Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 37


    ఉత్పల కూడా అతడినే చూస్తూంది. ఆ వుత్తరం అనూష నుంచి అని తెలిస్తే ఆమె ఏమని వుండేదోగాని, అప్పటికే తన స్వంత సమస్యలతో తలవరకూ మునిగివున్న ఆ అమ్మాయి వీటి గురించి పట్టించుకునే స్థితిలో లేదు.

    సరీగ్గా ఆ సమయంలో బజర్ మ్రోగింది.

    "మీ కోసం ఎవరో ఇద్దరు వచ్చారు సర్".

    "లేనని చెప్పు". రిసీవర్ పెట్టేసాడు. రెండు నిమిషాల తరువాత మళ్ళీ మ్రోగింది.

    "లోపలి కొచ్చి కూర్చున్నారు. వచ్చే వరకూ వుంటామన్నారు.

    జానీ విసుగ్గా క్రిందికి వెళ్ళాడు.

    క్రింద సోఫాలో కూర్చున్న ఇద్దరు వ్యక్తుల్నీ చూసి చివరి మెట్టుమీదే ఆగిపోయాడు.

    రామూ, గుండప్పలు అక్కడ కూర్చుని వున్నారు. రామూ మొహం మీద  అక్కడక్కడ ప్లాస్టర్ వుంది. గుండప్పచేతికి బ్యాండేజి వుంది. ఎదురుగా వున్న బల్ల మీద వాళ్ళ తాలూకు పిస్తోళ్ళు వున్నాయి.

    అరక్షణంలో సర్దుకున్నాడు జానీ. చేయి ముందుకు సాచి "హలో రామూ" అన్నాడు. రామూ తన చేతిని ముందుకు చాపలేదు.

    "జానీ, మనం చాలాకాలం క్రితం ఒకసారి కలుసుకున్నాం గుర్తుందా" అని అడిగాడు.

    "అవును. ఏదో బ్రోతల్ కేసులో అనుకుంటాను".

    రామూ పళ్ళు బిగించి "కాదు. పెద్దాపురం తీర్థంలో" అన్నాడు.

    "ప్చ్. వయసు పైబడుతూంది. సరిగ్గా గుర్తుండడం లేదు. ఏమిటి విశేషం?"

    "ఇదిగో ఇతడి పేరు గుండప్ప. వసంత్ దాదాకి కుడి భుజం" అన్నాడు రామూ, వసంత్ దాదా పేరు చెప్పగానే మొహంలో వచ్చే మార్పుని గమనిస్తూ అయితే  జానీలో మార్పేమీ లేదు.

    "గ్లాడ్ టు మీట్ యు" అన్నాడు తిరిగి చేయి సాచి! గుండప్ప అవసరమైన దానికంటే ఎక్కువ స్నేహ పురస్సరంగా  ఆ చేతిని అందుకుని నొక్కాడు. మధ్యలో రామూ మాట్లాడుతూ, "జానీ నువ్వొక సహాయం చేయాలి. దాదా నిన్నే  అడగమన్నాడు" అన్నాడు.

    "దాదాలాంటి వాడు నా పేరు గుర్తుంచుకుని చెప్పాడంటే ఎంతో సంతోషించవలసిన విషయం. చెప్పు రామూ. ఏం చెయ్యగలను?"

    "ఈ రోజు ప్రొద్దున్న గుండప్ప ఒక హత్య చేశాడు. నీ దగ్గరున్నట్టు ఎలిబీ ఇవ్వాలి".

    "తప్పకుండా".

    "గుండప్ప- రామూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. గుండప్ప జానీవైపు తిరిగి, "ఆ టైమ్ లో నీతో పాటు ఎవరూ లేరుగా" అని అడిగాడు.

    "ఉన్నారు".

    "ఎవరు?"

    "లక్షలమంది ప్రజలు".

    రామూ మొహంలో అయోమయం స్పష్టంగా కనపడింది. అది చూసి జానీ వివరణ ఇచ్చాడు. "ప్రొద్దున ముఖ్యమంత్రి జెండా వందనం కార్యక్రమానికి వెళ్ళాను. ఆయన మెళ్ళో దండ కూడా వేశాను. అయినా ఫర్వాలేదు. గుండప్పగారు నా పక్కనే వున్నారని చెపుతాను. లక్షమంది సాక్ష్యం".

