"ఎన్ని సంవత్సరాలయినా, ఎంత మందిలో ఉన్నా తల్లి తన కొడుకుని తేలిగ్గా గుర్తు పట్టగలదు -"
"ఆ మాటా నిజమే మరి" అన్నాడు రామలింగం.
"అమ్మా! వీళ్ళ మాటలేం పట్టించుకోకు ! నేను హిమాలయాల నుంచి తిరిగి రావటం ఇష్టంలేక వీళ్ళందరూ నాటకం ఆడుతున్నారు. రాధ మెడలో తాళి కట్టింది నేను. కృష్ణని ! నీ రెండో కొడుకు ఎంత స్వార్ధపరుడిగా తయారయాడో చూడు. తోడబుట్టిన వాడినే కాదు పొమ్మంటున్నాడు" అన్నాడు అవతారస్వామి దీనంగా.
"కాదమ్మా ! వాడెవడో తమ్ముడి పేరుతో నాటకమాడుతూ వీడినిక్కడికి పంపించాడు. వీడసలు తమ్ముడు కాదమ్మా !"
శారదమ్మ మొఖంలో నిరాసక్తత కనిపించింది.
"మీ గొడవలేవీ నా కనవసరం ! కానీ నా కొడుకు ఎవరో, ఎవరు కాదో మీరు నాకు చెప్పనక్కర్లేదు-"
"సరే ఈ గొడవేదో తర్వాత చూద్దాంలే ! ముందు భోజనానికి పదండి" అంది అన్నపూర్ణ.
"వీల్లేదు ! ఇప్పుడే - ఇక్కడే తేలాలి !" గట్టిగా అరిచాడు మురళి. అతని మొఖంలో కనిపించిన ఆవేశం అందరినీ నిశ్చేష్టులను చేసింది. "వాడు కేవలం డూప్లికేట్ అన్న విషయం నేనే ఋజూ చేస్తాను."
నరసింహం ఆశ్చర్యంగా కృష్ణవేపు చూడసాగాడు.
అవతారస్వామి నవ్వాడు "కన్నతల్లి గుర్తుపట్టటం కంటే ఇంకా ఋజువేముంటుందోయ్ పిచ్చివాడా!"
"ఇంకా నేను వెళతాను! ఓసారి మిమ్మల్నందరినీ చూడాలనిపించింది! వచ్చాను! అనుకోకుండా రెండో కొడుకుని కూడా చూశాను." అంది శారదమ్మ వెళ్ళడానికి సంసిద్ధమవుతూ.
"అమ్మా ! నువ్వు కూడా నాతోనే వుండమ్మా ! నాకు మాత్రం ఎవరున్నారని?" దీనంగా అడిగాడు అవతారస్వామి.
నరసింహానికి ఇదంతా నాటకమని తెలుస్తూనే వుంది. ఈమె ఆ హరికృష్ణ దగ్గర వుండి, వాడాడుతున్న నాటకానికి ఉపయోగపడుతోంది. తనకా విషయం తెలీకుండా వుంటానికని ఎక్కడో, ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు అబద్ధం చెప్తోంది.
అంతవరకూ సీరియస్ గా పచార్లు చేస్తూన్న వాడల్లా హఠాత్తుగా మురళి ఆగిపోయాడు.
"మావయ్యా! ఇప్పుడు తేలిపోతుంది - వాడు దొంగో - నేను దొంగో - రాధను పిలవండి." అన్నాడు ఆవేశంగా.
అవతారస్వామి ఉలిక్కిపడ్డాడు. "ఇంకా తేలటం ఏమిటి? హిమాలయ పర్వతాల కెళతానన్న వాడివి - వెళ్ళకుండా ఇక్కడే తిరుగటం చూస్తూంటేనే తెలిసిపోతోంది - ఎవరు దొంగో" అన్నాడు హేళనగా.
"మళ్లీ ఏమిటిప్పుడు ?" అడిగాడు రామలింగం చిరాకుగా.
"ముందు రాధను పిలవండి -"
రామలింగం లోపలికెళ్ళి రాధతో తిరిగి వచ్చాడు.
"చిన్నప్పుడు ఓసారి బాదంచెట్టు క్రింద నేనూ రాధా ఆడుకుంటూంటే రాధకూ నాకూ పోట్లాట వచ్చింది. అప్పుడేం జరిగిందో ఆ దొంగస్వామిని చెప్పమనండి ! కరెక్టుగా చెప్పగలిగితే నేను రాధను వదులుకుని వెళ్ళిపోతాను" అన్నాడు మురళి.
అవతారస్వామి మొఖంలో చిరునవ్వు చెరిగిపోయింది.
"చెప్పు నాయినా ! చెప్పు !" అన్నాడు రామలింగం.
"పోనీలే- కావాలంటే ఓ గంట ఆలోచించుకుని చెప్పు ! ఎందుకంటే అర్జంటుగా కథల్లాలంటే కుదరదుగా?" అన్నాడు నరసింహం.
అవతారస్వామి చెమటలు తుడుచుకున్నాడు. "ఏం జరిగిందో నాకు గుర్తులేదు. చాలాసార్లు నేనూ రాధా పోట్లాడుకున్నాం" అన్నాడు తడబడుతూ.
రాధ అనుమానంగా చూసిందతనివేపు.
"నేనూ బావా ఆ ఒక్కరోజే దెబ్బలాడుకున్నాం!" అంది చిరునవ్వుతో.
"ఆ రోజు నేను రాధ తలమీద ఇనుప చువ్వతో కొట్టాను. ఆదెబ్బ బలంగా తగలటంచేత తలకు గాయం అయింది. ఆ గుర్తు ఆ తరువాత చాలా రోజులవరకూ అలానే వుండిపోయింది. కావాలంటే చూడండి ! ఇప్పుడూ వుంటుంది" అంటూ ఆమె దగ్గరకు నడిచి ఆమె కుడివేపు జుట్టుపాయ పక్కకు తీసి చూశాడు.
నల్లని చార ఇంకా స్పష్టంగా కనబడుతూనే వుంది.
రాధ మొఖంలో ఆనందం వెలిగిపోయింది. అన్నపూర్ణ, రామలింగం కూడా ఆశ్చర్యపోయారు.
"నాయనా మురళీ ! మమ్మల్ని క్షమించు. ఆ దొంగవెధవ మాటలు నమ్మి నిన్ను అవమానించాము" అన్నారు సిగ్గుపడుతూ.
నరసింహం మురళి భుజంమీద గర్వంగా చేయి వేశాడు.
"శభాష్ ! నా అల్లుడు వనిపించావ్ ?'
"ముందు వాడిని పట్టుకుని తన్నండి - ఇంకోసారిలాంటి వేషాలేయకుండా ..." అన్నాడు రామలింగం.
అందరూ అవతారస్వామి కోసం చూసేసరికి అతను కాస్తా మాయమయిపోయాడు.
పరుగుతో అతని గది దగ్గరకు చేరుకున్నాడు మురళి. గది తలుపులు మూసి గడవేసి వున్నాయ్.
నరసింహం తలుపులు బాదాడు గానీ ఎలాంటి ప్రయోజనం కనిపించకపోయేసరికి కోపం ముంచుకొచ్చింది. ఎలాగయినా ఆ దొంగస్వామిని పట్టుకుని చిత్రహింసలు పెడితే గానీ అసలు వాడినిక్కడికి ఎవరు పంపిందీ అడ్రస్ దొరకదు.