ఆమె వెను తిరిగింది. అతడు ఆమెను అనుసరిస్తూ "ఈ చీరలో నువ్వు అచ్చు హంసలా వున్నావు" అన్నాడు.
ఆమె నవ్వి "నేనెప్పుడు ఈ చీర కట్టుకున్నా అక్కయ్య అలాగే ఏడిపిస్తుంది. పేరుకి తగ్గట్టు అచ్చు హంసలా వున్నావు- పేరుకు తగ్గ చీరేవిటి అని. మీరూ అలాగే అంటున్నారు" అంది.
"పేరుకి చీరకి ఏమిటి సంబంధం-?"
"హంసలేఖ అంటే అదే కదా-?"
"హంసలేఖ ఏమిటి?"
"నా పేరు-?"
" నీ పేరా?"
"పేరే తెలీదా-"?? ఓహ్ - నా పూర్తి పేరు మీకు తెలియదు కదూ హంసలేఖ" అంది.
"లేఖా-?? రేఖ కాదా-??" విస్తుపోతూ అడిగాడు.
"రేఖ అనుకున్నారా-? మీరలా పిలుస్తుంటే "ల" అన్న అక్షరం పలకదేమో అందుకని అలా అంటున్నారేమో అనుకున్నాను. అక్కపేరు రేఖ. స్వర్ణరేఖ. నాపేరు లేఖ. హంసలేఖ."
ఆకాశం విచ్చుకుంటున్నట్టు అనిపించింది అతనికి.
* * *
"ఎలా జరిగింది-?? ఎలా జరిగింది యిది-" అతని ఆవేశానికి ఆ గది కంపించింది.
డిపార్టుమెంటు రికార్డు రూమ్ లో నేత్ర కేకలు వేస్తున్నాడు. ప్రతిమ కూడా అదే స్వరంతో జవాబు ఇస్తూంది.
ఇద్దరి మధ్యా రికార్డు క్లర్కు అహోబిల బిక్కచచ్చి చూస్తూంది.
"నా తప్పేంలేదు. ఇదంతా నీ తప్పు. నేను ఫైల్లో డిటైల్డ్ గా రాశాను- చెల్లెలు అమాయకురాలని, అక్కపేరు స్వర్ణరేఖని." ప్రతిమ అంటూంటే,
"స్టాప్ నాన్ సెన్స్-" అని మళ్ళీ అరిచాడు. "ఫైల్స్ చదవడం అలవాటు లేదనీ, ఫోటో యిమ్మని నేనడిగినప్పుడు నువ్విచ్చిందే-"
"నేను కరెక్టుగానే యిచ్చాను. కవర్లో పెట్టి కవర్ మీద 'రేఖ' అని పేరు వ్రాసి మరీ ఇచ్చాను."
"కరెక్ట్ గా యిచ్చావా-? అహోబిలా - ఆ ఫైల్ తియ్-"
అప్పటికే బెదిరిపోయిన అహోబిల కంగారుగా రాక్ లోంచి ఫైల్ తీసి అందించింది. అతడు మొదటి పేజీ తిప్పి, అందులోంచి రేఖ అన్న కవరు తీసి, అందులోనుంచి ఫోటో బయటకులాగి, చూసి, ఇప్పుడు చెప్పు అన్నట్టు దూకుడుగా ఆమె వైపు విసుర్తూ "ఇదేమిటి......?" అని అడిగాడు.
ఆమె చూచి నిర్ఘాంతపోయింది. అందులో హంసలేఖ ఫోటో వుంది.
* * *
"అవునమ్మాయ్...... ఆ కంగార్లో నాకేం చేయాలో తోచలేదు. ఇంకో కవర్లో రెండు ఫోటోలువుంటే అందులో ఒకటి తీసి యిందులో పెట్టాను. మీ తాతగారు డిప్టీ తాసిల్దారుగా వున్న రోజుల్లో కూడా ఒకసారి యిలాగే జరిగితే....."
"నాయినమ్మా.... నాయినమ్మా- నాయినమ్మా- ఇంకేం మాట్లాడకు. నువ్వు చేసిన పనికి ఈ రోజు మా డిపార్ట్ మెంట్ ....." అంటూ చెప్పబోయింది ప్రతిమ.
