"కుటుంబ నియంత్రణ కంపల్సరీ చేస్తాను".
"మైనారిటీవర్గం మీద అరాచకం అని విదేశీ పత్రికలు గగ్గోలు పెడతాయి. అరబ్ దేశాలు ఆయిల్ సరఫరా ఆపుచేస్తాయి".
"వరకట్నం తీసుకోకుండా వివాహమాడిన కుర్రాళ్ళకి ఉద్యోగం అని ప్రకటిస్తాను."
"వరకట్న దురాచారం నశించాలి అన్న సామాజిక స్పృహతో గొంతులు చించుకుపోయేలా అరుస్తున్న ఈ అమ్మాయిలే తమ భర్త ఉద్యోగంకోసం కట్నం తీసుకోలేదు అని వ్రాస్తారు".
"లంచం తీసుకుంటే ఉరిశిక్ష అని ప్రకటిస్తాను".
"రిస్కు ఎక్కువ కాబట్టి రేటు నాలుగురెట్లు అవుతుంది".
"దేశప్రగతికి బార్లు, రేసులు, లాటరీలు, క్యాబరేలు, రాజకీయాలు, సిగరెట్లు, సినిమాలు, విదేశీ కార్లు అన్నీ అడ్డే కాబట్టి, వీటి మీద నిషేధం విధిస్తాను".
"నీకు పిచ్చెక్కిందని గద్దె దింపుతారు..."
జానకి బిక్క మొహంవేసి, "మరేం చెయ్యను" అని అడిగాడు.
"నిజంగా చేస్తావా?"
"అదేమిటి? నువ్వేగా నాకు ఆ పదవి ఇప్పించేది. చెయ్యకుండా ఎలా వుంటాను".
"సరే అయితే! ఇప్పుడు చెప్పను. నువ్వు నెగ్గి, ఈ దేశపు అత్యున్నత పవి స్వీకరించబోయే ముందు, త్రివిధ దళాధిపతులూ నీ ముందు నమ్రతగా నిలబడి వున్నప్పుడు, నువ్వు ప్రమాణం చేయబోయేముందు- అప్పుడు నేను కోరతాను. ఆ కోరిక విని నువ్వు కాదనకూడదు. దేశం అల్లకల్లోలమైనా, ప్రపంచం మొత్తం క్షోభించినా, దేశాధినేతగా ఆ పని చేయాలి. చేస్తానని ఒట్టు వెయ్యి".
"ఒట్టు. సరేనా".
* * *
ఆ సాయంత్రం లోహియా వచ్చాడు. లోహియా రావడం చూసి అప్పుడే జానకి నామినేషన్ సంగతి అందరికీ పొక్కిపోయినట్టుంది అనుకున్నాడు అతడు.
అంత పెద్ద కారు వెనుకే మరో నాలుగు కార్లూ ఆ వూరికి రావటం చూసి- పిల్లల్తో సహా పెద్దలు కూడా చుట్టూ చేరారు. జానకి అప్పుడే వాళ్ళ దృష్టిలో పెద్దవాడయిపోయాడు.
లోహియాతో కలసి అతడు ఊరి చివర కాలువపక్కనే నడుస్తూ సంభాషించసాగాడు.
"ఏమిటిది? ఎవరో అనామకుడిని నిలబెట్టావట" లోహియా అడిగాడు.
"అవును. 'జానకి' అని...."
"మనం మన ముఖ్యమంత్రిని ప్రెసిడెంట్ చేస్తే బావుంటుంది అని నేను అనుకుంటున్నాను".
"ఎందుకు"
"కారణాలు రెండు, 1. వంకచెక్కా రామ్మూర్తీ, నీ తండ్రి జి.కె. ఇద్దరూ ప్రధానమంత్రిని సపోర్టు చేస్తున్నారు కాబట్టి, 2. ముఖ్యమంత్రి ద్వారా మనకి కావల్సిన పనులు చేసుకోవచ్చు కాబట్టి".
"మనం జానకిని చేసినా ఆ రెండూ నెరవేరతాయి".
"అంతేనంటావా?"
"అంతే".
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం కొంచెంసేపు రాజ్యమేలింది. లోహియ సందిగ్ధంగా "జానకి నెగ్గుతాడంటావా?" అని అడిగాడు.
"చూద్దాం"
"నాకంతా అయోమయంగా వుంది. ఏది ఏమైనా ఈ రోజునుంచీ జానకిని ప్రొజెక్ట్ చేస్తూ వ్రాయమని మా పత్రిక ఎడిటర్స్ కి చెపుతాను".
"వద్దు వద్దు" కంగారుగా అన్నాడతడు.
"ఏం?"
అతడు సమాధానం చెప్పకుండా ఆలోచనలోపడ్డాడు. అతడు యోచించటం చూసి లోహియా కూడా మాట్లాడలేదు. అతడు అడిగాడు- "మన పేపరు సర్క్యులేషన్ ఎంత?"
"బొంబాయి, ఢిల్లీ, మద్రాసు ఎడిషనులు కలుపుకొని పదిహేను లక్షలు".
"ముందు సంచలనం కలుగజెయ్యండి. తరువాత వ్యతిరేకంగా వ్రాయండి. ఆపైన ఏం చెయ్యాలో చెపుతాను". ఇంకా ఆలోచిస్తూనే అన్నాడతడు. అతడి ఆలోచనలు భంగచెయ్యటం ఇష్టంలేనట్టు లోహియా కారు వైపు నడిచాడు. ఆ మరుసటిరోజు భారతదేశపు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రికలో హెడ్ లైనుగా వార్త వచ్చింది.
"ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులతో పాటూ
అర్థనారీశ్వరుడి పోటీ"
ఎన్నికల్లో ఆసక్తిదాయమైన మలుపు.
* * *
ఆ సాయంత్రం సుమతి అతడి దగ్గరకి వచ్చింది. ఆమెమొహంలో సంతోషం, ఆశ్చర్యం మిళితమై వున్నాయి- "ఏయ్! నాకబద్ధం ఎందుకు చెప్పావు?" అంది రాగానే.
"నేనా, ఏం చెప్పాను?"
"విక్రమ్ సింగ్ గురించి"
"అదా" అంటూ నవ్వేడు.
"ఈ వూళ్ళో ఏమనుకుంటున్నారో తెలుసా?"
"ఏమనుకుంటున్నారు?"
"నువ్వొక జమిందారీ బిడ్డవని, ఇంట్లోంచి పారిపోయివచ్చావని-"
"ఇంకా...?"
"ఇన్ని కార్లు రావడం చూసి మతిపోతూంది మా వాళ్ళకి. అసలీ వూళ్ళోకి ఒక టైమ్ లో రెండు కార్లు రావడమే గొప్ప".
"ఊ"
"ఇంతకీ అసలు నువ్వెవరివో చెప్పవా?"
"ఏం చెప్పను? నాకే తెలీదు".
"నీ పేరు కూడా చెప్పలేదు".
"మనిషికి పేరెవరు పెడతారు?"
"ఎవరు పెడతారు?.. తల్లిదండ్రులు"
"నాకు వాళ్ళెవరో తెలీదు".
"అవును ఆ విషయం చెప్పావు. చిన్నప్పుడే దొంగల్లో చేరిపోయావా అని అడిగాను. అవును అన్నావు. ఇప్పుడు చెప్పు-"
"ఇప్పుడు కూడా చెప్పటానికి ఏమీలేదు సుమతి. నేనొక "బాస్టర్డ్ చైల్డ్"ని అంతే".