Previous Page Next Page 
అంకితం పేజి 37


    నా చివరి ఆశ ఒక్కటే. నాకు ఎన్నాళ్ళయినా జైలుశిక్ష పడనీ..... అంకిత్ బ్రతకాలి! దానికోసం ప్రపంచం మొత్తాన్ని ఎదిరించదల్చుకున్నాను.

    పోలీస్ వ్యాన్ ని దాటామన్న మాటేగానీ.......నాకు అనుమానంగానే వుంది. వైర్ లెస్ లో ఈ పాటికే మా కారు నెంబరు అన్ని ప్రాంతాలకి వెళ్ళిపోయి వుంటుంది. డ్యూటీలోవున్న పోలీసు అధికారిమీద చెయ్యి చేసుకోవటం సామాన్యమైన నేరంకాదు. క్రమక్రమంగా నేను ఊబిలో దిగిపోతున్నానని తెలుస్తూనేవుంది. పూర్తిగా మునిగిపోయేలోపులో సుమద్యుతిని అంకిత్ దగ్గరికి చేర్చాలి. ఆపరేషన్ జరక్కుండా కృపానంద్ అడ్డుపడితే, అతడిని నిరోధించాలి. అదే ప్రస్తుతం కర్తవ్యం.

    కారు ఎయిర్ పోర్టు ముందు ఆపి, జాన్ వైపు చూసాను. అతడు అర్థం చేసుకున్నట్టు ఎంక్వయిరీ కౌంటర్ వైపు వెళ్ళాడు. నేనూ సుమద్యుతే మిగిలాం. ఆమె నాకు ఒక పుస్తకాన్ని అందించింది. ఆశ్యర్యంగా  దాన్ని అందుకున్నాను.

    కాలేజీలో విడిపోతున్నప్పుడు నేను ఆమెకి బహుమతిగా ఇచ్చిన పుస్తకం అది. అంతకాలం ఆమె దాన్ని అంత భద్రంగా దాచుకోవటము నాకు ఒక  రకమైన దిగులుతోకూడిన సంతోషం అనిపించింది. ఈ లోపులో ఆమె అంది-.

    'ఒక పెద్ద అనుభూతి ..... కాస్త తక్కువ ఆనందాన్ని ఇచ్చే అనుభూతిని మనసు పొరల వెనక్కి తోసేస్తుందనుకుంటాను. నా జీవితంలో ఇంతకంటే గొప్ప అనుభూతులు లేవు. అందుకే దాన్ని దాచుకున్నాను."

    నేను మాట్లాడలేదు.

    "వీలైతే దీన్ని మీ దగ్గిర వుంచండి. మళ్ళీ కలవటం అంటూ సంభవిస్తే అప్పుడు తీసుకుంటాను."

    ఆమె సంభాషణ పూర్తి కావొస్తుండగా జాన్ డేవిడ్ హడావుడిగా రావటం కనిపించింది. అతడేం చెప్తాడన్న టెన్షన్ తో, ఈ పుస్తకం గురించి ఆలోచన వెనక్కి వెళ్ళిపోయింది. సుమద్యుతి చెప్పింది కరెక్టే. ఒక పెద్ద అనుభూతి, చిన్న అనుభూతిని డామినేట్ చేస్తుంది. అరుంధతి, అంకిత్ లతో నా ఆనందకరమైన జీవితం. సుమద్యుతితో ప్రేమ (?) వ్యవహారాన్ని అడుక్కి తోసేసింది. ఆమె జ్ఞాపకాల్లో మాత్రం అది సజీవంగా వుంది.

    ఈ లోపులో జాన్ కారు దగ్గరికి వచ్చాడు. "విశాఖపట్టణం వెళ్ళే విమానం రెడీగా వుంది....." దాదాపు ఆనందంతో అరిచాడు.

    ఒక్కక్షణం నా చెవుల్ని నేను నమ్మలేకపోయాను. ఇంతవరకూ నాతో ఆడుకున్న విధి...... చివరిక్షణంలో ఈ విధంగా సాయం చేస్తుందనుకోలేదు. సంతోషంగా "థాంక్ గాడ్" అన్నాను. అతడు కిటికీలోంచి రెండు టిక్కెట్లు సుమద్యుతికి అందిస్తూ "లగేజ్ తీస్తాను" అన్నాడు.

    "అదేమిటి? నువ్వు రావడంలేదా మాతో" అన్నాను ఆశ్చర్యంగా.

    "రెండే టిక్కెట్లున్నాయి. అందుకు సంతోషిద్దాం" అన్నాడు.

