Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 42

                                 


    లేచి నడవాలని, కళ్లు విదిలిస్తూ గంతులేయాలని గుండెలో నుంచి పొంగుకొస్తున్న కోరికని ఆమె అతికష్టంమీద అణుచుకుంది. అవన్నీ మతిభ్రమించటానికి మొదటి మెట్లని ఆమెకి తెలుసు. వాటికి లోబడకూడదు! ఆమె తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నించింది. గాఢంగా ఊపిరి తీసుకోవటానికి కూడా భయపడింది.

    గట్టిగా ఊపిరి పీల్చుకుంటే ఆ పేటికలో గాలి అయిపోతుందేమోనన్న భయం ఆమెని చుట్టుముట్టింది.

    ....అయిదు నిమిషాలు గడిచేసరికి ఆమె చీకటికి అలవాటుపడింది. తనకి తనే ధైర్యం చెప్పుకుంది. "సిరిచందనా! కామ్ గా ఉండు. ఏం జరగాలో అది జరిగి తీరుతుంది. నువ్వు గట్టిగా అరిచి లాభంలేదు అని. బయటివాళ్ళకి నీ అరుపులు వినపడవ్. మరణం తప్పని సరైతే దాన్ని ఆహ్వానించు. ఇలా భయపడితేలాభమేముంది? చీకటికి నువ్వు అలవాటు పడాలి. తప్పదు" అంటూ తనని తాను సెల్ఫ్ హిప్పటైజ్ చేసుకోవటానికి ప్రయత్నించసాగింది. ఈ విధంగా తనకి తాను ధైర్యం చెప్పుకోన్నకొద్దీ ఆమెకి స్వస్థత చేకూరసాగింది. తలమీద వున్న వస్తువు ఏమిటో ఇంకా అర్థంకాలేదు. ఆమె దానికోసం తడుముతూ చెయ్యి కొంచెం పక్కకి జరిపేసరికి ఒక ఎలక్ట్రిక్ స్విచ్ లాటిది కనపడింది.

    దాన్ని ఆన్ చేసింది. వేయి నక్షత్రాలు ఒక్కసారి వెలిగినట్టు ఒక వెలుగు శవపేటికని కమ్మింది.

    నిజానికి వెలిగింది ఒక చిన్న జోరోవాల్టు బల్బు మాత్రమే. కానీ అప్పటివరకూ అంత దట్టమైన చీకటికి అలవాటుపడ్డ ఆమె కళ్లు ఆ మాత్రం వెలుగుని కూడా భరించలేకపోయాయి. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆ వెలుగు ఆమెకెంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఆ క్షణం తనకా పేటికలోంచి స్వేచ్చ లభించినట్టుగా ఫీలయ్యింది.

    రెండు నిమిషాల తరువాత ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అది ఒక శవపేటిక. కాళ్ళ దగ్గర ఒక చిన్న బాల్చీలాంటిది వుంది. మరోపక్క ఫాన్ వుంది. దాదాపు ఆమె ఎంత పోడవుందో శవపేటిక కూడా అంతే వుంది. ఆమె దాన్ని ఆన్ చేసింది. గాలి చల్లగా వీచసాగింది. ఆమెకి కొంత రిలీఫ్ దొరికింది.

    తను ఉన్న స్థానంనుంచే కొద్దిగా పక్కకి తిరిగి పడుకోటానికి వీలున్నట్టు ఆమె గమనించింది. ఆ సమయంలో అలా పక్కకి తిరగ గలగటం కూడా ఆమెకి  ఎంతో రిలీఫ్ నిచ్చింది. ఈలోగా ఆమె చేతికి మరో వస్తువు తగిలి దాన్ని తీసి చూసింది.

    అది మంచినీళ్ళ సీసా.

    ఆమె తేలిగ్గా శ్వాస పీల్చుకుంది. లైటు, ఫాను, నీళ్ళు ఏర్పాట్ల చేశారంటే తనని వాళ్లు చంపడానికి పూనుకోలేదన్నమాట. ఈ ఆలోచన ఆమెకి ధైర్యాన్నిచ్చింది. తల పక్కగా తడిమి చాక్లెట్ చేతిలోకి తీసుకుంది. దాంతోపాటే మరో కాగితం కూడా తగిలింది.

    అది ఒక ఉత్తరంగా తోచి చదవటం ప్రారంభించింది.

