Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 5


    ఆమెతో కలిసి ఎక్కడికి వెళుతున్నట్టు!


    ఇంద్రసేన ఎంత ఆలోచించినా ఆలోచనలు ఒకదారికి రావటంలేదు.


    అన్నగారు వచ్చేవరకు ఆమెకు ఏం తోచటం లేదు.


    ఈ విషయం డాడీకి చెపితే!


    ఆయన ఏమంటారో? డాడీకి చెప్పాలా వద్దా?


    డాడీకి చెప్పి పెద్దగొడవ పెట్టించేస్తే ఆమె ఆలోచిస్తుంది.


                                                                    48


    జయరాం ఇంటికి వెళ్ళగానే తల్లి ఎదురుపడి కొడుకువేపు క్షణంసేపు పరిశీలనగా చూసి మవునంగా అక్కడనుండి వెళ్ళిపోయింది ఆవిడ. అతనికి ఒక్కసారి మతిపయినట్టుగా అయింది. తన విషయం ఏదో తల్లి పసిగట్టినట్టే భావించి ఆవిడ ఎదుటపడడానికి ముఖం చెల్లనట్టుగా అనిపించసాగింది.


    ఇంద్రసేన తండ్రికి తల్లికి తన ఫ్రెండ్ కావేరి చెప్పిన విషయం చెప్పి అన్నగారి విషయం ఏమిటో తేల్చేయాలని అనుకుంది.


    కాని నెమ్మదిమీద ఆలోచించి అన్నయ్య తన దగ్గక ఏ విషయమూ దాచడు, అడిగితే తనే చెప్పేస్తాడు. ఈ మాత్రానికే తండ్రికి తల్లికి చెప్పటం ఎందుకు అని ఊరుకుంది.


    జయరాం రాగానే గదిలోంచి అతనికి ఎదురువెళ్ళింది.


    "అన్నయ్యా!" అంటూ.


    చెల్లెలిని చూస్తూనే క్షణంసేపు అలా ఉండిపోయాడు. అతనికి ఊహ తెలిసిన దగ్గరనుండి ఎవరికి అలా భయపడటం తెలీదు.


    ఈరోజు ఎందుకో ఎవర్ని చూసినా ఏమాట విన్నా ఉలిక్కిపడ సాగింది అతని మనసు.


    ఏమిటి అన్నట్లు చూశాడు.


    "నిన్ను ఓ విషయం అడగాలి" అంది అన్నగారివేపు పరీక్షగా చూస్తూ.


    "ఏ విషయం?" ముక్తసరిగా అడిగాడు. ఏ రోజూ లేనిది ఆరోజు చెల్లెలితో మాట్లాడాలి అంటే విసుగు అనిపిస్తుంది.


    ఇంద్రసేనకి అన్నగారు ఆ రోజు కొత్తగా కనిపించటంతో అయోమయంలో పడినట్టు అయింది.


    అడిగ విషయం సూటిగా అడగలేకపోయింది.


    "నా ఫ్రెండ్ కావేరి చూసింది, నువ్వు అంబిక కారులో ఎక్కడికో వెళుతున్నారని"


    "అలాగా" మామూలుగా ఉన్నాడు.


    "ఎక్కడికి వెళుతున్నారు! కావేరి చెప్పినమాట నిజమేనా!" అడిగింది.


    "నిజమే, ఆ అమ్మాయికి మన విషయంలో అబద్ధం చెప్పవలసిన కర్మ ఏం పట్టింది!"


    "అయితే నిజమేనన్నమాట. నువ్వు ఏదో గూడు పుఠాణిలో ఇరుక్కుంటున్నావు అనిపిస్తుంది, అంబిక మంచిదికాదు."


    "గూడుపుఠాణిలో ఇరుక్కోడానికి నేను అంత చవటని, తెలివితక్కువ వాడిని కాదు. అయినా నువ్వు విన్న విషయానికి చిలకలు చేర్చి ఆలోచిస్తావెందుకు.