    "నువ్వుకూడా వుంటే బావుండేది జాన్. ముగ్గురం వెళ్ళేవాళ్ళం" విచారం ధ్వనించింది నా కంఠంలో.

    "నేను వెళుతున్నాను."

    "మరి...........?"

    "నువ్వే రావటంలేదు."

    నేను అదిరిపడి "వ్వాట్" అని అరిచాను.

    "అవును. లోపల కృపానంద్ వున్నాడు. బహుశా అతడు కూడా విశాఖపట్టణం వస్తున్నట్టున్నాడు. విమానం లేట్ అయినట్టుంది. అది మనకి ఒక రకంగా సహాయపడ్డది. అయితే, మనం అనుకున్నట్టు కృపానంద్ కి చాలా పలుకుబడి వున్నట్టుంది. చాలామంది పోలీసులున్నారు. ఈ పరిస్థితిలో నువ్వు లోపలి రావటం...... కోరి అపాయం తెచ్చుకున్నట్టు అవుతుంది. ప్రస్తుతం సుమద్యుతిని చూస్తే  అతడు ఏ విధంగా వెర్రెక్కి పోతాడో వూహించలేం."

    అతడు చెప్తున్నదాన్లో తర్కం తొందరగానే అర్థమైంది నాకు. ఇంతలో విమానం బయల్దేరుతున్నట్లు అనౌన్స్ మెంట్ వినిపించింది. వాళ్ళు బ్రీఫ్ కేసులు పట్టుకుని నడక సాగించారు...... "జాన్" పిల్చాను.

    అతను ఆగాడు.

    "నేను తప్పుగా ఆలోచించిన ప్రతిసారీ సరిదిద్దావు. విశాఖ పట్టణం వెళ్ళే విమానం ఆలస్యమవొచ్చునన్న ఆలోచనే నాకు తెలీదు. థాంక్స్ జాన్ ! ఇప్పుడు నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. నీ అనుభవం, మనుష్యులపట్ల నీ అవగాహన, నిబ్బరితనం అన్నీ వుపయోగించి వాడిని రక్షించు...."

    జాన్ తలూపాడు.

    వాళ్ళు వెళ్ళిపోయారు.

    అక్కడేం జరుగుతుందో నాకిక తెలీదు. మిత్రులు, ఆప్తులు, శత్రువులు..... అందరూ రణరంగానికి చేరుకున్నారు. దయ, శ్వేత వరంగల్ లో వుండిపోయారు. ముఖ్యపాత్రధారినైన నేను ఇక్కడ మిగిలిపోయాను.

    "ప్రేక్షకుడిలా!

    ఎలా అక్కడికి చేరుకోవటం?

    నేను లేకుండా కూడా అక్కడ ఆపరేషన్ విజయవంతమవ్వొచ్చు. కానీ అంతవరకూ నేను ఆగలేనన్నది నిజం! ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. అందులోనూ కృపానంద్ అక్కడికి వెళ్తున్నాడంటేనే నా మనసు కీడు శంకిస్తోంది.

    రాత్రికి రాత్రి కార్లో విశాఖపట్టణం వెళ్దామన్న ఆలోచన క్షణక్షణానికి బలీయమవుతోంది! కానీ ఇప్పుడు బయల్దేరితే అక్కడికి చెరుకునేసరికి రేపు సాయంత్రమవుతుంది. ఫలితం వుండదు.

    ఏం చెయ్యాలో తోచని అయోమయావస్థలో కారు రివర్స్ చేయసాగాను. వర్షం ఎక్కువైంది. ఆ సమయంలో 'ఓ మైగాడ్' అని వినిపించింది. చప్పున తల వెనక్కి బాగా తిప్పి చూసాను. ఎడమవైపు సరీగ్గా చూసుకోలేదు. అట్నుంచి వస్తున్న వ్యక్తిమీద వర్షపునీళ్ళు చిమ్మాయి "......సారీ" అన్నాను.

    "ఇట్సాల్ రైట్. చీకటి కదా. మీరు మాత్రం ఏం చేస్తారు?" అన్నాడు. అంత సౌమ్యంగా మాట్లాడే వ్యక్తులు అరుదు. నాకు కాస్త సంతోషంగా అనిపించింది. "థాంక్స్" అనబోతూ అతడిని చూసి విచలితుడి నయ్యాను. ఈ లోపులో అతడు ముందుకు వచ్చాడు.

    అతడు కృష్ణానంద్! కొంతకాలం క్రితం నేను ఎయిర్ పోర్ట్ ఆఫీసులో కలిసిన వ్యక్తి!


