Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 42


    సర్కస్ ఎరీనా హడావుడిగా వుంది.

 

    వామనమూర్తి, గజపతిరావు, పార్వతమ్మ, అందరూ ముందు  వరసలో వున్నారు. చిన్న పిల్లలు కేరింతలు కొడుతున్నారు. బఫూన్లని చూసి నవ్వుతున్నారు. ఒకప్పటి రష్యాల రాయబారి  వామనమూర్తి, ఇండియాలో ప్రస్తుత రష్యన్  రాయబారి స్టాన్సలవస్కీ పక్క పక్కన కూర్చున్నారు. ఇరువైపులా సెక్యూరిటీ వుంది.

    
                                  *    *    *

 

    అతడి శరీరంలోకి సెలైన్ ఎక్కింపబడుతూంది. నేత్ర  అతని వైపే చూస్తున్నాడు. ప్రతిమ పక్కనే వుంది.

 

    నేత్ర రెడ్డినాయుడి వైపే యింకా చూస్తున్నాడు. మరణం  అంచున నిలబడి పోరాడుతున్నట్టు వుంది అతని మొహం.

 

    "నా కొడుకుని ఫిరంగిలో పెట్టి  పేల్చేస్తున్నారు." అన్న కంఠం ప్రతిధ్వనిస్తూంది. ఆస్పత్రి కిటికీ అవతల  నుంచి బ్యాండు మేళం వినిపించింది. బయటకు చూశాడు. 'రష్యన్ సర్కస్' అడ్వర్టయిజ్ మెంట్  ఊరేగింపు వెళ్తూంది.

 

    "సాయంత్రం ఆరింటికి ఎస్బీఆర్  సర్కస్ కి వెళ్తున్నాడు. 'మన  వాళ్ళని రెడీగా వుండమను. నేనొస్తున్నాను-" అని ప్రతిమ చెప్పిన సర్పభూషణరావు మాటలు గుర్తుకొచ్చాయి. అప్పుడు- సర్పభూషణరావు  లాంటి వాడు సర్కస్  కి వెళ్ళటం ఏమిటా అని నవ్వుకున్నాడు.

 

    గడియారం ఆరున్నర కొట్టింది.

 

    సర్కస్..... ఫిరంగి.... సర్కస్.....

 

    నేత్ర మెదడులో ఏదో మెరిసినట్టయింది.

 

    "ప్రతిమా..... ఈ రోజు వామనమూర్తిగారు సర్కస్ కి వెళ్తున్నారు కదూ......?" అన్నాడు.

 

    "అవును."

 

    "స్టాన్సలవస్కీ కూడా వెళ్తున్నాడు కదూ-"

 

    "అవును. ఏం.....?"

 

    "మైగాడ్....." అంటూ  ఒక్కగెంతులో అక్కడి నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల్లో అతని కారు హాస్పిటల్ కాంపౌండ్ లోంచి దూసుకు పోయింది. అతడి ఆలోచన్లు అంతకన్నా వేగంగా పరుగెడ్తున్నాయి.

 

    ఇండియాలో రష్యన్ రాయబారి స్టాన్సలవస్కీని, వామనమూర్తిని చంపేస్తే ఇటు శత్రు దేశానికీ, అటు సర్పభూషణరావుకీ లాభం. భారత దేశంతో రష్యన్ సంబంధాలు కొంతవరకూ చెడతాయి. ఎప్పటి నుంచో రష్యన్ రాయబారి మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మరణంతో, సరయిన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం మీద విమర్శ వస్తుంది.

 

    సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని ఫిరంగి గుండుతో సహా పిల్లవాడు వెళ్ళి వాళ్ళ మధ్య విస్ఫోటనం చెందుతాడన్నమాట.

 

    "హేట్సాఫ్ టు యువర్ ప్లాన్  ఏజంట్ క్యూ" అనుకున్నాడు మనసులో. సమయం ఏడు కావొస్తూంది.

 

    సర్కస్ లో "ఫిరంగి ఐటమ్" ఎప్పుడో నేత్రకి తెలీదు. బాణంలా దూసుకుపోతోంది కారు.

    
                                   *    *    *

 

    రింగ్ మాస్టర్ పులులు, సింహాల్ని కుర్చీల మీద  కూర్చోబెడుతున్నాడు. మరో మూల  బఫూన్ సింహం  తోకలాగి, అది గాండ్రుమనగానే పిల్లి మొగ్గలు వేసుకుంటూ పరుగెత్తాడు. పిల్లలు కడుపు చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఆనందం, ఆహ్లాదం పెనవేసుకున్నట్టున్నాయక్కడ. గవర్నమెంటు సర్వీసులో అత్యున్నత స్థాయిలో వున్న వాళ్ళ కుటుంబాల కోసం వేస్తున్న స్పెషల్  షో అది. విదేశాంగ శాఖ  ప్రధాన  కార్యదర్శి. డిఫెన్స్ సెక్రటరీ, అందరూ తమ, తమ  కుంటుబాల్తో వరుసల్లో కూర్చుని వున్నారు. మధ్యలో వామనమూర్తి వున్నాడు.