    అతను అంత సూటిగా చెప్పేసరికి ఆమెకు నోటమాట రాలేదు. అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది అనుకుంది.


    అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా ఒక విధంగా చిరాకు పడినట్లుగా మాట్లాడుతున్నాడు అనుకుని అతన్ని ఇక ఏం ప్రశ్నించలేదు.


    జయరాం చెల్లెలితో ఇక ఎక్కువ మాటలు పెంచుకోవటం ఇష్టంలేనట్టుగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.

 

    ఇంద్రసేన అలా నిలబడిపోయింది. అతను వెళ్ళినవేపే చూస్తూ అతనిలో చాలా మార్పు కనిపించసాగింది. ఆ మార్పు ఏమిటో ఆమెకు సరిగ్గా గ్రహింపు కాలేదు.


                           *    *    *


    జయరాం రోజూ సురేష్ వాళ్ళ యింటికి వెళ్ళి అంబకను చూసి వస్తున్నాడు.


    ఆమె ఎక్కడికి అయినా వెళ్ళాలనుకుంటే దగ్గరుండి కూడా తీసుకెళ్ళి తీసుకొస్తున్నాడు.


    అంబిక అతన్ని దారిలోకి తీసుకురావటం ఎలాగా అని ఆలోచిస్తుంది ఉపాయాలకోసం.


    అలా పదిరోజులు గడిచిపోయాయి.


    జయరాం ఫ్రెండ్ యింటిలో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళి తిరిగి యింటికి వచ్చేశాడు.


    ఇంటికి వస్తూనే తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసి మంచంమీద పడిపోయాడు.


    ఎన్నడూ లేనిది ఏదో భయం అతన్ని ఆవరించసాగింది. అక్కడ జరిగిన గొడవ తలుచుకుంటుంటే ఆవేశం ముంచుకు వచ్చి మనసు అంతా కోపంతో మండిపడసాగింది.


    తను తప్పు ఏం చెయ్యలేదే!


    కష్టంలో ఉన్న అమ్మాయిని తను ఆదుకున్నాడు అంతే తను చేశాడు.


    దీనిలో తప్పు ఏమిటి!


    అంబిక తననికాక ఇంకెవరిని ఈ సాయం కోరినా తప్పకుండా చేస్తారు.


    తనని ఈ సాయం కోరింది. తను చేశాడు.


    దీనిలో తప్పేమిటి?


    అందరూ ఎందుకలా అనుకుంటున్నారు! తన గురించి ఎందుకలా హేళనగా మాట్లాడుకుంటున్నారు.


    తను వెళ్ళగానే మాటలు ఆపేసి ఏమీ తెలియనట్లు కూర్చునేసరికి తనకి అసలే కోపం. ఆ మాటలు చెవులపడగానే అనుకుంటున్న వాళ్ళమీదకు చెయ్యెత్తాడు, వాళ్ళని చంపి రక్తం కళ్ళ చూడడానికి.


    మా యింటిలో ఈ ఫంక్షన్ అవుతుంటే ఇలా గొడవ పడటము బాగోదని ప్రాధేయపడుతూ ఫ్రెండు తనని వెనక్కి లాగేసి ఆపేశాడు.


    అంత పౌరుషముంటే డాక్టర్ అంబికను పెళ్ళిచేసుకొని యింటికి తీసుకెళ్ళమనండి చూద్దాం.


    "ఉహు పెళ్ళంటే ఏమి మాట్లాడడు"


    లేవదీసుకొచ్చింది వేరు, పెళ్ళి చేసుకోవటం వేరు. అందరూ తలో ముక్కా ముఖాన్నే అనసాగారు.


    మళ్ళీ వాళ్ళతో కలబడబోతోంటే మిగతా ఫ్రెండ్సందరూ ఆపేసి వెనక్కి లాగేశారు.


    బాధపడటం తెలియని అతనికి మనసంతా బాధతో నిండిపోయింది. ఎన్నడూ లేనిది భయం అతన్ని చుట్టేసింది. ఈ విషయం ఎంతవరకు వెళుతుంది?

 Previous Page Next Page