"ఆవిడ్ని అంటావేం.....? సీక్రెట్ ఫైల్ ని సిల్కు చీరల మధ్య పెట్టుకున్న నీ నిర్లక్ష్యాన్ని అనాలి." పక్కనుంచి నేత్ర అన్నాడు.
"ఇప్పుడేం జరిగింది......?"
"ఏం జరిగిందా.....? అనవసరంగా ఒక అమాయకురాలైన అమ్మాయిని ప్రేమలోకి దింపి, ముద్దు పెట్టుకోవడం జరిగింది." వ్యంగ్యంగా అన్నాడు. "ఇన్నాళ్ళ టైమూ వేస్టయింది. డిపార్ట్ మెంటు దృష్టిలో మనిద్దరం ఒక ఫూల్సుగా తయారయ్యాం."
"కొంపలేం మునగలేదు. చూడు నేత్రా- యుద్ధంలో చాలామంది అమాయకులు చచ్చిపోతారు. దాంతో పోల్చుకుంటే యిది చాలా చిన్న విషయం."
"ఏది? ముద్దు పెట్టుకోవటమా?"
"ఆ......"
"నీలాంటి వాళ్ళకి యిది చాలా చిన్న విషయమేమో.....?"
"ఏమన్నావ్.....?"
"అంటాను...... మళ్ళీ అంటాను. జీవితంపట్ల నిజాయితీ వున్న ఏ అమ్మాయికీ యిది చిన్న విషయంకాదు."
"అసలిదంతా చూస్తుంటే నువ్వే దీంట్లో కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనబడుతున్నావ్. ఇదంతా నాకు వదిలిపెట్టు. నేను వెళ్లి చెప్తాను."
నేత్ర విసుగ్గా చూసాడు. "ఏం చెప్తావ్.....?"
"ఇదంతా చేసింది నేనేనమ్మా. నన్ను క్షమించు. ముద్దే కదా తుడిచేకోపోతుంది అంటాను. అసలు నా ఉద్దేశ్యం ప్రకారం ఆ అమ్మాయి ఈపాటికి అంతా మర్చిపోయి వుంటుంది." అని పూర్తిచేసింది ప్రతిమ.
* * *
హంసలేఖ బితుకు బితుకుమంటూ కన్సల్టింగ్ రూములో కూర్చుంది. అయిదు నిమిషాలకి ఆమెకి పిలుపొచ్చింది. మామూలు ప్రశ్నలయ్యాక డాక్టర్ అడిగాడు.
"ఎవరమ్మా అతను....."
"నేత్ర అని నా స్నేహితుడు. మిగతా వివరాలు నేను అడగలేదు. ఎదురుప్లాట్ లో వుంటాడు. పొద్దున్నే వెళ్తే లేడు. తాళం వేసి వుంది. అయినా యిందులో అతని తప్పేం లేదండి. అర్థరాత్రి నేనే అతన్ని మా ఇంటికి యిన్ వైట్ చేశాను. ఇందులో తప్పేమైనా వుంటే అది నాదేనండి."
"అబార్షన్ రెకమెండెడ్ కాదమ్మా. ఇంతకీ ఎన్నో నెలా -?"
"నెలా-?"
"అవునమ్మా."
"ఇది సెప్టంబరు కదండీ. తొమ్మిదో నెల."
"ఆ నెల కాదమ్మా- నేనడిగింది. ఇప్పుడు నీకెన్నోనెలా అని?"
"నాకర్థం కాలేదు డాక్టరుగారూ మీరు చెప్పేది."
డాక్టర్ కి వళ్ళు మండిపోయింది. కేవలం ఆ అమ్మాయి తండ్రిని తలుచుకుని కోపం అణుచుకున్నాడు.
అనునయంగా "అదేనమ్మా- ఐమీన్ - యిది జరిగి ఎన్నాళ్ళయింది-?" అని అడిగాడు.
"ఏది ! ముద్దు పెట్టుకోవడమా?"
"అదే - ముద్దూ ఆ ముచ్చటా" చివరి పదాన్ని నొక్కి పలుకుతూ అడిగాడు. ఆమెదాన్ని పట్టించుకోలేదు.
"నిన్న రాత్రే డాక్టర్ గారూ-" అంది.
స్టెతస్కోప్ జారిపడింది. "నిన్న రాత్రి జరిగిన దానికి ఈరోజు ప్రెగ్నెన్సీ అని అనుమానం వచ్చిందా?" అదిరిపోతూ అడిగాడు.