Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 40


    "మన జాగ్రత్తలో  మనం  వుండటం మంచిదిగా డాక్టర్ గారూ." కంఠం చిన్నదిచేసి చెప్పింది.

 

    "చూడమ్మా- నువ్వు  నా కూతురులాంటిదానివి. ఈ విషయం ఎవరికీ చెప్పకు. అతడు నిన్ను చేసుకుంటే సరేసరి, లేదా ఈ రహస్యం నీలోనే దాగిపోనీ. అతడు కనపడడం మానేసింది పొద్దున్నించే అంటున్నావు కాబట్టి ఇంకొంత కాలం ఆగు. ఈలోపు అతడు కనబడితే చెప్పు. మీ నాన్నగారితో నేను మాట్లాడతాను. లేదంటే రెండు మూడు నెలలు పోయాక చూద్దాం-"

 

    హంసలేఖ లేచింది. హాస్పిటల్ గోడకున్న కుటుంబ నియంత్రణ ప్రకటనలో అబ్బాయి అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆమె ఆ బొమ్మవైపు చూసింది.

 

     పసిపిల్ల ఏడుపు ఫోటోలోంచి వినిపించింది.


                                     *    *    *

 

    "ఎవరు మీరు-?" అడిగాడు రెడ్డి నాయుడు.

 

    ఖరీదైన హోటలు కారిడార్ అది. అతడిని తీసుకువెళ్తున్నవాళ్ళు జవాబు చెప్పలేదు. ఒక రూంలోకి ప్రవేశించారు. లగ్జరీ సూట్ అది. అందులో ఒక ఫర్నిచరే అయిదారు లక్షలు చేస్తుంది.

 

    లోపల కూర్చుని వున్నాడు సర్పభూషణరావు.

 

    "ఎందుకు తీసుకొచ్చిన్రు ఈళ్ళు నన్ను-?"

 

    "అలా కూర్చో."

 

    "ఎవరయ్యా నువ్వు-?"

 

    "నీదగ్గిర పనిచేసిన యాదగిరే ఏజెంట్ నేత్ర అని నీకు కబురు పంపింది నేనే."

 

    రెడ్డినాయుడు అనుమానం విడిపోయినట్టు తేటబడ్డాడు.

 

    "ఓ- మీరేనా ఆ కబురు అంపింది. భలే ఆఫీస్రయా - చాకులాంటి కుర్రాడు. నీ యవ్వ- నా దగ్గర ఏం నాటకమాడిండు. నీ తల్లి నేనే  పరేషానయిన" అన్నాడు మెచ్చుకోలుగా నవ్వుతూ.

 

    "ఆ చాకుని యికముందు పనికిరాకుండా చెయ్యాలి."

 

    "ఏమన్నవ్-?"

 

    "ఏజెంట్ నేత్రని ఈ రోజు సాయంత్రం నువ్వు చంపాలి" అంతే  తాపీగా  చెప్పాడు.

 

    "చంపాల్నా-? నీ తల్లి - నాలుక తెగ్గోస్తా. ఈడెవడో తెల్సా? తెలంగాణ" దొర. నైజాం నెదిరించిన వంశంలో పుట్టినోడు."

 

    ఫోన్ మోగింది. సర్పభూషణరావు కామ్ గా రిసీవర్ తీసుకొని తను వినే అవసరం లేనట్టుగా రెడ్డినాయుడికి అందిస్తూ "విను" అన్నాడు.

 

    ఒక చిన్నపిల్లాడి గొంతు "నాయనా-" అని అట్నుంచి వినిపించింది. నాయుడికి ముందు అర్థంకాలేదు. అర్థంకాగానే "నర్సింహా" అని అరిచాడు.

 

    "నేనే  నాయనా-" అట్నుంచి ఎనిమిదేళ్ళ కుర్రాడి మాటలు యింకా పూర్తి చేయకుండానే ఆ కుర్రాడి వెనుకవున్న క్యూ సూదితో వాడి మెడమీద గుచ్చాడు. "నా-య-నో-" అన్న అరుపు వినిపించింది.

 

    "ఏమ్రా ......ఏమైంది....? ఏడ్నుంచి  నువ్వు....?" కంఠంలో దుఃఖపు జీర కదలాడుతూంటే కీచుగా అరిచాడు నాయుడు.

 

    "న్నా..... న్నాయి..... న్నా" చిన్న మూలుగు, ఏడుపు. చేతికి అంటిన రక్తం తుడుచుకున్నాడు క్యూ ఫోన్ కి అటువైపు.

 

    నాయుడు సర్పభూషణరావుతో "దొరా...... ఏంది.....? నా కొడుకు ఏడున్నడు?" అని దీనంగా అడిగాడు.

 

    "మా దగ్గరే వున్నాడు. నువ్వు మా  పని చేయకపొతే చావటానికి సిద్ధంగా వున్నాడు."

