక్షణం ఆగిపోయింది.
నీ....టి......చు.....క్క!
ఆమె కంగారుగా పేటిక పై భాగాన్ని తడిమింది. అక్కడ చెక్క తడిగా తగిలింది. అంటే..... నీరు లోపలి ప్రవేశిస్తోందన్న మాట! అప్పుడు ఆమె "నో....." అంటూ పెట్టిన కేక ఆ పేటికను కంపింపజేసింది.
కంగారుగా ఆమె స్విచ్చాన్ చేసింది. జిరోవాల్టు బల్బు ఒక్కసారి వెలిగి, సన్నగా మంటవచ్చి- ఆరిపోయింది. ఆమె పిడికిళ్ళు బిగించి చెక్కల్ని బలంగా కొడుతూ "నో....." అని అరుస్తూ "రక్షించండి" అంటూ కేకలు పెట్టసాగింది.
తన అరుపులు ఎవరికీ వినపడనంత దట్టమైన గుహలో వున్నానని కూడా మరచిపోయి ఆమె హిస్టీరిక్ గా అరవసాగింది. బ్యాటరీ అయిపోయిందన్న సత్యం ఆమెని పిచ్చిదాన్ని చేసింది.
9
పోలీస్ స్టేషన్ లాకప్ లో గోడకి అనుకుని కూర్చుని వున్నాడు మహర్షి. మోకాళ్ళమీద మొహం వంచుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతడి మనసిప్పుడు స్తబ్ధంగా ఉంది. దేన్నీ ఆలోచించే స్థితిలోలేదు. అతడు పోలీస్ స్టేషనులో సరెండర్ అయింతర్వాత తిరిగి జైలుకి పంపించే ఏర్పాట్లు జరగలేదు. ముందతన్ని మేజిస్ట్రేట్ దగ్గర హాజరు పరిచి 'జైల్ బ్రేక్ కేస్ క్రింద విచారణ జరపాలి. ఆ వ్యవహారమంతా మరుసటిరోజు జరుగుతుంది. ఆ కారణంగా అతడు సెల్ లోనే వుంచబడ్డాడు.