ఆమె మరి ప్రశ్నించకుండా ఉండిపోయింది. ఆమె మనస్సు నొప్పించాననుకున్నాడు.
"సారీ"
"ఎందుకు... పర్లేదులే... అయినా నేనొచ్చిన విషయం మర్చిపోయాను. రాత్రికి నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి..."
"ఎందుకు?"
సుమతి చిలిపిగా నవ్వి "మాస్కూలును రక్షించినందుకు" అంది. "మా కేదారేశ్వరత్త కూడా పిలవమంది"
ఆమె ఎవరూ?"
"నాకు వరుసకి అత్తయ్య అవుతుంది. ఆమెకెవరూ లేరు. నాతోనే వుంటుంది". ఎందుకో సుమతి స్వరంలో విషాదం ధ్వనించింది. అతడు మాటమార్చాడు.
"నీకు తెలుసా?"
"ఏమిటి?"
"గత రెండ్రోజుల్నుంచీ ఈ వూళ్ళో పదిమంది పిలిచారు భోజనానికి"
ఆమె కోపగించుకుని, "అందరూ నేనూ ఒకటేనా ఏమిటి?" అంది.
అతడుత్సాహంగా ముందుకువంగి "కాకపోతే మరేమిటో" అన్నాడు. ఆమె చురుగ్గా చూసింది. "నేనే నీ కాలిలోనుంచి బులెట్స్ తీయలేదూ?"
"తీశావు. దానికి ప్రతిగా నేను స్కూల్ ని రక్షించానుగా"
"ఇష్టం లేకపోతే చెప్పరాదూ..." నిష్టూరంగా అంది లేస్తూ.
"వస్తాను వస్తాను" కంగారు అన్నాడు. "మామూలు భోజనం చేసి ఎంతకాలమయ్యిందో".
"సరే! ఎదురుచూస్తూ వుంటాను" అని ఆమె వెళ్ళిపోయింది.
అతను ఆలోచనలోపడ్డాడు. అతడికి ఆశ్చర్యంగా వుంది. ఎటువంటి వాతావరణంలోనుంచి ఎటువంటిస్థితిలోకి.... తుపాకులు, రక్తపాతం, అనుక్షణం పోరాటాలూ, గెలుపులూ, ఓటములూ- చిన్న విషయం సాధించటంకోసం నిర్దాక్షిణ్యంగా మెడలు కత్తిరించడాలు- లక్షలు - కోట్లతో వ్యవహారాలు- ఫైవ్ స్టార్, స్విమ్మింగ్ ఫూల్స్ అటువంటి వాతావరణంలో నుంచి చిన్న పాక, నేలమీద నిద్ర.... చుట్టూ పొలాలు, నిశ్శబ్దంలోకి....
-ఆ సాయంత్రం అతడు సుమతి ఇంటికి వెళ్ళాడు. అతని రాకకోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
"రా...రా" అంటూ ఆహ్వానించింది. లోపలికి ప్రవేశిస్తూ ఆమెను చూశాడు. ఆమెకు నలభై ఏళ్ళకు పైనే వుంటాయి. నుదుటబొట్టు సూర్యుడిలా మెరుస్తూంది. "రా బాబూ" అంది.
అతడి మనసులో అదోలాటి భావన కలిగింది. కాస్త ఊహ తెలిసి మనుష్యుల మధ్యకు వచ్చాక అతడు ఇలాంటి స్త్రీలను చూడలేదు. నలభైదాటాక కూడా పెదాలకు లిప్ స్టిక్ లు, బిగించి కట్టిన బ్రాసరీలు, మొహాలకు ఫెయిర్-ఇన్-లవ్లీలూ చూశాడేతప్ప అతడున్న సమాజంలో ఈవర్చస్సు, గంభీరత సంతరించుకున్న స్త్రీలు కానరారు.
అతడు భోజనం చేస్తూంటే వాళ్ళిద్దరూ కొసరి కొసరి వడ్డించారు. చాలన్నా వినలేదు. సుమతి తమలపాకుల ఈనెలుతీస్తూంటే అతడు టేబిల్ మీద చేతులు ఆన్చి చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు. మెరిసే సున్నపువేలు హరికెన్ లాంతరు వెలుగులో తళుక్కుమనటాన్ని చూస్తున్న అనుభూతి ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంది. నాలుగు రోజుల క్రితం ఒకరికొకరు తెలియని మనుష్యులు ఇంత సన్నిహితంగా, ఇంత స్నేహంగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అన్న విషయం అతడికి కాస్త ఆశ్చర్యంగా వుంది. తనిల్లు గుర్తొచ్చింది. చెల్లాయి ష్యామా గుర్తుకొచ్చింది. తమ్ముడు భరత్ గుర్తొచ్చాడు. వాళ్ళు మాట్లాడతారు. కాని కేవలం డాక్టర్ దగ్గిరకి తీసుకువెళ్ళవలసివస్తే చెల్లీ- ఏదైనా కేసులో ఇరుక్కుంటే, తమ్ముడూ -
ఆ ఆలోచన రాగానే అతడి మనసు వికలమయింది. ఎంతసేపు మాట్లాడాడో గుర్తులేదు. బాగా రాత్రయిందని గుర్తొచ్చి 'వెళ్ళొస్తాను' అన్నాడు లేస్తూ.
