Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 40


    సరిగ్గా 8.30 కి స్వాములవారు బాత్ రూమ్ లో చేరి బోల్టు బిగించుకోగానే, ముగ్గురూ తలుపుదగ్గర చేరారు. అమితాబ్ తన పరికరపు అద్దాన్ని తలుపు రంధ్రం దగ్గర చేర్చి, టెలిస్కోప్ లో చూసినట్టు వంగి చూడసాగాడు. అతడు చెప్పినట్టు అంతా స్పష్టంగా కనపడుతూంది.

    "లాల్చీ విప్పాడు...బనీను విప్పాడు... పంచ విప్పా..." అంటూ రన్నింగ్ కామెంటరీలా చెప్పసాగాడు.

    నరసింహం విసుక్కుంటూ, "అంతా చెప్పనక్కరలేదు- నడుము మీద మచ్చ వుందో లేదో చూసి చెప్పు. చాలు" అన్నాడు.

    అంతలో అమితాబ్ ఆముదం తాగినట్టు మొహం పెట్టి లేచి నిలుచున్నాడు.

    "ఏం జరిగింది?"  అని అడిగాడు రామలింగం ఆత్రంగా.

    "మీకే చూడండి" అంటూ పక్కకి తొలగి నిలుచున్నాడు అమితాబ్. రామలింగం వంగి ఒక కన్ను మూసి, అందులోకి చూసి పాముని చూసినవాడిలా గెంతి నిలబడ్డాడు.

    "ఏం జరిగింది?" అని అడిగాడు నరసింహం టెన్షన్ గా.

    "మీరే చూడండి."

    నరసింహం వంగి చూసి, చివాలున లేచి నిలబడి "ఏమిటి మీ ఉద్దేశ్యం" అని అరిచాడు కోపంగా.

    "వాడు వెనక్కి తిరగటంలేదు. ఇటే నిలబడి స్నానం చేస్తున్నాడు. అయిదు నిముషాల నుంచీ" అన్నాడు అమితాబ్ బిక్కమొహం పెట్టి.

    "అయితే...?" అన్నాడు నరసింహం.

    "నేను చూడలేను."

    "ఎప్పుడో ఒకప్పుడు అటు తిరుగుతాడు."

    "అంటే అంతసేపూ నేనూ అలా చూస్తూ వుండాలనా మీ వుద్దేశ్యం? అలా చూడటానికి అదేమీ 'విశ్వరూపం' కాదు" అన్నాడు కోపంగా అమితాబ్.

    "మరి డిటెక్టివ్ పనికి వప్పుకున్నాక అన్నీ చూడాల్సిందే" దబాయించాడు నరసింహం.

    "అదే జేమ్స్ బాండయితే అలాగే చూసేవాడు" అన్నాడు మురళి అప్పుడే అక్కడికొస్తూ.

    "జేమ్స్ బాండయితే ఆడాళ్ళని చూసేవాడు. మొగాళ్ళని కాదు" కోపంగా అన్నాడు అమితాబ్.

    ఇంతలో బాత్రూమ చప్పుడయింది. తుపాకీ దెబ్బకు పరుగెత్తిన పక్షుల్లా తలో మూలకీ ఎగిరిపోయారు నలుగురూ.

    సరీగ్గా అదే సమయానికి ఆ ఇంటి ముందు ఒక రిక్షా వచ్చి ఆగింది.

    "అందులోంచి శారదమ్మ దిగింది.

    ఆమెను చూస్తూనే నిశ్చేష్టులయి నిలబడిపోయారందరూ.

    "రామలింగం ! ఆ మనిషి శారదమ్మే కదూ ?" అనుమానంగా అడిగాడు నరసింహం.

    నరసింహం ఆలోచనలో పడ్డాడు. ఇదీ హరికృష్ణ పేరుతో నాటకం ఆడుతున్న వాడి ప్లాన్ లో భాగమే అయుంటుంది. ఇన్నాళ్ళు శారదమ్మను ఎవరికీ తెలీకుండా దాచి ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడకు ఎందుకు పంపాడో తెలీటంలేదు.

    ఇంటిల్లపాదీ శారదమ్మ చుట్టూ మూగారు ఆశ్చర్యానందాలతో.

    "అమ్మా ! ఎక్కడున్నావమ్మా - ఇన్నాళ్ళూ ?" ఆప్యాయంగా అడిగాడు మురళి.

    "ఎక్కడయితేనేరా ! ఆ జైలరీ ఓ చిన్న ఉద్యోగం యిప్పించాడు. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. తల్లి సంగతి కన్నా కొడుకు పట్టించుకోకపోయినా - నన్ను ప్రేమగా చూసుకునే వారున్నారు -"

    మురళి మొఖంలో బాధ కనిపించింది.

    "అమ్మా - నేను నీ కొడుకుని. మురళిని" అన్నాడు.

    శారదమ్మ మాట్లాడకుండా మొహం తిప్పుకుంది.

    "నరసింహంగారూ! రావలసినామె మంచి సమయానికే వచ్చింది. అవతారస్వామి తన కొడుకైందీ లేనిదీ ఖచ్చితంగా చెప్పగలదు - మన సమస్య పరిష్కారమయిపోతుంది" అన్నాడు రామలింగం నరసింహం దగ్గరకొచ్చి.

    "అవును! వాడు దొంగ వెధవన్న సంగతి తేలిగ్గా గుర్తు పట్టగలదు -" అన్నాడు నరసింహం.

    రామలింగం లోపలకు వెళ్ళి అప్పుడే స్నానం ముగించిన అవతారస్వామితో పాటు తిరిగి వచ్చాడక్కడికి.

    "అమ్మా !" అన్నాడు అవతారస్వామి శారదమ్మను చూస్తూనే ఆనందంగా.

    శారదమ్మ ఓ క్షణం అతని వంక పరీక్షగా చూసింది.

    ఆమె ఏమంటుందో అని అందరి గుండెలూ వేగంగా కొట్టుకోసాగినయ్.

    "నాయనా! కృష్ణా ! ఎంత కాలానికి చూశాన్రా నిన్ను -" అందామె అవతారస్వామి దగ్గరకు నడిచి అతనిని ఆప్యాయంగా నిమురుతూ.

    నరసింహం మొఖంలో కళ తప్పింది. పిడికిళ్ళు బిగుసుకున్నయ్. ఇది అసాధ్యం ! హరికృష్ణ తన చేతిలోనే హతమయ్యాడు.

    మురళి ఆవేశంగా ఆమె దగ్గరకు నడిచాడు.

    "అమ్మా ! నేనే మురళినమ్మా ! చిన్నప్పుడు రాధ మెడలో తాళి కట్టిన వాడిని నేను -" అన్నాడు ఆత్రుతగా.

    నరసింహం నవ్వాడు.

    "దాన్దేముందిలే ! ఎన్నో ఏళ్ళక్రితం చూసిన కొడుకుని ఇంత సడెన్ గా గుర్తుపట్టమంటే ఎవరికైనా పొరపాటు జరుగుతుంది" అన్నాడు. 

 Previous Page Next Page