సుబ్బలక్ష్మి దగ్గరగా వచ్చి గుసగుసగా "మీరు రమ్మంటే మీతో నేను వచ్చేస్తాను." అంది.
ఉలికిపడ్డాడు భాస్కర్.
"మరి నీ సామాను?"
"సామానేముంది? నా చీరలు తెచ్చుకున్నాను." పైటచాటున దాచుకున్న చేతి సంచి చూపించింది సుబ్బలక్ష్మి.
నిర్ఘాంతపోయిన భాస్కర్ "నేను నిన్ను తీసికెళ్తాననే అనుకున్నావా?" అన్నాడు.
"జ్యోత్స్నగారు రాలేదుగా నన్నెందుకు తీసికెళ్ళరూ?" అని తెలివి తేటలు ప్రదర్శించింది సుబ్బలక్ష్మి. ఆ క్షణంలో సుబ్బలక్ష్మిని చూస్తోంటే పట్టరాని అసహ్యం కలిగింది భాస్కర్ కి.
"సరే! పద! రైలెక్కు." అన్నాడు.
సుబ్బలక్ష్మి సంబరంగా రైలెక్కి కూచుంది. తను కొన్న రెండు టిక్కెట్లూ సుబ్బలక్ష్మి చేతికిచ్చాడు. అవి జాగ్రత్తగా తన జాకెట్ లో దాచుకుంది సుబ్బలక్ష్మి.
గంట కొట్టారు. ట్రైన్ కదిలింది. భాస్కర్ గభాలున రైలు దిగి ఫ్లాట్ ఫాంవైపు నడిచాడు. సుబ్బలక్ష్మి కంగారుపడిపోతూ అయ్యో! భాస్కర్ గారూ! భాస్కర్ గారూ!" అంటూ పెట్టే కేకలు, రైలు కూత చప్పుడులో కలిసిపోయాయి.
సుశీల రావలసింది శనివారంనాడు. అంచేత తను మామూలుగా ఇంటికి వెళ్ళిపోయి మచ్చల డాక్టర్ కిచ్చిన ఉత్తరం తీసుకుందామనుకున్నాడు. తరువాత స్తిమితంగా జ్యోత్స్న ఎందుకు రాలేదో కనుక్కోవాలనుకున్నాడు. తీరా ఇంటికి వచ్చేసరికి ఎదురయిన పరిస్థితి ఇది!
సుశీల గర్భవతి అని తెలుసుకున్న భాస్కర్, "ఎంత ప్రమాదం తప్పి పోయిందీ?" అనుకున్నాడు మనసులో....
తన తండ్రి స్వార్థంతో తన బ్రతుకు పాడు చేశాడన్న కోపాగ్ని ఈనాటికీ మరిచిపోలేక పోతున్నాడు భాస్కర్. ఈనాటికీ తండ్రిని క్షమించలేక పోతున్నాడు. కానీ, తను చెయ్యబోయిన దేమిటి.
ఇంకా తన తండ్రి ఏమీ చదువుకోని అర్చకుడు, పరమమూర్ఖుడు. చదువు సంస్కారాలున్నా తన తండ్రి కంటే ఏ విధంగా అధికుడు? స్వార్థమనేది ఏ రూపంలో ఉంటేనేం? అది డబ్బు కౌపీసమయితే నేం? ప్రేమదాహమయితే నేం?
ఆభమూ, శుభమూ తెలియని పసికందుల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చిన తరువాత బాధ్యతారహితంగా వాళ్ళని వొదిలేసి తమ సుఖం తాము చూసుకొనే అధికారం తల్లిదండ్రులకుందా? అలాంటి తల్లిదండ్రులు క్షంతవ్యులేనా? తన కొడుకు.... తన కన్నబిడ్డ.... దిక్కూ దివాణం లేకుండా.... చదువు సంధ్యలు లేకుండా.... రోడ్లమీద బికారిలా తిరుగుతోంటే....
ఆ ఆలోచనను భరించలేక వణికిపోయాడు భాస్కర్.