"అప్పుడప్పుడూ వస్తూ వుండు బాబూ" అంది కేదారేశ్వరి. అతడు తలూపాడు. సుమతి నవ్వుతూ "ఆయన ఈ ఊళ్ళో శాశ్వతంగా ఉండి పోబోవటంలేదత్తా" అంది.
నా తండ్రితో కాంట్రాక్టు అయిపోయాక నా తల్లితోసహా ఇక్కడికే వచ్చి వుండిపోతాను.
అతడు వెళుతూవుంటే ఆమె గుమ్మంవరకూ వచ్చింది. అతడు ఆగి, తలెత్తాడు. ఆమె అతడివైపు చూస్తూ "మీరు ఇంతడబ్బున్నవారని తెలీదు. నిజంగా విక్రమ్ సింగే అనుకున్నాం. రకరకాల జోకులేసేం. క్షమించండి" అంది.
"నీకు నిజంగా స్క్రూ లూజులా వున్నట్టుంది".
"ఏం- ఎందుకని"
"లేకపోతే ఏమిటా మాటలు?"
"అంతేనా. అయితే ఓ.కే. గుడ్ నైట్...స్వీట్ డ్రీమ్స్".
స్వీట్ డ్రీమ్స్.... స్వీట్... డ్రీమ్స్...స్వీ...ట్...డ్రీ...మ్స్.
* * *
"జానకీ! నువ్వెప్పుడైనా ఎవర్నయినా ప్రేమించావా?"
జానకిరాముడు ఉలిక్కిపడి, అంతలోనే సర్దుకుని, తెరలుతెరలుగా నవ్వాడు. భోజనంచేస్తూ వున్నాడేమో, బాగా పొలమారింది. చాలాసేపటికిగానీ స్థిమితపడలేదు.
"నేనా? ప్రేమించడమా? ఆడదాన్ని ప్రేమించనా? మొగవాడిని ప్రేమించనా?" అని అడిగాడు.
అతడు గోడకి ఆనుకుని కూర్చునివున్నాడు. మొహం నిర్వికారంగా వుంది. "ప్రేమించడానికి ఆడ మొగ తేడా కూడా వుంటుందా జానకి? ఆ మాటకొస్తే ప్రాణంలేని పువ్వుల్నీ - పాటల్నీ కూడా ప్రేమించవచ్చు. అవునా!"
జానకి మొహంలో నవ్వు మాయమైంది. "నిజమే" అన్నాడు నొచ్చుకున్నట్టు. అది గమనించి అతడు, "ఊరికే అన్నానులే. నేను అడిగిందికూడా నువ్వు అనుకుంటున్న భావంలోనే..." అన్నాడు.
"అప్పటికి నాకింకా ఈ 'మధ్య'స్థితి రాలేదు. అప్పుడు పక్కింటి అమ్మాయిని ప్రేమించినట్టు గుర్తు. ప్రేమేమిట్లే- అప్పుడా అమ్మాయికి పన్నెండేళ్ళు...." అంటూ నవ్వసాగాడు.
అంతలోనే పేపరొచ్చింది. మొదట్లో జానకిరాముడు 'మనకెందుకు?' అని అభ్యంతరం తెలిపాడు. "అదేమిటి దేశానికి ప్రెసిడెంట్ గా నిలబడుతూ కనీసం పేపరుకూడా తెప్పించుకోకపోతే ఎలాగ?" అన్నాడతను.
అసలు మొట్టమొదటినుంచీ జానకిరాముడుకి ఈ వ్యవహారం అర్థం కానిదిగానూ, నవ్వులాటగానూవుంది. అతడు దేశ ప్రెసిడెంట్ గా నిలబడుతున్నాడని తెలిసి గ్రామంలో అందరూ విచిత్రంగా చూశారు. గ్రామపెద్దలు నవ్వుకున్నారు. "డిపాజిట్టు కట్టటానికి డబ్బులెవరిచ్చార్రా" అని ఒకరిద్దరు అడిగారు. ఆకతాయి పిల్లలు బొగ్గుతో ఆ రాత్రే గోడమీద "మీ ఓటు కొజ్జాకే..గాడిద గుర్తుకే..." అని రాశారు.
డాన్స్ చేస్తూ మామూలుగా అడుక్కోవటానికి వెళితే, "నీకేం ఖర్మరా! కాబోయే ప్రెసిడెంటూ" అంటూ హేళన చేశారు. ఆ విషయం అతడికి చెపితే "అవును. నీకెందుకూ ఆ పని" అన్నాడు.