 

    అంతలో నలుగురు వ్యక్తులు లోపల నుంచి ఫిరంగి తీసుకొచ్చారు. బఫూన్  అందులోకెక్కి, లోపలనుంచి బయటకు దూకాడు. మళ్ళీ నవ్వులు, అదే సమయానికి సర్పభూషణరావు లేచి వెనుకవైపుకు వెళ్ళాడు.

 

    వామనమూర్తి వంగి గజపతిరావుతో ఏదో  చెబుతున్నాడు. ఎనిమిదేళ్ళ కుర్రవాడిని అక్కడకు తీసుకువచ్చారు. సీతాకోక చిలుక మేకప్ లో వున్నాడు ఆ  కుర్రవాడు. తగరం తొడుకు, బంగారం రంగు రెక్కలు వున్నాయి. మొహానికి పక్షి మాస్క్ వుంది. అదే  సమయానికి నేత్ర  కారు కాంపౌండ్ లోకి  ప్రవేశించింది.

 

    సర్పభూషణరావు ఫిరంగి వెనకాల వున్న గుండుని చూస్తున్నాడు. వెనకాల వున్నా అనుచరుడు దాన్ని మార్చి వేరే యింకొకటి పెట్టాడు.

 

    నెమ్మదిగా ఫిరంగి దిశ ఆకాశం నుంచి వామనమూర్తి వైపుకు మార్చబడింది. దాన్ని ఎవరూ గుర్తించలేదు. యాక్షన్ లో అదొక భాగం అనుకున్నారు.

 

    అదే సమయానికి నేత్ర  కారు దిగి  పరుగు పరుగున లోపలికి రాబోయాడు. గేటు దగ్గర పోలీసులు అతన్ని ఆపారు.

 

    "ఇది స్పెషల్ షో! కేవలం యిన్ వైటీస్ కి మాత్రమే" అంటూ  పోలీసు ఆఫీసర్ అతడిని వెనక్కి  తోసేసాడు. వాదించలేదు నేత్ర. వాదనలకిది టైమ్ కాదు.

 

    లోపల నుంచి  మైకులో వినపడుతూంది. "దిసీజ్ ది టైమ్ ఫర్  కేనన్  బోయ్ బ్లో ఆప్.(ఫిరంగి ద్వారా బాలుడు పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.

 

    కుర్రవాడిని ఫిరంగిలోకి ఎక్కిస్తున్నారు. అతడి  వీపుకి మినియేచర్ ఎక్స్  ఫ్లోజివ్ అమర్చబడి వుంది. మొహానికి మాస్క్ వుండటంవల్ల వాడి మొహంలో భావాలు బయటికి తెలియటంలేదు. వామనమూర్తి గజపతి రావుతో మాట్లాడుతున్నాడు.

 

    నేత్ర బోన్ల మధ్య పరుగెత్తుతున్నాడు. సింహాలు, పులులు అతడిని చూస్తున్నాయి. కొన్ని గాండ్రిస్తున్నాయి. తాళ్ళు, గుడ్డలు, కర్రలు అస్తవ్యస్తంగా పడివున్నాయి. వాటిని  దాటుకుంటూ అతడు లోపలకు ప్రవేశించాడు.

 

    సర్పభూషణరావు జరిగే తతంగాన్ని చూస్తున్నాడు. మిగతా జనానికి అతడు కనపడకుండా తెరల వెనక వున్నాడు. ఆ అంశంలో పాల్గొనని మిగతా  సర్కస్  కళాకారులందరూ వింగులో నుంచి చూస్తున్నారు. రకరకాల కాస్ట్యూమ్స్ లో వున్నారందరూ. ఆ ఫిరంగిలో నిజంగా పాల్గొనవలసిన కుర్రవాడు, సీతాకోక చిలుక గెటప్ లో , చీకట్లో స్తంభానికి కత్తి వేయబడి వున్నాడు.

 

    నల్ల ముసుగులో 'తలారి' గెటప్ లో వున్నా అనుచరుడు ఫిరంగికి నిప్పంటించాడు.

 

    అదే సమయానికి లోపలికి వచ్చిన నేత్ర దృష్టి ట్రెసీజ్ తాళ్ళమీద  పడింది. వాటి సాయంతో అతడు గాలిలోకి లేచాడు. పది, ఇరవై, నలభై. ఏభై అడుగుల ఎత్తు గాలిలో ఎగిరాడు.

 

    ఫిరంగి పేలగానే అందులోంచి కుర్రవాడు బాణంలా దూసుకొచ్చాడు. వామనమూర్తి వైపు అతడి శరీరం బంతిలా వేగంగా వెళ్తూంది. ఆకాశంలో వెళ్తూన్న పక్షిని పక్కనుంచి వచ్చి డేగ పట్టుకున్నట్టు, నేత్ర గాలిలోనే ఆ కుర్రవాడిని పట్టుకున్నాడు. అదే వేగంతో వాడి వీపున ఎక్స్ ఫ్లోజిస్ తీసి. గాలిలోకి విసిరాడు.

 Previous Page Next Page