    అది నిజంగా ఉత్తరమే. వణుకుతున్న చేతులతో దాన్ని పట్టుకొని ఆమె చదవసాగింది. "నీ తల వెనుకభాగంలో ఒక బ్యాటరీ వుంది. లైటు, ఫాను దానికి అమర్చబడి ఉన్నాయి. అదేవిధంగా నువ్వు నీ ఇష్టం వచ్చినంతసేపు వెలుతురునీ, గాలినీ అనుభవించవచ్చు. అదే విధంగా నీ తల పక్కన కొద్దిగా  ఆహరం కూడా  వుంది. అయితే ఒక్క విషయం! నీపేటికలో అమర్చిన బ్యాటరీ కేవలం ఆరుగంటలు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి గాలిని, వెలుతురునీ పొదుపుగా వాడుకోవాలని నీకు చెప్పనవసరం లేదనుకుంటాను. పోలీసులు మాకు బంగారం అందజేస్తే సరేసరి. లేకపోతే..... వుయ్ ఆర్ సారీ.....గుడ్ బై!"

    ఆమె ఆ ఉత్తరం కేసి అలాగే చూస్తుండిపోయింది.

    కొంచెం సేపటికి ఆమె చప్పున స్పృహలో కొచ్చినట్లు ఫాన్ ఆపుచేసింది. లైటుమాత్రం ఆర్పేయలేకపోయింది. మనసులోనే తనున్న పొజిషన్ నీ, తన పేటికనీ ఉహించుకాసాగింది.  ఆమె మనసులో ఒక ఆకృతి రూపుదాల్చుకుంది.

    ఆమె మరొక పది నిమిషాలు అలాగే పడుకొని వుంది. కానీ ఎంతసేపు అలా ఉండగలదు? లోపలి గాలి పూర్తిగా స్తంభించి తిరిగి ఉక్కపోయసాగింది. ఫాన్ ఆన్ చేసి అరనిమిషం తరువాత మళ్ళీ  ఆఫ్ చేసింది.


   
    ఈ పాటికి కిడ్నాపర్లు పోలీసులకి తన విషయం చెప్పుంటారా? పోలీసులు వాళ్ళు అందజేయమన్న ప్రకారం బిస్కెట్లు తీసికెళ్ళి వుంటారా?

    ఆలోచిస్తూ ఆమె నెమ్మదిగా పక్కకి వత్తిగిల్లింది.

    అప్పుడు తగిలింది మరో పరికరం. ఆమె దాన్ని చేతిలోకి తీసుకొని చూసింది. వైర్ లెస్ సెట్! ముందు అదేమిటో ఆమెకి అర్థంకాలేదు. ఆమె ఎన్నడూ వైర్ లెస్ ని చూడలేదు.

    ఆ సెట్ మీద మరో చిన్న ఉత్తరం వుంది.  దాన్ని ఎలా ఉపయోగించాలో అందులో వివరంగా వ్రాయబడి వుంది.

    ఆమె ఆనందంతో సన్నగా కేకపెట్టింది. ముందు లైటు, తరువాత ఫాను, ఆ తర్వాత వైర్ లెస్ సెట్టు ఆమెని ఆనందంలో ముంచాయి. అయితే అవన్నీ తాత్కాలికమైన ఆనందాలే అని, తను భయంకరమైన నరకంలో గడప బోతున్నానని ఆ క్షణం ఆమెకి తెలీదు. ఉత్తరం చివరి భాగంలో ఈ విధంగా వుంది. "...... ఈవైర్ లెస్ సహాయంతో నువ్వు కావాలంటే మీ వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇది వన్- వే- ట్రాఫిక్- వైర్ లెస్. అంటే......నువ్వు కావాలనుకుంటే మీ వాళ్ళతో మాట్లాడొచ్చు. కానీ అట్నుంచి వాళ్లు నిన్ను కాంటాక్ట్ చేయలేరు. ఎందుకంటే నీ వేవ్ లెంగ్త్ వాళ్ళకి తెలియదు కాబట్టి. చివరగా ఒక సలహా! ఒక ఫాన్ గంటసేపు తిరిగితే అయ్యే బ్యాటరీ ఖర్చుకి, ఒక లైటు రెండు గంటలపాటు అయ్యే ఖర్చుకి- దాదాపు పదిరెట్లు ఈ వైర్ లెస్ ఉపయోగిస్తే ఖర్చవుతుంది. అందువల్ల క్లుప్తంగా మాట్లాడు. ఒక్క నిమిషంనువ్వు మీ వాళ్ళతో మాట్లిడితే పది నిమిషాలు నీ బ్యాటరీ తాలూకు జీవితం ఖర్చయిపోతుందని గుర్తుంచుకో."

