Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 36


    ఆమె కళ్ళలో తిరిగి నీళ్ళు నిండాయి. బేలగా "నే....ను....నేను ఎక్కడికి వెళ్ళను?" అంది. జానీ ఆ దృశ్యాన్ని చూడలేనట్టు కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూడసాగాడు. ఎదైనాచేసి ఆమెని రక్షించగలిగితే బావుణ్ణు! కానీ ప్రపంచం అంతా ఏకమయినా ఆమెని రక్షించలేదు. ఆ విషయం 'మాఫియా' గురించి తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది.

    "ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను వదిలిపెట్టరు" తిరిగి ఆమే అంది.

    "గోవా అయితే బావుంటుంది" న్నాడు బిల్హణుడు. "గోవాలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసే గాంగ్ వేరే!..... దానికీ దాదా మాఫియాకి అంతగా సంబంధంలేదు. అది వేరే ముఠా. అక్కడయితే నిన్ను ఎవరూ పట్టించుకోక పోవచ్చు".

    జానీ రెస్ట్ లెస్ గా కిటికీ రెక్కపట్టుకున్నాడు. గోవా 'మాఫియా' గురించి కొంత వరకూ బిల్హణుడు అబద్ధం చెపుతున్నాడు. అయినా ఇంత అమాయకంగా కనపడే అమ్మాయి గోవాలాటి వూళ్ళో ఒక్కటే ఎలా బ్రతగ్గలదు.

    ఈ లోపులో బిల్హణుడు అన్నాడు. "......అమ్మాయ్! నీకో రెండు వేల రూపాయిల దాకా ఇస్తాము. ఎలాగో ఎవరి కంటా పడకుండా ఈ నగరపు పోలిమేర్లు దాటిస్తాము. అసలు ఇది చేయడంకూడా ప్రాణాల్తో రిస్కు అయిన పనే! కానీ న్నిను చూస్తూంటే గాలిలో దీపంలా వదిలెయ్యబుద్ధికావడంలేదు. దీనికి ప్రతిగా నువ్వు రెండు సాయాలు మాకు చెయ్యాలి. ఒకటి, ఒక వేళ నువ్వు వాళ్ళకి దొరికిపోతే ప్రాణాలు తీసేటంతటి చిత్రహింసలు పెట్టినా, నిన్ను బస్ నుంచి రక్షించింది కానీ, ఇలా గోవా పంపించిందికానీ మేమన్న విషయం బయట పెట్టకూడదు.... ఇది మొదటిది. రెండోది-కనీసం మరో నాల్గయిదు  సంవత్సరాల వరకూ నువ్వు నీ తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి గానీ, ఉత్తరం వ్రాయటానికిగానీ ప్రయత్నించకూడదు...." అని ఆగి, ".......ఉహూ-నాల్గయిదు సంవత్సరాలు కాదు. కనీసం పది సంవత్సరాల వరకూ నీ వునికి ఎవరికీ తెలియకూడదు. ఈ రెండు విషయాలు పాటిస్తానని భగవద్గీత మీద ప్రమాణం చేస్తే, మిగతా ఏర్పాట్లు నేను  చేస్తాను. శోత్రియ వంశంలో పుట్టిన దానిని భగవద్గీతని నమ్ముతావని అనుకుంటున్నాను".

    ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని అర్థాంగీకారంగా తీసుకుని బిల్హణుడు జానీ వైపు తిరిగి "ఇట్రా" అంటూ మళ్ళీ పక్కగదిలోకి తీసుకెళ్ళాడు.

    లోపలికి వెళ్ళాక "జానీ!" అన్నాడు. "మనం రిస్కు తీసుకుంటున్నామేమో అనిపిస్తూంది. ఈ అమ్మాయిని చూస్తూంటే, మాటని దాచగలిగే ధైర్యం వున్నదాన్లా అనిపించడంలేదు. రేప్పోద్దున్న పొరపాటున వాళ్ళకి కానీ దొరికి విషయం బయట పెట్టిందంటే వాళ్ళ జీపుని నాశనం చేసినందుకు, ఆ గుండప్ప, రామూలనీ మిగతా వాళ్ళని చావ గొట్టినందుకూ మన ప్రాణాలు మామూలుగా కాదు- చిత్రవధ చేసి మరీ తీస్తాడు ఆ దాదా. ముందైతే ఏదో సలహా చెప్పానుకానీ చూస్తూ చూస్తూ మనం కూడా ఇందులో ఇరుక్కు పోయామనిపిస్తూంది. ఈ సలహా చెప్పినందుకు తరువాత ఏమైనా గొడవలోస్తే మళ్ళీ నన్ను నిందించకు. ఇంకో రకంగా ఏదైనా నీకు తోస్తే చెప్పు".

