"ఊరుకో ! కమలా! కొంచెం ఆవేశం తగ్గించుకో? అర్ధం చేసుకో! నేను మయూర కేం చేసాను? నా కొడుకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించడానికి మాత్రమే ప్రయత్నించాను. యతి ప్రాణాలు కాపాడాను. పోలీసుల బారి నుండి కాపాడాను. రెండూ నిజమే! కానీ అందుకు బదులుగా యతి నాకెంత చేసాడో నీకు చెప్పినా అర్ధం కాదు. మనం పెళ్ళి చేశామే కాని, మయూర వేణు దంపతుల్లాగ ఒక్కనాడైనా జీవించలేదు. ఇక ముందు జీవించరు. మయూర , యతి చిన్నతనం నుండే ప్రేమించుకున్నారట! ఆ సంగతి నాకు తెలియదు. ఒక దుర్మార్గుడు పాడుచేసిన స్త్రీని , ఒకసారి పెళ్ళయినాదాన్ని స్వీకరించటానికి సిద్దంగా వున్నాడంటే అతని మనసు యెంత ఉదాత్తమయినదో ! ఆ ప్ర్రేమ యెంత గాడమైనదో ఊహించుకో! అయినా మన ఇంట్లో వున్నన్ని రోజులూ, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ గాడితప్పి ప్రవర్తించలేదు. ఆ ఇద్దరికీ మనమీద వున్న గౌరవం అలాంటిది. ఇప్పుడయినా వాళ్ళు స్వతంత్రించి ఏం చెయ్యటం లేదు. నా దగ్గరికే వచ్చారు. సమస్యను నన్నే పరిష్కరించమని అడిగారు."
"హమ్మయ్య! అయితే యికనేం వాడిని ఆ చెంపా ఈ చెంపా వాయగొట్టి పంపించేసి, దాన్ని యింట్లో పడేయండి. కొన్నాళ్ళు గడిచిపోతే అన్నీ సర్దుకు పోతాయి." గబగబా అంది కమల.
లాలనగా కమల కన్నీళ్లు తుడిచాడు ప్రభాకర్.
"కమలా! పిచ్చిదానివయిపోకు. అలా చెయ్యటం వల్ల ఎవరు సుఖపడలేరు. చిన్న పిల్లలంతా చేరి నాకు పెద్దరికం నిలిపినందుకు, ఇది కాదు నేను చేయవలసింది! మన వేణుతో మయూరకు విడాకులిప్పిస్తాను. యతికీ, మయూరకూ పెళ్ళి చేస్తాను."
'అయ్యో!" ముఖం చేతుల్లో కప్పుకుని కూలబడింది కమల. "ఇదెక్కడి అన్యాయమండి! కన్న కొడుక్కి కోడలి చేత విడాకులిప్పించి కోడల్ని మరెవరికో ఇచ్చి పెళ్ళి చేస్తారా? ఇంత ఘోరం లోకంలో ఎక్కడన్నా వుంటుందా?"
"కమలా! మనం ఘోరం అనుకుంటే అన్నీ ఘోరం గానే కనిపిస్తాయి. అర్ధం చేసుకోగలిగితే అన్నీ సవ్యంగానే సవ్యంగానే వుంటాయి. ఆనాడు నేను నిన్ను పెళ్ళి చేసుకున్నప్పుడు అందరూ ఘోరమనే గుండె బాదుకున్నారు. "బాల వితంతువయినా కాదు. పెళ్ళయి పిల్లలున్న ఆడది" అన్నారు! కన్న తండ్రి ముఖం చూడకుండా వేలివేసాడు.
ఆనాడు నేను నా గుండె బలంతో అదే సరయిన మార్గమని నిర్ణయించుకుని నిన్ను పెళ్ళి చేసుకున్నాను. కాలం గడిచిన కొద్ది మనను వెలి వేసిన వారే మనను అభినందిచారు. ఇప్పుడూ అంతే! నా నిర్ణయం ప్రస్తుతం కొంత మందికి ఘోరంగా తోస్తే తోస్తుంది. కానీ , ఈ నిర్ణయం ఎంతో సమంజసమైనదనీ, సంఘంలో ఈ మార్పు అవసరమేననీ కాలమే రుజువు చేస్తుంది."
"ఏమోనండీ! నాకు మతి పోతుంది - గుండె దడదడ లాడుతోంది, ఈ ఘోరం నేను చూడలేనండీ !"
'అలా కాదు కమలా! కష్ట సుఖలన్నిట్లో నా పక్కన నిలబడ్డావు రా! యతినీ, మయూరను పలకరించు." అని కమలను చెయ్యి పట్టుకుని నడిపించుకొని వచ్చాడు. యతి పక్కన వంటినిండా పమిట కప్పుకొని నిలబడింది మయూర. ప్రభాకర్ తో కమల బయటకు రాగానే కమల పాదాలకు నమస్కారం చేసింది. మయూర కళ్ళలోనూ నీళ్ళు నిండుకున్నాయి. చెమ్మగిల్లిన కళ్ళతో ఆ కన్నీళ్లు తుడిచి "ఎందుకమ్మా ఏడుస్తావు/?సుఖంగా వుండు!" అంది కమల.
