ప్రస్తుతం సిరిచందన ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో వుందో అతడికి తెలీదు. తెలిస్తే బహుశ అతను కూడా పిచ్చివాడయి ఉండేవాడేమో. సమీపకాలంలో అమలు జరగబడే ఉరిశిక్ష గురించి అతనికేమీ చింతలేదు. అతడాలోచిస్తూన్నదల్లా సిరిచందన భవిష్యత్తు గురించే!
"అనవసరంగా తను ఆమె జీవితంలో ప్రవేశించి ఆమె భవిష్యత్తునంతా ఛిన్నాభిన్నం చేశాడు" అన్న వ్యధే ప్రస్తుతం అతణ్ణి బాధిస్తోంది. ఆ భార్యభర్తలని ఎలా కలపాలా అని ఆలోచించసాగాడు. అంతలోనే అతడి ఆలోచన అతడికే నవ్వు తెప్పించింది. జైల్లో కూర్చుని ఉరికంబం ఎక్కబోతూ, తిరిగి వాళ్ళిద్దర్నీ కలపాలను కోవటం చాలా నిరర్థకమైన ఆలోచన! ఏ విధంగానూ జరగని పని!
అతను ఆలోచనల్లో వుండగా శబ్దం వినిపించింది. అతడు తలెత్తి చూసాడు. వర్మ అటువైపే వస్తున్నాడు. అతడు ఆశ్చర్యంగా లేచి నిలబడుతూ సెల్ తలుపు దగ్గరికి వచ్చాడు. వర్మ దగ్గరికి వచ్చి "మహర్షీ..." అన్నాడు.
మహర్షి అతడివైపు విస్మయంగా చూస్తూ "ఇంతరాత్రి........" అన్నాడు. "స్టేషన్ ఆపీసర్ నాకు తెలుసు. నామిత్రుడివని చెప్పి, మాట్లాడాలని అడిగాను" అన్నాడు వర్మ. "...... నువ్విక్కడ సరెండర్ అయ్యావని సిరిచందన చెప్పింది."
మహర్షి ఉలిక్కిపడి "సిరిచందన నిన్ను కలిసిందా?" అనడిగాడు. "కలిసింది అంతేకాదు, మొత్తం జరిగిందంతా చెప్పింది." మహర్షి గాఢంగా విశ్వసించి "ఇలా జరుగుతుందనుకోలేరు వర్మా, అనుకునివుంటే నేను అసలు ఆమెను కలుసుకోకపోయి వుండేవాడిని" అన్నాడు.
"కలుసుకోవటమే ఒకందుకు మంచిదయిందేమోలే. భర్త గురించి పూర్తి వివరాలు ఆమెకు తెలిసాయి."
మహర్షి చేతులు సెల్ వూచలచుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి. "ఏం తెలిసింది వర్మా" అని అడిగాడు.
"మొత్తమంతా చెప్పేశాను. శ్రీవాణి నీ భార్య అనీ, నీ భార్య ప్రియుడు రవితేజ అనీ....."
"ఎందుకు..... ఎందుకు చెప్పావ్?" ఎప్పుడూ లేనంత కోపం అతడి కంఠంలో ధ్వనించింది.
వర్మ మాత్రం తాపీగా "ఇంతవరకూ వచ్చింతర్వాత యిక ఏం దాచినా ప్రయోజనం లేదు మహర్షి! ఇప్పటికే నీ మౌనంవల్ల చాలా అనర్థాలు కొనితెచ్చుకున్నావ్. ఇక వాటిని కొనసాగనివ్వను" అన్నాడు.
"ఏం చేస్తావ్?"
"మొత్తం విషయమంతా కోర్టుకు లాగుతాను. శ్రీవాణి మరణం అనాలో చితంగా జరిగిపోయిందనీ, దానికి ప్రత్యక్ష సాక్షి రవితేజ అనీ....."
"ఇదంతా మనం ఒకప్పుడు అనుకున్నదే. కానీ దానివల్ల ప్రయోజనం వుండదు. రవితేజ కోర్టులో ఏ విషయమూ ఒప్పుకోడు. రవితేజ ఎవరో మనకు తెలియని రోజుల్లో ఇవన్నీ మనం ఆలోచించాం! కానీఇప్పుడు అతడు సిరిచందన భర్త! అతడికి పరువునష్టం కలిగించే పని నేనేమీ చేయను" దృఢంగా అన్నాడు మహర్షి.
