Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 4


    "మీరు వచ్చి చూసి వెళతారు నిజమే, కాని కృష్ణమౌళికి తెలిస్తే!" అంటూ ఆగిపోయింది.


    "తెలిస్తే" అంటూ రెట్టించి అడిగాడు. ఆ అడగటంలో వాడికి నేను జడుస్తానా అన్నట్టుంది.


    "మీకు అతని సంగతి పూర్తిగా తెలీదు. మీరు లేని సమయములో వచ్చి నన్ను వాళ్ళ యింటికి తీసుకెళ్ళిపోవచ్చు, నాకు భయంగా వుంది" అంది.


    అతను నవ్వి అన్నాడు. "మీరు ఇంకా ఎంతో ధైర్యవంతులు అనుకున్నాను, ఇంత పిరికివారనుకోలేదు. మీకు అలాంటి భయాలేమీ వద్దు. నేను లేని టైములో నా ఫ్రెండు ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నేను మీతో వస్తాను సరా" అంటూ ఆమెకు ధైర్యం చెప్పి వప్పించాడు.


    అంబికను స్నేహితుడు సురేష్ ఇంటికి తీసుకెళ్ళి సురేష్ కి అతని భార్య నీలకు పరిచయం చేశాడు. అంతకుముందే చెప్పి ఉంచటం వలన వాళ్ళు అన్నారు. మీకు ఏం భయంలేదు, మేము ఉన్నాము. ఈ యిల్లు మీ యిల్లు అనుకోండి అని.


    అంబిక జయరామ్ వేపు చూసింది.


    అతను నవ్వి రేపు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

 

                              *    *    *

              
    అంబిక తనకు ఇచ్చిన గదిలో ఒంటరిగా కూర్చుని ఆలోచనలలో పడిపోయింది.


    జయరామ్ తనని యింటికి తీసుకువెళతాడని ఆశించింది.


    అతను వాళ్ళ యింటికి తీసుకెళ్ళకుండా ఇక్కడ వీళ్ళ యింటిలో ఉంచాడు.


    ఇప్పుడు ఎలా! ఏం చెయ్యటం! ఆలోచించసాగింది. సరే ఇంతవరకూ ఎలాగూ వచ్చాడు.


    వాళ్ళ యింటికి తీసుకెళ్ళడానికి తనే ఏదో ప్లాను ఆలోచించాలి అనుకుంది.


    కృష్ణమౌళికి ఈ విషయమెలా తెలుస్తుందా అనుకుంది.


    మర్నాడు అంబిక స్నానముచేసి తనతో తెచ్చుకున్న పాత చీర కట్టుకుంది.


    సురేష భార్య నీల కొత్తబట్టలు తీసుకొచ్చి ఇచ్చింది. ఏమిటిండీ అంటే జయరామ్ నీకోసం కొని తెప్పించమని డబ్బు ఇచ్చి వెళ్శాడు. నేను షాపుకెళ్ళి తీసుకొచ్చాను అంది.


    అంబిక మనసులో పొంగిపోయింది. మనిషి దారికొస్తున్నాడే అనుకుంది.


    నీల ఇచ్చిన కొత్తచీర కట్టుకుంది.


    జయరామ్ పదిగంటలు దాటిన తరువాత వచ్చాడు.


    "మీరు హాస్పిటల్ కి గాని వెళ్ళాలనుకుంటున్నారా" అడిగాడు అంబికను.


    "అవును.... కాని" అంటూ ఆగిపోయింది.


    "ఏమిటి కృష్ణమౌలిగురించా భయం! ఊళ్ళో లేడు, ఉన్నా భయం లేదు, నేనున్నానుగా పదండి" అన్నాడు.

    అంబిక అతనితో హాస్పిటల్ కి బయలుదేరింది.


    అతనితో కార్లో కూర్చుంటూ అతనివేపు ఓరగా చూసింది.


    కొత్తచీర కట్టుకున్న తనని పరీక్షగా చూస్తాడేమో అనుకుంది.


    అతను అలా ఏం చూడలేదు. మామూలుగా ఉన్నాడు.