    గుండప్ప ఇబ్బందిగా గెడ్డం గోక్కున్నాడు.

    రామూలేచి, "వద్దులే జానీ. ఆ సాక్ష్యం అంత బలంగా వుండదు. ఇంకెవర్నైనా చూడడం మంచిది. వెళ్ళొస్తాము" అన్నాడు.

    జానీ వాళ్ళని కారువరకు సాగనంపి డోర్ వేస్తూ "దాదాకి ఈ విషయంలో సాయపడకపోయినందుకు మనస్పూర్తిగా విచారిస్తున్నానని చెప్పు. ఇంకోరకంగా సాక్ష్యమేదైనా ఏర్పాటు చేయమంటే చేస్తాను".

    "అక్కర్లేదు".

    జానీ లోపలికి వస్తుంటే, లోపలి గదిలోంచి బిల్హణుడు బయటికి వచ్చాడు. వెనుకే ఉత్పల కూడా వచ్చింది. వచ్చిన ఆగంతుకుల్ని ఆమె చూసినట్టు పాలిపోయిన ఆమె మొహమే చెపుతోంది.

    "వాళ్ళు మనని గుర్తుపట్టినట్టున్నారు" అన్నాడు జానీ. "....అందుకే ప్రొద్దున్న మనం ఎక్కడున్నామో కనుక్కునే నెపం మీద వచ్చారు".

    "ఇద్దర్లో ఎవడికీ ఎక్కువ దెబ్బలు తగిలినట్టు లేదు. ఒక ఫ్రాక్చర్ మాత్రం అయినట్టుంది. నాకిప్పుడు వెంటనే ఆ సలీం శంకర్ మొహం దగ్గర్నుంచి చూడాలని వుంది.  చేతుల వరకూ వచ్చిన పిట్టని ఆఖరి క్షణంలో వదిలేసినందుకు వీళ్ళిద్దర్నీ అక్కడిక్కడే ఎందుకు కాల్చి చంపలేదా అని అనుమానంగా వుంది. బహుశా ఇరవైనాలుగ్గంటలు టైమిచ్చి వుంటాడు. అందుకే వీళ్ళు ఇలా చేతి బ్యాండేజీలు, ఫాంటు బొందులు సర్దుకుంటూ ఊరుమీద పడ్డారు" నవ్వాడు.

    "వీళ్ళకి మనమీద అనుమానం ఎందుకు కలిగిందో?"

    "బహుశా బస్  స్టాండ్ లో ఎవరో చూసి వుంటారు. జానీ! మనం వీలైనంత తొందర్లో ఈ అమ్మాయిని ఇక్కడనుండి రహస్యంగా పంపే ఏర్పాట్లు చెయ్యాలి"

    "అక్కర్లేదు"

    బిల్హణుడు విస్మయంతో "అదేమిటి" అన్నాడు.

    "ఈ అమ్మాయి మనతో పాటే ఇక్కడే వుంటుంది".

    ఉత్పల తన చెవుల్ని తనే నమ్మలేనట్టు చూసింది. జానీ వాళ్ళని గమనించడం లేదు. ఎక్కడో చూస్తున్నట్టు న్నాయి అతడి కళ్ళు. "భిల్లూ! తెలుగులో నువ్వు బాగా కవిత్వం చెపుతాను కదా. మనం చేస్తున్నది తప్పేమో అని మనసు బాధ పడడాన్ని ఏమంటారు? ఒక మాటలో చెప్పు".

    "అంతర్మధనం"

    "ఆ ......అలాంటిదే నాలో చాలాసేపట్నుంచీ జరుగుతూ వుంది. పాపం ఆ అనూషని తలుచుకున్నకొద్దీ జాలేస్తుంది".

    మామూలుగా వింటున్న ఉత్పల ఉలిక్కిపడి "అనూషా" అంది అప్రయత్నంగా.