                          *    *    *

    విమానంలో వెనుకసీట్లో మొహానికి పేపర్ అడ్డు పెట్టుకుని కూర్చున్నాను. అందరికన్నా చివరి సీటు. ముందు సీట్లలో జాన్, సుమద్యతి వున్నారు. వారికి కొద్దిగా వెనుక- కృపానంద్ వున్నాడు. అతడి వెనుక, చివరగా నేను! ఒకర్నొకరు వెంటాడుతున్నట్టు -ఏదో పట్టేదారు సినిమాలో దృశ్యంలా వుందది.

    మనసులోనే కృష్ణానంద్ కి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. విధి ఒక రకంగా మనిషి కెప్పుడూ సాయం చేస్తూనే వుంటుంది. లేకపోతే -ఎప్పుడో పొరపాటున యాదృచ్చికంగా (నా కొడుకుకి అతడే తండ్రి అనుకుని) కలిసిన కృష్ణానంద్ ఈ విధంగా ఈ వర్షం రాత్రి తారసపడటం ఏమిటి? తను పనిచేసే ఎయిర్ పోర్ట్ లో తనకున్న పరపతి ఉపయోగించి నాకు ఈ చివరి సీటు సంపాదించి పెట్టటమేమిటి?

    ఆలోచనలో వుండగానే విమానం విశాఖపట్టణం చేరుకుంది.

    కృపానంద్ అంత కామ్ గా వుండటం ఆశ్చర్యం అనిపించింది. అంకిత్ కి ఆపరేషన్ జరగకుండా అతడు బహుశా పోలీసులను కోరవచ్చు. అందువల్లే అతడు అంత ధైర్యంగా వున్నట్టున్నాడు. కానీ అతడు అక్కడే పొరపాటు పడుతున్నాడు. శ్వేత కిడ్నీ కాదు మేము అమరుస్తున్నది.....! సుమది...!!! అందువల్ల అతడు మమ్మల్ని చట్టపరంగా ఏమీ చేయలేడు. అతడు ఏమైనా చేయగలిగితే అది కేవలం శ్వేతని కిడ్నాప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేయించటం!

    ఆ కేసుకూడా నిలవదు. ఎందుకంటే- శ్వేతని వికలాంగుల హొమ్ నుంచి తీసుకొచ్చింది నేనుకాదు. డాక్టర్ మహారధి! ఆ పాప తాతయ్య!! అదీగాక సుమద్యుతి ఆ పాప కన్నతల్లి కాబట్టి - అది కిడ్నాప్ అవదు.

    ఈ విధమైన ఆలోచనలతో నా మనసు తేలికపడింది. ఇక ఆపరేషన్ చేసే స్థలం కూడా మార్చనవసరం లేదు. మహారధి తాలూకు నర్సింగ్ హొమ్ లోనే చెయ్యవచ్చు.

    ఇంత ఆలోచించి కూడా నేనా పరిస్థితుల్లో కృపానంద్ ఎదుట పడదల్చు కోలేదు. అతడసలే కల్లుతాగిన కోతిలాటివాడు. విమానాశ్రయంలో ఏదయినా సీను క్రియేట్ చేసినా చెయ్యగలడు. అందుకే, అతడు అక్కణ్నుంచి వెళ్ళిపోయాక, నెమ్మదిగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటపడ్డాను. అప్పటికే సుమద్యుతి, జాన్  స్టాండ్ లో వున్న కారువద్దకు చేరుకున్నారు. నేను వేగంగా అక్కడికి వెళ్ళాను.

    డాక్టర్ మహారధి కారు అది! కోడల్ని రిసీవ్ చేసుకోవటానికి రమ్మని జాన్ విమానాశ్రయం నుంచి ఫోన్ చేసి వుంటాడు. అతడి దూరదృష్టిని మనసులోనే  మెచ్చుకున్నాను.

    దగ్గరగా వెళ్ళి "హలో" అన్నాను. ముగ్గురూ ఒకేసారి తలతిప్పి చూసారు.

    అప్పుడు వాళ్ళ మొహాల్లో కనపడిన ఉద్వేగానందాల్ని వర్ణించటానికి నాకు మాటలు చాలవు.

    "ఎలా వచ్చావు?" జాన్ అడిగాడు ఎగ్జయిటింగ్ గా.

    "మీరొచ్చిన ఫ్లయిట్ లోనే-"

    "కారెక్కండి. వెళ్తూ మాట్లాడుకుందాం" అన్నాడు డాక్టర్ మహారధి. నేనుకూడా కారేక్కాను.

    "ఆపరేషన్ మా నర్సింగ్ హొమ్ లోనే ఏర్పాటు చేసాను" అన్నాడు మహారధి. "సుమ- అంకిత్ లు టెక్నికల్ గా అన్ని విధాలా మ్యాచ్ అయ్యారు కాబట్టి సమస్య లేదు."