    ఆమెకి అదే పెద్ద వరం లాగా కనపడింది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరచటం కోసం, తన వాళ్ళతో మాట్లాడటం కోసం, దేవుడే ఆ వైర్ లెస్ పంపించాడని ఆ క్షణాన ఆమెకి అనిపించింది. కిడ్నాపర్స్ ప్లాన్ లో అది ఒక అత్యంత కీలకమైన అంశమని ఆమె ఊహించలేదు.


                               6

    కమీషనర్ అశ్వత్ధామ దీర్ఘాలోచనలో వున్నాడు.

    కిడ్నాపర్స్ స్ట్రాటజీ అతనికి అర్థమైంది. ఏ విషయమూ చెప్పకుండా వాళ్ళు మౌనంగా ఉంటే తమకీ మరింత టెన్షన్ పెరుగుతుందనీ, వాళ్ళు చెప్పిన కండిషన్సుకి ఒప్పుకొక తప్పని మానసిక పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళకు తెలుసు. అందువల్లే వాళ్ళు ఏ విషయమూ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారనీ అతడికి అర్థమైంది. అతడు హోంమినిష్టరు సెక్రటరీతో మాట్లాడి మొత్తం విషయమంతా వివరించాడు. బంగారు బిస్కెట్లు దొరకగానే వాటిని ప్రభుత్వానికి హాండోవరు చెయ్యకుండా తమ దగ్గరే ఉంచుకున్న విషయంలో ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని అతను భయపడ్డాడు. కానీ, ఈ విషయమై హోంమినిష్టర్ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. వారుకూడా సిరిచందనని ఎలా బయటికి తీసుకురావాలా అన్న విషయమే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే ఈ నిర్ణయించుకున్నారు. కమీషనర్ అశ్వత్ధామ  నిజాయితీ మీద ఎవరికీ అపనమ్మకం  లేదు. కానీ ఇక్కడ సమస్య నమ్మకాలూ, అపనమ్మకాలూ కాదు. సిరిచందనని ఆ కిడ్నాపర్సు బారినుంచి ఎలా బయటకి తీసుకురావాలా అన్నది!

    ....విష్ణువర్థనరావు మానసికంగా బాగా కృంగి పోయాడు. అల్లారుముద్దుగా పెంచిన తన కూతురు ఎక్కడవుందో తెలియక అతడు విలవిల లాడిపోతున్నాడు. అయితే ఈ విషయంలో నిబ్బరంగా ఉన్న అశ్వత్ధామ, కిడ్నాపర్సుకి తమకి కావలసింది దొరికిన తరువాత, తాము కిడ్నాప్ చేసిన వ్యక్తిని సురక్షితంగా వదిలి పెడతారని అతడి కెందుకో ప్రగాఢమైన నమ్మకం వుంది.

    రవితేజ కూడా అక్కడే ఉన్నాడు. మొట్టమొదటి ఫోన్ కాల్ కమీషనర్ ఆఫీసుకి రాగానే కిడ్నాపరు ఇక కమీషనరుతోనే కాంటాక్ట్ పెట్టుకుంటారని, అతను కూడా ఇక్కడికే చేరుకున్నాడు.

    వాళ్ళ నలుగురూ చేయగలిగిందేమీ లేదు. కిడ్నాపర్సు దగ్గరినుంచి రాబోయే మరొక ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండటమే. ఆ సమయంలో ఒక ఇన్ స్పెక్టర్ హడావుడిగా అక్కడికివచ్చి "సర్" అన్నాడు కమీషనర్ తలెత్తి చూశాడు.

    "ఒక వైర్ లెస్ మెసెజ్!"

    "ఎవరికి?"

    "అదే తెలియటం లేదు. చాలా కన్ఫ్యూజింగ్ గా వుంది సర్."

    కమీషనరు లేచి హడావుడిగా వైర్ లెస్ రూంలోకి వెళ్ళాడు. అతడు ప్రీక్వేన్సీ అడ్జెస్ట్ చేస్తూండగా ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్టు ఒక స్వరం వినిపించింది "ఎవరూ, ఎవరు మాట్లాడుతోంది?"

