Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 41


    "ఏం  బాగున్నావా...?" నేత్ర అడిగాడు. రెడ్డినాయుడు మాట్లాడలేదు. అతడి మొహంలో ప్రేతకళ కనిపిస్తూంది. కళ్ళు నిస్తేజంగా వున్నాయి. "తిరిగి తిరిగి అలిసిపోయినట్టున్నావ్. కాఫీ తాగుతావా?....." అని అడిగాడు నేత్ర. ప్రతిమ కళ్యాణి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి సాయం చేయసాగింది. రెడ్డి మాట్లాడకపోవడం చూసి "ఏమిటి అలా వున్నావు......?" అని అడిగాడు నేత్ర మళ్ళీ.

 

    "ఏం లేద్దొరా... వూర్కినే....."

 

    "ఎప్పుడెళ్తున్నావు వూరు?......"

 

    "పనైనాక ఎల్లిపోవాలి కదా......"

 

    నేత్ర  డ్రాయర్ మీద  వున్న పాకెట్  తీసి రెడ్డి  నాయుడికి యిస్తూ "మీ  అబ్బాయికి యిది. టాకింగ్ డాల్. జీతగాడు యాదగిరి యిచ్చిందని చెప్పు. ఏం  చెప్తవ్ దొరా....?" అన్నాడు పాత రోజుల్ని ఇమిటేట్ చేస్తూ. రెడ్డి నాయుడు నిరామయంగా చూసాడు. "నీ తల్లి....... చెప్పరాద్వయ్య...." అని నవ్వాడు నేత్ర. రెడ్డి నాయుడు దాన్ని అందుకుంటూ "దొరా..... యింతకాలం నాకు సేవ జేసినవ్. యిప్పుడు నేన్నీకు జేస్త" అంటూ లేచాడు. "నేనే  నీకు కాఫీ దెస్త."

 

    నేత్ర  వారిస్తూ "ఛా..... నువ్వు చెయ్యడం ఏమిటి.....? వద్దు......" అన్నాడు అప్పటికే రెడ్డినాయుడు లోపలికి వెళ్ళిపోయాడు.

 

    టైమ్ అయిదున్నర అయింది.

 

    స్టవ్ మీద  పాలు కాగుతున్నాయి. పైన షెల్ఫ్ లో నెస్ కేఫ్ సీసా వుంది. అది తీసుకుని, పంచదార కోసం పక్కన వున్న డబ్బా తీసాడు.

 

    రెడ్డి నాయుడు అటూ యిటూ చూశాడు. అతడి చేతులు వణుకుతున్నాయి. వంటింట్లో ఎవరూ లేరు. పాలు మరుగుతున్న శబ్దం ఇంకేమీ లేదు. అంతా నిశ్శబ్దంగా వుంది.

 

    మరుగుతున్న పాలల్లో నెస్ కేఫ్ వేశాడు.

 

    జేబులోంచి పొట్లాం తీసి విప్పాడు. లోపల నల్లటి పొడి వుంది. కాఫీ రెండు కప్పుల్లో పోశాడు. నల్లటి పొడి వెయ్యటానికి చెంచా తీసుకున్నాడు.

 

    పొట్లం ఇప్పి ఒక కప్పులో వేయబోతుండగా "అది పంచదార కాదు" అని  వినిపించింది వెనుక నుంచి. ఉలిక్కిపడ్డాడు. అతడి గుండె ఒక్కక్షణం ఆగినట్టయింది. చేతిలో పొట్లం వణికింది.

 

    వెనక కళ్యాణి నవ్వుతూంది.

 

    రెడ్డినాయుడు మొహం వాడిపోయింది. "ఇది ......యిదీ ....." అన్నాడు చేతిలో పొట్లం దాచెయ్యటానికి ప్రయత్నిస్తూ.

 

    "మా తాతమ్మ ఎప్పుడూ అంతే. పంచదార అని వ్రాసి వున్న సీసాలో కారం  పోస్తుంది. మీరేం కలుపుతున్నారు కాఫీలో?...."

 

    "నేనా?.....నేనూ?......" తడబడుతూ అన్నాడు.

 

    ఆ అమ్మాయి దగ్గర కొచ్చి షెల్ఫ్ లో వెతికి మరో సీసా  తీసింది. "చింతపండు అని రాసి వుంటే అది పంచదార. చదవండి."

 

    "నాకు చదువు రాదు."

 

    "భలే...... మీకు చదువు రాక  చదవలేరు. నేను కళ్ళు లేక చదవలేను. బావుంది కదూ...."

 

    రెడ్డి అప్పుడు చూచాడు ఆమె  అంధత్వాన్ని. అతడి మొహంలో రిలీఫ్ కనపడింది.

 

    "వన్ బ్లయిండ్ మాన్ లీడ్స్ అనదర్ అని ఇంగ్లీషులో సామెత మనల్ని చూసే వ్రాసి వుంటారు." అంటూ నవ్వి, మూతతీసింది. "పంచదార కప్పుల్లో వెయ్యండి. ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారట. ఆర్నెల్లు మీకు సేవ  చేసి  అన్నయ్య యిప్పుడు మీకు  దొర  అయ్యాడన్న మాట. ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నారా.....?"