వర్మ విసుగ్గా అతనివంక చూసాడు. "నువ్వు సెంటిమెంట్ ను పట్టుకుని వ్రేలాడకు. ఆఖరికి సిరిచందనకు కూడా ఆమె భర్తమీద ఏ సదభిప్రాయమూ లేదు. విషయాలన్నీ మేం చర్చించుకున్నాం కూడా."
"ఒకవేళ మీరిదంతా చేసినా కూడా దానివల్లేమీ ఫలితం వుండదన్న విషయం మీకు తెలుసా?" మహర్షి కటువుగా అడిగాడు. "తెలుసు. ఫలితం వుండదని ఏ పనీ చేయకపోవటం కూడా మంచిదికాదు. మన ప్రయత్నాలు మనం చేయాలి."
"ఏం చేస్తావ్?"
"నిరాహారదీక్ష చేస్తాను."
"ఏమిటీ....."
"అవును. ఏదో ఒక విధంగా ఇదంతా పేపర్లకెక్కాలి. రవితేజ డిస్టర్బ్ అవ్వాలి. రవితేజ ఆఫీస్ ముందూ, ఇంటిముందూ టెంట్ వేస్తాను. మొత్తం విషయమంతా పెపర్లకేక్కిస్తాను. పరువుపోయిన తరువాత రవితేజ దిగిరాక తప్పదు. అప్పుడైనా మరతాడేమో చూద్దాం."
"మారడు. ఇదంతా కేవలం మనిద్దరం కలిసి చేస్తున్న వ్యవహారం అంటాడు. అంతేకాదు, తన భార్యకి నేను ప్రియుడినని కూడా పేపర్లకి వెల్లడిస్తాడు. దేనివల్ల కలిగే పరిణామాలను నువ్వాలోచించావా వర్మా! సిరిచందన సమూలంగా నాశనమయిపోతుంది! సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఆమెను వేలెత్తి చూపుతారు. ఇదంతా జరగనివ్వను. నా కంఠంలో ప్రాణముండగా జరగనివ్వను" ఆవేశంగా అన్నాడు.
వర్మ అతడివైపు సానుభూతిగా చూసాడు. "జరిగి తీరుతుంది మహర్షీ! నేనూ సిరిచందనా ఇంతకుముందే ఈ విషయాలన్నీ చర్చించుకున్నాం. ఏది ఏమైనా మేం చెయ్యాల్సింది చేస్తాం. నీ సహకారం ఉన్నా లేకపోయినా సరే. ఆ విషయం చెప్పడానికే వచ్చాను" అని అక్కడినుండి కదిలాడు.
"వర్మా.....ప్లీజ్! నేను చెప్పేది విను." అని అరుస్తున్నా కూడా వినిపించు కోకుండా అక్కడినుంచి బయటికి వచ్చాడు.
మహర్షి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అతడి హృదయం మౌనంగా రోదించసాగింది. ఆవేశంలో తన స్నేహితుడు, స్నేహితురాలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఎటు దారితీస్తుందో తలుచుకుంటూంటేనే అతడి మనస్సు కలవరపడుతోంది. జరగబోయేది ఏమీ వుండదు. తనకి ఉరిశిక్ష పడుతుంది. నిరాహారదీక్షల్నీ, పేపర్లో వార్తల్నీ కోర్టు పరిగణించాడు. తనకి ఉరిశిక్ష పడి ఈ లోకంనుంచి నిష్క్రమించిన తరవాత మిగిలేది సిరిచందన మాత్రమే. అప్పటికే జరగవలసిన అన్యాయమంతా జరిగిపోతుంది. ఇద్దరూ కలిసి ఆవేశంలో తీసుకున్న ఈ నిర్ణయంయొక్క పరిణామం సిరిచందన జీవితకాలం మొత్తం అనుభవిస్తూ వుండక తప్పదు.
అతడు వెనక్కి వచ్చి యధాస్థానంలో కూర్చున్నాడు.