 

    "రేయ్..... లంజాకొడ్కా......" అంటూ నాయుడు అతడి మీదికి లంఘించబోయాడు. వెనుకనుంచి మెడమీద దెబ్బ పడింది. నేలమీద కూలిపోయాడు. మొహం పక్కనే ఫోన్ పడింది. రిసీవర్ లోంచి "నాయనా..... నాయనా...." అని హృదయవిదారకంగా వినిపిస్తూంది.

 

    సర్పభూషణరావు లేచి ఫోన్ సరిగ్గా పెట్టాడు. వెళ్ళి రెడ్డిని స్నేహ పురస్సరంగా లేపాడు.

 

    "అర్థమైంది కదా...... నీ కొడుకు నీకు క్షేమంగా దక్కాలంటే, యిదిగో...... ఈ మందు నేత్ర కాఫీలో కలపాలి."

 

    "ఎందుకు.....? ఏమిటది....?"

 

    "విషం.... చంపటానికి." రెండు ప్రశ్నలకీ రెండు ప్రశ్నలకీ రెండు సమాధానాలు చెప్పి నవ్వాడు సర్పభూషనరావు. "నీ ద్వార అయితే పని చాలా  సులభంగా అవుతుంది. కదా....!"

 

    "రేయ్...... నిన్నూ...." అన్నాడు రెడ్డి  నాయుడు.

 

    "ఆగు..... సాయంత్రం లోపల ఈ పని ముగిసిందని చెప్పకపొతే అక్కడ నీ కొడుకు శరీరం ఫిరంగిలో గుండులా దూర్చబడుతుంది. పాతి పెట్టడానికి కూడా వీల్లేకుండా ముక్కలు ముక్కలయిపోతుంది. ఎక్కువ మాట్లాడటం నాకిష్టంలేదు. ఆలోచించుకుని ఏది బావుంటే అది చెయ్యి. పోలీసులకి చెప్పాలనుకుంటే చెప్పు. నాకభ్యతరం లేదు. నీ ఇష్టం".

    
                                    *    *    *

 

    ప్రతిమ ఆ ఇంట్లోకి అడుగు పెడుతూండగా లోపల నుంచి గజపతి రావు వస్తూ కనిపించాడు.... ఆ అమ్మాయిని చూసి లోపలున్న భార్యతో "పార్వతీ..... శకునం బావుంది. తొందరగా రా " అని అరిచాడు.

 

    ప్రతిమ నవ్వుతూ "ఇదేమిటి?...... మీరు కూడా శకునాల్ని నమ్ముతారా?......" అని అడిగింది.

 

    "కాదమ్మా...... ఈ రోజు సాయంత్రం సర్కస్ కి వెళ్ళటానికి నిన్న పొద్దున్నించి తయారవుతూంది. యిలా చెప్తేనన్నా వస్తుందేమోనని......" అంటూ నవ్వేడు. అతని మాటలు పూర్తవుతుండగా పార్వతమ్మ వచ్చింది.

 

    "ఏం అమ్మాయ్..... నువ్వు కూడా వస్తావా సర్కస్ కి......?"

 

    "మా సీక్రెట్  ఏజెంట్స్ కి రోజూ సర్కసే! ఇక స్పెషల్ గా  చూసేదేముందండి...? నేత్ర వున్నాడా?...."

 

    "లోపలున్నాడు" అంటూ ఆ  దంపతులిద్దరూ వెళ్ళిపోయారు.

 

    ప్రతిమ లోపలకు వెళ్ళింది. నేత్ర ఒక్కడే కూర్చుని పెషేన్స్ ఆడుతున్నాడు. కల్యాణి బట్టలు సర్దుతూంది.

 

    "ఎక్కడ నుంచి వస్తున్నావ్?...... ప్లాట్  నుంచేనా....?"

 

    "అవును.... ఆ ఫోన్ దగ్గర డ్యూటీ నాది కదా.....?"

 

    "ఏవైనా ముఖ్యమైన ఫోన్స్ చేసాడా యస్.బి.ఆర్....?"

 

    "ఏమీ లేదు. సాయంత్రం ఆరింటికి సర్కస్ కి వెళ్తున్నాడు. 'మన  వాళ్ళని రెడీగా వుండమను. నేనొస్తున్నాను,  అని ఎవరితోనో చెపుతున్నాడు."

 

    నేత్ర నవ్వి "అంత పెద్ద  వ్యాపారవేత్తకి సర్కస్  చూసే  టైమెక్కడ దొరికిందబ్బా?....." అన్నాడు.

 

    ఇంతలో గుమ్మం దగ్గర చప్పుడైంది. ఇద్దరూ అటు  చూశారు. రెడ్డి నాయుడు లోపలికి వస్తూ కనిపించాడు.

 Previous Page Next Page