    "నేను కమీషనర్ అశ్వత్ధామని, ఎవరు?"

`    "నేను సిరిచందనని."

    కమీషనర్ గుండె ఒక్కక్షణం కొట్టుకోవటం ఆగి తిరిగి ప్రారంభమైంది. ఎగ్జయిటింగ్ గా "సిరీ...... సిరిచందనా" అని అరిచాడు. ఆమెకి వైర్ లెస్ లో మాట్లాడటం సరిగ్గా తెలియనట్టు, ఇటువైపునుంచి కమీషనర్ మాట్లాడుతూ ఉండగా అటునుంచి ఆమెకూడా మాట్లాడటం ప్రారంభించింది. ముందు ఆమెకి ఆ విషయం నేర్పాల్సి వచ్చింది. కమీషనరు అన్నాడు, 'నేను మాట్లాడటం అవగానే 'ఓవర్' అంటాను. అప్పుడు నువ్వు ఆన్ చెయ్యాలి. నువ్వు మాట్లాడటం అవగానే 'ఓవర్' అనాలి. అప్పుడు నేను ఇక్కడ ఆన్ చేస్తాను."

    సిరిచందన ఆ విషయం తెలుపుకున్నట్టు "నేను అంకుల్. సిరిచందనని ఓవర్....." అంది.

    "ఎక్కడ నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వైర్ లెస్ నీకెక్కడిది?"

    "ఒక చిన్న పేటికలో నన్ను బంధించారు. నీళ్ళగుంటలో ఎక్కడో పడేశారు. మీతో కాంటాక్ట్ పెట్టుకోవటం కోసం ఈ వైర్ లెస్ ఇచ్చారు నాకు. కానీ అంకుల్ నేను ఎక్కువ సేపు మాట్లాడలేను. ఎందుకంటే, దీనికి ఉన్న బ్యాటరీ అయిపోతే నాకు ఈ పేటికలో గాలి, వెలుతురు కూడా ఉండదు. ఓవర్."

    కమీషనర్ కి విషయం అర్థమైంది.

    కిడ్నాపర్స్ తమని మరింత ఇరుకున పెట్టటం కోసం ఆమెని ఒక వైర్ లెస్ కూడా ఇచ్చారు. శవపేటికలో పెట్టారంటే ఆమె మరెంతోసేపు ప్రాణాలతో బ్రతకదు. ఆ విషయం తాము తెలుసుకోవటం కోసం ఈ విధంగా చేసాడు. ఇప్పుడిక ఆమె వైర్ లెస్ లో రక్షించమని అడుగుతూ అంటే తాము నిస్సహాయంగా చూస్తూ వుండిపోవాలి. మానసికంగా తమని దెబ్బతీయటం కోసం కిడ్నాపర్స్ వేసిన రెండో ఎత్తు ఇది.

    ఆ పరిస్థితిలో కూడా ఖాన్ తెలివితేటల్ని అతడు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పోలీసులు వాళ్ళని పట్టుకోవటానికి ఏమాత్రం వలవేసినా అక్కడ సిరిచందన ప్రాణాలు పోతాయి. కిడ్నాపర్సుని పట్టుకొని సిరిచందన ఎక్కడవుందో తెలుసుకోవటం కోసం థర్డ్ డిగ్రీ ఉపయోగించటం మొదలుపెడితే వాళ్ళా రహస్యాన్ని చెప్పటంకోసం కనీసం నాలుగైదు గంటలు పడుతుంది. ఈ లోపులో అక్కడ ప్రాణాలు పోవటం ఖాయం. 'నో ట్రిక్స్....మీరు మాకు బంగారు అప్పగిస్తే, మీ అమ్మాయి మీకు సురక్షితంగా దొరుకుతుంది' అని అన్యాపుదేశంగా కిడ్నాపర్స్ చెబుతున్నారు. కమీషనర్ ఈ ఆలోచనలో వుండగానే విష్ణువర్థనరావు అక్కడికి ప్రవేశించాడు., కమీషనర్ ఆయనకి జరిగిందంతా చెప్పాడు. తన కూతురు ఎక్కడో నీళ్ళ అడుగున వుందని తెలియగానే విష్ణువర్థనరావు చిన్న పిల్లవాడిలాగా విలపించసాగాడు.

 Previous Page Next Page