    మనిషిలో ఇంకా బాగా మార్పురావాలి.


    ఎలా!


    ఎలా అయితే మనిషిలో మార్పువస్తుందా అని ఆలోచించసాగింది.


    కారు హాస్పిటల్ వేపు వెళ్ళసాగింది.


                           *    *    *


    ఇంద్రసేన స్నేహితురాలు కావేరి వచ్చింది.


    "రా రా చాలా రోజులకి వచ్చావు" అంటూ ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళింది ఇంద్రసేన.


    కావేరి నవ్వింది. "కొద్దిగా మంచినీళ్ళివ్వు తల్లీ ఎండలోపడి వచ్చాను" అంది.


    "అదేం మీ కారుందిగా ఎండలో రావడమేమిటి?"


    అంది మంచినీళ్ళు తెచ్చి అందిస్తూ.

 

    "మా డాడీకి ఏదో పనుండి వెళ్ళారు. నేను బస్సులో వచ్చాను" అంటూ నీళ్ళు గటగటా త్రాగి గ్లాసు టేబుల్ పై పెట్టేసి,


    "మీ అన్నయ్యగారి పెళ్ళయిపోయింది, ఇక నీ పెళ్ళి ఉంది" అంది కావేరి.


    "మా అన్నయ్య పెళ్ళా! ఇంకా కాలేదే" అంది. ఇంద్రసేన నవ్వి.


    "చాల్లే నన్ను పిలవలేదని అనుకుంటానని" అంది. "నిజమే బాబూ మా అన్నయ్యకి ఇంకా పెళ్ళి కాలేదు." "కాలేదూ! అబద్ధమాడకు నా కళ్ళారా నేను చూశాను. డాక్టర్ అంబికను పెళ్ళిచేసుకున్నారు కదూ! వాళ్ళు ఇద్దరూ పక్కపక్కన కూర్చుని కారులో వెళుతున్నారు" అంది కనుబొమ్మలు పైకెగరేస్తు ఇప్పుడు ఏమంటావు అన్నట్లు. ఇంద్రసేన ఆ మాటలు వింటూనే నవ్వుతున్నదల్లా అలా ఉండిపోయింది. మనిషి నిటారుగా అయిపోయింది.


    "నువ్వు ఎప్పుడు చూశావు" అడిగింది.


    "ఇప్పుడే నేను బస్ స్టాండులో నిలబడి బస్ కోసం చూస్తున్నాను. వాళ్ళ కారు ఎదురుగా ఆగింది. డ్రయివర్ వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ కాబోలు కొని తీసుకు రమ్మని పంపించారు. వెనక సీటులో డాక్టర్ అంబిక మీ అన్నయ్యగార్ని నేను చూశాను" అంది.


    ఇంద్రసేన ఇక ఏం మాట్లాడలేదు. కావేరికి ఏదో చెప్పేసి ఆ మాటలు ఆపేసి మరోవేపుకు మళ్ళింది. కావేరి కాస్సేపు కూర్చుని వెళ్ళిపోయింది.


    స్నేహితురాలు వెళ్ళిన దగ్గరనుండి ఇంద్రసేన అగ్గిమీద గుగ్గిలం అవసాగింది.


    అన్నయ్య అంబిక ఇద్దరూ కారులో కలిసి వెళుతున్నారా! ఎక్కడికి!


    అన్నయ్యకు అంబిక అంటే అసలు పడదు కదా!


    ఆమెతో ఎందుకు! ఎక్కడికి వెళుతున్నాడు?


    ప్రతీ విషయం తనత చెప్పే అన్నయ్య ఈ విషయం ఎందుకు దాచినట్లు?


    ఇంద్రసేన కోపంతో కరకరలాడిపోయింది.


    అంబిక అంటే ఆమెకు ఎలాగో అనిపిస్తుంది.


    అన్నయ్య ఇంటికి వచ్చాక చూడాలి.


    తనకై తాను ఈ విషయం తనకి చెపుతాడా! లేదా అసలు ఏం జరిగింది. ఆమె అంటే అంత మండి పడేవాడు.

 Previous Page Next Page