    "శ్వేత విషయం ఏమైనా తెలిసిందా?" సుమ అడిగింది.

    "అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. శ్వేతని దయగారు వెనక్కి తీసుకు వెళ్ళిపోయారు. వరంగల్ నుంచి ఫోన్ చేసారు. వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ "హొమ్" లో చేర్పించేస్తానని చెప్పారు."

    నా మనసు తేలికైంది. అప్పటివరకూ కొన్ని నెలల పాటు అనుభవించిన టెన్షన్, శ్రమ, మానసికమైన అలసట- అన్నీ ఒక్కసారిగా ఎవరో చేత్తో తీసేసినట్టు పోయాయి. సమస్యల మేఘాలన్నీ దూదిపింజెల్లా ఈ విధంగా తెలిపోతాయని నేను కలలో కూడా వూహించలేదు. గాఢంగా నిశ్విసిస్తూ కారు సీటు వెనక్కి వాలాను.

    "గంట క్రింత పోలీసులు మా నర్సింగ్ హొమ్ కి వచ్చారు" అన్నాడు మహారధి. ఉలిక్కిపడ్డాను. సవ్యంగా నడుస్తున్న పడవలో చిన్న  కుదుపులాటి భావన! అయితే, మహారధి వెంటనే మరింత సంతోషకరమైన వార్త చెప్పాడు. "...... హైద్రాబాద్ నుంచి వైర్ లెస్ లో మీ గురించి చెప్పినట్టున్నారు. నేనా ఇన్ స్పెక్టర్ తో మాట్లాడాను. మీ మానసిక పరిస్థితి, మీ గురించి చెప్పినట్టున్నారు. నేనా ఇన్ స్పెక్టర్ తో మాట్లాడాను. మీ మానసిక పరిస్థితి, మీ అబ్బాయి ఆరోగ్యం గురించి ఆందోళన అన్నీ వివరించాను. ఏ పరిస్థితుల్లో మీరా విధంగా ప్రవర్తించి వుంటారో వూహించటం కష్టం కాదు. ఆ ఇన్ స్పెక్టర్ మంచివాడు. అర్థం చేసుకోగలిగాడు. తనే స్వయంగా హైద్రాబాద్ మాట్లాడి, మీరు కొట్టిన  ఇన్ స్పెక్టర్ ని కన్విన్స్ చేసాడు. అతి కష్టంమీద ఆ ఇన్ స్పెక్టర్ ని మీమీద చార్జెస్ వదులుకోవటానికి వప్పించాడు."

    "థాంక్ గాడ్............." స్వగతంగా అన్నాను. "వాళ్ళు సులభంగా వప్పుకుంటారని నేను అనుకోలేదు."

    "మామూలు పరిస్థితుల్లో వప్పుకోరు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు........"

    "ఏమిటది?"

    "కృపానంద్ కి పై అధికారుల్తో మంచి సంబంధాలు, పలుకుబడి వున్నాయి. ఆ అధికారులు క్రిందిస్థాయి ఇన్ స్పెక్టర్లకి ఇటువంటి పనులు అప్పజెపుతారు. వీళ్ళ మనసులోనే తిట్టుకుంటూ ఈ పనులు చేస్తారు. చేసేది నిజంగా ఏదయినా "మంచి" పనైతే వీళ్ళకీ ఇంటరెస్టు వుంటుంది. అలా కాకపోతే చాలా చిరాగ్గా వుంటుంది. ఆ  ఇన్ స్పెక్టర్ కి ఈ కేసు మొత్తం చెప్పేసరికి అర్థం చేసుకున్నాడు."

    అప్పటివరకూ మౌనంగా వున్న జాన్ ".........కృపానంద్ ఈ విధంగా తయారవటంతో మీ పాత్ర ఎంతవరకూ వుంది?" అని అడిగాడు.

    నేను ఆసక్తిగా మహారధివైపు చూసాను. అతడు గాఢంగా ఊపిరి వదిలాడు. నేను ఆ శూన్యత పోగొట్టుకోవటానికి నేను రెండో పెళ్ళి చేసుకున్నాను. అదీగాక- ప్రాక్టీసు మీద ఎక్కువ ఏకాగ్రత నిలిపాను. వాడిలో వస్తూన్న వైపరీత్యాలు తెలుసుకొనేసరికే పరిస్థితి చేయిదాటిపోయింది. మీరు అర్థం చేసుకోగల రనుకుంటాను."

 Previous Page Next Page