    జానీ ఆమె వైపు తిరిగి "ఏం? నీకు తెలుసా" అని అడిగాడు. ఉత్పల తలూపింది. జానీ అన్నాడు-

    "అనవసరంగా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయింది ఆ అమ్మాయి. నిజానికి ఆ అమ్మాయి చేసిన తప్పేమిటి? వసంత్ దాదా తాలూకు 'మనిషికి రూపాయి స్కీము' గురించి వివరిస్తూ వ్యాసం వ్రాయడమేగా! దానికి ప్రతీకారంగా దాదా  ఆవిడని జింకని తరిమినట్టు తరుముతున్నాడు" శ్రోతలిద్దరి వైపు చూస్తూ అన్నాడు. జానీ. అతని మొహంలో అదోలాంటి దీప్తిని గమనించింది ఉత్పల. తండ్రిలో కూడా ఇలాటి అంతర్మధనాన్ని గమనించేది అప్పుడప్పుడు. పద్యం సగం వ్రాసి, అంత  అద్భుతంగా వచ్చిన సగం పద్యాన్ని చూసుకుని- మిగతా పాదాన్ని ఎలా పూర్తి చెయ్యాలా అని-

    "ఆ పురము, జయశ్రీలకు

    కా పురము, .....ద్వారకా పురము...."

    అని వ్రాశాక ఆలోచించగా ఆలోచించగా హఠాత్తుగా

    "భూ పురములలో.....

    గో పురము ......గో.....పురము"

    అని తట్టినప్పుడు తన తండ్రి ముఖం ఎంత సంతృప్తితో వెలిగిపోయిందో అలాటి సంతృప్తిని అతడి కళ్ళల్లో చూసింది. అయితే తండ్రిది సాహిత్యానికి సంబంధించినది. ఇతడిది సమాజానికి సంబంధించినది. అంతలో జానీ, ఆ అవగాహన యొక్క పూర్ణ స్వభావాన్ని వివరించాడు. అతడి మాటలలో-

    "ఆ అమ్మాయి మాటలు నామీద గొప్ప ముద్ర వేశాయి బిల్లూ! ఎంత వారిస్తున్నా వినకుండా ఆ అమ్మాయి తను నమ్మిన దారిలో తను వెళ్ళిపోయింది. ఆమె అన్నట్టు మనమంతా చేతకాని కొజ్జాలమే! ఒక ఆడదాన్ని ఒక సలీంశంకర్ 'నేను నిన్ను దేశంలో ఎక్కడైనా సరే- చివరికి పోలీసు ఇన్ స్పెక్టర్ వ్రాత బల్లమీద, రాజకీయనాయకుల మీటింగు వేదికమీద- ఎక్కడైనా సరే అనుభివించగలను' అని సవాలు చేస్తే- ఆమెను రక్షించడానికి ఒక్కడు- ఒక్కడంటే ఒక్కడు రాడు. తన దారి తను చూసుకోవలసిందే! ఆమె మొదటి నుంచీ చెపుతూనే వుంది- మనమే వినలేదు.....ఇప్పుడు జరిగిన సంఘటన ఆమెది కాదు. ఈ దేశం ఎంత అనాధో చెప్పటానికి ఇది ఓ ఉదాహరణ! మరో ఉదాహరణ ఇదిగో ఈమె. నువ్వన్నట్టు అతడి బలంతో పోల్చుకుంటే మనం చాలా చిన్నవాళ్ళమే. కాని మనం చచ్చేలోపులో వాళ్ళ గాంగ్ లో కనీసం ఒకరిద్దర్నయినా చంపి మరీ చద్దాం. అనూష మాటలలో చెప్పాలంటే- ఏదో ఒకటి ఎక్కడో ఒకచోట నుంచి మొదలు కావాలి కదా- అది ఈ అమ్మాయి కారణంగా మన నుంచే ప్రారంభం కానీ!! ఏం చెప్పు- నువ్వు దీనిలో కలుస్తావా? 'నాకు అక్కర్లేదు' అని ఈ విషయాన్నించి విడిగా వుంటావా? బలవంతమేమీ లేదు భిల్లూ......నీకేది ఇష్టమో చెప్పు".

    విస్ఫారితమైన నేత్రాలతో జానీనే చూస్తూ అతడి మాటల్నీ. భాషనీ, వాదననీ వింటూన్న ఉత్పల, ఈ చివరి ప్రశ్నకి చప్పున తలతిప్పి బిల్హణుడివైపు చూసింది.

    బిల్హణుడి మొహం చాలాసేపు సీరియస్ గా వుండి, అందులోంచి నెమ్మదిగా చిరునవ్వు ఉదయించింది. "ఓ.కె. బాస్. నీ వెనుకే నేను......కానీ నన్నోమాట చెప్పనీ, వెంట్రుక కట్టి కొండని లాగబోతున్నాం. దేశపు అత్యంత బలవంతమైన మాఫియాతో రెండు చిట్టెలుకలు ఢి కొనబోతున్నాయంటే అంటే కదా".