    చాలాసేపటి తరువాత జానీ మాట్లాడుతూ, ఇంకో రకంగానా.....అంటే?" అని అడిగాడు.

    "కటువుగా వున్నా- మనం తప్పించుకునే ఒకే ఒక మార్గం చెప్పాలంటే....."

    "చెప్పు, ఆగావేం? ఏమిటా మార్గం?"

    "ఈ విషయం మనకి తెలిసినట్టు వసంత్ దాదాకి చెప్పడం ఒక్కటే".

    జానీ ఇరిటేటింగ్ గా పచార్లు చేయటం ప్రారంభించాడు. ఒకచోట ఆగి, "బిల్లూ, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా...... తెల్లపావురం గుర్తొస్తుంది. నిజం, చాలా ఒద్దికైన  పావురం. దీన్ని చూస్తూ- చూస్తూ...." ఆ తరువాత మాట్లాడలేకపోయాడు.

    "కానీ ఆ తరువాత పరిణామాలు......"

    "బస్ తీసుకెళ్ళి జీపుని గుద్దినప్పుడు ఈ పరిణామాలు ఆలోచించలేదా బిల్హణ్ నువ్వూ?"

    బిల్హణుడు బలంగా నిశ్వసించాడు. "అప్పుడు మనం దీని వెనుక వసంత్ దాదా వున్నాడనుకోలేదు జానీ! ఆ విషయం మర్చిపోకు. ఏదో రామూ గుండప్పల స్వంత కిడ్నాపింగ్ వ్యవహారమానుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాం. కానీ 'వసంత్ దాదా' అంటే నీకు తెలియనిదేముంది? అన్ని బలగాలూ అతడి క్రిందే వుంటాయి. ఒక చిన్న నగరంలో ఒక మూల చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం-మన దారిన మనం పోక అందులోనూ ఈ వసంత్ దాదాతో గొడవలెందుకు?"

    జానీ ఏదో అనబోతూ వుండగా ఇంటర్ కమ్ లో "మీ కోసం ఎవరో వచ్చారుసార్. ఏదో కవరు- మీకే స్వయంగా ఇవ్వాలంటున్నాడు" అని వినపడింది.

    జానీ క్రిందికి వెళ్లి కవరు తీసుకుంటూ, ఎవరుపంపారు దీన్ని" అని అడిగాడు.

    "తెలీదుసార్, మీకే స్వయంగా  ఇమ్మన్నారు"

    కవరు తీసుకుని పైకి వెళ్తూ దాన్ని చింపాడు. లోపల మూడు పేజీల ఉత్తరం వుంది. చివర సంతకం లేదు. పేరు కూడా టైప్ చేసేవుంది.

    'అనూష' అని.


                                                    *    *    *


    జానీ,,

    క్షేమమేనా? సాధారణంగా ఉత్తరాల్లో 'ఇక్కడంతా క్షేమం. అక్కడ క్షేమమని తలుస్తాను' అన్న వాక్యంతో ప్రారంభిస్తారు. క్షేమం అనేది శరీరానికే కాదు, మనసుక్కూడా అని జనం గ్రహించిన రోజు, భవిష్యత్తులో బహుశా ఎవరూ ఆ వాక్యంతో ఉత్తరం మొదలు పెట్టడానికి సాహసించరేమో.....అవును మరి! ఈ దేశంలో శారీరకంగా క్షేమంగా వుండాలంటే, ముందు మనసుని కలుషితం చేసుకోవడం తప్పనిసరి అవుతోంది. ముఖ్యంగా మనలాటి వాళ్ళకి. (నువ్వూ తెలివైన వాడివనే నమ్ముతున్నాను. తప్పయితే క్షిమించు).

    ఆంథ్రోపాలజీ". గురించి నీకు తెలుసా? దాంట్లోంచి పుట్టుకొచ్చి ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతూన్న విభాగం, "సోషల్ ఆంథ్రోపాలజీ" మనిషి నేటి ప్రవర్తనని, పరిణామ సిద్దాంతంతో అన్వయించి ఆ దృక్పధంతో ఆలోచిస్తే- ఒక భయంకరమైన భవిష్యతు అతి సమీపంలో గోచరమవుతుంది.