తేజస్వి, మమత, ప్రతాప్, ఉదయ్ మొదలయినవాళ్ళు కూడా వచ్చారు. అంతా కూచుని మాటల్లో పడ్డారు. ఏమి జరగనట్టుగా మాట్లాడటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు ప్రభాకర్. యతి, మయూర వంచిన తలలు ఎత్తలేకపోతున్నారు.
వేణు వచ్చాడు - ఎప్పటిలాగ తప్పతాగే వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. ఈ పరిణామం అతడు ఊహించలేనిది - ఏ మాత్రం భరించలేనిది.
"నో! నో! నేను మయూరకు విడాకులియ్యను. ఆ దెయ్యాన్ని సుఖంగా, సంతోషంగా బతకనియ్యను. ఆ యతిగాడిని చంపి ముక్కలు చేస్తాను." అని అరిచాడు వేణు. ప్రభాకర్ శాంతంగానే కఠినంగా "వేణూ! బుద్దిగా లాయరు గారు చెప్పిన చోట సంతకాలు పెట్టు, లేకపోతే కోర్టులో నీ బండార మంతా బయటపడుతుంది. అప్పుడు మయూరకు విడాకులూ వస్తాయి. నువ్వు పబ్లిక్ గా నవ్వుల పాలూ అవుతావు' అన్నాడు.
తండ్రి కంఠంలో కాటిన్యం గుర్తించాడు వేణు. ఆ కంఠం అలా పలికినప్పుడు దానిని ఎదిరించి ఎవరూ ఏమి చెయ్యలేరని తెలుసు! ఎర్ర బడ్డ ముఖంతో ముక్కుపుటాలు అదురుతుండగా లాయరు పెట్టామన్న చోట సంతకాలు పెట్టేసాడు.
చిన్నప్పటి నుండీ "మా ఫాదరు తలుచుకుంటే ....." అంటూ ప్రభాకర్ పరపతి పరోక్షంగా ఉపయోగించు కొంటూ వేణు చేసిన ఆగడాలు గుర్తుకొచ్చాయి యతికి. ఆ రోజుల్లో ఒకనాడు "మీ ఫాదరు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు, కానీ, పశువులా మారిన నిన్ను మనిషిగా చెయ్యలేరు." అనటం కూడా గుర్తుకొచ్చింది. ఎలాంటి మహానుభావుడి కడుపునా ఎలాంటి వాడు పుట్టాడు?
ఇదంతా జరిగిన తరువాతి కొద్ది రోజుల్లోనే మయూర కు లీగల్ గా విడాకులు లభించాయి. అంతవరకూ మయూర తల్లిదండ్రుల దగ్గరే ఉంది. అటు మయూర తల్లిదండ్రులు, ఇటు యతి తల్లి దండ్రులు కూడా ఈ పరిణామాలకు పెద్దగా సంతోషించలేదు. తమ బిడ్డ ఒక పెళ్లి కాదని మరో పెళ్లి చేసుకుంటే నలుగురూ ఏమనుకుంటారో అని మయూర తల్లితండ్రులు భయపడ్డారు. తన కుడుక్కు "లక్షణమైన సంబంధం" తెచ్చి చెయ్యలేకపోయానే" అని యతి తల్లి బాధపడింది. మొత్తం మీద అందరూ సర్దుకోక తప్పలేదు. యతి మయూర రిజిస్టరు మేరేజ్ చేసుకున్నారు. పెళ్ళి కాగానే మయూర యతితో కలిసి యతి గ్రామంలో ఉన్న కోవెలకు వెళ్ళింది. ఆనాడు భగవంతుడ్ని నిందించింది. ప్రభాకర్ భగవంతుడ్ని ప్రార్దిస్తున్నప్పుడు కూడా మనసు బండ బారినట్లే ఉండేది. విధి లీలలు ఎంత చిత్రమైనవి? జీవితంలో ఒడిదుడుకులు ఎవరికైనా తప్పవు. ఈ సంఘర్ధణే జీవితంలో నుంచి జరగగానే దేవుణ్ణి మెచ్చుకొని ఆపద రాగానే నిందించటం ఎంత ముర్ఖం? ఏ శక్తి ప్రభాకర్ లాంటి వ్యక్తుల హృదయాలను అంత ఉదాత్తంగా వెలిగించగలుగుతుందో ఆ శక్తే భగవంతుడు . తన మనసు ఉన్నతంగా , ఉద్దత్తంగా ఉంటె చాలు! జీవితంలోని సంఘర్షణలను ఎన్నైనా ఎదుర్కొనగలదు. అదే జీవితానికి అర్ధం.
మయూర చెయ్యి పట్టి లాగుతూ "ప్రార్ధన ముగిసిందా?" అన్నాడు యతి.
"లేదు! ప్రారంభమయింది!" నవ్వింది మయూర.
------సమాప్తం------