 

    విషం ఒక కప్పులోనూ, పంచదార ఒక కప్పులోనూ వేసి  "అవును దొరసాని....." అన్నాడు.

 

    ఆమె స్పూన్ తో రెండు కప్పులూ కలిపింది. ఆమె ట్రే పట్టుకోబోతుంటే, "నేను తీసుకెళ్తాను." అన్నాడు.

 

    "అన్నయ్య చెప్తే ఏమో అనుకున్నాను. భలే సెంటిమెంట్ మీది....."

 

    అతడు ట్రే ఎత్తుతూ "సెంటిమెంటా.....?" అన్నాడు.

 

    "మనకి అవతలి వాళ్ళు ఎంత చేస్తే, అంతకు రెట్టింపు మనం  వాళ్ళకి చెయ్యడాన్ని సెంటిమెంట్ అంటారు." రెడ్డినాయుడు ట్రేతో ముందు గదిలోకి వచ్చాడు.

 

    "నువ్వెందుకు ఇంత కష్టపడ్డావ్?"

 

    "పర్లేదు దొరా" అంటూ ట్రే ఇద్దరి మధ్యా పెట్టి నిలబడ్డాడు.

 

    నేత్ర కప్పు తీసుకుంటూ, "అన్నట్టు నువ్వు పంచదార తక్కువ తాగాలని డాక్టరు చెప్పాడుగా. అలాగే వేసావా?" అన్నాడు. నాయుడు కళ్ళు తడి అయ్యాయి. "-నీకింకా గుర్తున్నదా దొరా" అన్నాడు.

 

    "భలేవాడివే. ఎందుకు మర్చిపోతాను? ఒకసారి పంచదార ఎక్కువ వెయ్యలేదని కొట్టావ్ కూడా" అంటూ నవ్వి కప్పు తీసుకున్నాడు. ఈ చివరి మాటతో రెడ్డి నాయుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.

 

    ఇద్దరూ కప్పులు చేతిలోకి తీసుకుని తాగడం మొదలెట్టారు.

 

    "దొరా....." అన్నాడు నాయుడు. నేత్ర ఆశ్చర్యంగా చూసాడు. నాయుడు అలా మాట్లాడడం అదే మొదటిసారి.

 

    "నిన్ను సంపకుంటే ఆళ్ళు నా కొడుకుని సంపేత్తమన్నారు. ఆడ్ని ఆళ్ళు సంపేత్తారు దొరా. ఇప్పటికే సగం  సంపేసిన్రు. మర ఫిరంగిలో పెట్టి పేల్చేత్తామన్నారు. నువ్వు తాగే కాఫీలో యిసం పెట్టమన్నారు."

 

    నేత్ర  శిలా ప్రతిమలా కూర్చుండిపోయాడు. మెరుపుల మధ్య  మొహం  కనిపించినట్లు, రకరకాల భావాలు ప్రతిబింబిస్తున్నట్టు రెడ్డినాయుడు కనిపించాడు. కరుణ, భయం, జాలి, దిగులు.

 

    ప్రతిమ, కళ్యాణి నిశ్చేష్టులయ్యారు. రక్తం యింకిపోయిన మొహాల్తో యిద్దరూ ప్రేక్షకుల్లా అతడి మాటలు వింటున్నారు. రెడ్డి నాయుడు కుర్చీ కోడు గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కొక్క మాటే బలవంతంగా బయటకొచ్చింది.

 

    "నాకేం  చెయ్యాలో తోచలేదు. నా కొడుక్కి సావు తప్పదు. నా ఒక్కగానొక్క కొడుకు సస్తే నే బతక లేను. అట్టగని నిన్ను సంపలేను. అందుకే ..... అందుకే......"

 

    నేత్రకి  ఏదో  అనుమానం వచ్చింది. కుర్చీలోంచి  లేచి అతడివైపు వస్తూ "అందుకే.....?" అన్నాడు.

 

    "ఆ యిసం  నేను తాగినా దొరా....." అంటూ  తూలిపోయాడు.

 

    అతడిని నేత్ర పట్టుకున్నాడు. రెడ్డి నాయుడి నోట్లోంచి నురుగు వస్తూంది. "...... నే..... సస్తే..... ఏముంది దొరా...... ఎండిపోయిన ఆకు లాటోడ్ని. నువ్వు  బతకాలె. నీ  అవసరం దేశానికుంది. నాకు సంతోషంగా వుంది దొరా. నిన్ను బతికించుకున్న. నా కొడుకునీ బతికించుకున్న. నే సస్తే నా కొడుకుని వదిలేస్తరు. ఇంకేం సేసి సస్తరా ఎదవ నా కొడుకులు...." అతడి మాటలు పూర్తికాలేదు.

 

    "నో.... నువ్వు చావటానికి వీల్లేదు. నిన్ను రక్షించుకుంటాను" అంటూనేత్ర అతడిని పట్టుకున్నాడు. "ప్రతిమా..... క్విక్..... అంబులెన్స్ కి  ఫోన్ చెయ్యి."

 

    సాయంత్రం ఆరయింది గడియారం గంటలు కొడుతూంది.

 Previous Page Next Page