    ప్రాణులు రెండు రకాలు. బలవంతమైనవి. బలహీనమైనవి. ఆటవిక న్యాయంతో బలవంతమైన ప్రాణులు, బలహీనమైన వాటిని వేటాడి చంపుతాయి. మనిషి కూడా ఒకప్పుడు ఈ స్టేజ్ లోనే వుండేవాడు. కానీ నాగరికత పెరిగేకొద్దీ బలహీనులైన చాలామంది, బలవంతులైన కొద్దిమంది నుంచి తమని రక్షించుకోవడం కోసం పన్నుల రూపంలో చందాలు వేసుకొని సైన్యాన్నీ, రాజునీ, శాసనాల్నీ ఏర్పాటుచేసుకున్నారు. అదే ఇప్పుడు పోలీసు వ్యవస్థగా మారింది.

    కాలక్రమేణా బలవంతులు, బలహీనులు అన్న తేడాపోయి, కొత్త విభేదం తలెత్తింది, 'తెలివైనవాళ్ళూ-తెలివి తక్కువ వాళ్ళు' అని. రాజులు రాజ్యాలేలిన కాలంలో ఈ రెండు తెగల మధ్య తేడా సమాజానికి అంత ప్రమాదకరంగా వుండేది కాదు. మహా అయితే ఈ తెలివైన వాళ్ళు వర్తకులై ప్రజల్నించి మరి కాస్త ఎక్కువ ధనాన్ని సంపాదించేవారు.

    కాలక్రమేణా మనిషి జీవితం మరింత సంక్లిష్టమైంది. ఎకనమిక్సు, కామర్సు, పోలిటిక్సు అనే మూడు షట్పాదులు మనిషిని  రక్షించే నెపం మీద చుట్టుముట్టాయి. ఆటవిక న్యాయంలో పూర్వం వుండే శారీరకంగా బలవంత, బలహీన వర్గాలుపోయి, తెలివితేటలున్న వాడికీ, తెలివి లేని వాడికీ మధ్య తేడా పెరుగుతూ వచ్చింది. మనుష్యులు నిర్మించుకున్న 'పోలీసులు' అనే కోటని తెలివైన వాడు కొనేసి, తనలో కలుపుకున్నాడు. మనుషులు తయారు చేసుకున్న శాసనాల్నీ, చట్టాల్నీ తనకు అవసరమైనట్టు మలుపు తిప్పుకున్నాడు. తొమ్మిది శాతం చదువుకున్నవాళ్ళు, తొంభై శాతం తెలివితక్కువవాళ్ళ నుంచి లాభం పొందటానికి ఈ చట్రంలో తమకి అనువైన చోట ఇరుక్కుపోయారు. వీళ్ళని పోలీసు కమిషనర్లు, తహసిల్దార్లు, సెక్రటేరియట్ గుమాస్తాలుగా పిలవచ్చేమో! మిగతా ఒక శాతం సమాంతర మాఫియా ప్రభుత్వంగా తయారయ్యారు. దేశం సుభిక్షంగా వున్నదనుకునే వారికి వీరి పనులు తెలియవు. చాప క్రింద నీరులా- ధనం వీరిని చేరే ఏర్పాటు చేసుకున్నారు. 1960 తరువాత భారతదేశంలో నెమ్మదిగా మొదలైన ఈ ప్రవాహం- పాతిక సంవత్సరాల్లో వరదలా మారింది. పోలీసుస్టేషన్లకి కూడా వేలం పాట తయారవడం ఈ పరిణామ సిద్ధాంతానికి పరాకాష్ట! ఇలాంటి వేలం పాట కూడా ఒకటున్నదని చాలా మందికి తెలియకపోవడం మనిషికి అజ్ఞానంపట్ల వుండే ఇష్టానికి తార్కాణం!! ఈ అజ్ఞానంమీదే వ్యాపారం మొదలైంది. తెలివైనవాడూ, ఆయుధం వున్నవాడూ కలిస్తే ఇక అడ్డేముంది? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోశతాబ్దం నాటికి నైతిక విలువల అర్థం పూర్తిగా మారిపోతుంది. నిజాయితీగా బ్రతకడం కన్నా సమాంతర ప్రభుత్వాన్ని నమ్ముకోవడం మేలనే భావనకి అంకురార్పణ ఇప్పుడే కలిగిందని నా వుద్దేశ్యం. మన ఎన్నికల విధానం, మన నాయకులు, మన  బ్యూరోక్రసీ మరింత వేగంగా వెడితే శతాబ్దం కూడా అక్కర్లేదు. అప్పటికి మనిషి తన తెలివితేటల్నీ, చదువునీ, తన పదవినీ,  ఎలా కాష్ చేసుకోవచ్చా అని మాత్రమే ఆలోచిస్తాడు. అంతస్సంఘర్షణ పోతుంది. "పెళ్ళి కొడుక్కి పై సంపాదన బావుందట" అన్నది ఇప్పుడు ఎలా వాడుకపదం అయిందో, ఏ మాత్రం సిగ్గు పడకుండా ఈ విషయాన్ని ఎలా చెప్పుకుంటున్నామో, అప్పుడు 'పెళ్ళికొడుకు స్మగ్లింగ్ లో భాగస్వామి అట' అని క్వాలిఫికేషన్ గా చెప్పుకుంటాం. ఇదంతా ఏదో గమ్మత్తుగా అనిపించవచ్చుగానీ ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. మనం చాలా సిగ్గుపడవలసిన విషయంగా అనిపించకుందా, కేవలం ;గమ్మత్తు' గా అనిపించడం- ఇదే నేను సోషల్ ఆంథ్రోపాలజీలో ఈ రాత్రి కనుక్కున్నా గొప్ప విషయం!