"ఏ పరిస్థితుల్లోనూ నా సంతానాన్ని భాద్యతారహితంగా వదిలెయ్యలేను. నేను ఏయే సుఖాలు నష్టపోయినా సరే!" అని నిశ్చయించుకున్నాడు.
తను వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నందుకు సుశీల ఏయే ప్రశ్నలు వేసి ఎంతగా సతాయిస్తుందోనని హడలిపోయాడు భాస్కర్ - కానీ, సుశీల ఏమీ జరగనట్లు ప్రవర్తించసాగింది. తడుముకుంటూ, తడుముకుంటూ తనకోసం తనకిష్టమయిన పదార్థాలు తయారు చెయ్యాలని తాపత్రయపడుతున్న సుశీలని చూస్తే భాస్కర్ కి జాలితో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
జ్యోత్స్న వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి తన వాటాలోకి రాలేదు. పైకి ఏమీ అనకపోయినా లోలోపల జ్యోత్స్న ఏమయిపోయిందా, అనే ఆరాటం పోలేదు భాస్కర్ కి.
భాస్కర్ పేర పెద్దకవరు వచ్చింది. అందులో రెండు ఉత్తరాలు ఉన్నాయి. ఒకటి వెంకట్రావు వ్రాసింది. రెండవది జ్యోత్స్న వ్రాసింది.
"డియర్ భాస్కర్!
నేను జ్యోత్స్నను పెళ్ళి చేసుకున్నాను. ఎంతో విడ్డూరంగా కనిపించే విషయానికి సంజాయిషీ లాంటిది నా ఉత్తరం.
ఇన్ కంటాక్స్ వాళ్ళు నా ఇంటిని సోదా చెయ్యటం నాకు ఏ విధమయిన ఆస్తిపాస్తులూ, బేంక్ బేలెన్సులూ లేవన్న విషయం బయటపడటం.... నీకు తెలిసినదే! నిజానికి నాకు మొదటినుంచీ డబ్బులేదు. వ్యాపారస్థుల దగ్గిర ఏజెంట్ గా పని చెయ్యటం వల్ల బాగా డబ్బున్న వాళ్ళ వేషాలు మాత్రం అబ్బాయి.
అంతేగాదు. లోకం కేవలం డబ్బుని బట్టి ఒక మనిషిని ఎంత గౌరవిస్తుందో కూడా అర్థమయింది.
భాస్కర్! నిజానికి ఒక మనిషికి ఎంత డబ్బు కావాలి? మనం తినేదెంత? కట్టుకొనేదెంత? ఖరీదైన బట్టలు, పెద్ద పెద్ద మేడలు, ఇవన్నీ ఇతరులకు మన గొప్ప చూపించుకోవటానికే కదూ! జాగ్రత్తగా ఆలోచిస్తే డబ్బు విలువ మనం అనుభవించటానికి కాదు. నలుగురిలో మన గొప్ప చూపించుకోవటానికి అనిపిస్తుంది.
ఇన్నాళ్ళుగా అందరూ నేను గొప్పవాణ్ణి అనుకుంటున్నారు. అలాగే గౌరవిస్తున్నారు - అందుకే భయపడుతున్నారు. నాకు డబ్బు లేకపోయినా, డబ్బున్నవాళ్ళు అనుభవించే ఆనందమంతా నేను అనుభవించాను.
అయితే ఏనాటికైనా నాకు డబ్బులేదనే రహస్యం బయటపడుతుందేమోననే భయం నన్ను పీడించేది. అంతర్గతంగా ఉన్న ఈ భయానికి బ్లడ్ ప్రషర్ తోడయి ఫిట్స్ రావటానికి దారి తీసింది. ఒకనాడు జ్యోత్స్న దగ్గిర కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయాను. పాపం, జ్యోత్స్న సహనంతో నాకు తెలివివచ్చేవరకూ ఏదో తనకు చేతనైన ఉపచారాలు చేసింది. నాకీ జబ్బు ఉన్నట్లుగా ఎవరికీ చెప్పవద్దంటే ఆ రహస్యాన్ని తనలోనే దాచుకుంది.