తను ఒకసారి సిరిచందనని కలుసుకోవాలి. కలుసుకుంటే ఆమెను కన్విన్స్ చేయగలడు. కానీఎలా?...... మహర్షి ఈ విధంగా ఆలోచనల్తో సతమతమవుతూండగా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన వర్మ ఇంటివైపు నడవసాగాడు. అతడి మనసంతా ఉద్వేగంగా వుంది. అతడికెందుకో ఈ విధంగా చేయటం ద్వారా 'మహర్షిని ఉరికంబం నుంచి తప్పించగలను' అన్న నమ్మకం కలిగింది. ఏ మనిషయినా ఏదో ఒకచోట మానసికంగా బ్రేక్ అవుతాడు. రవితేజని ఆ విధంగా బ్రేక్ చేయగలిగితే చాలు. "నువ్వు కోర్టులో చెప్తావా? లేక నేను నీ పరువు బజారుకీడ్చనా?" అని తను బేరం పెడితే అందులో లాజిక్ వున్నా లేకపోయినా రవితేజలో భయం కలుగుతుంది.
ఆ భయం చాలు..... ఏ మాత్రం అవకాశమున్నా రవితేజ కోర్టుకి రావటానికి ఒప్పుకుంటాడు.
సిరిచందన మరణం అంచున వుందని, తను చేస్తున్న ప్రయత్నాలన్నీ ఎందుకూ లాభించవనీ తెలియని వర్మ, పబ్లిక్ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. నంబరు డయల్ చేసి "హలో" అన్నాడు.
అట్నించి "యస్...... రవితేజ స్పీకింగ్" అన్న కంఠం వినపడగానే "నేను ......వర్మని" అన్నాడు.
మహర్షి ప్రసక్తి రాగానే రవితేజలో సంచలనం కలిగినా, దాన్ని కప్పిపుచ్చుకుంటూ-
"ఇప్పుడు నేను ఏమీ మాట్లాడే స్థితిలో లేను. నాకు చాలా అర్జెంట్ పనులు వున్నాయి." అంటూ అట్నించి ఫోన్ పెట్టేయరు" తాఫీగా అన్నాడు వర్మ.
"వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్?"
"ది నాన్సెన్స్ బై నేమ్- శ్రీవాణి."
"వ్వాట్....?" అప్పుడు వర్మ తను అసలు జరపదలుచుకున్న కార్యక్రమం గురించి చెప్పటం ప్రారంభించాడు.
10
కమీషనరు అశ్వత్ధామ చిరాగ్గా పచార్లు చేస్తున్నాడు. ఆ గదిలో ఉన్న పోలీస్ ఆఫీసర్లందరూ మౌనంగా, నిశ్శబ్దంగా కూర్చుని వున్నారు. గట్టిగా ఊపిరి తీయటానికి కూడా వారికి భయంగా వుంది. అయితే ఆ భయం తమపై అధికారిని చూసి కాదు. అక్కడున్న ప్రతివారి మనసులోనూ సిరిచందన ప్రస్తుత పరిస్థితే కదులుతోంది.
కిడ్నాపరు దగ్గర్నుంచి ఫోన్ కాల్ రాలేదు. అక్కడ సిరిచందన బ్రతికివుందో ఆమె ప్రాణాలు అప్పటికే పోయాయో ఎవరికీ తెలీదు. ఆ స్థితిలో ఎవరూ మాట్లాడటానికి కూడా సాహసించలేదు. అక్కడ వున్నప్రతీ ఒక్కళ్ళూ పేలడానికి సిద్ధంగా వున్న అగ్ని పర్వతాల్లా నిస్సహాయంగా కూర్చుని వున్నారు. ఆవేశంతో రగిలిపోతూ ఏం చేయాలో తోచక, ఎవర్ని నిందించాలో తెలియక ఫ్రస్ట్రేషన్ తో, ఆవేశంతో వూగిపోతున్నారు.
"డామిట్!" ......అశ్వత్ధామ వచ్చి కుర్చీలో కూర్చుని..... తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు "వాళ్ళడిగినట్టే బంగారం అందజేసాం. ఇంకా ఎందుకు మనకు ఫోన్ చేయరు? అక్కడ ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో కనీసం ఊహించ గలుగుతున్నారా? అసలు వాళ్ళు మనుషులేనా....... నరరూప రాక్షసులా?" అన్నాడు.
ఎవరూ మాట్లాడలేదు. కమీషనర్ రవితేజవైపు తిరిగి "వాళ్ళడిగినట్టే బ్రీఫ్ కేసులు విసిరేశావ్ కదూ?" అన్నాడు.
"ఎస్ సార్!" అన్నాడు రవితేజ.