    రాత్రంతా ఆలోచించి ఇదా నువ్వు కనుక్కున్న 'గొప్ప' విషయం అని నీకు నవ్వు రావచ్చు. ఏం చెయ్యను? ఇప్పుడు తొమ్మిదయింది. ఇంకో గంటలో నాకు బెయిలు లభించి బయటకొస్తాను. ఈ ఇన్ స్పెక్టర్ చాలా మంచివాడు. ఏం తోచడం లేదంటే పాపం కాగితం కలం ఇచ్చాడు. తరువాత టైప్ మిషన్ కూడా ఇస్తాడు. ఈ కటకటాల వెనుక కూర్చుని రాత్రంతా ఆలోచించిన ఈ కొత్తరకపు సోషల్ ఆంథ్రోపాలజీలో నేనెక్కడ ఇముడుతానన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. అప్పుడే అర్థరాత్రి సలీంశంకర్ వచ్చాడు! చెప్పానుగా ఇన్ స్పెక్టర్ మంచివాడని! సలీంశంకర్ రాగానే, అల్లుడికి స్వాగతం చెప్పినట్టు చెప్పి, తను బయటకు వెళ్ళి నిల్చున్నాడు. సెంట్రీ టీకి పంపాడు.
మిగతావాళ్ళు ఏమయ్యారో తెలీదు.

    సో..... సలీం శంకర్ గెల్చాడు. పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ టేబిల్ మీద 'నేను నిన్ను గెలుస్తాను' అని అతడు చేసిన ఛాలెంజిని- చాలా మామూలుగా, అవలీలగా ప్రారంభించాడు. ఆ నిస్తేజమైన గోడలు, వ్యవస్థని పరిరక్షించవలసిన లాఠీకర్ర, తుపాకి అన్నీ యాథాస్థానంలో మామూలుగానే వున్నాయి. ఆ టేబిల్ మీద నా పక్కనే ఇండియన్ పీనల్ కోడ్ పుస్తకం వుండడం కూడా యాదృచ్చికమే అనుకుంటాను.

    అతడు నవ్వుతూ బెల్ట్ బకిల్ విప్పాడు.

    ఇట్ డజ్ నాట్ మాటర్ వెదర్ హి ఎరెక్టెడ్- ఆర్ - ఎజాక్యులేటెడ్! అంత వరకూ వచ్చాక "ఉహూ! ఇక్కడ కాదు. నీకింకా పొగరు తగ్గినట్టు కనిపించడం లేదు. ఇంకో అవకాశమిస్తున్నాను. ఈ సారి అసెంబ్లీ వేదిక మీద మిగిలిపోయిన ఈ పని పబ్లిగ్గా పూర్తిచేస్తాను. నీ శక్తి మీద నీకు ఏమాత్రం నమ్మకమున్నా నిన్ను (కాళ్ళుకాదట. ఇక్కడ కూడా సాడిజమే. నడుము అంటే అర్థమైందిగా)..... క్షిమించమని మోకరిల్లితే నిన్ను వదిలిపెడతాను" అని వెళ్ళిపోయాడు. అతడి సెన్స్ ఆఫ్ ఎఛీవ్ మెంట్ కిది పరాకాష్ట.