                              18

    చెత్తకుండీ దగ్గర ఎంగిలాకులు ఏరుకునే స్థితి నుంచి- రెండు వందల కోట్ల ఆస్థికి అధిపతి అయ్యాడంటే, వసంత్ దాదా దానికోసం అనుక్షణం శ్రమించాడు. ఎనిమిదేళ్ళ వయసులో ఒక చలి రాత్రి ఫుట్ పాత్ మీద పడుకుని వుండగా ఇద్దరు రౌడీలు ఆ కుర్రవాడిని రేప్ చేశారు. బహుశ ఆ క్షణమే అతడికి బ్రతుకు గురించి అర్థమై వుంటుంది. ఒక్కసారి జీవితపు ఇన్ సెక్యూరిటీ గురించి అర్థంకాగానే అతడి జీవితం మరో మలుపు తిరిగింది.

    రెండు రోజులు కష్టపడి నాలుగు జేబులు కొట్టి వంద రూపాయిలు సంపాదించాడు. దాంతో సీసాడు ఆసిడ్ కొని, రేప్ చేసిన ఆ ఇద్దరు రౌడీలు నిద్రపోతుంటే ఒక్కసారిగా వారి నిక్కర్ల లోపలికి పోసి పరుగెత్తాడు. దాదాపు రెండు ఫర్లాంగుల వరకు వినపడిన వాళ్ళ ఆర్తనాదాలు అతడికి చాలా సంతృప్తినిచ్చాయి. కానీ ఆ తరువాత రెండు గంటలకే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    బోస్టన్ స్కూల్ నుంచి బయటపడేసరికి అతడి వయసు పద్దెనిమిది సంవత్సరాలు. స్కూలు అతడి జీవితాన్ని మార్చేసింది. పట్టుబడకుండా ఎలా నేరం చెయ్యొచ్చో సహవిద్యార్థులు నేర్పారు. పోలీసులు- టీచర్ల సినిసిజం- మనిషిలో వుండే అరాచకత్వపు అధమ స్థాయిని చూపించింది.

    బయటకొచ్చేసరికి పర్ ఫెక్ట్ క్రిమినల్ గా తయారయ్యాడు వసంత్ బాబు అమీర్జాదా! అప్పటికే యూసఫ్ లాలా ఢిల్లీని మకుటం లేని మహారాజులా ఏలుతున్నాడు. 1950లో జరిగిన అల్లర్లలో మస్తాన్ దాదా, యూసఫ్ లాలాని మతకలహాల సాకుతో చంపేశాడు. దానికి వసంత్ బాబు అమీర్జాదా సాయపడి, ఆ తరువాత మస్తాన్ దాదాకి కుడి భుజం అయ్యాడు.

    'పెల్విక్ కాన్సర్' తో మస్తాన్ దాదా రెండు సంవత్సరాలు కష్టపడి చనిపోయాక, వసంత్ బాబు అమీర్జాదా-వసంత్ దాదా అయ్యాడు. అప్పటికే చీకటి ప్రపంచం ఈ యువకుడి శక్తి సామర్థ్యాల్ని గుర్తించింది.

    1. హాజీ మస్తాన్, యూసఫ్ పటేల్, దావూద్ ఇబ్రహీం లాటి వాళ్ళందరూ పేరుమోసిన స్మగ్లర్లుగా పేపర్లలో ప్రముఖంగా పడుతూ వుంటే దాదా మాత్రం  వార్తాల్లోకి అసలు రాకుండా జాగ్రత్త తీసుకున్నాడు. (కాలక్రమేణా ఇదే లాభకరం అని మిగతా స్మగ్లర్లు గుర్తించినా అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది)

    వసంత్ దాదా  మొట్టమొదటి ఫోటో పేపర్లో- అతడు బొంబాయిలో కట్టించిన ఆంజనేయస్వామి గుడి ప్రారంభోత్సవం సందర్భంలో పడింది. ఆ ఫంక్షన్ కి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి (......?.....) హాజరయ్యారు. ఆ తరువాత పాతిక సంవత్సరాలకి దాదా COFEPOSA క్రింద అరెస్ట్ అయినప్పుడు  ఈ ముఖ్యమంత్రే అతడిని దగ్గరుండి విడుదల చేయించాడు. అది వేరే సంగతి.

 Previous Page Next Page