"మరి...?!" అన్నాడు అశ్వత్ధామ. "....అది వాళ్ళకి అందలేదా? లేకపోతే తీసుకోవడం ఆలస్యమైందా? అది నిజమైన బంగారమో కాదో తెలుసుకోవటానికి ఇంతసేపు పట్టిందా?" అతడి మాటలుపూర్తి కాకముందే ఇన్ స్పెక్టర్ కిరణ్ లోపలికి ప్రవేశించాడు అతడి మొహంలో భయమూ, జంకూ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. "సర్....." అన్నాడు సందిగ్ధంగా. ఆఫీసర్లందరూ అతడివైపు చూసారు.
"ఇప్పుడే రైల్వేస్టేషన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది సార్. రైల్వే ట్రాక్ ప్రక్కన పడివున్న బ్రీఫ్ కేసుల్ని లైన్ మెన్ స్టేషన్ లో అందచేసాట్ట. అవి ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కస్టడీలో వున్నాయట....." అతడిమాటలు పూర్తికాలేదు. ఆఫీసర్లందరూ ఒక్కసారి తెల్లబోయి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.
అనుకోని ఆ పరిణామానికి కోపం పట్టలేక, అశ్వత్ధామ పిడికిలి బిగించి బలంగా బల్లమీద కొడుతూ ".....నాన్సెన్స్" అని అరుస్తూ ......విసురుగా కుర్చీలోంచి పైకిలేస్తూ "ఇదెలా జరిగింది...... ఎలా జరుగుతుంది?" అనరిచాడు. ఎవరూ మాట్లాడలేదు. అందరి మనసుల్లోనూ ఒక్కటే ప్రశ్న. ఎలా.....ఇప్పుడెలా?"
అశ్వత్ధామ తనని తాను కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నించాడు. అనుకున్నప్రకారం కిడ్నాపర్ అక్కడికి వచ్చి చూసుంటాడు. బ్రీఫ్ కేసులు లేకపోయేసరికి వెళ్లిపోయుంటాడు. అంటే.... సిరిచందన ఇంకా ఆ శవపేటికలోనే వుండి వుంటుంది! ఇటేమో కిడ్నాపర్, తనని పోలీసులు మోసం చేసారనుకుని వుండివుంటాడు. ఇప్పుడు తమతో అతను తిరిగి కాంటాక్ట్ పెట్టుకుంటాడా...... లేక మొత్తం ఆపరేషన్ వదిలేస్తాడా? ఆ ఆలోచన రాగానే వణికిపోయాడు అశ్వత్ధామ! రవితేజ మొహం పాలిపోయి వుంది. విష్ణువర్థనరావు నోట మాటలేక అచేతనంగా వున్నాడు.
కమిషనరు కిరణ్ తో "నాకు హోమ్ మినిష్టరుకి కనెక్షనివ్వమని చెప్పు వీలయితే ఢిల్లీ కూడా మాట్లాడతాను. ముందు ఆ బంగారం బ్రీఫ్ కేసుల్ని వెనక్కి తెప్పించు" అని అరిచాడు.
కిరణ్ హడావుడిగా అక్కడినుండి వెళ్ళిపోయాడు. అక్కడ వాతావరణం తిరిగి యాధాస్థితికి రావడానికి మరో అయిదు నిమిషాలు పట్టింది. తరువాత చేయవలసిందేమిటాని అక్కడి ఆఫీసర్లు చర్చించటం మొదలుపెట్టారు. "వెంటనే ప్రెస్ మీటింగు ఏర్పాటు చేయండి. రాత్రికి రాత్రే ఈ న్యూస్ ప్రెస్ కి వెళ్లిపోవాలి. దూరదర్శన్ లో కూడా బ్రాడ్ కాస్ట్ చేయండి! ఇందులో మన పోరపాటేం లేదని, కిడ్నాపర్లు అడిగినట్టే బ్రీఫ్ కేసులు అందజేస్తామని న్యూస్ పేపర్లో రావాలి. ఆలస్యం లేకుండా సిరిచందన రిలీజ్ కావాలి. అది ముఖ్యం" అశ్వత్ధామ చెబుతున్నాడు. ఒక పోలీస్ ఆఫీసరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం కోసం హడావుడిగా బయటికి వెళ్ళాడు. విష్ణువర్థనరావు కూతురి మీద ఆశలు వదిలేసుకున్నాడు.