    సంతోషిస్తున్నావా జానీ? 'హమ్మయ్య .....ఏమీ కాలేదుగా' అని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నావా! అంగుళం వరకూ వచ్చిన ప్రమాదం అంగుళం ముందుకు రాకుండా వుండిపోవడంతో పరిరక్షించబడిన ఈ శీలంమీద నాకేమీనమ్మకం లేదు. కేవలం అతడి దయాదాక్షిణ్యం మీదో, లేక నన్ను  మరి కొంతకాలం ఇరుకున పెట్టి ఆనందించాలనే అతడి సినికల్ మనస్తత్వం వల్లనో రక్షింపబడిన ఈ శీలం- ఇలా కాకుండా- కండరాల రాపిడితో పునీతమైవుంటే -నేను కూడా హమ్మయ్య అయిపోయింది అని ఊపిరి పీల్చుకోవటమో, ఆత్మహత్య చేసుకోవడమో, అసెంబ్లీకి ఈ విషయాన్ని లాగి ప్రతికల సర్క్యులేషన్ పెంచడమో చేసి వుండేదాన్ని! అసెంబ్లీ వేదిక అంటే గుర్తొచ్చింది. నేను వెంటనే అర్జెంటుగా అసెంబ్లీ లేని ఏ ఢిల్లీ  లాటి యూనియన్ టెరిటరీకో పరుగెత్తాలి. దురదృష్టవశాత్తు ఏ రాష్ట్రపు ప్రజావేదికమీద తనీ అశ్వమేధయాగానికి, అశ్వమేధానికి పూనుకుంటాడో చెప్పలేదు. అలాగే ఎంతకాలంలోపులో నేను వాళ్ళ నడుములు పట్టుకోవాలో గడువు కూడా చెప్పలేదు. కాబట్టి తొందరపడి నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నా కెందుకో వసంత్ దాదా అంటే ఇష్టం కలుగుతూంది. సలీంశంకర్ హిమాన్ లా తోస్తున్నాడు. దేశ ప్రజలంతా కలసి, గత చరిత్ర ఆధారంగా, గత అనుభవాల సారాన్ని పిండి, ప్రజా స్వామ్య విలువల్ని కాపాడడం కోసం పటిష్టంగా నిర్మించుకున్న ఈ వ్యవస్థ అనే కోటపైన దాదా, శంకర్లు గూండాయిజం అనే గుర్రానెక్కి రౌడియిజం అనే కత్తి ఝుళిపిస్తూ తమ పతాకాన్ని ప్రతిష్టాపిస్తూంటే నాలాటి ఆడపిల్లలు మానాన్ని దాచుకోవలసిన చేతుల్ని గాలిలో పైకెత్తి జైజై ధ్వానాలు పలక్కుండా ఏ శక్తి రక్షించగలదు?

    ......రక్షించగలిగే కొద్దిపాటి శక్తి వున్న జానీలు తమ సామ్రాజ్యానికి నష్టం కలక్కుండా వుంటే చాలు అన్న స్వార్థంతో వున్నప్పుడు.....

    ఉంటాను నేస్తం. (మొదటిసారి ముద్దు పెట్టుకున్నవాడు నేస్తం అవుతాడని ఎక్కడో చదివాను) మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుందాం. ప్రజావేదిక లేని చోటుకి అర్జెంటుగా పరుగెత్తే టైమయింది-

                                                                                                            -అనూష


    పి.ఎస్: ఈ ఉత్తరాన్ని టైపు చేయడంలో నావుద్దేశ్యం-దీన్ని నువ్వు ఎవరికీ చూపించి నిరూపించకుందా వుంటావని! బుజువులు లేకుండా పని చెయ్యడం వసంత్ దాదా నుంచి ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను".

    ఉత్తరం చదవడం పూర్తి చేశాడు జాని.

    అతడి మొహం అదోలా మారింది. ఉత్తరం ప్రతీ వాక్యమూ వేటలో పరుగెత్తే గుర్రంలా అతడి మెదడుని చిందరవందర చేస్తూంది. అతడినే చూస్తున్న బిల్హణుడు దగ్గిరకొస్తూ "ఏమంది?" అని అడిగాడు.

    జానీ మాట్లాడలేదు.

 Previous Page Next Page